సయ్యద్ నశీర్ అహ్మద్

వికీపీడియా నుండి
(సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సయ్యద్ నశీర్ అహమ్మద్ (سید نصیر احمد)
జననం1955 , డిసెంబరు 22
నివాస ప్రాంతంనరసారావుపేట , గుంటూరు జిల్లా
ఇతర పేర్లుసయ్యద్ నశీర్ అహమ్మద్
వృత్తిపరిశోధకుడు,
ప్రసిద్ధిపాత్రికేయుడు, పరిశోధకుడు, రచయిత, చరిత్రకారుడు
మతంఇస్లాం (ముస్లిం)
తండ్రిసయ్యద్ మీరాఁ మొహియుద్దీన్
తల్లితల్లి బీబీ జాన్

సయ్యద్ నశీర్ అహ్మద్ (سید نصیر احمد): (Syed Naseer Ahamed), నెల్లూరు జిల్లా పురిణిలో 1955 డిసెంబరు 22 న జన్మించాడు. ప్రభుత్వ రికార్డు ప్రకారం పుట్టిన తేదీ 1954 ఆగస్టు ఒకటి అని తెలుస్తుంది. ఇతను హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. 'సారేజహాఁ సే అచ్ఛా ఇండియా' తెలుగు మాస పత్రిక సంపాదకుడు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ మొత్తం పద్నాలుగు (20) గ్రంథాలు రాశాడు.

బాల్యం

[మార్చు]

తండ్రి సయ్యద్ మీరా మొహియుద్దీన్, తల్లి బీబీ జాన్.తాత సాయబాన్ సాహెబ్, నాయనమ్మ సాయబ్బి. పురిణిలో బాల్యం గడిచింది. కావలిలో విశ్వోదయా ఉన్నత పాఠశాలలో పదవతరగతి వరకు చదువుకున్న అతని కుటుంబం గుంటూరు జిల్లా నరసరావుపేటకు వెళ్లింది. నరసరావుపేటలో స్థిరపడిన అతను భోపాల్‌, చిత్రదుర్గ, గుంటూరులో ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడు/ఉండవల్లి గ్రామంలో నివసిస్తున్నాడు.

పరిశోధనా, రచనా రంగం

[మార్చు]

నశీర్‌ వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తిరీత్యా పాత్రికేయుడు, పరిశోధకుడు, రచయిత, చరిత్రకారుడు, చిత్రకారుడు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ ఇప్పటి వరకు (2021 నాటికి) 20 గ్రంథాలను వెలువరించిన అతను ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రలను వెలికితీసి తెలుగు పాఠకులకు అందిస్తున్న తొలి చరిత్రకారుడిగా ఖ్యాతి గడించాడు.

అధ్యయనాలు, రచనలు

[మార్చు]

ఈ గ్రంథాలలో పలు గ్రంథాలు ఆరేడుసార్లు పునర్ముద్రితం అయ్యాయి. అలాగే ఆ గ్రంథాలు .హిందీ, ఉర్దూ, ఆంగ్లం, తమిళం భాషల్లో ప్రచురితమయ్యాయి.

నసీర్ అహ్మద్

భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్రను, భారతీయ ముస్లింల స్థితిగతులను వివరిస్తూ తెలుగు, ఆంగ్ల భాషలలో పలు వ్యాసాలను రాసి ప్రచురించిన అతను ఈ అంశం మీద పలు ప్రాంతీయ, జాతీయ స్థాయి వేదికల నుండి, సభలు, సదస్సులలో ప్రసంగాలు చేస్తూ, మంచి వక్తగా పేర్గాంచిన నశీర్‌ భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్రను, ముస్లింల స్థితిగతులను సాధికారికంగా విడమర్చి తెలుపటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.నిత్య అధ్యయనశీలి అయిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ పలు గ్రంథాల ప్రచురణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, ఆ కృషిలో దేశమంతటా పర్యటిస్తూ, విషయ సేకరణగావిస్తూ, విశ్లేషిస్తూ పలు గ్రంథాల ప్రచురణకు కృషిచేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ లో నివాసం.

రచనలు

[మార్చు]
నసీర్ అహ్మద్ పుస్తకాల ముఖపేజీల చిత్రమాలిక.

1999 నుండి సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ వెలువరించిన చరిత్ర గ్రంథాలు

