వరాహగిరి వెంకట జోగయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరాహగిరి వెంకట జోగయ్య (1870 - 1939) ప్రముఖ న్యాయవాది. స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాష్ట్రపతి వి.వి.గిరి యొక్క తండ్రి.

వీరు గోదావరి జిల్లా చింతలపల్లి గ్రామంలో జన్మించారు. వీరి పెంపుడు తండ్రి నరసయ్య పంతులు మందస సంస్థానంలో కొంతకాలం దివానుగా పనిచేశారు. వీరు 1888 సంవత్సరంలో బరంపురం నేటివ్ కాలేజీలో ఎఫ్.ఏ. పరీక్ష పాసై, 1894లో ఫస్టు గ్రేడు ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు లా కాలేజీలో చదివే రోజుల్లో ఈయన టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క సహాధ్యాయి. 1896లో బి.ఏ. పట్టా పుచ్చుకున్నారు. చిరకాలంలోనే వకీలు వృత్తిలో మంచి అభివృద్ధి సాధించారు. బరంపురం న్యాయస్థానంలో ప్రముఖ న్యాయవాదిగా పేరుపొంది, బార్ అసోషియేషన్ ప్రెసిడెంటుగాను, పబ్లిక్ ప్రాసిక్యూటరుగాను కొంతకాలం ఉన్నారు. ప్రజాసేవ కార్యాలలో పాల్గొనడానికి వీరు పదవి అడ్డురావడంతో దానిని త్యజించారు. ఈయన బెంగాల్ - నాగపూర్ రైల్వే కార్మికుల సంఘపు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు.

వీరు చాలాకాలం మునిసిపాలిటీ, తాలూకా బోర్డులలోను సభ్యునిగా ఉన్నారు. 1907 నుండి 1917 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. 1920లలో చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ స్థాపించిన స్వరాజ్య పార్టీలో చేరి, 1927 నుండి 1930 వరకు కేంద్రప్రభుత్వ శాసనసభలో ప్రజా ప్రతినిధిగా ఉన్నారు.

బరంపురం ప్రాంతం అంతా ఉత్కళ రాష్ట్రంలో చేర్చబడిన తరువాత అక్కడ ఆంధ్రులు పడే దురవస్థలు గురించి పై అధికారులకు తెలుపడానికి శ్రమించారు. ఒడిషా సరిహద్దు నిర్ణయ కాలంలో వీరు ఆంధ్రులకు అన్యాయం జరగకుండా చూడటానికి మూడు సార్లు లండన్ వెళ్ళి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి విషయాలు తెలియజేశారు. 1937 ఎన్నికలలో మద్రాసు శాసనసభకు విశాఖపట్టణం మండలపు ప్రజా ప్రతినిధిగా ఎన్నికై, 1937 నుండి 1937వరకు మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నాడు.[1]

ఈయనకు వి.వి.గిరితో పాటు లక్ష్మీబాయి అనే కూతురు ఉంది. ఈమె కూడా సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నది.

వరాహగిరి వెంకట జోగయ్య, 1939, జనవరి 27న మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. p. 134. Retrieved 12 August 2024.