Jump to content

రంగనాయకమ్మ

వికీపీడియా నుండి
(ముప్పాళ్ల రంగనాయకమ్మ నుండి దారిమార్పు చెందింది)
రంగనాయకమ్మ
జననం (1939-09-21) 1939 సెప్టెంబరు 21 (age 85)
వృత్తిరచయిత్రి
తల్లిదండ్రులు
  • లక్ష్మీ సత్యనారాయనయ్య (తండ్రి)
  • లక్ష్మీ నరసమ్మ (తల్లి)
పురస్కారాలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు, 1965

రంగనాయకమ్మ (జననం 1939) సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు. ఈమె రచనల్లో మార్క్సిస్ట్ ఆలోచనలు, ప్రజాస్వామిక విలువలు, కుల వ్యతిరేకత, సమానత్వం వంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. భారతీయ పురాణాలు, పునరుజ్జీవనంపై విమర్శల నుండి పౌర స్వేచ్ఛలు, భారత కమ్యూనిస్టు ఉద్యమం, చైనాలో మావోయిజంపై చర్చల వరకు వివిధ విషయాలపై విస్తృతంగా రాసింది.[1][2]

1955లో రచించడం ప్రారంభించిన ఆమె, 15 నవలలు, 70 కథలు, వ్యాసాలు రాసింది. 1965లో బలిపీఠం అనే నవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేసింది. మార్కిస్టుగా మారిన తరువాత నుండి గౌరవాలను, అవార్డులను తిరస్కరించింది.[1]

ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.

జీవిత విశేషాలు

[మార్చు]

రంగనాయకమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామంలో 1939లో జన్మించింది. ఈమె తాడేపల్లిగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి 1955లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలైంది. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతంలోని కళాశాలకు పంపించి చదివించలేని కారణంగా ఈమె విద్యాభ్యాసం అంతటితో ఆగిపోయింది.

రంగనాయకమ్మ 1958లో సాంప్రదాయకంగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970లో ఆ వివాహం నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడూ, అభిమానీ, పాఠకుడూ బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి ఉంటున్నారు.

తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో 'దద్దనాల' రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం. 1958 నుంచి 1970 మధ్య కాలంలో 'ముప్పాళ' రంగనాయకమ్మగా పరిచయం. మొదటి వివాహం నుంచీ బయటపడిన తరువాత తన పేరు నుంచీ 'ముప్పాళ' తీసేసి కేవలం 'రంగనాయకమ్మ'గా పరిచయం.

రచయిత్రిగా

[మార్చు]

నవలలు

[మార్చు]

ఆమె మొదటి నవల, కృష్ణవేణి, 1950ల చివరలో ప్రచురించబడింది. ఇందులో రెండు విభిన్న వివాహాల చిత్రణ ద్వారా సంబంధాలలో అంచనాలను చర్చిస్తుంది.[3] 1962లో ఆంధ్రప్రభ ధారావాహికంగా ప్రచురితమైన ఒక ప్రసిద్ధ నవల బలిపీఠం రాసింది. ఈ నవల బ్రాహ్మణ వితంతువైన అరుణ, దళిత సామాజిక కార్యకర్త భాస్కర్ మధ్య వివాహం ఆధారంగా, సమాజంలో కులాంతర వివాహాలు, వితంతువులపై ఉండే కళంకాన్ని విశ్లేషిస్తుంది.[4][5]

మార్క్సిస్టు రచనలు

[మార్చు]

1973లో మార్క్సిజంతో పరిచయం పెంచుకుని, అప్పటి నుండి ఆ దృక్కోణం నుండి రాయడం ప్రారంభించింది. 1974 లో ప్రచురించబడిన రామాయణ విషవృక్షం ద్వారా బాగా ప్రసిద్ది చెందింది, ఇది హిందూ ఇతిహాసమైన రామాయణాన్ని మార్క్సిస్ట్ దృక్కోణం నుండి విమర్శించింది. ఈ పుస్తకం మొదట మూడు సంపుటల్లో రాగా, తరువాత 746 పేజీలతో ఒకే వాల్యూమ్‌గా ప్రచురించబడింది. ఆంగ్ల అనువాదం 2004 నుండి అందుబాటులోకి వచ్చింది.