 1. భారత స్వాతంత్ర్యోద్యమం: ముస్లింలు
 2. భారత స్వాతంత్ర్యోద్యమం: ముస్లిం మహిళలు
 3. భారత స్వాతంత్ర్యోద్యమం: ముస్లిం ప్రజాపోరాటాలు
 4. భారత స్వాతంత్ర్యోద్యమం: ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లింలు
 5. భారత స్వాతంత్ర్యసంగ్రామం: ముస్లిం యోధులు (ప్రథమభాగం)
 6. షహీద్‌-యే - ఆజం అష్ఫాఖుల్లా ఖాన్‌ (తెలుగు, ఉర్దూ )
 7. మైసూరు పులి టీపూ సుల్తాన్‌ (తెలుగు / ఆంగ్లం )
 8. చిరస్మరణీయులు
 9. 1857: ముస్లింలు
 10. అక్షరశిల్పులు (333 మంది ముస్లిం తెలుగు రచయితల, కవుల వివరాలతో కూడిన పుస్తకం)
 11. కువైట్ కబుర్లు
 12. అష్ఫాఖ్ - బిస్మిల్ (తెలుగు, ఇంగ్లీష్ )
 13. కవిరాజు డాక్టర్ ఉమర్ అలీషా
 14. చరితార్దులు (1757 నుండి 1947 వరకు సాగిన బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన 155 మంది ముస్లిం యోధుల ఆల్బమ్) (తెలుగు, ఇంగ్లీష్, తమిళం )
 15. చరితార్దులు -2 (1780 నుండి 1947 వరకు సాగిన బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన 155 మంది ముస్లిం యోధుల ఆల్బమ్) (తెలుగు, ఇంగ్లీష్, తమిళం )
 16. పండిత రాంప్రసాద్ బిస్మిల్: అస్ప్యాక్హుల్లా ఖాన్ (తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ )
 17. గాంధీజీ ప్ర్రాణరక్షకుడు: బతక్ మియా అన్సారీ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ )
 18. ఆజాద్  హింద్ ఫోయూజ్: ముస్లిం పోరాటయోధులు
 19. మహాత్మా గాంధీ: ముస్లిం సహచరులు - అనుచరులు (తెలుగు, ఇంగ్లీష్ )
 20. బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధులు, భారత రత్న: మౌలానా అబుల్ కలాం ఆజాద్
 21. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు: ఫాతిమా షేక్ (తెలుగు, ఇంగ్లీష్ )
 22. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం: హిందూ - ముస్లిం ఐక్యత
 23. అండమాను జైలు : ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు
 24. భారత స్వాతంత్ర్యోద్యమం : తెలంగాణ ముస్లిం యోధులు

ముస్లిం పోరాట యోధులు పుస్తకావిష్కరణ

[మార్చు]

నంద్యాల పట్టణంలో

[మార్చు]

నంద్యాల పట్టణంలోని స్థానిక సిపియం కార్యాలయంలోనశీర్ అహమ్మద్ రాసిన "అజాద్ హింద్ ఫౌజ్ ముస్లిం పోరాట యోధులు" గ్రంథాన్ని పశ్చిమ బెంగాల్‌ మాజీ ఎంపీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మహమ్మద్‌ సలీమ్‌, మాజీ ఎమ్మెల్యే, ఆవాజ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎంఏ గఫూర్‌, కో-కన్వీనర్‌ అబ్దుల్‌ సమ్మద్‌లు 2019 నవంబరు 2 ఆదివారంనాడు ఆవిష్కరించారు.[1]

నరసరావుపేట పట్టణంలో

[మార్చు]

నరసరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్‌నగర్‌లోని మై మూన్ మకాన్ వేదికపై జరిగిన కార్యక్రమంలో "అజాద్ హింద్ ఫౌజ్ ముస్లిం పోరాట యోధులు" అనే ఇదే గ్రంథం నరసరావుపేటలో 2019 నవంబరు 3న సుప్రీం కోర్టు మాజీ సెక్రటరీ జనరల్ వేదాంతం సీతారామావధానిచే ఆవిష్కరింపబడింది.చరిత్రలో మరుగుపడిన వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిన గ్రంథంగా వియస్ఆర్ అవధాని పేర్కొన్నాడు.[2]

చరిత్రకారుల నిర్లక్ష్యం

[మార్చు]

ఆధునిక ఆంధ్రుల సాహితీ చరిత్రను పునర్మించడంలో సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ది ఉన్నత”మైన పాత్ర. భారతదేశ వ్యాప్తంగా చరిత్ర నిర్మాణంలో, పరిశోధనా పద్ధతిలో, సబాల్ట్రన్‌ దృక్పధం వచ్చింది. భారతదేశంలో నిర్లక్ష్యం చేయబడిన, నిరాకరించబడిన, ఆణిచివేయబడిన మూడు తరగతుల వారి చరిత్ర నిర్మాణమే సబాల్ట్రన్‌ చరిత్ర నిర్మాణం అంటారు. జాతీయోద్యమకాలంలో మొదట ఆంగ్లం నేర్చుకున్న బ్రాహ్మణవర్గం, కులీనవర్గం తమకు అనుకూలంగా చరిత్రను మార్చి రాసుకున్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, జమీందారీలు భారత స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపినట్టు పేర్కొన్నారు. ఆదికాదు అని చెప్పడానికి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆనాడే 'గాంధి - రెనడే- జిన్నా' అనే పుస్తకం రాశాడు. అందులో గాంధీకి సమాంతరంగా, సమానంగా జిన్నాని, రెనడేని ఎక్స్‌పోజ్‌ చేశాడు. ఇది గొప్ప ప్రయత్నం. ప్రత్యామ్నాయ చరిత్రకి, వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ గ్రంథం దిక్సూచి అయ్యింది. సయ్యద్‌ నశీర్‌ ఆహమ్మద్‌ రాసిన 'భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథంలో ఆ స్థాయిలో ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల, జాతీయోద్యమకారుల వ్యక్తిత్వాలను చిత్రించాడు.

