మేఘ సందేశం (సంస్కృతం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేఘ సందేశం (సంస్కృతం) పూర్తిపాఠం వికీసోర్స్‌లో ఉంది.

Kalidasa writing The Cloud Messenger (Meghaduta), 375 CE illustration

మేఘ సందేశం లేదా మేఘదూతం (Meghasandesam or Meghadiootam) సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించిన ఒక కావ్యము. కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి. (మిగిలిన రెండు రఘు వంశము, కుమార సంభవము)

కావ్య ప్రశస్తి[మార్చు]

కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు.

1813లో ఈ కావ్యం 'హోరేస్ హేమాన్ విల్సన్' (Horace Hayman Wilson) చే ఆంగ్లంలోనికి అనువదింపబడింది.

మేఘ సందేశంలో శ్లోకాల సంఖ్యపై కొంత అనిశ్చితి ఉంది. మూల కావ్యంలో 110 లేదా 111 శ్లోకములని అంటారు. పూర్వ మేఘంలో 63, ఉత్తర మేఘంలో 48 శ్లోకాలున్నాయని సుశీలకుమార దేవుడు చెప్పాడు. వావిళ్ళవారి ప్రతిలో 124 శ్లోకాలు, మరి కొన్ని ప్రతులలో 129 శ్లోకాలు చెప్పబడ్డాయి.[1]

మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి. సంక్షిప్తంగా కావ్యంలో ఉన్న విషయం ఇది.

పూర్వ మేఘం[మార్చు]

ఒక యక్షుడు కర్తవ్యాన్ని విస్మరించడం వలన యజమాని శాపానికి గురియై, మహిమలు పోగొట్టుకుని, కొలువునుండి ఒక సంవత్సరంపాటు బహిష్కరింపబడి, ఒక సంవత్సరం పాటు చిత్రకూటం వద్ద రామగిరి అరణ్యాలలో తిరుగాడుతూ ఉన్నాడు. ప్రియురాలి ఎడబాటుతో విహ్వలుడై ఉన్న అతనికి ఆషాఢం సమీపించినపుడు ఒక మబ్బుతునక అతనికంటబడింది. తన వియోగంతో తన ప్రేయసి కృశించి దుఃఖిస్తూ ఉంటుందని తలచిన ఆ యక్షుడు ఎలాగో ప్రేయసిని ఊరడించడానికి తన సందేశాన్ని ఆమెకు అందించమని కోరుతాడు. పుష్కలావర్త సంభూతుడు అయిన మేఘుడు ఉత్తమ కుల సంజాతుడు గనుక ఒకవేళ తన అభ్యర్ధనను తిరస్కరించినా 'యాచనా లాఘవము' (చిన్నతనము) ఉండదని భావించి అతనిని ప్రార్ధిస్తాడు. మేఘుడు వెళ్ళవలసిన మార్గాన్నీ, మధ్యలో కానవచ్చే దృశ్యాలనూ వర్ణిస్తాడు.

మిత్రమా! గాలి పాటు నీ ప్రయాణానికి అనుకూలంగా ఉంది. శుభ శకునాలు కనుపిస్తున్నాయి. హంసలు నీకు మానస సరోవరం దాకా తోడు వస్తాయి. దారిలో అలసిపోతే కొండ కొనలపై విశ్రాంతి తీసుకో. శక్తి ఉడిగితే మధురమైన నదీజలాలను ఆస్వాదించు. మధ్యలో పొటమరించిన కార్చిచ్చును ఆర్చేవాడవు గనుక నిన్ను ఆమ్రకూటం మరువలేదు. మధ్యలో నెమళ్ళు అందంగా నిన్ను స్వాగతిస్తాయి. కాని మైమరచి కార్యాన్ని విస్మరించవద్దు సుమా!.

