వీరాభిమన్యు (1965 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా వీరాభిమన్యు (1936 సినిమా)

వీరాభిమన్యు
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. మధుసూదన రావు
నిర్మాణం సుందర్ లాల్ నహతా, డూండీ
తారాగణం నందమూరి తారక రామారావు,
శోభన్ బాబు,
సత్యనారాయణ,
కాంచన,
గీతాంజలి,
కాంతా రావు,
పద్మనాభం,
రాజనాల
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన ఆరుద్ర, దాశరథి, సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ రాజ్యలక్ష్మి ప్రొడక్సన్స్
భాష తెలుగు

వీరాభిమన్యు 1965 ఆగస్టు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకృష్ణునిగా నందమూరి తారక రామారావు, వీరాభిమన్యుగా శోభన్ బాబు అర్జునునిగా కాంతారావు, సుభద్రగా ఎస్.వరలక్ష్మి, ఘటోత్కచుడుగా నెల్లూరు కాంతారావు, భీముడుగా దండమూడి రాజగోపాలరావు, దుర్యోధనుడిగా రాజనాల నటించారు.[1] శోభన్ బాబు కథానాయకునిగా నటించిన తొలిచిత్రము ఇది.

సుభద్ర (ఎస్.వరలక్ష్మి)కు అర్జునుడు (కాంతారావు) పద్మవ్యూహ ప్రవేశ నిర్గమన వివరాల్లో ప్రవేశ వివరాలు పూర్తిచేశాకా, బయటపడడం చెప్తూండగా కృష్ణుడు (ఎన్.టి.ఆర్.) ప్రవేశించి వారిస్తాడు. కృష్ణుడు అర్జునునికి సుభద్ర నిద్రిస్తోందని, గర్భస్థ శిశువు అంతవరకూ వ్యూహాన్ని విన్నాడని, పుట్టినవాడు లోకైక వీరుడు అవుతాడని చెప్తాడు.

కొన్నేళ్ళకు ద్వారకలో కృష్ణుడు సుభద్రకు పాండవుల అజ్ఞాత వాసం గురించి చెప్తాడు. అస్త్రవిద్యా ప్రదర్శనలో పెరిగి పెద్దవాడైన అభిమన్యుడు (శోభన్ బాబు) చూపిన నైపుణ్యానికి బలరాముడు రుద్ర ధనుస్సు బహూకరిస్తాడు. దానికి అసూయతో లక్ష్మణకుమారుడు (నాగరాజారావు) అభిమన్యుణ్ణి నిందిస్తాడు. కోపంతో అతన్ని వెంటాడుతూ పోయిన అభిమన్యుడు విరాట రాజ్యానికి చేరుకుని, ఉద్యానవనంలో విరాట రాజకుమారి ఉత్తర (కాంచన)ని చూడగా, పరస్పరం తొలిచూపులనే ప్రేమించుకుంటారు.

శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు (నెల్లూరి కాంతారావు) అందించిన సహకారంతో ఉత్తర అంత:పురం చేరిన అభిమన్యుడు ఆమెకూ తనంటే ఇష్టమేనని తెలుసుకుంటాడు. పాండవుల అజ్ఞాతవాసం భగ్నం చేసేందుకు దుర్యోధనుడు (రాజనాల) పన్నిన ఉత్తర గోగ్రహణాన్ని అర్జున, ఘటోత్కచ, అభిమన్యులు చిత్తు చేస్తారు. అర్జున పుత్రుడని తెలిసి అభిమన్యునితో ఉత్తర పెళ్ళి జరిపిస్తాడు విరాటుడు.

పాండవుల అజ్ఞాత వాసం పూర్తికావడంతో రాజ్యం కోసం చేసిన రాయబారాలు విఫలమై కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతుంది. వీరాభిమన్యుని యుద్ధ పరాక్రమానికి ద్రోణుడు, అర్జనుడు, పాండవులు తదితరులంతా సంతోషిస్తారు. ఇంతలో ధర్మరాజుని పట్టి తెచ్చేందుకు ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. పద్మవ్యూహ భేదన చణుడైన అర్జునుణ్ణి అక్కడ నుంచి దూరంగా తీసుకుపోవడంలో విజయం సాధించినా, కడుపులోనే పద్మవ్యూహం భేదించి లోపలికి చేరడం తెలిసిన అభిమన్యుడు ఆ విషయాన్నే మిగతా పాండవులకు చెప్తాడు. ఐతే దాన్నించి బయటపడడం రాదనీ వారంతా వెనుకే రావాలని కోరుతాడు.

కానీ ఈశ్వర వరంతో అర్జునుడు తప్ప మిగతా పాండవులను కొద్ది సేపు అడ్డగించగల సైంధవుడు వారిని పద్మవ్యూహం బయటే అడ్డగిస్తాడు. ఎవరు వారించినా వినక అభిమన్యుడు ఒంటరిగా లోపలకి ప్రవేశిస్తాడు. ఆకాశమార్గాన రాక్షసయుద్ధంలో సాయం చేయబోయిన ఘటోత్కచుణ్ణి, అలంబాసురుడనే మరో రాక్షసుడు అడ్డుకుంటాడు. ఒంటరిగా వీరోచితంగా పోరాడుతున్న అభిమన్యుణ్ణి దుష్టచతుష్టయమైన దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మోసగించి వెన్నుపోటు పొడిచి చంపుతారు.