నసీర్ అహ్మద్ నైపుణ్యాలు

[మార్చు]

నశీర్‌ అహమ్మద్‌ పాత్రికేయుడు కావడం, చరిత్ర, చట్టం, వాణిజ్య శాస్త్రం, పాత్రికేయ వైశిష్టం, జనజీవన సంబంధాలు కలిగి ఉండటంతో బహు ముఖీన నైపుణ్యాన్ని ఈ గ్రంథంలో చూపించాడు. ఈ గ్రంథంలోనే కాదు భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ నశీర్‌ రాసిన ప్రతి గ్రంథంలో బహు ముఖీన నైపుణ్యం సుస్పష్టమవుతుంది. ఈయన రచనా పద్ధతిలో ప్రవాహశీలత పాఠకుడ్ని తన వెంట నడిపించుకుంటూ వెడుతుంది. ఆ కారణంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ నశీర్‌ రాసిన తొమ్మిది గ్రంథాలలో ఐదు గ్రంథాలు మూడుసార్లు, నాలుగు గ్రంథాలు రెండుసార్లు పునర్ముద్రణ అయ్యాయి. ఒక ఉద్యమాన్ని, చరిత్రను సమన్వయించి రాసేప్పుడు సమకాలీన సామాజిక దృష్టి ఉండాలి. భారత స్వాతంత్ర్యోద్యమం, జాతీయోద్యమాన్ని రచించిన రచయితలకు పాఠ్యగ్రంథ రచనా పద్ధతి అలవడింది. అందులో తేదిలు, ఘటనలు, నామవాచకాలు, నుతులు, స్తుతులు తప్ప గుండెను కదిలించే వర్ణనలు, విశ్లేషణలు తక్కువ. కానీ నశీర్‌ అహమ్మద్‌ గ్రంథాలన్నీ కదులుతున్న సముద్రంలా ఉంటాయి. పాఠకుడ్ని ఆ ఘటనల్లోని ఉద్వోగంలోకి తీసుకెడుతాడు నశీర్‌. అది ఆయనకు కొన్ని థాబ్దాలు 'ఉదయం' లోనూ, 'వార్త' దినపత్రికల్లో ప్రజాజీవనాన్ని చిత్రించిన నైపుణ్యం నుండి వచ్చింది.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ కోట్‌ చేసే అంశాలు కూడా ప్రమాణబద్దమైనవి. ఆయన నూతన గ్రంథం 'భారత స్వాతంత్ర్యోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథానికి రాసిన ఉపోద్ఘాతం (కథనం) ఆయన దృక్పధానికి గీటురాయి. ఆయన కేవలం రచయిత కాదు, కేవలం విశ్లేషకుడు కాదు, ఒక దృక్పధానికి ప్రతినిధి. అందుకే ఈ తరం ఆయన వైపు చూడాల్సిన అవసరాన్ని ఆయన సృష్టించాడు. ఆ దృక్పధమే ఆయన రచనకు జవం-జీవం. అదే ఆయనను 'చరిత్ర నిర్మాణ శాస్త్రవేత్త'గా మార్చింది. డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ కూడా 'అసృశ్యులెవ్వరు?' గ్రంథం రాసేప్పుడు ఆయన పీఠిక రాశాడు. అందులో తన చారిత్రక దృక్పధం ఎమిటో చెప్పాడు. అందుకనే సబాల్ట్రన్‌ హిస్టోగ్రఫీకి అంబేద్కర్‌ ఆద్యుడయ్యాడు. ఆ రచనా విధానం కొనసాగింపులోనే సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రూపొందారు.

నసీర్ అహ్మద్ రచనల ప్రధానాంశం

[మార్చు]

ఆయన దృక్పథంలో ప్రధానాంశం భారతీయ ముస్లింలు, జాతీయోద్యమ థ నుండి అంతకుముందు సాగిన సాయుధ పోరాట థ నుండి భారతదేశాన్ని రక్షించడానికి, విముక్తం చేయడానికి భారత స్వాతంత్ర్యోద్యమంలో తమ నెత్తురు ధారబోశారు. అది ఈ భూమిలోకి ఇంకినంతగా అక్షరాల్లోకి ప్రవహించలేదు. ఆ కారణంగా ప్రజాబాహుళ్యం ఎరుకలోకి రాలేదు. ఇది కుట్రే. అని ఆయన ఉద్దేశం. అంతేకాదు భారతీయ ముస్లింలు భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రజాస్వామిక సైన్యంగా పాల్గొన్నారు, పోరాడారు. తమ సామాజిక శక్తిని, రాజకీయశక్తిని మొత్తంగా భారతీయ సమాజానికి అర్పించారు. చరిత్ర ఈ విషయాన్ని విస్మరిస్తే అది అసమగ్ర చరిత్ర అవుతుందని నశీర్‌ అహమ్మద్‌ ప్రతిపాదన. ఈ ప్రతిపాదనే ఆయన నూతన చారిత్రిక దృక్పథానికి వెలుగు తెచ్చింది. అయితే ఇటువంటి ప్రతిపాదనలు చేయడం అంత తేలికైన పనికాదు. అణిచివేసిన వాడి నుండే ఆయుధాన్ని చేత బూనాలి. అంతేకాదు దేన్ని నాశనం చేశారో అక్కడి నుండే మూలాలు వెతకాలి. దానికి అవసరమగు పరిశోధనా దృష్టి నశీర్‌కు ఉంది. చరిత్రకారుడు పరిశోధకుడు కలిస్తే చరిత్ర కాల్పనికం కాకుండా సత్యనిష్ఠం అవుతుంది. అందుకనే తాను రాసిన చరిత్ర గ్రంథాలలో ఆయన పుంఖాను పుంఖాలుగా ఉపపత్తులు మన ముందుంచుతున్నారు. ఎవ్వరూ కాదనలేని ప్రమాణాలు చూపిస్తున్నారు. అది సత్యనిష్ఠయే కాకుండా చారిత్రక పరివర్తితం కావడం కోసం తేదిలు, సంఘటనలు కూడా ఆయన ఇస్తున్నారు. దీంతో ఆయన ఒక ప్రామాణిక చరిత్రకారుడుగా నిగ్గుతేలారు.

