భారతదేశ కార్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1866లో విదేశీ, కామన్వెల్త్ కార్యాలయ భవనం పశ్చిమ లేదా పార్క్ వైపు. ఇందులో విదేశీ, భారతదేశ కార్యాలయాలుండేవి. అయితే హోమ్, కలోనియల్ కార్యాలయాలు వైట్‌హాల్ వైపున ఉండేవి.

భారతదేశ కార్యాలయం (ఇండియా ఆఫీస్) అనేది 1858లో లండన్‌లో స్థాపించబడిన బ్రిటిషు ప్రభుత్వ విభాగం. భారతదేశ వైస్రాయి, ప్రావిన్సుల అధికారుల ద్వారా దేశ పరిపాలనను పర్యవేక్షించడానికి దీన్ని ఏర్పాటు చేసారు. ఈ భూభాగాల్లో భారత ఉపఖండంలోని నేటి కాలపు దేశాలతో పాటు యెమెన్, హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న ఇతర భూభాగాలు కూడా కలిసి ఉన్నాయి. ఈ విభాగానికి నేత, భారతదేశ వ్యవహారాల మంత్రి. ఇతను బ్రిటిషు మంత్రివర్గ సభ్యుడు. కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఈ అధికారికి అధికారిక సలహాదారు. [1]

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారతదేశ కార్యాలయాన్ని మూసివేసారు. కొత్త దేశంతో యునైటెడ్ కింగ్‌డమ్ సంబంధాల బాధ్యత కామన్వెల్త్ సంబంధాల కార్యాలయానికి (గతంలో డొమినియన్స్ కార్యాలయం ) బదిలీ చేసారు.

భారతదేశ కార్యాలయం మూలాలు (1600–1858)[మార్చు]

ఈస్ట్ ఇండియా కంపెనీని 1600లో ఆంగ్ల వ్యాపారుల జాయింట్-స్టాక్ కంపెనీగా స్థాపించారు. వారు "ఇండీస్ "తో ఆంగ్ల వాణిజ్యానికి ప్రత్యేక హక్కులను పొందారు. కేప్ ఆఫ్ గుడ్ హోప్‌కు మాజిల్లాన్ జలసంధికీ మధ్య ఉన్న భూభాగాలను వాళ్ళు ఇండీస్ అని అన్నారు. "భారతదేశం" అనే పదం సింధు నది పేరు నుండి ఉద్భవించింది. ఈ నది, ఈ ప్రాంతంలో వాణిజ్యానికి, నాగరికతకూ సుదీర్ఘ కాలంగా ముఖ్యంగా ఉంటూ వచ్చింది. త్వరలోనే కంపెనీ, ఆసియాలోని దక్షిణ, తూర్పు ఇండీస్ అంతటా "ఫ్యాక్టరీల " నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. 250 సంవత్సరాల కాలంలో కంపెనీ మౌలిక పాత్ర లోను, దాని విధుల్లోనూ అనేక గణనీయమైన మార్పులకు లోనైంది.

1698 తర్వాత పాత, కొత్త కంపెనీల మధ్య పోటీ కాలం ఫలితంగా 1709లో యునైటెడ్ కంపెనీ ఆఫ్ మర్చంట్స్ ట్రేడింగ్ టు ఈస్ట్ ఇండీస్ ఏర్పడింది. ఈ 'కొత్త' ఈస్టిండియా కంపెనీ, ప్రధానంగా ఆసియాలో అక్కడక్కడా వ్యాపార ప్రయోజనాలున్న వాణిజ్య సంస్థ స్థాయి నుండి 18వ శతాబ్దపు ద్వితీయార్ధానికల్లా దక్షిణాసియాలో ప్రధాన ప్రాదేశిక శక్తిగా రూపాంతరం చెందింది. దాని ప్రధాన కార్యాలయం బెంగాల్లో ఉండేది. ఈ అభివృద్ధి యొక్క రాజకీయ పర్యవసానాల కారణంగా 1784లో బ్రిటిషు ప్రభుత్వం, కంపెనీ అవలంబించే భారతీయ విధానాలపై పర్యవేక్షణ కోసం లండన్‌లో స్టాండింగ్ కమీషనర్‌లను (బోర్డ్ ఆఫ్ కంట్రోల్) ఏర్పాటు చేసింది.

