వెంపటి సదాశివబ్రహ్మం
వెంపటి సదాశివబ్రహ్మం | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1905, ఫిబ్రవరి 19 తూర్పు గోదావరి జిల్లా |
మరణం | 1968, జనవరి 1 మద్రాసు |
వృత్తి | రచయిత |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతీయులు |
రచనా రంగం | కథారచయిత |
వెంపటి సదాశివబ్రహ్మం (1905 - 1968) పేరుపొందిన చలనచిత్ర రచయిత.
సదాశివబ్రహ్మం తూర్పు గోదావరి జిల్లాలోని తుని గ్రామంలో ఫిబ్రవరి 19, 1905 సంవత్సరంలో వెంపటి బ్రహ్మయ్యశాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించాడు. వీరు పంచకావ్యాలు చదివి, ఆంధ్ర, సంస్కృత భాషలలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. తిరుపతి వేంకటకవుల ప్రభావంతో అవధాన విద్యపై మొగ్గు చూపాడు. అష్టావధానాలు, శతావధానాలు జరిపి, గద్య, పద్య రచనలు చేసి బాలకవిగా పేరుపొందారు.
ఎప్పుడూ ఎక్కడా ఓ చోట కాలు నిలవని సదాశివబ్రహ్మానికి పెళ్ళి చేస్తేనైనా ఇంటిపట్టున వుంటాడని భావించి, 1928 లో ఆయన 23 వ ఏట శ్రీకాకుళానికి చెందిన జానకమ్మతో పెళ్ళి జరిపించారు. అప్పటికామె వయస్సు ఎనిమిది సంవత్సరాలే. వివాహమయ్యాక ఆమెను తునిలో ఉంచి, తాను మాత్రం స్వాతంత్య్రోద్యంలోకి దూకాడు. ముఖ్యంగా రంపచోడవరం మొదలగు ఏజెన్సీ ప్రాంతాలలో అల్లూరి సీతారామరాజు నిర్వహించిన పితూరీలలో పాల్గొన్నాడు. ఆ తరువాత కాంగ్రెసు పార్టీలో చేరారు. 1930లోని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, కొన్ని నెలలు కారాగార శిక్ష అనుభవించాడు. జైల్లో దేశభక్తి పూరితమైన పద్యాలను, గేయాలను రాసి ఎలుగెత్తి ఆలపించేవాడట. ఆనాటి కాంగ్రెస్ సభల్లో పాల్గొని, హరికథ, ప్రక్రియలో ప్రబోధాత్మక కథాగానాలను ఆలపిస్తు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటంలో తన వంతు పాత్రను నిర్వహించాడు.
సినీ రచయితగా[మార్చు]
సినీరంగ ప్రవేశం[మార్చు]
దర్శకనిర్మాత హెచ్.ఎం.రెడ్డి, సదాశివబ్రహ్మం హరికథను విని, వెంటనే తను నిర్మించే 'తెనాలిరామకృష్ణ' (1941) చిత్రానికి రచన చేయాల్సిందిగా ఆహ్వానించాడు. 1941 వరకే దాదాపు 75 చిత్రాలు విడుదలై 'చిత్రవజ్రోత్సవాన్ని' చేసుకొన్న తెలుగు సినిమాలో వెంపటి ప్రవేశంతో స్క్రీన్ ప్లే విధానంలో మార్పు వచ్చింది. అలాగే పాత్రల స్వరూప స్వభావాలను మరింత స్పష్టపరచే విధంగా సంభాషణలు వ్రాయడంలో కొత్త ఒరవడిని వెంపటి సదాశివబ్రహ్మం సృష్టించారు. అలా తొలి చిత్రంతోనే రచయితగా విజయం సాధించిన వెంపటి అనంతర కాలంలో దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ ఎన్నో సినిమాలకు రచనలు చేశారు.[1]
1941 లోనే రాజాశాండో దర్శకత్వం వహించిన 'చూడామణి' చిత్రానికి వెంపటి స్క్రీన్ ప్లే సమకూర్చాడు. 1941 లో వచ్చినా 1950 దశకంలో రాబోతున్న సినిమాల తాలూకు ఛాయలన్నీ ఆ సినిమాలో పొడచూపాయి. అప్పటి వరకు వచ్చిన పౌరాణిక చిత్రాల మూసను వదిలిపెట్టి 'చూడామణి' కొత్త పుంతల్ని తొక్కింది. హాస్యనటి, గాయని టి. కనకం, వెంపటితో కలిసి 'దేశదిమ్మరి' అనే చిత్రాన్ని ప్రారంభించింది. కాని చిత్రం తొలిదశలోనే ఆగిపోయింది. ఈ సినిమా కోసం రాసిన కథే 1957 లో స్వయంప్రభగా అవతరించింది. 1942 లో రోహిణి బ్యానర్ కింద హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన 'ఘరానా దొంగ' (హానెస్ట్ రోగ్) చిత్రానికి వెంపటి సంభాషణలు, పాటలు అందించాడు.