ముస్లింల చరిత్రలో మూడు గొప్పతనాలు ఉన్నాయి. ముస్లింలు లేకుండా భారతదేశ చరిత్ర నిర్మించలేము. ముస్లింల శ్రమ లేకుండా భారత ఉత్పత్తులు లేవు. ముస్లింల సంస్కృతి లేకుండా భారతదేశ సంస్కృతి-నాగరికత పరిపూర్ణం కాదు. ఈ మూడు అంశాలను నశీర్‌ అహమ్మద్‌ తన గ్రంథాలలో అంతర్లయగా ప్రవహింపచేశారు. అంతేకాదు సోషలిస్టులుగా, గాంధేయవాదులుగా, విప్లవోద్యమకారులుగా, సెక్యులరిస్టులుగా ముస్లింల భావజాల ఉద్యమాలను కూడా లిఖించడం, ఆయనలోని హేతుబద్ద ఆలోచన విధానం వల్లే సాధ్యమైంది. మత దురహంకారానికి భిన్నంగా ఎవరెవరు ప్రవర్తించారో చెబుతూ, భారత స్వాతంత్ర్యోద్యమం, ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథం (101వ పుట) లో ఆయన ఇలా పేర్కొన్నాడు.

'ఆ రోజుల్లో మతదురహంకారానికి దూరంగా ఉన్న సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌, డాక్టర్‌ అక్బర్‌ అలీ, జలాలుద్దీన్‌, హసన్‌ ముహమ్మద్‌ పహిల్వాన్‌, విూర్‌ అహమ్మద్‌ అలీ ఖాన్‌, డాక్టర్‌ లతీఫ్‌ సయూద్‌ లాంటి వారు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం మాత్రమే కాదు విలీనం కోరుతూ కూడా ఉద్యమించారు. సామ్యవాద సిద్థాంతాలకు ఆకర్షితులై సమసమాజ స్థాపన లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలో భాగస్వాములైన మగ్దూం మొహిద్దీన్‌, అలం ఖుంద్‌ విూర్‌, హసన్‌ నాసిర్‌, జవ్వాద్‌ రజ్వి, ఆఖ్తర్‌ హుస్సేన్‌, జహందర్‌ అస్ఫర్‌, కుతుబ్‌-యే-ఆలం, అహసన్‌ అలీ విూరజ్‌, విూరాజ్‌ హైదర్‌ హుస్సేన్‌, హుస్సేని షాహిద్‌ లాంటి వివిధ రంగాలలో ప్రతిభావంతులైన ప్రముఖులు నైజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావాలని డిమాండ్‌ చేశారు.' ఇందులో ఆయన ఇరువది నామవాచకాలను ఇచ్చారు. ఇవన్నీ చరిత్రలో నిర్లక్ష్యం చేయబడిన పేర్లే.

భారతదేశంలో వచ్చిన అన్ని వాదాలకు బ్రాహ్మాణులే నాయకులు. బ్రాహ్మణేతరులున్నా వారు త్రైవర్ణాల్లోని వారే. గాంధీవాదానికి గాంధీ నాయకుడు. ఆయన వైశ్యుడు. కమ్యూనిస్టు వాదానికి డాంగే నాయకుడు. ఆయన బ్రాహ్మణుడు. సోషలిస్టు వాదానికి రాం మనోహర్‌ లోహియా నాయకుడు. ఆయన వైశ్యుడు. ఈ మూడు వాదాల్లో పనిచేసిన ముస్లింలు అందులో కూడా ఆణగద్రొక్కబడ్డారు. వారందర్ని నశీర్‌ అహమ్మద్‌ ముందుకు తెచ్చారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 'వాట్‌ కాంగ్రెస్‌ అండ్‌ గాంధీ హ్యావ్‌ డన్‌ టు అన్‌టచ్‌బుల్స్‌' గ్రంథంలో గాంధీ కాంగ్రెస్‌ అశ్ప్రశ్యులను నిర్లక్ష్యం చేసిందని చెప్పాడు. 'భారత స్వాతంత్ర్యోద్యమం, ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథంతోపాటుగా సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ వెలువరించిన గ్రంథాలన్నిటిలో జాతీయోద్యమంలో పనిచేసిన ముస్లింలు చారిత్రక నిర్లక్ష్యానికి గురయ్యారని సాధికారికంగా, సప్రమాణంగా నిరూపించారు. అంతేకాకుండా ఆయన ప్రతిపాదించిన ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులందరూ ఎదోక ఆంశంలో ప్రతిభావంతులు అని కూడా నిగ్గుతేల్చారు. నశీర్‌ గొప్పతనం ఎమిటంటే మెయిన్‌ స్ట్రీమ్‌ సమాజం కూడా వీటినుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది అని చెప్పాడు. వ్యక్తిత్వ నిర్మాణం మీద కూడా ఆయన తన గ్రంథాలలో కృషిచేశారు. దీని వల్ల ముస్లిం విద్యార్థులు, మేధావులు ఈయన గ్రంథాలను చదివి 'మాలో నుండి ఇంతమంది గొప్పవారు వచ్చారు. వీరంతా మాకు ఆదర్శం. వీరి జీవితాలను అధ్యయనం చేయడంవల్ల మాలో కూడా గొప్ప వ్యక్తిత్వ నిర్మాతలున్నారు' అనే ఆత్మగౌరవ భావం ప్రదీప్తమవుతుంది.

భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముస్లింల గురించి ఆశ్చర్యాన్ని కలిగించే వివరాలతో నశీర్‌ రూపొందించిన 'భారత స్వాతంత్ర్యోద్యమం ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు'లో మీర్‌ అక్బర్‌ అలీ ఖాన్‌ గురించి రాస్తూ, ముస్లింల్లోని ప్రముఖులు జాతీయోద్యమ కాలంలో కళాశాల నుండి విశ్వవిద్యాలయాల నుండి పోరాటాలలో పాల్గొని ఆ తరువాత లండన్‌ వెళ్ళి తమ విద్యాభ్యాసాలు కొనసాగించి మళ్ళీ తమకు తాము ఎలా నిలబడ్డారో (279 పేజీలోని) ఒక్క పేరాలోనే ఆయన ఇలా చెప్పాడు.

'1920లో ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ గ్రాంటులతో నడుస్తున్న కళాశాలలను బహిష్కరించమని గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు అలీఘర్‌లో విద్యాభ్యాసం చేస్తున్న అక్బర్‌ అలీ ఖాన్‌, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ లాంటి ప్రముఖుల బాటలో జాతీయోద్యమంలో ప్రవేశించి కళాశాలను బహిష్కరించారు. ఆ తరువాత జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయం (జామియా మిలియా ఇస్లామియా) లో ప్రవేశించి విద్యాభ్యాసం చేస్తూ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమ విరమణ తరువాత లండన్‌ వెళ్ళి న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా తిరిగి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు'. నశీర్‌ రాసిన ఈ చరిత్రను చదివితే ఆయనలోని అధ్యయనశీలత బయటపడుతుంది. అంటే అనేక అంశాలను తన దృక్పధం నుండి సంక్షిప్తీకరించి చెప్పడం.

నశీర్‌ అహమ్మద్‌ చరిత్రను తరంగాలు తరంగాలుగా పెయింట్‌ చేస్తారు. అంటే ఆయన రచనా క్రమంలో ఒక విజ్యువలైజేషన్‌ ఉంది. అందువల్లే ఆయన పుస్తకాలు ఆయనతోపాటుగా పాఠకుడ్ని సుదూరాలకు తీసుకువెడతాయి. దృక్ఫదం లేని గ్రంథాలు విజ్ఞానంగా మిగిలిపోతాయి. మన గ్రంథాలయాలన్నీ ఈ పుస్తకాలతో నిండి పోయాయి. పుస్తకం చదివాక ఒక ఫీల్‌ ఉంటుంది గాని ఒక దిశానిర్ధేశనం ఉండటం లేదు. నశీర్‌ గ్రంథాల్లో దిశానిర్దేశనం ఉంది. స్పష్ఠమైన మార్గం ఉంది. అందుకే ఆయనను మనం చరిత్రకారుడుగానే కాకుండా ఇంటలెక్చువల్‌గా చూడాలి. ఇంటలెక్చువల్‌ అంటే విషయ సంపన్నంగా ప్రచారం ఉంది. కాని విషయం నుండి కొత్త అంశాన్ని సృష్టించే వాడ్నే ఇంటలెక్చువల్‌ అంటాం. ఇటువంటి కొత్త ప్రతిపాదనలు నశీర్‌ చాలా చేశారు. చాలా నిశితంగా చూసినప్పుడు ఆయన ప్రతిపాదనలు అందుతాయి. పాఠకుడు నశీర్‌ను అభిమానించటమో, ప్రేమించటమో చేయాలి. చేయకపోతే సమాచారాన్ని మాత్రమే అందుకుంటాడు. అయన అంర్గతంగా ప్రవహింప చేసిన భావజాలాన్ని, భావోద్వేగాన్ని అందుకోలేడు. అందుకని పాఠకుడ్ని ఒక మూడుసార్లన్నా ఆయన ప్రతి గ్రంథం చదవమని నేను కోరుతున్నా.

ముఖ్యంగా నశీర్‌ తాను అనుకున్న విమర్శలను వ్యక్తిత్వాల చేత చెప్పిస్తారు. ప్రస్తుతం నా అధ్యయనంలో ఉన్న 'భారత స్వాతంత్ర్యోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు'లో జాతీయోద్యమంతోపాటుగా కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న మహిళానేత జమాలున్నీసా బాజీ గురించి రాస్తూ కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారో అన్న ఆమె వ్యాఖ్యానాన్ని (పేజీ 300లో) ఇలా ఉటంకించారు. 'చివరి వరకు కమ్యూనిస్టుగా కొనసాగిన ఆమె ఆనాటి త్యాగాలను, ఈ వివరాలను తెలిపేనాటికి కమ్యూనిస్టు పార్టీ పరిస్థితి, పార్టీ నాయకులు వారి కుటుంబాల తీరుతెన్నులను తన కుటుంబ సభ్యుల త్యాగాలతో పోల్చుతూ, ఇక, ఇప్పుడు పార్టీ లీడర్ల పిల్లల్ని చూస్తే...వాళ్ళు పార్టీకై ఏమి చేయరు. కొంత మంది మాస్కో వెళ్ళి వచ్చారు. అయితే పార్టీకేంచేశారు? నా అన్నదమ్ములు-జఫర్‌ ఆక్సిడెంటులో చనిపోయాడు. ఆన్వర్‌ చాలా కష్టాలు పడ్డాడు. జాల్నా జైలులో ఉన్నాడు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని తర్వాత చనిపోయాడు. ఆయన కూతురు ఎం.ఎస్‌.సి చేస్తున్నది. భార్య తర్వాత చదువుకుని ఉద్యోగం చేసింది...ఆ రోజుల్లో 500 మంది స్త్రీలను పోగుచేయగలిగేదాన్ని. ఇప్పుడు 50 మంది రారు, అంటూ జమాలున్నీసా బాజీ నిరాశను వ్యక్తంచేశారు.' కమ్యూనిస్టు పార్టీ ఏ క్యాపిటలిజాన్ని ఎదిరించిందో ఆ క్యాపిటలిజంలో ఇరుక్కుపోయింది. చాలా మంది కమ్యూనిస్టు కార్యకర్తలు లగ్జరీకి, ఇండువిడ్యులిజానికి అలవాటు పడ్డారు. దీంతో పాతరతం కమ్యూనిస్టులు ఇప్పుడున్న వారితో పోల్చి విశ్లేషణ చేస్తున్నారు.

