వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 15వ వారం
సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం లో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది. మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.
కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.
ఇంకా....పూర్తివ్యాసం పాతవి