కంపెనీ హోదాలో వచ్చిన ఈ మార్పు, ఇతర అంశాలతో కలిసి, 1813 - 1833 మధ్య కాలంలో బ్రిటిషు పార్లమెంటు కొన్ని చట్టాలు చేయడానికి దారితీసింది. దాంతో ఈస్ట్ ఇండీస్‌తో వాణిజ్యానికి బ్రిటిషు ప్రభుత్వం అన్ని సంస్థలకూ తలుపులు తెరిచింది. దాని ఫలితంగా కంపెనీ తన వాణిజ్య విధుల నుండి పూర్తిగా వైదొలిగింది. 1858 పునర్వ్యవస్థీకరణ వరకూ, బోర్డు పర్యవేక్షణ లోనే కంపెనీ బ్రిటిషు ఇండియా ప్రభుత్వ బాధ్యతను కొనసాగించింది.

ఈ మార్పులు ఇన్ని జరిగినా, లండన్ నగరంలో ఈస్ట్ ఇండియా హౌస్‌లో ఉన్న కంపెనీ ప్రాథమిక నిర్మాణంలో మాత్రం పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఇందులో పెద్ద సంఖ్యలో యజమానులు లేదా వాటాదారులు, ఎన్నికైన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఉండేవారు. బోర్డుకు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నాయకత్వం వహించేవారు. కంపెనీ రోజువారీ వ్యవహారాలకు శాశ్వత అధికారులు బాధ్యత వహించేవారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మాత్రం, వెస్ట్‌మినిస్టర్‌లోని ప్రభుత్వ భవనాలకు సమీపంలో తన ప్రత్యేక కార్యాలయాన్ని నిర్వహించుకునేది.

భారత ప్రభుత్వ చట్టం 1858తో, లండన్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీల కంపెనీ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ల స్థానంలో భారతదేశ కార్యాలయం (ఇండియా ఆఫీస్) అనే ఒకే కొత్త డిపార్ట్‌మెంటును నెలకొల్పారు. ఇది భారతదేశ వ్యవహారాల మంత్రి కింద ఉండేది. విదేశాంగ కార్యాలయం, కలోనియల్ కార్యాలయం, హోమ్ ఆఫీస్, వార్ ఆఫీస్‌తో పాటు యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వ కార్యాలయంగా ఇది పనిచేసేది.

వివరాలు, విధులు[మార్చు]

భారతదేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు చట్టబద్ధమైన సలహాదారుల సంఘం, కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహాయం చేసేది. సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ కింద అధికారుల బృందం ఉండేది. ఈ అధికారులలో ఎక్కువగా ఈస్ట్ ఇండియా కంపెనీ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లకు చెందిన సివిల్ సర్వెంట్ల సిబ్బంది ఉండేవారు. వైట్‌హాల్‌ లోని కొత్త భారతదేశ కార్యాలయ భవనంలో వీరు కూర్చునేవారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్, కంపెనీ గతంలో నిర్వహించిన అన్ని కార్యనిర్వాహక విధులను నిర్వహించేవారు. గతంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దక్షిణాసియాలోని బ్రిటిషు ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్‌పై నిర్వహించిన 'పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ' అధికారాలను ఇతను వారసత్వంగా పొందాడు. భూమిపైన, సముద్రంలోనూ వేసిన టెలిగ్రాఫ్ కేబుళ్ళు (1868-70), సూయజ్ కెనాల్ (1869) ప్రారంభోత్సవం మొదలైన వాటి వలన దక్షిణాసియాతో సమాచార సంబంధాలు మెరుగవడంతో ఈ నియంత్రణను సాధ్యమైంది. వైస్రాయ్, ప్రావిన్షియల్ గవర్నర్ల ద్వారా ఆసియా, ఆఫ్రికాలోని పెద్ద ప్రాంతాలు, మధ్యప్రాచ్యం లపై ఈ నియంత్రణను అమలు చేయగలిగింది. పంతొమ్మిదవ శతాబ్దం చివరి పాదంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మొదలైన రాజ్యాంగ సంస్కరణలకు 1919 - 1935 భారత చట్టాలతో మరింత ఊపు వచ్చినపుడు మాత్రమే బ్రిటిషు ఇండియా ప్రభుత్వంపై భారతదేశ కార్యాలయపు పట్టు బాగా సడలింది. దాంతో దక్షిణాసియాపై దాని పట్టు సడలైనట్లైంది. శాసన సభలకు, స్థానిక ప్రభుత్వాలకూ క్రమంగా అధికార వికేంద్రీకరణ జరిగింది. ఆ పరిపాలనా సంస్కరణలే 1937లో బర్మాను మిగిలిన దక్షిణాసియా నుండి వేరు చేయడానికీ, లండన్‌లో బర్మా కార్యాలయం ఏర్పాటుకూ దారితీశాయి. స్టేట్ సెక్రటరీ మాత్రం ఒక్కరే ఉండేవారు. కార్యాలయం కూడా అదే భవనంలో ఉండేది. 1947లో ప్రస్తుత భారతదేశం, పాకిస్తాన్‌లకు 1948లో నేటి మయన్మార్‌కూ స్వాతంత్ర్యం ఇవ్వడంతో, భారతదేశ కార్యాలయం, బర్మా కార్యాలయం రెంటినీ అధికారికంగా రద్దు చేసారు.

1947కి ముందు ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలతో సంబంధాలు, రక్షణ విధానంలో విస్తృతమైన ప్రమేయం ఫలితంగా, వివిధ సమయాల్లో నిర్దిష్ట పొరుగు లేదా అనుసంధానిత ప్రాంతాల విషయంలో భారతదేశ కార్యాలయం కూడా బాధ్యత తీసుకుంది. వీటిలో ముఖ్యమైనవి:

బెంగాల్ (1616–1857);
శ్రీలంక అప్పట్లో సిలోన్‌ అనేవారు (c. 1750–1802);
సెయింట్ హెలెనా (1834 వరకు);
కేప్ ఆఫ్ గుడ్ హోప్ (1836 వరకు);
జాంజిబార్, సోమాలియా, ఇథియోపియా (ప్రధానంగా పంతొమ్మిదవ శతాబ్దం);
ఎర్ర సముద్రం, అరేబియా ద్వీపకల్పం, పెర్షియన్ గల్ఫ్ రాష్ట్రాలు, ఇరాక్, ఇరాన్ (c. 1600–1947);
ఆఫ్ఘనిస్తాన్, రష్యా, చైనా, మధ్య ఆసియా, టిబెట్, నేపాల్, భూటాన్, సిక్కిం (పద్దెనిమిదవ శతాబ్దం చివరి నుండి 1947 వరకు);
మలయా, ఆగ్నేయాసియా (c. 1867 వరకు);
ఇండోనేషియా (సి. 1825 వరకు);
చైనా (పదిహేడవ శతాబ్దం ప్రారంభం నుండి 1947 వరకు); జపాన్ (పదిహేడవ శతాబ్దం).

వెస్టిండీస్, దక్షిణ, తూర్పు ఆఫ్రికాలు, ఫిజీకి వలస వచ్చిన భారతీయుల స్థితిపై భారతదేశ కార్యాలయ ఆసక్తి కారణంగా కూడా అక్కడ ఈ కార్యాలయ ప్రమేయం ఉండేది

వైట్‌హాల్‌లోని ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్ మెయిన్ బిల్డింగ్‌లో భారతదేశ కార్యాలయం దాని కార్యాలయాలను ఉండేవి.

