వల్లూరు వెంకటరామయ్య

వికీపీడియా నుండి
(వల్లూరి వెంకట్రామయ్య చౌదరి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వల్లూరి వెంకట్రామయ్యచౌదరి
జననంమే 11, 1925
కొలకలూరు, తెనాలి, గుంటూరు జిల్లా
ప్రసిద్ధిరంగస్థల నటుడు
తండ్రిఅంజయ్య
తల్లిసౌభాగ్యమ్మ

వల్లూరి వెంకట్రామయ్యచౌదరి ప్రముఖ రంగస్థల నటుడు. ఆంధ్ర డ్రమెటిక్ అమెచ్చూర్ స్థాపకులలో ముఖ్యులు.

జీవిత విశేషాలు

[మార్చు]

వీరు 1925, మే 11న సౌభాగ్యమ్మ, అంజయ్య దంపతులకు గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కొలకలూరులో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ప్రాథమిక విద్య సొంత వూరులోనే సాగింది.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

వీరి పెదనాన్న వెంకటరామయ్య నటుడు, దుగ్గిరాల కంపెనీలో వివిధ పాత్రలను పోషించేవాడు. అంతేకాకుండా వీరి పాఠశాల పంతులు ముకుందరామయ్ సహజ నటుడు, గాయకుడు. పెదనాన్న, పంతులు ప్రభావంవల్ల వెంకట్రామయ్య నాటకంపై అనురక్తిని పెంచుకొని పాఠశాల వార్షికోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణ రాయబారం నాటకంలో దుర్యోధన పాత్రను పోషించి, ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు.

ఒకరోజు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లినందుకు పంతులు దండించడంతో స్కూల్ విద్యకు స్వస్తిపలికి, నటనవైపు దృష్టి మళ్లించారు. ఎమ్.ఎన్. రాయ్ రాడికల్ పార్టీలో చేరి, ఆ పార్టీకి సంబంధించిన గేయాలను శ్రావ్యంగా పాడేవారు. ప్రముఖ హేతువాది త్రిపురనేని రామస్వామి చౌదరి సంస్కరణలపట్ల ఆకర్షితుడై ఆయన అభిమానాన్ని చూరగొన్నారు.

త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన శ్రీరామ రావణ యుద్ధం నాటకంతో వల్లూరు నటజీవితం ప్రారంభమైంది. బాలనాగమ్మ లో ఫకీరుగానూ, రామాంజనేయ యుద్ధంలో యయాతిగానూ, సక్కుబాయిలో శ్రీకృష్ణుడుగానూ, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడిగా నటించారు. మిత్రులైన డి.వి. సుబ్బారావు, రత్నాకరరావు, పగడాల రామారావు, జానకీదేవి, రాజకుమారి, కృష్ణవేణిలతో కలసి ఒక నాటక సంస్థను స్థాపించారు. ఆ సంస్థ తరపున బాలనాగమ్మ, భక్త శబరి, నటనాలయం, వీరపాండ్య కట్టబ్రహ్మన్న మొదలైన నాటకాలను ప్రదర్శించారు. బాలనాగమ్మ నాటకం ప్రదర్శించేటపుడు ఫకీరు పాత్రలో ఉన్న వల్లూరు వెంకట్రామయ్యను చూసి, పిల్లలు, పెద్దలు దడుచుకునేవారు. గర్భణీ స్త్రీలు, చిన్నపిల్లలు రాకూడదని నిర్వాహకులు ముందుగానే తెలిపేవారు. ఈ పాత్ర ఆయనకు బాగా పేరు తెచ్చింది. ఆయన ‘జై కపాళీ’ అనీ గంభీరమైన కంఠంతో అన్నపుడు రెండు మూడు కి.మీ.ల దాకా వినపడేది. ఈ పాత్రను ఇంత గంభీరంగా నటించి మెప్పించినవారు ఆంధ్ర నాటకరంగంలోలేరు. ఈ నాటకాన్ని పల్లెపల్లెకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.

ఆంధ్రరసాలిని సంస్థ తరపున ఆలపాటి వెంకట్రామయ్య కళాపరిషత్తులో నటనాలయం నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించాడు.[1]

మూలాలు

[మార్చు]
  • వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 565.


మూలాలు

[మార్చు]
  1. అద్భుత నాటకం నటనాలయం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 24 జూలై 2017, పుట.14