బహుగ్రంథ రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ మంచి మనిషి, స్నేహపాత్రులు. అందుకే ఆయన తాను రాసే వ్యక్తులు జీవించి ఉంటే కలిశారు. సుదూర ప్రయాణాలు చేశారు. వారి కుటుంబ సభ్యులతో మమేకం అయ్యారు. వారి వ్యధను అర్థం చేసుకున్నారు. నిర్లక్ష్యపూరిత మైంది ప్రతిదీ వ్యథార్థమవుతుంది. దాన్ని లిఖించాడు. అదే ఈనాడు కావాల్సింది. ఇప్పటి రచయితలు పుస్తకాలు మాత్రమే వెతికి రాస్తారు. మస్తకాల గురించి వారికి తెలియదు. పుస్తకాన్ని మస్తకాన్ని కలిపి పెనవేయడమే నశీర్‌ రచనా శిల్పం.


ప్రస్తుత 'భారత స్వాతంత్ర్యోద్యమం, ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథం ఇంతకుముందు రాసిన 'మైసూరు పులి, టిపూ సుల్తాన్‌'లో పెల్లుబికిన స్ఫూర్తితో ఉంది. చరిత్రలో వర్ణణాత్మక విధానం అత్యున్నతమైనది. ఈ గ్రంథం ద్వారా ఉర్దూ, పారశీక, ఆంగ్ల పదాలను తెలుగు నుడికారాన్నీ ఆంధ్ర పాఠకులకు వందలాదిగా అందించారు. దీన్నే భాషా సంపన్న రచన అంటారు. అంటే రచయిత తన రచనల ద్వారా భాషను కూడా నేర్పుతున్నారు. ఇక్కడ నశీర్‌లోని చాలా బలమైన పాత్రికేయుడు కన్పిస్తాడు.

నసీర్ అహ్మద్ వ్యక్తిగా పనిచేస్తున్నారా? సంస్థగా పనిచేస్తున్నారా? మనకు ఆశ్చర్యం. ఆయన చేపట్టిన రచనలన్నీ ఆంగబలం అర్థబలం పుష్కలంగా గల వ్యవస్థలు, విశ్వవిద్యాలయాలు మాత్రమే చేయగలిగినవి. అటువంటి ప్రాజెక్టులను ఆయన విజయవంతంగా పూర్తిచేసుకపోతుంటే విస్మయం కలుగుతుంది. అయితే ఆయన వ్యక్తి ఏ మాత్రం కారు. ఎందుకంటె వాళ్ళమ్మగారు షేక్‌ బీబిజాన్‌ గొప్పతల్లి. నేను యుధ్దంలో ఉన్పప్పుడు నా నొసటన ముద్దుపెట్టి, నా వెన్నుతట్టిన తల్లి ఆమె. నశీర్‌ తండ్రి చిన్ననాటనే చనిపోయారు. తల్లి పట్టుదల, త్యాగంతో బిడ్డను అత్యున్నత చదువులు చదివించింది. నశీర్‌ జీవిత భాగస్వామి షేక్‌ రమిజా భానులో సగం తల్లి ఉంది. ఆమె భర్తకు మొస్ట్‌ ప్రోటక్ట్రివ్‌ ఫోర్స్‌గా నిలచింది. భర్త ఉన్నతిని, విస్త్రుతిని, డైనమిజాన్నీ ప్రేమించిన వ్యక్తి. ఎక్కువ మంది భార్యలు భర్తలో ఉన్న క్వాలిటీని గుర్తించకే ఘర్షణకు గురవుతారు. కొంతమంది క్వాలిటీ, ఎబిలిటీని కూడా ప్రేమిస్తారు. అప్పుడు ప్రేమ విస్త్రుతి అవుతుంది. శ్రీమతి రమిజా ప్రేమలో సంపూర్ణత ఉంది. ఒకవైపున తల్లి మరోవైపున భార్య ఆయన అండదంగా నిలుస్తున్నందున నశీర్‌ వ్యవస్థ కాగలిగాడు. అటువంటి వ్యవస్థల్లోంచి పలు ప్రయోజనాత్మక ఉత్పత్తులు ఉబికి వస్తాయి అటువంటి ఉత్తమ ఉత్పత్తులలో రచన ఒకటి.