1943 నుంచి 1945 వరకు, దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా చిత్రనిర్మాణం కుంటుపడింది. అప్పటికే మద్రాసులో మాంబళంలో క్రిసెంట్‌పార్కు వద్ద ఓ అద్దె ఇంట్లో కుటుంబంతో సహా మకాం పెట్టిన వెంపటి, చేతినిండా సినీరచనలు లేక మళ్లీ అవధానాలు, హరికథలు చెబుతూ కాలక్షేపం చేయసాగాడు. ఈ కాలంలో వెలువడిన చిత్రాలకు 'ఘోస్టురైటర్'గా కూడా పనిచేశాడు. గూడవల్లి రామబ్రహ్మం నిర్మించిన 'పల్నాటి యుద్ధం' (1947) చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే రాసింది వెంపటే (టైటిల్స్‌లో పేరు కనిపించదు) అలాగే కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వంలో వచ్చిన రాధిక (1948) సువర్ణమాల చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించాడు.
1948 లో దర్శక నిర్మాత సి.వి.రంగనాథ్ దాస్ సాధనా సంస్థను స్థాపించి 'దాసి' చిత్రాన్ని నిర్మిస్తూ వెంపటి సదాశివబ్రహ్మానికే కథ, మాటలు, పాటలు వ్రాసే అవకాశం ఇచ్చాడు. కానీ ఆ చిత్రం సగంలోనే ఆగిపోయింది. ఆ తరువాత, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, లక్ష్మీరాజ్యంలతో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఘనవిజయం సాధించిన 'సంసారం' చిత్రానికి రచన చేశాడు.
1931 నుండి 1948 వరకు తెలుగులో వెలువడిన సినిమాల గురించి వెలువడిన పత్రిక 'చిత్రకళ' (1948) సదాశివబ్రహ్మాన్ని సృజనాత్మకతగల రచయితగా అభివర్ణిస్తూ హాస్యనటుడిగా (మదాలస చిత్రంలో టిట్టికుడి పాత్ర) కితాబు నిచ్చి, దర్శకత్వం నెరపి సత్తా పున్నవాడని ప్రశంసించింది.
50వ దశకం[మార్చు]
1950 దశకం సదాశివబ్రహ్మం సినిమా ప్రస్థానంలో స్వర్ణయుగం. ఈ కాలంలో సంసారం (1950), దాసి (19520, పెంపుడు కొడుకు (1953), కోడరికం (1953), వద్దంటె డబ్బు (1954), కన్యాశుల్కం (1955), చరణదాసి (1956), ఉమాసుందరి (1956), భలేరాముడు (1956), భలే అమ్మాయిలు (1957), సువర్ణ సుందరి (1957), చెంచులక్ష్మి (1958), దొంగల్లో దొర (1957), ఇంటిగుట్టు (1958), స్త్రీ శపథం (1959), శభాష్ రాముడా (1959), కృష్ణలీలలు (1959), అప్పుచేసి పప్పుకూడు (1958), శరద (1957) మొదలైన చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రాసి సినీ రచయితగా తారాపథంలో దూసుకెళ్లారు. ఈ చిత్రాలన్ని ఘనవిజయం సాధించినవే! ఇక ఇల్లరికం (1959) కథను అల్లిన వారు వెంపటి వారే!
