గృహ ప్రవేశం
గృహ ప్రవేశం కొత్త ఇల్లు లేదా గృహము కట్టుకున్న తరువాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే పండుగ. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యన్నారాయణ స్వామి వ్రతం, బంధువులకు, స్నేహితులకు విందు, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం మొదలైనవి దీనిలోని ముఖ్యమైన కార్యక్రమాలు.
నూతన గృహ ప్రవేశమునకు కావలసిన వస్తువులు
[మార్చు]- పసుపు = 150 గ్రాములు.
- కుంకుమ = 250 గ్రాములు.
- తమలపాకులు = 2 కట్టలు (పెద్దవి)
- వక్కలు = 100 గ్రాములు.
- అరటి పిలకలు = 2
- అరటి పండ్లు = 25
- అగరవత్తులు = 1 కట్ట (పెద్దది)
- సాంబ్రాణి = 100 గ్రాములు.
- నువ్వుల నూనె = 2 కిలోలు
- ఒత్తుల కట్ట = 1 (పెద్దది)
- తెల్ల గుడ్డ బద్దీ ముక్క (కాటన్) = 1/4 మీటరు (అఖండ దీపమునకు)
- మట్టి మూకుడు (కొత్తది) = 1
- వరి ధాన్యము = 1 కిలో
- విస్తళ్ళు = 12
- దేవుళ్ళ పటములు = 5
- పూల మాలలు = 20 మూరలు
- రవికెల గుడ్డలు = 4 (కాటన్ ముక్కలు) (కొత్తవి)
- చాకు (కొత్తది) = 1
- పూజా బియ్యము = 8 కెజీలు
ధర్మ సింధు[1] ప్రకారం ఆచరించవలసిన పద్ధతి ఈ విధంగా ఉంది. గృహ యజమాని ధర్మపత్నితో సహా మంగళ స్నానాలు చేసి బంధు మిత్రులతో కూడుకొని నూతన గృహమునకు, ముహూర్త సమయమునకు కొంచెము ముందుగా చేరుకొనవలెను. గృహ ద్వారము వద్ద దూడతో ఉన్న ఆవును పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలెను. అష్టదిక్కుల, భూదేవికి ఊర్ధ్వ పురుషునికి వాస్తువరుణ దేవతలకు మృష్టాన్నము, వసంతంతో నింపిన గుమ్మడికాయ బలిహరణము (ఉద్దిబేడలు, పెసరపప్పు, బియ్యము, పసుపు, సున్నము కలిపి వండిన అన్నము) ఈయవలెను. దీనిని వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కుల పెట్టవలెను. కలశమున గంగాది తీర్థములను ఆవాహన చేసి పూజించవలెను. దీనిని "గంగపూజ" అంటారు. శుభ ముహూర్తమున దూడతో ఆవును ముందుంచుకొని, గృహదేవతా విగ్రహములను కాని, పటములను కాని చేత పట్టుకొని మంగళ వాద్య ఘోషముల మధ్య యజమాని కుడికాలు, ధర్మపత్ని ఎడమకాలు గృహమునందు పెట్టవలెను.
పాలు పొంగించి, క్షీరాన్నమును వండి దానితో వాస్తుపురుషుని పూజించి నివేదన చేయవలెను. పాలు పొంగించుటకు చేసిన అగ్ని హోత్రమునకు నెయ్యి, చక్కెర వేసి నమస్కరించవలెను. వాస్తుపూజకు ముందు గణపతి పూజ చేయవలెను. నవగ్రహ పూజ, అష్ట దిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణము పెట్టువరకు నూతన గృహమున ఏమియు వండరాదు.
మూలాలు
[మార్చు]- ↑ గృహ ప్రవేశము, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 673-4.