నశీర్‌ ఒక రచయితే కాదు, బోధకుడు, నిర్మాణకర్త కూడా. ఆయన ఈ మూడు థాబ్దాల్లో చాలా సభల్లో, సదస్సుల్లో పాల్గొన్నారు. సాధికారిక ఉపన్యాసాలు, ప్రసంగాలు చేశారు. పలు సామాజిక ప్రజా ఉద్యమాల నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన నిరంతరం డిబేటబుల్‌ పర్సన్‌. ఆయనలోని గొప్పదనం 'వాది-ప్రతివాది'. ఎదైనా చెప్పదలచుకుంటే సూటిగా చెబుతారు. మార్మికత లేదు. మేం 1979లో కలిశాం. ఆయనతోపాటుగా నరసరావుపేటకు చెందిన యస్వీయార్‌, బివికె పూర్ణానందం, వియస్‌యన్‌ మూర్తి, జేవియార్‌ వీరంతా కలిశారు. మేమంతా సామాజిక ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశాం. వివిధ రంగాలలో హేతువాద భావజాలంతో పోరాడుతున్నాం, జీవిస్తున్నాం. ఎందరో తత్త్వవేత్తల్ని చదివాం. ప్రధానంగా హ్యూమనిజం, విజ్ఞానం, తర్కం, సమన్వయాలను ఉద్యమాలు మాకు నేర్పాయి. నశీర్‌కు పత్రికలు నడిపిన అనుభవం ఉంది. ఆయన మానవతా ప్రదీపకుడు. ఒక పోరాట యోధుడ్ని ఆయన జీవితం ముగియక ముందే రికార్డు చేయాలన్న పట్టుదల, తపన తన గ్రంథాలలో కన్పిస్తుంది. ఇలా రాయక ఎందరో త్యాగమూర్తుల జీవితాలు అక్షరబద్దం కాలేదు.

నశీర్‌ రచనల్లో ఉన్న గొప్పదనం 'నేటివిటీ', రచన మొత్తంగా దేశీయంగా ఉంటుంది. సెక్యులర్‌గా ఉంటుంది. డెమాక్రటిక్‌ పర్సెపెక్టివ్‌ ఉంటుంది. చాలా చరిత్ర రచనల్లో ఈ అంశాలు దొరకవు. ఎందుకంటె చరిత్ర ఎప్పుడు కథనాత్మకం. నశీర్‌ చరిత్రను చెప్పారు, చెప్పించారు. దీనికి ప్రజాస్వామిక దృక్పధం కావాలి. అది ఈయన రచనల్లో మెండుగా ఉంది. ఈయనది వర్ణణాత్మక -విశ్లేషణాత్మక రచన. చరిత్రతో క్రూడ్‌ కంటెంట్‌ను ఇవ్వడం ఆనవాయితీ అయ్యింది. అయితే ఆద్థ్రంగా చెప్పడం కూడా అవసరం. నశీర్‌ 1999 నుండి వెలువరిస్తున్న తన గ్రంథాలు 1. భారత స్వాతంత్ర్యోద్యమం, ముస్లింలు, 2. భారత స్వాతంత్ర్యోద్యమం, ముస్లిం మహిళలు, 3. భారత స్వాతంత్ర్యోద్యమం, ముస్లిం ప్రజాపోరాటాలు, 4. భారత స్వాతంత్ర్య సంగ్రామం, ముస్లిం యోధులు (ప్రథమ భాగం), 5. చిరస్మరణీయులు, 6. మైసూరు పులి టిప్పూ సుల్తాన్‌, 7. షహీద్‌-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్‌, 8. 1857 - ముస్లింలు అను గ్రంథాలలో సెన్సిటివిటీని ప్రమోట్‌ చేశారు. చారిత్రక సమాచారాన్ని అందివ్వడం మాత్రమే కాకుండా మానవతా స్ఫూర్తిని కల్పించారు. ఈ రచనా పద్ధతి ఆయన్ని పాఠకుల హృదయాలలో నిలబెడుతుంది. ఒక పాత్రికేయుడు చరిత్రకారుడిగా మారితే మనకు ఈ వెలుగులు లభిస్తాయి. నశీర్‌లో వేదన ఉంది. అది ఆయన చాలా పర్సెపెక్టివ్‌తో చెబుతున్నారు. ఎక్కవమంది వేదనను వైయుక్తికం చేస్తారు. నశీర్‌ సామాజికం చేశారు. ఇస్లాంలో ఉన్న ఇంటిగ్రెటినీ ఆయన కన్వే చేయగలిగారు. ఆయన తన రచనలతో ముస్లింలలో కల్పించబడుతున్న ఇనెసెక్యూరిటీన్ని తొలిగిస్తున్నారు. ముస్లిల మీద రుద్దబడుతున్న ఆపరాధనా భావాన్ని, ఆత్మన్యూన్యతా భావజాలాన్నీ తుత్తినియలు చేస్తున్నారు. ఈ దేశం మనదేనని గర్వంగా చెబుతున్నాడు. సబాల్ట్రన్‌ స్టడీస్‌లలో ఇదే ప్రధానం. ఒక గిరిజనుడు, ఒక దళితుడు, ఒక ముస్లిం, ఒక మహిళ తమకు తాముగా నిలబడి తమ జనసముదాయాల గురించి మాట్లాడటమే సబాల్ట్రన్‌ స్టడీస్‌ మూలమైన అంశం. నశీర్‌ తన సమాజం నుండి మొత్తం సమాజం గురించి మాట్లాడుతున్నారు. ఇదే నిజమైన చరిత్ర.