కాలక్రమం[మార్చు]

1600లండన్ మర్చంట్స్ గవర్నర్ అండ్ కంపెనీ ఈస్ట్ ఇండీస్‌తో వ్యాపారం చేస్తున్నాయి . లండన్‌లో స్థాపించబడింది
1709 - బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ యూనియన్‌గా ఉద్భవించింది. స్కాట్లాండ్ జన్మించింది.
1757 - ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారత భూభాగాన్ని జయించడం ప్రారంభించింది.
1765 - మొఘల్ చక్రవర్తి ఈస్టిండియా కంపెనీకి భూ ఆదాయాన్ని సేకరించే హక్కును మంజూరు చేశాడు.
1773 - బెంగాల్ మొదటి గవర్నర్‌గా వారెన్ హేస్టింగ్స్ నియమితులయ్యారు.
1784 - బ్రిటిషు ప్రభుత్వం లండన్‌లో భారతదేశం కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసింది.
1813 – 1813 చార్టర్ చట్టంతో బ్రిటిషు ఇండియాతో వాణిజ్యంపై ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యం ముగిసింది.
1833 – చైనాతో వాణిజ్యంపై ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్య హక్కుల ముగింపు
1857 - 1857 నాటి భారతీయ తిరుగుబాటు బ్రిటిషు వారి స్థానిక అభిప్రాయాన్ని మార్చింది.
1858 - భారత ప్రభుత్వ చట్టం 1858 లో ఈస్ట్ ఇండియా కంపెనీ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ స్థానంలో ఇండియా ఆఫీస్, కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
1937 – బ్రిటిషు ఇండియా నుండి బర్మాను వేరు చేయడం, బర్మా కార్యాలయ ఏర్పాటు.
1947 - భారత డొమినియన్, పాకిస్తాన్ డొమినియన్ రెండు దేశాలకూ డొమినియన్ హోదా మంజూరైంది. కామన్వెల్త్‌లో ఉండాలని భారతదేశం కోరుకుంది. భారతదేశ కార్యాలయం రద్దు.
1948 - బర్మా స్వాతంత్ర్యం, బర్మా కార్యాలయం రద్దు
1971 - తూర్పు బెంగాల్‌ను పాకిస్తాన్ నుండి వేరు చేయడం ప్రస్తుత బంగ్లాదేశ్‌ను సృష్టించడం.

ఇండియా ఆఫీస్ రికార్డ్స్[మార్చు]

ఇండియా ఆఫీస్ రికార్డ్స్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ (1600–1858), బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లేదా బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ది అఫైర్స్ ఆఫ్ బ్రిటిషు ఇండియా (1784–1858), భారతదేశ కార్యాలయం (1858–1947) బర్మా ఆఫీస్ (1937–1948) లకు, అధికారికంగా నాలుగు ప్రధాన సంస్థలలో ఒకటి లేదా ఇతర వాటితో అనుసంధానించబడిన బ్రిటిషు ఏజెన్సీలకూ చెందిన ఆర్కైవ్‌ల ఖజానా. ఇండియా ఆఫీస్ రికార్డ్స్ దృష్టి మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాల పైన, 1947కి ముందు వాటి పరిపాలన పైనా కేంద్రీకరించి ఉంటుంది. ఇండియా ఆఫీస్ రికార్డ్స్ వారి అధికారిక ఆర్కైవుల్లో భారతదేశంలోని బ్రిటిషు అనుభవానికి సంబంధించి 300 ల పైచిలుకు సేకరణలు, 3,000 కు పైబడిన ప్రైవేట్ పేపర్‌లు కూడా ఉన్నాయి

గతంలో ఇండియా ఆఫీస్ లైబ్రరీలో ఉన్న ఇండియా ఆఫీస్ రికార్డ్స్ ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్ పబ్లిక్ రికార్డ్స్‌లో భాగంగా లండన్‌లోని బ్రిటిషు లైబ్రరీ వారి ఆసియా, పసిఫిక్, ఆఫ్రికా కలెక్షన్స్‌లో భాగంగా ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. 70,000 వాల్యూమ్‌ల అధికారిక ప్రచురణలు, 1,05,000 రాత ప్రతులు, ప్రింటెడ్ మ్యాప్‌లతో పాటు 14 కిలోమీటర్ల షెల్ఫులు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

  1. Kaminsky, 1986.