మెలెనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెలెనా (Melena) లేదా మెలీనా అనేది జీర్ణాశయాంతర వ్యాధి. ఈ వ్యాధి లక్షణం - మలం ముదురు నలుపు, తారు రంగులో ఉంటుంది. కారణం దీనిలో ఎగువ జీర్ణశయాంతర రక్తస్రావం కలిగి ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ జీర్ణ ఎంజైమ్‌లు, ప్రేగు బాక్టీరియా సూక్ష్మజీవుల ద్వారా మార్పు చెందుతున్న కారణంగా మలం నలుపు రంగు, అధిక వాసన కలిగి ఉంటుంది.[1]

బిస్మత్ సబ్‌సాలిసైలేట్ ( పెప్టో-బిస్మోల్‌లో క్రియాశీల పదార్ధం), ఇనుము మాత్రలు (ఐరన్ సప్లిమెంట్‌లు) వంటి అనేక ఔషధాల వలన లేదా బీట్‌రూట్, బ్లాక్ లైకోరైస్ లేదా బ్లూబెర్రీస్ [2] వంటి ఆహారపదార్థాలు తీసుకోవడము వలన కూడా మలానికి నలుపు రంగు కలుగుతుంది, కానీ ఈ నలుపు రంగు లక్షణం వేరు, మెలీనా లక్షణము వేరు.

మెలెనా పదం 19వ శతాబ్దం ప్రారంభం నాటిది. దీనికి మూలం ఆధునిక లాటిన్, గ్రీకు నుంచి తీసుకోబడింది. మెలెనా అంటే నలుపు. .

కారణాలు[మార్చు]

మామూలుగా కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్ వ్యాధి) వంటివి మెలెనా పరిస్థితి కలుగ చేస్తాయి [3]. అయినప్పటికీ, ఎగువ జీర్ణ వాహిక లేదా ఆరోహణ పెద్ద ప్రేగులో ఏదైనా ఇతర రక్తస్రావాలు కూడా మెలెనాకు దారితీయవచ్చు [4]. మెలెనా వార్ఫరిన్ వంటి ప్రతిస్కందక (anticoagulant) ఔషధాల సంక్లిష్టత వలన కూడా ఈ వ్యాధి లక్షణాలు కనపడవచ్చు[5].

మెలెనా లేదా ఎగువ జీర్ణశయాంతర రక్తస్రావానికి అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగులను ప్రభావితం చేసే ప్రాణాంతక కణితులు (malignant tumors), థ్రోంబోసైటోపెనియా, హీమోఫిలియా వంటి రక్తస్రావ రక్త వ్యాధులు, పొట్టలో పుండ్లు, కడుపు క్యాన్సర్, అన్నవాహిక వేరిసెస్ (esophageal varices), మెకెల్ డైవర్టికులం (Meckel's diverticulum), మాల్లోరీ-వైస్ సిండ్రోమ్ (Mallory-Weiss syndrome) వంటివి కారణాలు.

ఇనుము మాత్రలు, పెప్టో-బిస్మోల్, మాలోక్స్, సీసం వంటి ఔషధ పదార్ధాలు సేవించడం, ముక్కు నుండి రక్తం కారిన (ఎపిస్టాక్సిస్) ఫలితంగా మింగబడిన రక్తం, ఇంకా బ్లాక్ పుడ్డింగ్ (బ్లడ్ సాసేజ్) వంటి ఆహారాలలో తీసుకున్న రక్తం లేదా సాంప్రదాయ ఆఫ్రికన్ మాసాయి (ఇందులో పశువుల రక్తం ఆహారంలో ఉపయోగిస్తారు) ఆహారం తీసుకోవడం వలన కృత్రిమమైన మెలెనా లక్షణాలు కనిపిస్తాయి.

మెలెనా వ్యాధిలో గణనీయమైన రక్తస్రావం జరుగుతుంది కాబట్టి వైద్యపరంగా అత్యవసర పరిస్థితిగా పరిగణించబడుతుంది. ఈ ప్రాణాంతక పరిస్థితిని నివారించడానికి, ముఖ్యంగా దీనికి కారణాలను కనుక్కోవడం, అత్యవసరంగా చికిత్స ప్రారంభించడము అవసరం.