ఇంకా ముందుకు సాగి విదిశానగరం వద్ద వేదవతీ నదీజలాలను ఆస్వాదించు. ఉజ్జయినీ నగరంలోని ఉత్సవాలను తిలకించు. ఏదైనా మేడపైన విశ్రాంతి తీసుకో. మహాకాళేశ్వరుని పూజా సమయంలో మృదంగ నాదంలాగా ఉరిమి ముందుకు సాగు. తరువాత గంభీరానదికి ఎదురు వెళ్ళు. దేవగిరి వద్ద చల్లనిగాలి నీకు సేద తీరుస్తుంది. అక్కడ నువ్వు ఉరిమితే కార్తికేయుని నెమలి ఆనందంగా ఆడుతుంది. తరువాత చర్మణ్వతీ నది, దశపురము, బ్రహ్మావర్తము, కురుక్షేత్రము కనిపిస్తాయి. సరస్వతీ నదీజలాలతో పునీతుడవు కావచ్చును. పాలపొంగులాంటి గంగానది ఫైనుండి పయనించి హిమాలయాలను చేరుకో. ఆదిదంపతుల ఆతిథ్యమారగించు. ఒకవేళ గౌరమ్మ కాలినడకన కైలాసం ఎక్కుతూ ఉంటే నీవు మెట్లుగా మారి ఆమెకు సహకరించు. తరువాత మానస సరోవరం జలాలను గ్రోలి ముందుకు సాగగానే కన్నుల పండువుగా అలకా నగరం కనుపిస్తుంది.

ఉత్తర మేఘం[మార్చు]

అలకానగరం శోభ వర్ణనతో ఉత్తర మేఘం భాగం ఆరంభమౌతుంది. యక్షుడు మేఘునితో తన సంభాషణను ఇలా కొనసాగిస్తాడు -

మిత్రమా! అలకానగరం వర్ణనకు అలవి గానంత అందమైనది. అక్కడి అనేకమైన మేడలు నీతో సమానంగా అంబరాలనంటుతుంటాయి. నీ మెరుపు నెచ్చెలి ఎప్పుడూ నిన్నంటిపెట్టుకొని ఉన్నట్లుగా ఆ భవనాలలో సుందరాంగులు శోభాయమానంగా ఉంటారు. వర్ణ చిత్రాలతో, మధుర సంగీత నాదాలతో, ఇంద్రనీల కాంతులతో ఆ భవనాలు అలరారుతుంటాయి. అక్కడ కుబేరుని ప్రాసాదమునకు ఉత్తరాన ఇంద్రధనుస్సులా ఉండే నా భవనం దూరాన్నుంచే కనిపిస్తుంది.కల్పవృక్షము, నీలమణిఖచితమైన సోపానములు గల బావి, కృతక పర్వతము, కన్నులకింపైన వకుళ, అశోక వృక్షములు, ద్వారమున రమ్యమైన శంఖ పద్మములు - ఇవి నాయింటి గురుతులు.

ఆ నా భవనమున ఇంపైన పలువరస, సన్ననైన నడుము, చకిత హరిణీ నయనములు గలిగి, యౌవన మధ్యస్థ యైన ముద్దులొలుకు వయ్యారపు బొమ్మ యున్నది. ఆమెయే నా ప్రియతమ, నా బహిఃప్రాణము, మద్వియోగ సంతప్త. ఒకవేళ ఆమె గనుక నిద్రిస్తూ ఉంటే దయతో సద్దుమణగి వేచియుండుము. తరువాత మెల్లగా మేలుకొలిపి మందస్వరముతో నా సందేశాన్ని వినిపించు.

ఆ సందేశము ఏమంటే - "ఓ కళ్యాణీ! విధి చేత శిక్షింపబడిన నీ కాంతుడు రామగిరి ఆశ్రమమున కుశలముగా నున్నాడు. నీకై కుములుచున్నా గాని, శాపాంతమున తిరిగి లభింపగల భోగములను తలచుకొని ఊరట చెందుచున్నాడు. నీవు బేలవు కాక ధైర్యము తెచ్చుకొనుము. కష్టములు కడతేరక మానవు. మిగిలిన నాలుగు నెలల శాపము త్వరలో ముగియనున్నది. ఆపై అంతా ఆనందమే".

ఇంకా యక్షుడు మేఘునితో ఇలా అన్నాడు - "ఓ జలదా! అన్యమార్గము లేక ఈ దూతకార్యము నీకప్పగించుచున్నాను. నా ధూర్తత్వమును మన్నింపుము. నా దయనీయ స్థితిని చూచి నీవీ సందేశమును అందజేతువని ఆశించుచున్నాను. ఆపై నీ ఇచ్చవచ్చిన యెడ నీవు తిరుగవచ్చును. నీకెన్నటికిని ప్రియ వియోగము సంభవించకుండు గాక".

దయనీయమైన ఆ సందేశమును వినిన మేఘుడు యక్షపురికి అరిగి యక్షిణికి ప్రియుని కుశలవార్తను అందజేసెను. ఆ పడతి ఊరటనందెను. కుబేరుడు కూడా ఈ విషయమునెరిగి కరుణతో శాపమును అంతమొందించెను. అప్పుడా యువ దంపతులు సంతోషాంతరంగితులగుచు ఎక్కువైన భోగములనుభవించిరి.

కావ్యంలో అందాలు[మార్చు]

వర్ణనలలోను, అలంకారాలలోను కాళిదాసునకు గల అసమాన ప్రతిభా శైలి ఈ కావ్యంలో వెల్లివిరిసింది. మచ్చుకు కొన్ని వర్ణనలు.

  • శిప్రా నదీ తరంగములను తాకి వచ్చు చల్లగాలి ఎలా ఉన్నదంటే, నర్మ వచనాలతో ప్రేయసిని అనునయించే ప్రియుని ప్రవర్తనను పోలి ఉంది.
  • విరహతాపం ఉపశమించడానికి శయ్యపై పవళించిన యక్షపత్ని తూర్పుదిక్కున అంతంతగా కనుపించు ఏకకళామాత్ర శేషయైన చంద్ర రేఖ వలె నున్నది.
  • జలదా! అలకాపురిలో ఏడంతస్తుల భవనాలున్నాయి. అందు పైభాగముల నీవంటి నీరదములు గాలికి లోపలికేగి, ఆ భవనములలోని చిత్రాలను తమ జల కణములతో తడిచేసి, ఆ అపరాధం వల్ల భయపడి మెల్లగా పొగలాగా కిటికీలలోంచి నిష్క్రమిస్తాయి . ఇదెలా ఉన్నదంటే - దూతీ సహాయమున రహస్యమార్గంలో అంతఃపురంగలోకి చొరబడి అత్యాచారమొనరించిన ధూర్తుడు ఇతరులకు తెలుస్తుందేమో నని శంకతో, అపరాధ భయంతో, దొంగచాటు దారిలో బయటపడుతున్నట్లు.

ప్రాచుర్యం-ప్రభావాలు[మార్చు]

