శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)
17°17′00″N 82°24′09″E / 17.28328°N 82.40256°E
అన్నవరం సత్యనారాయణ దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°17′N 82°24′E / 17.28°N 82.40°E |
పేరు | |
ఇతర పేర్లు: | సత్యదేవుడు |
ప్రధాన పేరు : | శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | కాకినాడ |
ప్రదేశం: | రత్నగిరిక్షేత్రం, అన్నవరం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సత్యనారాయణస్వామి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 1891 ఆగష్టు 6 |
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం, లేదా అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా లోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ-వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది.[1] విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణస్వామికి ఈ ఆలయం అంకితం చేయబడింది.
రవాణా సౌకర్యం
[మార్చు]కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి 18 కి.మీ.ల దూరంలో.. కాకినాడ నగరానికి 45 కి.మీ.ల దూరంలో.. రాజమహేంద్రవరానికి 80 కి.మీ.ల దూరంలో.. విశాఖపట్నం నుంచి 120 కి.మీ.ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వేస్టేషన్ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం.. రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు.[2]
అలయ నిర్వహణ
[మార్చు]ఈ ఆలయం 13 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ క్రింద నిర్వహించబడుతోంది.[3]
స్థలపురాణం
[మార్చు]స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి, మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి కొండ, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.[4]
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు ఇతనికి, రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియ, మఖ నక్షత్రం, గురువారం నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారం ప్రతిష్టించి సేవించుం" అని చెప్పి మాయమయ్యారని కథనం
మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు (కృష్ణకుటజం) కింద పొదలో స్వామి వారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 న (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించారు.[4]
ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నలు గలవి, శూల శిఖరాలతో ఉన్నాయి.అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవత, అంబికా దేవతల ప్రతీకలగు చక్రశిఖరాలు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
ఆలయ పునరుద్ధరణ
[మార్చు]1970లో ఆలయం మీద పిడిగు పడి ఆలయవిమాన గోపురం పగులుబారటంతో రుద్రాక్షమడపం మీద పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ్జ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైటు నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల కొరకు తమిళనాడు నుండి 1000 టన్నుల గ్రానైట్ తీసుకువచ్చారు. దిగువ, మొదటి అంతస్తుకు 900 టన్నుల గ్రానైటు రాయి ఉపయోగించారు. పునర్నిర్మాణానికి ముందు చిన్నదిగా ఉన్న గర్భాలయాన్ని కొంచం విశాలంచేసి ఆలయ ప్రధాన ద్వారం పెద్దదిచేసి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. దిగువన ఉన్న యంత్రమందిరం కూడా విశాలం చేశారు.
స్వర్ణాలంకరణ
[మార్చు]పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం, గణేశ, బాలాత్రిపుర సుందరి, సూర్యనారాయణ, శంకర పంచాయత కలశాలు స్వర్ణపుపూత పూసుకున్నాయి. క్షేత్రపాలకులయిన రామాలయ గోపుర కలశం, ఆంజనేయస్వామి గోపురకలశం కూడా బంగరుపూతపూయబడ్డాయి. రుద్రాక్షమండపం, మంకరతోరణం, ద్వారాలు, ఊయలకు కూడా బంగారు పూత పూయబడ్డాయి.
అనుబంధ ఆలయాలు
[మార్చు]రత్నగిరి కొండల పై శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం. అన్నవరంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కొండ క్రింద గ్రామ దేవత గుడి ఉంది.
ఆలయ విశేషాలు
[మార్చు]ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నాలు ఉన్నాయి, శూల శిఖరములతో ఉన్నాయి. రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.
ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్తులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది.[5]
సత్యనారాయణస్వామి శ్లోకం
[మార్చు]శ్రీ సత్యనారాయణ స్వామివారిని
- "మూలతో బ్రహ్మరూపాయ
- మధ్యతశ్చ మహేశ్వరం
- అధతో విష్ణురూపాయ
- త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.
దర్శన వేళలు
[మార్చు]ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో విరామం: రోజూ స్వామివారికి మహానివేదన కోసం... మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలు ఆపేస్తారు. నివేదన అనంతరం మళ్లీ కొనసాగిస్తారు.
ప్రత్యేక పూజలు వివరాలు
[మార్చు]- ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు.