అరుదుగా నవజాత శిశువులలో తల్లి రక్తాన్ని మింగడం వలన ప్రసవించిన 2/3 రోజుల తర్వాత మెలెనా పరిస్థితి కనిపించవచ్చు. 

వ్యాధి నిర్ధారణ[మార్చు]

అధిక రక్తస్రావంతో వ్యాధి తీవ్రతరమైనప్పుడు, రోగులకు రక్తహీనత లేదా తక్కువ రక్తపోటు కలుగవచ్చు. మెలెనా కాకుండా కూడా, చాలా మంది రోగులు ఇలాంటి కొన్ని లక్షణాలు కలిగి ఉండవచ్చు. అందువలన మెలెనా ఉన్న సందర్భాల్లో, స్పష్టమైన కారణాలు తెలుసుకోవడము కోసం రక్తస్రావ మూలాన్ని నిర్ధారించడానికి సాధారణంగా ఎగువ ఎండోస్కోపీ (upper endoscopy) ని సిఫార్సు చేస్తారు. 

దిగువ జీర్ణశయాంతర రక్తస్రావం సాధారణంగా హెమటోచెజియా (hematochezia) స్థితి వలన ఎర్రటి తాజా (ఫ్రాంక్ బ్లడ్)రక్తంతో ఉంటాయి. రక్తస్రావ మూలాన్ని గుర్తించడానికి సున్నితత్వం, నిర్దిష్టత కలిగిన 'ట్యాగ్డ్ ఎర్ర రక్త కణాలు గుర్తించే (టాగ్) స్కాన్ (RBC న్యూక్లియర్ స్కాన్ - ఎర్ర రక్త కణాలను గుర్తించడానికి చిన్న మొత్తంలో రేడియోధార్మిక పదార్థాన్ని ఉపయోగిస్తారు) పరీక్ష జరుపుతారు. కణాలను గుర్తించటానికి ఇంకా అవి శరీరంలో ఎలా కదులుతున్నాయో (ట్రాక్) గమనించడానికి శరీరం స్కాన్ చేయబడుతుంది. ప్రత్యేకంగా ఇది నెమ్మదిగా రక్తస్రావం జరిగేటప్పుడు అంటే నిముషానికి 0.5 మి.లీ కంటే వేగం తక్కువగా ఉంటే (< 0.5 ml/min) ఉపయోగించబడుతుంది. వేగవంతమైన రక్తస్రావం అంటే నిముషానికి 0.5 మి.లీ కంటే వేగం ఎక్కువగా ఉంటే (>0.5 ml/min), మెసెంటెరిక్ యాంజియోగ్రామ్, ఎంబోలైజేషన్ ప్రమాణం. అయితే తరచుగా ఈ వ్యాధి నిర్ధారణకు కొలోనోస్కోపీని (Colonoscopy) ఉపయోగిస్తారు[6]

మెలెనా లేదా హెమటోచెజియా[మార్చు]