  • అసలు మేఘ సందేశమే ఒక కల్పన. ఈ కల్పనకు దారి తీసిన పరిస్థితులు నేపథ్యంగా విశ్వనాథ సత్యనారాయణఒక అందమైన కల్పనతో వ్రాసిన నవల దూతమేఘము. నేపాలరాజవంశాలను పూర్వరంగంగా తీసికొని అతడు వ్రాసిన ఆరు నవల లలో ఇది ఒకటి. కాళిదాసు మందాక్రాంతవృత్తాల లో మేఘ సందేశం వ్రాయడానికి గల కారణానికి అతడు చేసిన కల్పన పరమ రమణీయంగా ఉంటుంది.
  • ఎడబాటు కలిగిన ప్రేయసీ ప్రియులు దూతల ద్వారా సందేశములు పంపుట ఇతర పురాణాలలో కానవస్తుంది. - నల దమయంతుల హంస రాయబారము, రుక్మిణీ కృష్ణుల బ్రాహ్మణ రాయబారము, రామాయణమున హనుమంతుని దౌత్యము. సుందర కాండములో రామదూతగా హనుమంతుడు శ్రీరాముని అభిజ్ఞానమును సీతమ్మకు అందజేసే వృత్తాంతానికి, మేఘదూతంలోని కథానుగమనానికి పోలికలున్నాయి. కాని ఇలా మేఘమును రాయబారిగా ఎంచుకొనే కల్పనలో కాళిదాసే ప్రథముడు. చైనీయ కవి నూకాంగ్ తన కావ్యములో మేఘమును దూతగా పంపెనని బహుభాషా కోవిదుడు, వంగ దేశీయుడు అగు హరనాథ పండితుడు వ్రాసెను. కాని నూకాంగ్ సా.శ. ద్వితీయ శతాబ్దమువాడు. కాళిదాసు క్రీ.పూ. మొదటి శతాబ్దమువాడు.[2]
  • మేఘ సందేశం కావ్యాన్ని అనుసరిస్తూ అనేక రచనలు వచ్చాయి. ఈ కావ్యంలోని ఊహాగానానికి ఉన్న అందం అలాంటిది. వాటిలో సాంగణ కుమారుడైన విక్రమ కవి రచించిన 'నేమి సందేశము'ను ప్రత్యేకంగా పేర్కొనాలి. మేఘ సందేశంలోని ప్రతి శ్లోకంలోనూ చివరి పాదాన్ని మాత్రం యధా తధంగా తీసుకొని విక్రమ కవి తన కావ్యాన్ని రచించాడు. అంటే పూర్తి కావ్యం సమస్యా పూరణంలా రచించాడన్నమాట. ఇంకా 100కు పైగా అనుసరణ రచనలు వచ్చాయి. 12వ శతాబ్దికి చెందిన ధోయి కవి 'పవనదూతము', 13వ శతాబ్దికి చెందిన వేదాంత దేశిక కవి 'హంస సందేశము', 15వ శతాబ్దికి చెందిన కృష్ణానంద సార్వభౌముని 'పదాంక దూతము', 14వ శతాబ్దికి చెందిన ఉద్దండుని 'కోకిల సందేశము', జైన పండితుడు మేరుతుంగ కవి 'జైన మేఘ దూతము', 17వ శతాబ్దివాడు దేవీ చంద్రుని 'పవన దూతము', 18వ శతాబ్దినాటి వైద్యనాథ సూరి 'తులసీ దూతము' - వాటిలో కొన్ని. 18వ శతాబ్దమున జర్మను కవి శీలరు మేఘదూత కావ్యము ననుసరించుచు వ్రఅసిన 'మారియా స్టూవర్టు' అనే కావ్యంలో నిర్బంధంలో ఉన్న ఒక రాణి మేఘం ద్వారా ఫ్రాన్సు దేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది. సా.శ.1083లో నలందా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడైన ద్వీపాంకర అతీశుడు టిబెట్‌కి వెళ్ళి అక్కడ బౌద్ధాన్ని ఉత్తేజపరిచే క్రమంలో భారతీయ సాహిత్యాన్ని అనువర్తింపజేసేందుకు ప్రోత్సహించారు. ఆ క్రమంలోనే మేఘదూతం సహా అనేక సంస్కృత గ్రంథాలను టిబెటిక్ భాషలోకి అనువర్తింపజేశారు[3].

మూలాలు[మార్చు]

  1. కోసూరు వెంకట నరసింహరాజు రచన
  2. కోసూరు వెంకట నరసింహ రాజు రచన - 34వ పేజీ
  3. రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 9 December 2014.

వనరులు, బయటి లింకులు[మార్చు]