- సాధారణ వ్రతమైతే రూ. 150, ప్రత్యేక వ్రతమైతే రూ.300, ధ్వజస్తంభం వద్ద చేసేందుకు రూ. 700, విశిష్ట వ్రతమైతే.. రూ. 1500 చొప్పున రుసుం చెల్లించాలి
- వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు, అరటిపళ్లు తీసుకొస్తే సరిపోతుంది. మిగతా పూజా సామగ్రి ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు తదితర పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చుతుంది. వ్రతకర్తలైన భార్యాభర్తలతో పాటు వారి పిల్లల్ని అనుమతిస్తారు.
పూజల్లో పాల్గొనేందుకు రుసుం వివరాలు:
[మార్చు]- పౌర్ణమికి నిర్వహించే ప్రత్యంగిర హోమంలో పాల్గొనేందుకు రూ.558
- స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం ఘనాపాఠీల ఆశీర్వచనానికి రూ. 558
- పవళింపుసేవలో పాల్గొనేందుకు.. రూ. 50
- స్వామివారి శాశ్వత కల్యాణం (పదేళ్లు మాత్రమే) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 10వేలు
- శ్రీ స్వామివారి వ్రతం (పదేళ్లు) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 7 వేలు
- స్వామివారి శాశ్వత నిత్యపూజ (పదేళ్లకు) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 500
- శ్రీ స్వామివారి మూలవరులకు అభిషేకం (ప్రతి నెలా ముఖ నక్షత్రం రోజున)రు. 3,000 టిక్కెట్‌పై అనుమతిస్తారు.
- రత్నగిరిపై సప్త గోపూజ నిత్యం జరుగుతుంది. రూ. 116 రుసుం చెల్లించాలి.
- శ్రీ సత్యనారాయణస్వామివారి మూలవరులకు స్వర్ణపుష్పార్చన. 108 బంగారు పుష్పాలతో పూజచేసి ప్రసాదం అందిస్తారు. దీనికి రూ. 3 వేలు రుసుముగా చెల్లించాలి.
శ్రీ సత్యదేవునికి నిర్వహించే నిత్యపూజల సమయాలు
[మార్చు]- రోజూ తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ
- 5 గంటలకు ధూపసేవ
- ఉదయం 7 గంటలకు బాలభోగం
- 7.30 గంటలకు బలిహరణ
- ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ చతుర్వేద పారాయణలు
- మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన
- సాయంత్రం 6 గంటలకు ధూపసేవ
- రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకూ దర్బారు సేవ
- రాత్రి 8.30 గంటల నుంచి 9 గంటల వరకూ ఏకాంత సేవ
ఆలయ మూర్తులకు నిర్వహించే ఇతర సేవలు
[మార్చు]రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ శ్రీ స్వామివారికి నిత్యకల్యాణం జరుగుతుంది. ఇందులో పాల్గొనదల్చిన భక్తులు రూ. 1,000 రుసుం చెల్లించాలి. ఆ మేరకు దేవస్థానమే పూజాసామగ్రి సమకూరుస్తుంది. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువా, జాకెట్టు ముక్క, ప్రసాదం, బంగీ ప్రసాదం అందజేస్తారు.
- వసతి, భోజన సౌకర్యం వివరాలు
రత్నగిరిపైన.. అన్నవరంలోనూ దేవస్థానం చౌల్ట్రీలు.. కాటేజ్‌లు... సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రోజుకు కనిష్ఠంగా రూ. 150 నుంచి గరిష్ఠంఆ రూ. 3వేల వరకూ రుసుం వసూలు చేస్తారు. వీటికి ఆన్‌లైన్ ద్వారా ముందస్తు బుకింగ్ సదుపాయం ఉంది. వీటితో పాటు పలు ప్రైవేటు.. ఆధ్యాత్మిక సంస్థల వసతిగృహాలూ భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది.
- ఆన్‌లైన్ సేవలు
దేవస్థానంలో వసతిగదులు, వ్రత, కల్యాణ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ ధరకన్నా 50శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ సేవలన్నింటినీ మీ-సేవ కేంద్రాల్లో బుక్‌చేసుకునే అవకాశముంది. ఉపాలయాల్లో నిర్వహించే పూజలు: ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీహోమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు భక్తులు ఒక్కొక్కరికి రూ. 558 చెల్లించాలి.