దిగువ జీర్ణ వాహిక ( సిగ్మోయిడ్ పెద్దప్రేగు, పురీషనాళం వంటివి) నుండి ఉద్భవించే రక్తస్రావం సాధారణంగా ప్రకాశవంతమైన ఎర్రటి రక్తం హెమటోచెజియా వలన ఉంటుంది. చిన్న ప్రేగు వంటి మరింత సన్నిహిత మూలం నుండి ఉద్భవించే రక్తం లేదా నెమ్మదిగా జరిగే ఎంజైమాటిక్ విచ్ఛిన్నం జరిగేంత రక్తస్రావం మాత్రము మెలెనాతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ కారణంగా, మెలెనా తరచుగా కడుపు లేదా డ్యూడెనమ్‌ లోని రక్తంతో (ఎగువ జీర్ణశయాంతర రక్తస్రావం) సంబంధం కలిగి ఉంటుంది, ఉదాహరణకు పెప్టిక్ అల్సర్ ద్వారా. పేగు నాళం (ల్యూమన్) లోపల రక్తం విచ్ఛిన్నం కావడానికి సుమారు 14 గంటలు పడుతుందని ఒక అంచనా; అందువల్ల రవాణా సమయం 14 గంటల కంటే తక్కువగా ఉంటే రోగికి హెమటోచెజియా ఉంటుంది, 14 గంటల కంటే ఎక్కువ ఉంటే రోగికి మెలెనా అని కనపడుతుంది స్థూలంగా అర్ధం చేసుకోవాలంటే, రక్తస్రావ మూలం ట్రెయిట్జ్ స్నాయువు (ligament of Treitz) పైన ఉన్నట్లయితే మాత్రమే మెలెనా సంభవిస్తుంది, అయితే, కొన్ని సారులు మినహాయింపులు సంభవిస్తాయి. 

చికిత్స[మార్చు]

ఈ రక్తస్రావానికి మూలం, అంతర్లీన కారణాన్ని అనుసరించి చికిత్స ఉంటుంది. కడుపులో ఏర్పడే ఆమ్లం తగ్గించే 'ఈసొమెప్రజోల్', 'పాన్ ప్రోటోజోల్' వంటి ఔషధాలు ఇస్తారు. కడుపులో ఏర్పడే పుండ్ల వలన అయితే వాటిని ఎండోస్కోపిక్ చికిత్సతో మందుల కలిపి నియంత్రించవచ్చు, రక్తం గడ్డకట్టే సూది మందులను అవసరాన్ని బట్టి ఇస్తారు. ఉష్ణంతో ఒత్తిడి కలిగించే ప్రక్రియలు, ప్రోటాన్ పంప్ నిరోధకాల వినియోగం, ఇంకా అవసరాన్ని బట్టి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితులలో రక్తం మార్పిడి కూడా చేస్తారు[7].

సహజ చికిత్సా పద్ధతులు[మార్చు]

కొన్ని మూలికలను ఉపయోగించడం, జీవనశైలి మార్పులను అనుసరించడం ద్వారా మెలేనా లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు, చికిత్స చేయవచ్చు లేదా తీవ్రత నిరోధించవచ్చు.

మూలాలు[మార్చు]

  1. Davidson's Principles and Practice of Medicine (22nd ed.). Edinburgh: Churchill Livingstone. 2014. p. 854. ISBN 978-0-7020-5103-6.
  2. Dugdale, David (2009-11-01). "Bloody or tarry stools". National Institutes of Health. Retrieved 2009-11-30.
  3. Walker, HK; Hall, WD; Hurst, JW (1990). "Hematemesis, Melena, and Hematochezia". Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. Butterworths. ISBN 9780409900774. Melena strongly suggests, and hematemesis confirms, that bleeding is of upper gastrointestinal origin…Peptic ulcer, the most common cause of gastrointestinal hemorrhage, should be pursued through questions about epigastric distress, the relationship of symptoms to food intake, and a past history of peptic ulcer disease.
  4. Talley, Nicholas; O'Connor, Simon (2014). Clinical Examination: A Systematic Guide To Physical Diagnosis. Churchill Livingstone. ISBN 9780729541473.
  5. . "Gastrointestinal bleeding in patients receiving oral anticoagulation: Current treatment and pharmacological perspectives".
  6. Eastwood, Gregory L. (2010). "Gastrointestinal Bleeding". Decision Making in Medicine (Third Edition): An Algorithmic Approach (in English). MOSBY ELSEVIER. pp. 196–199. doi:10.1016/B978-0-323-04107-2.50074-0. ISBN 978-0-323-04107-2.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  7. "What is Melaena?". Medicover Hospitals. Retrieved 13 February 2023.
  8. "What Is Melena? Causes and Natural Treatment Tips". Doctors Health Press. Retrieved 13 February 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=మెలెనా&oldid=4077089" నుండి వెలికితీశారు