కొండపనేని రామలింగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండపనేని రామలింగేశ్వరరావు
జననం(1945-02-17)1945 ఫిబ్రవరి 17
మరణం1995 జూలై 15(1995-07-15) (వయసు 50)
వృత్తిసినిమా కళా దర్శకుడు
జీవిత భాగస్వామిపార్వతి
తల్లిదండ్రులు
  • కొండపనేని చలమయ్య చౌదరి (తండ్రి)
  • సహదేవమ్మ (తల్లి)

కొండపనేని రామలింగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కళాదర్శకుడు. ఇతడు 35 సంవత్సరాలకు పైగా చిత్రపరిశ్రమలో పనిచేశాడు. ఇతడు పరిశ్రమలో ఆందరికీ రామలింగంగా సుపరిచితుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు 1945, ఫిబ్రవరి 17వ తేదీన గుంటూరు జిల్లా, దుగ్గిరాల గ్రామంలో కొండపనేని చలమయ్య చౌదరి, సహదేవమ్మ దంపతులకు జన్మించాడు.[1] ఇతని తండి ఆయుర్వేద వైద్యుడు. ఇతని బాల్యం దుగ్గిరాల గ్రామంలో నడిచింది. తరువాత మెట్రిక్యులేషన్ చదవడానికి తెనాలి వెళ్ళి అక్కడ రామా ట్యుటోరియల్ కాలేజీలో చేరాడు. ఇతని తండ్రి ప్రజానాట్యమండలి కళాకారుడు కావడంతో అతనికి ఆనాటి పేరుపొందిన నటులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. దానితో రామలింగేశ్వరరావుకు సినిమా రంగం పట్ల ఇష్టం పెరిగి మెట్రిక్యులేషన్ పూర్తి కాగానే 1960లో మద్రాసుకు వెళ్ళిపోయాడు.

సినిమా రంగం[మార్చు]

మద్రాసు చేరుకున్న రామలింగం తన తండ్రికి స్నేహితుడైన నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు వద్ద పబ్లిసిటీ డిజైనర్‌గా తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు. అక్కడ భార్యాభర్తలు, కలసి ఉంటే కలదు సుఖం మొదలైన సినిమాలకు పనిచేశాడు. తరువాత కాట్రగడ్డ నరసయ్య, గుమ్మడి, జగ్గయ్యల సహకారంతో టి. వి. యస్. శర్మవద్ద అప్రెంటిస్‌గా చేరాడు. కొంత కాలానికే ఇతడికి కృష్ణ పరిచయమయ్యాడు. రామలింగం పనితీరు పట్ల ఆకర్షితుడైన కృష్ణ ఇతడికి డిజైనింగ్ వృత్తి నుండి కళా దర్శకత్వంవైపు మళ్ళమని సలహా ఇచ్చాడు. ఇతడు ఆ రంగంలో ప్రవేశించడానికి తీవ్రమైన కృషి చేసి చివరకు కుదరవల్లి నాగేశ్వరరావు వద్ద సహాయకుడిగా చేరి పేదరాసి పెద్దమ్మ కథ సినిమాకు పనిచేశాడు. అక్కడ ఇతడు కొన్ని మెలకువలు నేర్చుకున్నాడు. 1962-64ల కాలంలో ఇతనికి గడ్డు పరిస్థితి ఏర్పడి గత్యంతరంలేక తిరిగి ఉత్త చేతులతో దుగ్గిరాలకు వెళ్ళిపోయాడు.

కొన్ని సంవత్సరాలు గడిచాక అలపర్తి సురేంద్ర ఇతని గురించి తెలుసుకుని 1967లో తిరిగి మద్రాసుకు పిలిపించాడు. రామలింగం కళాదర్శకత్వ శాఖలో నిలదొక్కుకోవడానికి సురేంద్ర సహకరించాడు. తిరిగి ఇతడు కుదరవల్లి నాగేశ్వరరావు వద్ద సహాయకుడిగా చేరాడు. 1968లో దోనేపూడి కృష్ణమూర్తి, వీర్రాజులు నిర్మాతలుగా కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో కాంతారావు నటించిన రాజయోగం సినిమాతో ఇతడు కళాదర్శకుడిగా మారాడు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఇతనికి మంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది. చారిత్రక, సోషియో ఫాంటసీ సినిమాల స్క్రిప్టుకు, పాత్రలకు తగినట్లుగా సెట్టింగులను సమకూర్చడంలో ఇతడు పేరుగడించాడు.