ఆమె రాసిన మరో ముఖ్యమైన రచన మార్క్స్ దాస్ క్యాపిటల్ కు 3 సంపుటాలలో పరిచయం. మొదటి సంపుటి 1978 లో ప్రచురించబడింది. జానకి విముక్తి అనే మూడు సంపుటాల నవల, లింగ సమానత్వానికి మార్క్సిజం సరైన మార్గం అని వాదించింది.

ప్రజా సాహితి మాసపత్రిక

[మార్చు]

ఆగస్టు 1977 నుండి మే 1979 వరకు, ప్రజా సాహితి అనే సాహిత్య మాసపత్రికను ప్రచురించింది. అదే సమయంలో ఆమే మార్క్స్ 'కాపిటల్' పరిచయం వంటి ఇతర ముఖ్యమైన రచనలు చేస్తుండడంతో పత్రిక హక్కులను జన సాహితి కు బదిలీ చేసింది. 'కాపిటల్' పరిచయం మొదటి సంపుటి 1978లో ప్రచురించబడింది.

అనువాదాలు

[మార్చు]

స్పార్టకస్, స్వేచ్ఛాపథం (ఫ్రీడమ్ రోడ్), టామ్ మామ ఇల్లు (అంకుల్ టామ్స్ క్యాబిన్) లతో ఆంగ్ల నవలలను తెలుగులోకి అనువదించడం ప్రారంభించింది. చార్లెస్ బెట్టెల్‌హీమ్ మార్క్సిస్ట్ రాజకీయ, సైద్ధాంతిక విశ్లేషణాత్మక రచనలను తెలుగులోకి అనువదించింది.[1]

విమర్శనాత్మక రచనలు

[మార్చు]

ఈమె అనేక విషయాల పై అనేక విమర్శలు చేస్తుంటారు. గాంధీ లాంటి పేరొందిన వ్యక్తుల్ని కూడా విమర్శించారు. అసమానత్వం నుంచి అసమానత్వం లోకే ఈమె వ్రాసిన విమర్శనాత్మక రచనలలో ఒకటి.

రాజకీయ జీవితం

[మార్చు]

యూనిటీ సెంటర్ ఆఫ్ కమ్యూనిస్ట్ రివల్యూషనరీస్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)లో చేరి, 1978లో ఏర్పడిన జన సాహితి సంస్థ నుండి సైద్ధాంతిక సంఘర్షణలను ఎదుర్కొన్న తర్వాత 1979లో రాజీనామా చేసి జన సాహితితో మా విభేదాలు అనే పుస్తకాన్ని ప్రచురించింది. తదనంతరం, ఏ కమ్యూనిస్టు సమూహంతో సంబంధం లేకుండా తన మార్క్సిస్ట్ దృక్పథాన్ని కొనసాగిస్తూ, స్వతంత్రంగా తన రచనలను ప్రచురించాలని నిర్ణయించుకుంది.[1]

వివాదాలు

[మార్చు]

ఈమె వ్రాసిన నవల 'జానకి విముక్తి' ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వస్తూ ఉన్న రోజుల్లోనే వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ఆగి పోయింది. తరువాత ఆ నవల పుస్తక రూపంలో విడుదల అయ్యింది. నీడతో యుద్ధం పుస్తకంలో గోరా, జయగోపాల్, సి.వి., ఎమ్.వి. రామ మూర్తి వంటి నాస్తిక రచయితల్ని విమర్శిస్తూ ఈమె వ్యాసాలు వ్రాయడం వల్ల విశాఖపట్నం నాస్తికులు ఈ సీరియల్ ని నిలిపి వెయ్యాలని కోరుతూ పత్రిక ఎడిటర్లకి ఉత్తరాలు వ్రాసారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనం కలిగించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల 'తులసిదళం' ని విమర్శిస్తూ 'తులసిదళం కాదు గంజాయి దమ్ము' అనే వ్యాస సంకలనం వ్రాసింది. వాటిలో యండమూరితో బాటు ఆ నవలకు ముందుమాట వ్రాసిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావును కూడా విమర్శించడం వల్ల అతను పరువు నష్టం దావా వేసి గెలిచాడు.[ఆధారం చూపాలి]