దీనికి కారణమైన సైంధవుణ్ణి చంపుతానని ఆగ్రహావేశాలతో ప్రతిజ్ఞ చేసిన అర్జునుడి కృష్ణ మాయ సాయంతో చంపుతాడు. శ్రీకృష్ణునితో అన్నీ తెలిసి కూడా నీవు అభిమన్యుణ్ణి కాపాడలేదని నిందించడంతో అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపి, అభిమన్యుడు చంద్రలోకంలో ఉన్నాడని, శరీరంతో వచ్చే బంధాలు శరీరంతో నశిస్తాయని, పుట్టినవానికి చావు తప్పదని జ్ఞాన బోధ చేయడంతో సినిమా ముగుస్తుంది.[2]

నటీనటులు

[మార్చు]
 1. శోభన్ బాబు - అభిమన్యుడు
 2. కాంచన - ఉత్తర
 3. ఎన్.టి.రామారావు - శ్రీకృష్ణుడు
 4. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు - అర్జునుడు
 5. రాజనాల - దుర్యోధనుడు
 6. పద్మనాభం - ఉత్తర కుమారుడు
 7. నెల్లూరు కాంతారావు - ఘటోత్కచుడు
 8. దండమూడి రాజగోపాలరావు - భీముడు
 9. ధూళిపాళ - ధర్మరాజు
 10. సత్యనారాయణ - సైంధవుడు
 11. కె.వి.యన్.శర్మ - శకుని
 12. వాలి సుబ్బారావు - దుశ్శాసనుడు
 13. రమేష్ - కర్ణుడు
 14. ఎ.వి.సుబ్బారావు - భీష్ముడు
 15. రావి కొండలరావు - ద్రోణుడు
 16. వేమూరి రామయ్య - విరాటుడు
 17. సూర్యనారాయణ - బలరాముడు
 18. కాశీనాథ్ - సాత్యకి
 19. రాళ్ళబండి కామేశ్వరరావు - అశ్వత్థామ
 20. కాకరాల - విదురుడు
 21. రామకోటి - ఎడమ భుజం
 22. కోళ్ళ సత్యం - కుడి భుజం
 23. నాగరాజు - లక్ష్మణ కుమారుడు
 24. జి. వరలక్ష్మి - ద్రౌపది
 25. ఎస్. వరలక్ష్మి - సుభద్ర
 26. మాలతి - సుధేష్ణ
 27. సుజాత - మంజుల, ఉత్తర సఖి
 28. గీతాంజలి - నర్తకి

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

వీరాభిమన్యు చిత్ర కథను మహాభారతం నుంచి స్వీకరించి అభివృద్ధి చేశారు. 1936లో వి.డి.అమీన్ దర్శకత్వంలో సాగర్ మూవీటోన్ పతాకంపై కాంచనమాల, పులిపాటి నటులుగా వీరాభిమన్యు చిత్రం నిర్మించారు. తమకు తగ్గట్టుగా, కాలానుగుణంగా రాసుకున్న స్క్రిప్టుతో రెండవసారి భారత మూలమైన ఆ కథతో ఈ సినిమాను తీశారు. సినిమాకి సముద్రాల సీనియర్ మాటలు రాశారు.[2]

చిత్రీకరణ

[మార్చు]

సినిమాలో పలు ట్రిక్ తో తీయాల్సిన సన్నివేశాలు ఉండడంతో సినిమాకు ఇద్దరు ఛాయాగ్రాహకులు ఉన్నారు. ఎస్. వెంకటరత్నం ఛాయాగ్రహణంతో పాటు ట్రిక్ ఛాయాగ్రహణంని రవికాంత్ నగాయిచ్ నిర్వహించారు.[2]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
అదిగో నవలోకం వెలసే మనకోసం ఆరుద్ర[3] కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
కల్లాకపటం రూపై వచ్చే నల్లనివాడా రా సముద్రాల రాఘవాచార్య కె.వి.మహదేవన్ ఎస్.జానకి బృందం
చల్లని సామివి నీవైతె అల్లన ఆగుము జాబిల్లి ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
చూచీ వలచీ చెంతకు పిలచీ నీ సొగసులు లాలన చేసీ ఆరుద్ర కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
రంభా ఊర్వసి తలదన్నే రమణీలలామె ఎవరీమె ఆరుద్ర కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల

తాకిన చోట ఎంతో చల్లదనం, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం. పి. సుశీల.

పద్యాలు

[మార్చు]
 1. పరిత్రాణాయ సాధునాం (శ్లోకం), భగవద్గీత
 2. నీ సఖులన్ సహోదరులన్ నిన్ను నిమేషంబులో (పద్యం), రచన:సముద్రాల
 3. పాలకడలి వంటి పాండవాగ్రజుడు (పద్యం) రచన: సముద్రాల
 4. అనిమిష దైత్యకింపురుషులాది ఎవ్వరు వచ్చినన్ (పద్యం), రచన: తిక్కన
 5. యదా యదాహి ధర్మస్య (శ్లోకం), భగవద్గీత
 6. . స్తానుడే తోడుగా (పద్యం)ఘంటసాల, సుశీల
 7. ఈ వెంట్రుకలు పట్టి ఈడ్చిన, పి.సుశీల , రచన: తిక్కన .
 8. బానిసలంచు పాండవుల , మాధవపెద్ది, రచన: సముద్రాల సీనియర్
 9. రాధే యుండును దుస్స సేనుడును, మాధవపెద్ది, రచన: తిక్కన.

మూలాలు

[మార్చు]
 1. ఆంధ్రజ్యోతి. "యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న 'వీరాభిమన్యు'". Retrieved 10 August 2017.[permanent dead link]
 2. 2.0 2.1 2.2 సి.వి.ఆర్., మాణిక్యేశ్వరి (29 మే 2015). "వీరాభిమన్యు". ఆంధ్రభూమి. వెన్నెల సంచికలో
 3. వీరాభిమన్యు, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 15-16.
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి., ఘంటసాల గళాంమృతం, కొల్లూరిభాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు పద్యాలు.