కృష్ణ తన సోదరులతో కలిసి పద్మాలయా స్టూడియోస్ ప్రారంభించాక ఇతడిని ఆ సంస్థలో ఆస్థాన కళాదర్శకుడిగా నియమించుకున్నాడు. అప్పటి నుండి 12 సంవత్సరాలు ఆ బ్యానర్‌కు కళాదర్శకునిగా పనిచేసి తన జీవితంలో మధురమైన అనుభూతులను సంపాదించుకున్నాడు. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం చింతపల్లిలో 5 ఎకరాల స్థలంలో ఇతడు డిజైన్ చేసిన సెట్టింగ్‌ను లక్ష రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించారు. దీనిని పద్మాలయా కాలనీగా పిలుస్తున్నారు. మోసగాళ్ళకు మోసగాడు సినిమాకు ఇతడు కళాదర్శకత్వంతో పాటు కాస్ట్యూములు కూడా డిజైన్ చేశాడు. ఈ సినిమాలో కృష్ణకు ఇతడు డిజైన్ చేసిన దుస్తులు బాగా పాపులర్ అయ్యి కృష్ణకు బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈనాడు సినిమా కోసం మద్రాసు అరుణాచలం స్టూడియో ప్రక్కన ఇతడు నిర్మించిన సెట్టింగ్ కృష్ణా గార్డెన్స్ పేరుతో పద్మాలయా స్టూడియోస్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. షోలే సినిమా సెట్టింగ్ తరువాత అంత వాస్తవిక సెట్టింగ్‌గా దీనిని పేర్కొంటారు. ఈ సెట్టింగ్ పలువురి ప్రశంసలను పొందింది.

ఇతడు పద్మాలయా సినిమాలతో పాటుగా భార్గవ్ ఆర్ట్స్ మొదలైన బ్యానర్లకు కళాదర్శకుడిగా పనిచేశాడు. కట్టా సుబ్బారావు, తాతినేని ప్రసాద్, వేజెళ్ల సత్యనారాయణ వంటి అనేక దర్శకుల సినిమాలకు కళా దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు కొన్ని ఇతర భాషా చిత్రాలకు పనిచేశాడు. ఇతనికి కళా దర్శకత్వంతో పాటు నటనలో కూడా ఆసక్తి ఉంది. నా పెళ్ళాం నా ఇష్టం, పచ్చని సంసారం, మామా కోడళ్లు, అల్లరిపిల్ల వంటి కొన్ని సినిమాలలో నటించాడు. [1]

ఇతడు ప్రభుత్వాన్ని సినిమా నిర్మాణం కోసం ఓపెన్ స్టూడియోలు నిర్మించాల్సిందిగా అభ్యర్థించాడు. మద్రాసు నుండి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు తరలిరావడానికి కృషి చేశాడు. ఇతడు 250కు పైగా సినిమాలకు కళా దర్శకత్వం వహించాడు. ఇతని సోదరుడు ఉమామహేశ్వరరావు సినీ జర్నలిస్టు. ఇతని వివాహం సావిత్రితో జరిగింది. ఇతని పెద్ద కుమారుడు కూడా కళా దర్శకునిగా పనిచేస్తున్నాడు. రామలింగం కాలేయ వ్యాధితో బాధపడుతూ తన 50వ యేట హైదరాబాదులో 1995, జూలై 15న మరణించాడు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

ఇతడు కళా దర్శకుడిగా పనిచేసిన సినిమాల పాక్షిక జాబితా:

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 వెబ్ మాస్టర్. "Kondapaneni Ramalingeswara Rao (Art Director)". indiancine.ma. Retrieved 19 January 2022.

బయటి లింకులు[మార్చు]