రామాయణ విషవృక్షం పెద్ద ఎత్తున అమ్ముడుపోతోందని లోక్‌సభలో యు. వి. కృష్ణం రాజు అడిగ్గా, రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక అందిన తర్వాత కేంద్రం ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి విద్యాసాగర్ రావు అన్నారు.[6] 2025లో ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ "ప్రజల ప్రయోజనాలతో చూస్తే ఏ మత గ్రంథమైనా విష వృక్షమే" అని వాఖ్యానించింది.[7]

రచనలు

[మార్చు]

నవలలు

[మార్చు]
  • కృష్ణవేణి, 1950
  • పేక మేడలు
  • చదువుకున్న కమల
  • బలిపీఠం
  • కూలినగోడలు
  • స్త్రీ
  • రచయత్రి
  • ఇదే నా న్యాయం
  • కళ ఎందుకు?
  • స్వీట్ హోం
  • అంధకారంలో
  • జానకి విముక్తి
  • కళ్ళు తెరిచిన సీత
  • అమ్మకి ఆదివారం లేదా? (50 కథల సంపుటి)

ఇతర రచనలు

[మార్చు]
  • రామాయణ విషవృక్షం
  • ఇదండి మహాభారతం!, 2014
  • మార్క్స్ "కాపిటల్" పరిచయం
  • శ్రమ దోపిడీ ప్రపంచాన్ని మార్చాలి!
  • తత్వ శాస్త్రం - చిన్న పరిచయం
  • పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం
  • దొంగ తల్లిదండ్రులు ఉంటారు జాగ్రత్త

వ్యాసాలు

[మార్చు]
  • నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?
  • జన సాహితితో మా విభేదాలు
  • తీగ లాగారు, డొంకంతా కదిలింది!
  • నీడతో యుద్ధం (నాస్తిక, హేతు, నవ్య మానవ వాదాలపై)
  • చలం సాహిత్యం
  • అసమానత్వం నుంచి అసమానత్వం లోకే
  • తులసి దళం కాదు, గంజాయి దమ్ము!
  • 'యజ్ఞం' కథపై వ్యాసాలు
  • ఈ 'చక్కని పాడియావు' ఎవరిది?
  • వాడుక భాషే రాస్తున్నామా?
  • తెలుగు నేర్పడం ఎలా?
  • ఇంటి పనీ - బైటి పనీ
  • దళిత సమస్య పరిష్కారానికి
  • ఇంగ్లీషు కీకారణ్యంలోజి ప్రవేశించండి! (తెలుగు విద్యార్ధులకు ఇంగ్లీషు గ్రామరు)
  • కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?
  • మానవ సమాజం - నిన్నా, నేడూ, రేపూ
  • మార్క్సిజమే తెలియకపోతే
  • శ్రామిక కోణం
  • పల్లవి లేని పాట
  • శాస్త్రీయ దృక్పథం

అనువాదాలు, పరిచయాలు

[మార్చు]
  • చైనాలో ఏం జరుగుతోంది?
  • చైనాలో సాంస్కృతిక విప్లవమూ, పరిశ్రమల నిర్వహణా!
  • స్పార్టకస్
  • స్వేచ్ఛాపథం (ఫ్రీడమ్ రోడ్)
  • టామ్ మామ ఇల్లు (అంకుల్ టామ్స్ క్యాబిన్)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 హర్ష్, థాకోర్ (2024-09-14). "Trailblazer in literary innovation, critic of Indian mythology, including Ramayana". Conterview (in ఇంగ్లీష్). Retrieved 2025-03-22.
  2. Group, Sociology (2020-02-08). "Ranganayakamma feminist-Marxist writer: Biography and Books". Sociology Group (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2025-03-22.
  3. Sjoberg 1969, p. 531-532.
  4. Bharathi, Thummapudi (2008). A History of Telugu Dalit Literature (in ఇంగ్లీష్). Gyan Publishing House. pp. 83–84. ISBN 978-81-7835-688-4.
  5. Sjoberg 1969, p. 531.
  6. "Home | List of Publications | Articles | Reviews/Critiques". web.archive.org. 2008-11-21. Archived from the original on 2008-11-21. Retrieved 2025-03-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. రాఘవ (2025-03-17). "'ఏ మత గ్రంథమైనా... విష వృక్షమే' | Interview with writer Ranganayakamma of Ramayana Vishavruksham". telangana.thefederal.com. Retrieved 2025-03-22.

బయటి లంకెలు

[మార్చు]