వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 23వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ

జనపదాల కాలం నాటి నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగి కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన తెలంగాణ 1948 సెప్టెంబరు 17న నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడింది. దశాబ్దాలుగా సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. జూన్ 2, 2014 న తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్టానికి ఉత్తరాన మహారాష్ట్ర, పశ్చిమాన మహారాష్ట్ర మరియు కర్ణాటక, దక్షిణాన మరియు తూర్పున ఆంధ్రప్రదేశ్, ఈశాన్యాన చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందినవారు. చరిత్రలో షోడస మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారతం కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. 10 జిల్లాలు కలిగిన తెలంగాణ రాష్ట్ర వైశాల్యం 114,840 చకిమీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 3,52,86,757 ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ లో 5వ శక్తిపీఠం, భద్రాచలంలో ప్రముఖమైన రామాలయం, బాసరలో సరస్వతీ దేవాలయం ఉన్నాయి. దేశంలో ఐదవ పెద్ద నగరమైన హైదరాబాదు ఈ రాష్ట్ర రాజధాని. వరంగల్, నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మం, రామగుండం తెలంగాణలోని ఇతర ముఖ్య నగరాలు.

(ఇంకా…)