బుద్ధ జయంతి
బుద్ధ జయంతి
నేటికి రెండున్నర వేల సంవత్సరములకు పూర్వము భూమిపై ధర్మము పేరుతో పశువులను వధించు చుండిరి. అప్పుడు జీవ హత్య నిలుపుటకు మాయాదేవి గర్భమున భగవానుడు బుద్ధునిగా అవతరించెను. ఇతని తండ్రి శుద్ధోదనుడు. వీని రాజధాని కపిల వస్తు నగరం. బాల్యమున బుద్ధుని నామము సిద్ధార్ధుడు. జ్యోతిష్కులు "ఈ బాలుడు రాజగును. కాని విరక్తుడై లోకకళ్యాణ కారుడగు"నని చెప్పిరి. అప్పుడు శుద్ధోదన రాజు పెద్ద భవనము నిర్మించి రాకుమారుని అందులో ఉంచెను. రోగములు, దుఃఖములు, మృత్యువులు యేమి తెలియ నివ్వక పెంచెను. ఇతనికి యశోధరతో వివాహము జరిగెను. వీరికొక పుత్రుడు కలిగెను. వారి పేరు రాహులుడు. సిద్ధార్ధుడు ఒకమారు నగరం చూచుటకై తండ్రి ఆజ్ఞ తీసికొని వెలుపలకు వచ్చెను. నగరంలో తిరుగు సమయమున ఒక వృద్ధుడు కనిపించెను. మరొక మారు నగరం సందర్శించునప్పుడు ఒకరోగి కనిపించెను. మూడవమారు దర్శించునప్పుడు చనిపోయినవాడు కనిపించెను. ఈదృశ్యములను చూచిన సిద్దార్ధుని మనస్సు చలించెను. సంసార సుఖము నుండి విరక్తి జెంది అమరత్వమును పరిశోధించుటకై ఒక అర్ధరాత్రి దినమున రాజభవనమునుండి వెలుపలకు వచ్చెను. ఒక వనమందు తపస్సు ప్రారంభించెను. అంతమున జ్ఞానబోధ ప్రాప్తించి సిద్ధార్ధుడు బుద్ధభగవానుడయ్యేను.
బుద్ధ భగవానుడిట్లు చెప్పెను: సంసారము దుఃఖమయము, తృష్ణ దుఃఖకారణము, తృష్ణ నశించిన, దుఃఖము నశించును. రాగ ద్వేష అహంకారములను వదలిన జీవులు ముక్తులగుదురు. 1. సత్యము 2. నమ్రత 3. సదాచారము 4. సద్‌విచారము 5. సద్గుణము 6. సమృద్ధి 7. ఉన్నతమైన లక్ష్యము 8. ఉత్తమమైన ధ్యానము ఈ ఎనిమిది సాధనములను బుద్ధ భగవానుడు మానవుల ఉన్నతి కొరకు చెప్పెను. ఈ విధముగ ప్రపంచం మంతయు తిరిగి మానవ ధర్మములను ప్రచారము గావించెను. యజ్ఞములందు పశువధను మాంపించెను. జీవులయెడ ప్రేమ, అహింస సద్భావములతో అమర సందేశమిచ్చెను.