భ్రాతృ విదియ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాతృ విదియ ఒక హిందువుల పండుగ. దీనిని కార్తీకమాసము నందు కార్తీక శుద్ధ ద్వితీయ రోజున జరుపుకుంటారు. స్మృతి కౌస్తుభము దీనిని యమ ద్వితీయ అని పేర్కొన్నది.

ఈనాడు యమ, చిత్రగుప్తాది పూజ, భగినీ (భగినీ అనగా సోదరి) గృహ భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి.

యముడి చెల్లెలు యమునా నది. యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి రమ్మని చాలాసార్లు కోరుతుంది. తీరిక చిక్కని పనుల మూలంగా ఆమె కోర్కె తీర్చలేకపోతాడు. తుదకు యముడు ఒకనాడు యమున యింటికి వెళ్తాడు. ఆనాడు కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆమె ఎంతో మర్యాద చేసిమ్ది. యమున్ని అతని ముఖ్య లేఖకుడైన చిత్రగుప్తుని, వారి దూతలను పూజించింది. స్వయంగా వంటచేసి అందరికీ వడ్డించింది. ఆమె చేసిన మర్యాదలకు సంతృప్తుడైన యముడు చెల్లెలికి ఏదైనా వరం కోరుకోమంటాడు. దానికి ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకాలోక ప్రాప్తి, అపమృత్యుదోషం లేకుండా వరం ప్రసాదించమని కోరింది. ఆమె కోరిన వరాన్ని ప్రసాదిస్తూ యముడు ఎవరైతే ఈనాడు సొదరుని తన ఇంటికి ఆహ్వానించి తన చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందక చిరకాలము పుణ్యస్త్రీగా వుంటుందని కూడా వరమిచ్చారు.

యమునికి, యమునకు ఇటువంటి సోదర ప్రేమ నడచిన విదియ కాబట్టి యమ ద్వితీయ అనే పేరు వచ్చింది. ఈనాడు ప్రధానమైన ఆచారం సోదరి సోదరుని ఇంటికి ఆహ్వానించి పూజించి గౌరవించడం. ఈ ఆచారం ఏర్పడిన తరువాత ఈ పర్వదినానికి భాతృ విదియ అనే పేరు వచ్చినది.

మూలాలు

[మార్చు]
  • భాతృవిదియ, పండుగలు-పరమార్థములు, ఆండ్ర శేషగిరిరావు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2005, పేజీలు: 392-394.