- ప్రత్యేక రోజుల్లో విశిష్ట పూజలు :చైత్రశుద్ధ పాడ్యమి పంచాంగ శ్రవణం, చైత్రశుద్ధ అష్టమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీరామనవమి కల్యాణ ఉత్సవాలు జరుగుతాయి.
- చైత్ర బహుళ షష్టి నుంచి అమావాస్య వరకూ కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శ్రీ నేరేళ్లమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీకృష్ణజయంతి, వినాయక చవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీకమాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు.
- ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
పండుగలు
[మార్చు]రత్నగిరి పై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే.
- శ్రావణ శుద్ధ విదియ - శ్రీసత్యనారాయణస్వామి జయంతి.
- వైశాఖ శుద్ధ దశమి-వైశాఖ బహుళ పాఢ్యమి ( ఐదు రోజులు) శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి.
- వైశాఖ శుద్ధ ఏకాదశి- స్వామివారి కళ్యాణం
- చైత్ర శుద్ధ పాడ్యమి - ఉగాది - పంచాగశ్రవణం
- శ్రీరామనవమి - చైత్ర శుద్ధ నవమి - శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు
- చైత్ర బహుళ షష్ఠి - కనక దుర్గమ్మ జాతర
- శ్రీకృష్ణాష్టమి- శ్రీ కృష్ణ జయంతి
- వినాయక చవితి - గణపతి నవరాత్రులు
- దేవీ నవరాత్రులు - యంత్రాలయంలో లక్ష కుంకుమార్చన
- కార్తీక పౌర్ణమి - గిరి ప్రదక్షిణ - జ్వాలాతోరణం
- కార్తీక శుద్ధ ద్వాదశి - తెప్పోత్సవం
- మహాశివరాత్రి - లక్ష బిల్వార్చన
ఇంకా దర్శనీయ స్థలాలు
[మార్చు]- పలభా యంత్రం: పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ, నిర్దేశక యంత్రం రత్నగిరి పైన ప్రధాన ఆలయానికి ప్రక్కన ఉంది. సూర్యుని నీడ (ఎండ) ఆధారంగా కాల నిర్ణయం చేసి, పని చేసేగడియారం ఇది.
- తులసివనం
- వనం మధ్యలో పాముపుట్ట
- ఉద్యానవనం. ఇక్కడ భక్తులు సేదతీరేందుకై ఏర్పాటు చేయబడిన ఉద్యానవనంలో అందమైన పూలమొక్కలు,పొగడచెట్లు,పూజలకు ఉపయోగపడే పలు పత్రిమొక్కలు పెంచబడుతున్నవి.ఉధ్యానవనం మధ్య మధ్య కూర్చునేందుకు వీలుగా సిమెంట్ బల్లలు కట్టబడ్డాయి.
ఒక విశేషం
[మార్చు]రత్న గిరి పై వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రాముఖ్యతకు గుర్తుగాను, స్వామి వారిని దర్శించేందుకు వచ్చే భక్తజనానికి ప్రయాణ సౌకర్యాన్ని కలిగించే దృష్టి తోను రైల్వే శాఖ రత్నాచల్ పేరుతో ఒక ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. ఇది విశాఖపట్నం-విజయవాడ ల మధ్య నడుస్తూ, అన్నవరం స్టేషనులో ఆగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Gold-plated main entrance of Annavaram temple inaugurated - The Hindu". web.archive.org. 2022-12-21. Archived from the original on 2022-12-21. Retrieved 2022-12-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Praveen, Kishan. "Annavaram Temple Vratham Ticket Price Timings Booking Online". Gokshetra. Gokshetra. Retrieved 19 June 2023.
- ↑ India, The Hans (2016-10-01). "Trust boards named for AP temples". www.thehansindia.com. Retrieved 2022-12-21.
- ↑ 4.0 4.1 "Sri Veera Venkata Satyanarayana Swamy Vari Devasthanam, Annavaram East Godavari District - Tempel History". www.annavaramdevasthanam.nic.in. Retrieved 2022-12-21.
- ↑ admin (2020-12-22). "Annavaram - Satyanarayana Swamy, Temple, History, Vratham, Timings, Accommodation, Images - Vihara Darshani". www.viharadarshani.in. Retrieved 2022-12-22.