60వ దశకం[మార్చు]
1960 లో 'దేవాంతకుడు', చిత్రానికి కథ, మాటలు వ్రాసింది వెంపటే. (ఈ సోషియో ఫాంటసీ చిత్రంలోని 'గోగ్గో గోంగూర' పాట జనాదరణ పొందింది) ఈ చిత్రమే మళ్లీ 1977 లో 'యమగోల'గా నిర్మించినపుడు బాక్సాఫీసును బద్దలు చేసింది. ఆ తరువాత 'యమలీల, యమదొంగ' వంటి చిత్రాలకు మూల బిందువు వెంపటి కథే. 1961 లో 'ఉషా పరిణయం', 'కన్న కొడుకు' 'శభాష్ రాజా' చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు వ్రాశాడు. 'లవకుశ' (1963) చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రచించి, ఓ అపురూప దృశ్యకావ్యంగా అందించిన ఘనత వెంపటిదే. 1964 లో బి.ఎ. సుబ్బారావు దర్శకత్వం వహించిన 'మై రావణ'కు, గుత్తారామనీడు దర్శకత్వంలో వచ్చిన 'పల్నాటి యుద్ధం' చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు వ్రాశాడు. 1966లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన పరమానందయ శిష్యుల కథ చిత్రానికి కథ మాటలు కొన్ని పాటలు పద్యాలు వ్రాశాడు. లలితా శివజ్యోతి వారి 'రహస్యం' (1967) ఈయన చివరి చిత్రం. ఈ చిత్రానికి కథను సుబ్రహ్మణ్యం పిళ్లె అందించాడు. మాటలు, కొన్ని పాటలు పద్యాలు సదాశివబ్రహ్మం వ్రాశాడు.
సదాశివబ్రహ్మం జనవరి 1, 1968 సంవత్సరంలో గుండెపోటుతో ఆకస్మికంగా చెన్నైలో పరమపదించారు.
చిత్రసమాహారం[మార్చు]
- ససురాల్ (1961) (కథ)
- ఇల్లరికం (1959) (సంభాషణలు) (కథ)
- కృష్ణలీలలు (1959) (చిత్రానువాదం, సంభాషణలు)
- అప్పుచేసి పప్పుకూడు (1958) (చిత్రానువాదం, సంభాషణలు)
- చెంచులక్ష్మి (1958) (చిత్రానువాదం, సంభాషణలు)
- సువర్ణసుందరి (1957) (కథ)
- శారద (1957) (కథ)
- తెనాలి రామకృష్ణ (1956) (సంభాషణలు) (కథ)
- భలే రాముడు (1956) (సంభాషణలు, పాటలు)
- చరణదాసి (1956) (చిత్రానువాదం, సంభాషణలు)
- కన్యాశుల్కం (1955) (చిత్రానువాదం)
- పరదేశి (1953) (సంభాషణలు)
- సంసారం (1950) (సంభాషణలు) (కథ)
- పల్నాటి యుద్ధం (1947) (సంభాషణలు)
- హానెస్ట్ రోగ్ (ఘరాణా దొంగ) (1942) (రచయిత)
- చూడామణి (1941) (సంభాషణలు) (కథ)
- తెనాలి రామకృష్ణ (1941) (కథ)
మూలాలు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- 1905 జననాలు
- 1968 మరణాలు
- తెలుగు సినిమా రచయితలు
- స్వాతంత్ర్య సమర యోధులు
- శతావధానులు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా సినిమా రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు