రామ్ రాబర్ట్ రహీమ్

వికీపీడియా నుండి
(రామ్-రాబర్ట్-రహీవ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రామ్ రాబర్ట్ రహీమ్
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
రజనీకాంత్,
శ్రీదేవి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ పద్మావతి ఫిల్మ్స్
భాష తెలుగు

రామ్ రాబర్ట్ రహీమ్ విజయనిర్మల దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. 1980లో విడుదలైన ఈ సినిమా 1977లో విడుదలైన హిందీ హిట్ చిత్రం "అమర్ అక్బర్ ఆంథొనీ" యొక్క పునర్ణిర్మాణం (రీమేక్).[1] హిందీ మూలంలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రిషీ కపూర్ నటించారు. ఈ తెలుగు చిత్రంలో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ రాబర్ట్ గానూ, రజనీకాంత్ రామ్ గానూ, చంద్రమోహన్ రహీం గానూ నటించారు. అంజలీదేవి రామ్ రాబర్ట్ రహీంల తల్లి పాత్రను పోషించింది. శ్రీదేవి రాబర్ట్ ప్రియురాలిగా నటించింది.

జగదీష్ ఒక డ్రైవరు. అతను, అతని భార్య, ముగ్గురుపిల్లలతో సంతోషమైన జీవితాన్ని గడుపుతుంటాడు. తన యజమాని కన్నింగ్స్ దగ్గర విశ్వాసపాత్రమైన వ్యక్తిగా పనిచేస్తుంటాడు. ఒకసారి కన్నింగ్స్ యాక్సిడెంట్ చేసి, జగదీష్‌ని ఆ నేరం తనమీద వేసుకోమని ప్రాధేయపడతాడు. తాను జగదీష్ సంసారానికి నెలనెలా ఖర్చులు భరిస్తానని మాట ఇస్తాడు. విశ్వాసపాత్రుడైన జగదీష్ జైలుకెళ్తాడు. జైలు నుండి విడుదలై వచ్చిన జగదీష్ తన కుటుంబం చీకటితో నిండిపోయి ఉండడం గమనిస్తాడు. ఒకవైపు తన భార్య టీబీతో మంచాన పడివుంది. మరోవైపు దరిద్రం తాండవిస్తోంది. సహాయం కోసం తన యజమాని కన్నింగ్స్ వద్దకు వెళ్తాడు. కన్నింగ్స్ సహాయం చేయకపోగా, జగదీష్‌ని అవమానిస్తాడు. ఆవేశంతో జగదీష్ కన్నింగ్స్‌ని పిస్టల్‌తో కాల్చి అతని కారులోనే పారిపోతాడు.

జగదీష్ భార్య ఒక చీటీ తన పిల్లల చేతిలో ఉంచి, ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరుతుంది. కాని విధివశాన ఆమెకు చూపు పోతుంది. జగదీష తన ముగ్గురు పిల్లలను తీసుకుని బయలు దేరుతాడు. వాళ్ళను ఒక పార్కులో కూర్చోబెట్టి తాను ముందుకు సాగుతాడు. కారు ఒక దుర్ఘటనలో చిక్కుకుంటుంది. పెద్ద కొడుకు ఒక జీపుక్రింద పడగా పోలీస్ ఆఫీసర్ అతనిని తీసుకుపోతాడు. రెండవవాడు ఒక చర్చిలో ఫాదర్ దగ్గర దత్తపుత్రుడిగా పెరుగుతాడు. చిన్నవాడు ఒక ముస్లిం కుటుంబంలో పెరుగుతాడు. ఇలా జగదీష్ కుటుంబం విచ్చిన్నమౌతుంది. సంవత్సరాలు గడుస్తాయి.

జగదీష్ ఒక లక్షాధికారి అవుతాడు. పెద్దవాడు రామ్‌ బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ అవుతాడు. రెండవవాడు రాబర్ట్, మూడవవాడు రహీమ్‌గా పెరుగుతారు. కన్నింగ్స్ కూతురు రోజీని జగదీష్ అపహరించి, పెంచి పై చదువులకు లండన్ పంపుతాడు. ఆమె తిరిగివస్తుంది. ఆమెను రాబర్ట్ ప్రేమిస్తాడు. రహీం మంచి కవ్వాలీ పాటగాడు అవుతాడు. అతడు రజియా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. రామ్‌ బాధ్యతగల పోలీస్ ఆఫీసర్‌గా పిక్ పాకెట్ చేసే ఒక అమ్మాయిని నరకపు జీవితాన్నుంచి తప్పించి మంచి మార్గంలో పెడ్తాడు. ముగ్గురూ కలుసుకుంటారు కాని వారి వివరాలు వారికే తెలియవు.

కన్నింగ్స్ మరలా ధనవంతుడౌతాడు. చిన్నతనంలో జగదీష్ ఎత్తుకుపోయిన తన కూతురు రోజీని కలుసుకోవడానికి కన్నింగ్స్ తహతహలాడుతుంటాడు. అన్ని చోట్ల వెదుకుతుంటాడు. రోజీ అతనికి దొరికిన సమయంలో పరిస్థితుల ప్రోద్భలంవల్ల రోజీని తన పార్ట్‌నర్ అయిన జేమ్స్‌తో పరిణయం చేయవలసిన దుస్థితి ఏర్పడుతుంది.

ఫాదర్ హత్యచేయబడిన సందర్భంలో రాబర్ట్ తన తండ్రియైన జగదీష్‌ను గుర్తుపడతాడు. పువ్వులమ్ముకుని జీవనం సాగిస్తున్న జగదీష్ పత్ని తన కొడుకు రహీంను గుర్తు పడుతుంది. రోజీ పెళ్ళి జరగబోయే సమయంలో రామ్‌, రాబర్ట్, రహీమ్‌ మారువేషాలలో కన్నింగ్స్‌ని, అతని ముఠాని పోలీసులకు అప్పగిస్తారు. జగదీష్ తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తన భార్య పిల్లలను తిరిగి కలుసుకుంటాడు[2].

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్ని అందించగా, ఆత్రేయ, ఆరుద్ర, సినారె,వేటూరి, సాహితి గీతాలను సమకూర్చారు[2].

పాట రచయిత సంగీతం గాయకులు
అమ్మంటే అమ్మ ఈ అనంత సృష్టికామె అసలు బ్రహ్మ ఆత్రేయ చక్రవర్తి చక్రవర్తి
చిలకుందీ చిలక ముసుగున్న చిలక సినారె చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఒక్క సారి ముద్దుపెట్టుకో వుండలేను చెయ్యి పట్టుకో సినారె చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
మై నేమ్‌ ఈజ్ రాబర్ట్ గంజాల్విజ్ ఐ కమ్‌ ఫ్రమ్‌ లౌలీ ప్యారడైజ్ ఆరుద్ర చక్రవర్తి మాధవపెద్ది రమేష్
ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసీ మెలసీ కౌగిట బిగిసే బంధాలలో వేటూరి చక్రవర్తి పి.సుశీల, ఆనంద్, ఎస్.పి.శైలజ
సాయిబాబా ఓ సాయిబాబా షిరిడీ సాయిబాబా సినారె చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
లక లక లక లక చెంచుక తక తక తక తక దంచుక సాహితి చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
ముగ్గురు కలిసీ ఒకటై నిలిచీ ముందుకు దూకారంటే సినారె చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆనంద్, రమేష్

మూలాలు

[మార్చు]
  1. http://economictimes.indiatimes.com/Features/Business_of_Bollywood/Transcending_language_barrier/articleshow/3504534.cms
  2. 2.0 2.1 ఈశ్వర్. రామ్‌ రాబర్ట్ రహీమ్‌ పాటలపుస్తకం. p. 16. Retrieved 12 September 2020.

బయటి లంకెలు

[మార్చు]