చారిత్రక రచన ఒక ఎత్తయితే సాహిత్య చరిత్ర రచన మరో ఎత్తు. నశీర్‌ అహమ్మద్‌ చరిత్ర రచనకు మాత్రమే పరిమితం కాకుండా సాహిత్య చరిత్రకు సంబంధించిన 'అక్షరశిల్పులు' గ్రంథాన్ని కూడా వెలువరించారు. తెలుగులో రాసిన, రాస్తున్న మూడువందల ముఫైమూడు మంది ముస్లిం కవులు, రచయితల రచనలు, వారి జీవిత రేఖలకు ఈ గ్రంథం దర్పణం లాంటిది. ముస్లిం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ సృష్టించిన రచనల వివరాలను, ఆయా కవులు, రచయితల జీవిత విశేషాలను వివరించే కార్యభారాన్ని మోసేందుకు నశీర్‌ పూనుకోవడం ఆయన చారిత్రక, సాహిత్యాభిలాషకు నిదర్శనం. ఈ తరహా సాహిత్య చరిత్ర గ్రంథాల రచనలకు సంబంధించిన విషయ సేకరణకు ఎంతో ఓపిక, ఓర్పు, సహనం అవసరం. అంతటి బృహత్కర కార్యభారాన్ని చేపట్టి రెండేళ్ళు అహర్నిశలు శ్రమించి సమాచారం సేకరించి 'అక్షరశిల్పులు' వెలువరించడం ఆయన కృషి పట్టుదలకు తార్కాణం. ఈ గ్రంథం ద్వారా ముస్లిం కవులు, రచయితల విశేషాలు, వారి రచన వివరాలు మరుగున పడి మటుమాయం కాకుండా తెలుగు సాహిత్య చరిత్రకు నశీర్‌ అందజేశారు.

భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక విషయాలను ప్రస్తుత గ్రంథం 'భారత స్వాతంత్ర్యోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' జనబాహుళ్యం ఎరుకలోకి తెచ్చారు. 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందుగా 1780లో విశాఖపట్నం సైనిక స్థావరంలో తిరుగుబాటు బావుటాను ఎగురేసిన సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ (సత్తెనపల్లి), పరాయి పాలకులను పాలద్రోలడానికి సర్వం ఒడ్డి కృషి సల్పిన నిజాం రాజకుమారుడు ముబారిద్దౌలా (హైదరాబాద్‌), ఆంగ్లేయుల మీద యుద్ధబేరి మ్రోగించడానికి తన కోటను ఆయుధాల కర్మాగారం-గిడ్డంగిగా మార్చిన కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌ (కర్నూలు), ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా తిరుగుబాటుకు యత్నించిన పుట్టు అంధుడైన వ్యూహకర్త షేక్‌ పీర్‌ షా (కడప), నిజాం రెసిడెన్సీ మీదకు వీర యోధుల్ని నడిపిన మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌, పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ (హైదరాబాద్‌) లాంటి యోధులు విశేషాంశాలను తన ఉద్గ్రంథం ద్వారా నశీర్‌ తెలుగు పాఠకుల దృష్టిలోకి తెచ్చారు. ప్రజా క్షేమం పట్టని ప్రభువులను కూడా ప్రశ్నించవచ్చన్న చైతన్యాన్ని సామాన్య ప్రజానీకంలో కగిలించిన పునర్వికాసోద్యమ నిర్మాత ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం (హైదరాబాద్‌), ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా తెలుగు గడ్డ మీద ప్రపధమంగా అధికారపదవిని త్వజించిన త్యాగశీలి మహమ్మద్‌ గులాం మోహిద్దీన్‌ (విజయవాడ) గాంధీజి ఆరంభించిన ఖద్దరు ఉద్యమంతో మమేకమై 'ఖద్దరు ఇస్మాయిల్‌' గా పేర్గాంచిన మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (తెనాలి) మన్నెం యోధుడు అల్లూరి సీతారామరాజుకు అండదండలందించిన ఆంగ్ల ప్రభుత్వంలోని అధికారి ఫజులుల్లా ఖాన్‌, గాంధీ బాటలో సాగి 'విశాఖ గాంధి'గా విఖ్యాతి చెందిందిఫరీదుల్‌ జమా (విశాఖపట్నం), భారత స్వాతంత్ర్యోద్యమ సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్న 'జైహింద్‌', 'నేతాజి' అను అద్భుత పదాల సృష్టికర్త అబిద్‌ హసన్‌ సఫ్రాని (హైదరాబాద్‌), ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానాన్ని విలీనం చేయాలంటూ నిజాం నవాబుకు నేరుగా లేఖ రాసిన సాహసి ఫరీద్‌ మీర్జా (హైదరాబాద్‌), ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు తాను కూడబెట్టుకున్న సంపాదనంతా విరాళంగా ఇచ్చివేసిన యువకులు షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌ (విజయనగరం), విలీనోద్యమంలో ప్రజాపక్షంగా అక్షరయుద్ధం చేసినందుకు భయానక హత్యకు గురైన సంపాదకులు షోయాబుల్లా ఖాన్‌ (మహబూబాబాద్‌), నిజాం సంస్థానం పరగణాలో 'పరిటాల రిపబ్లిక్‌' ఏర్పాటును ప్రకటిస్తూ స్వాతంత్ర్య పతాకాన్ని ఎగురవేసిన ధైర్యశాలి షేక్‌ మౌలా సాహెబ్‌ (పరిటాల) లాంటి విశిష్ట వ్యక్తుల పోరాట స్ఫూర్తిని నశీర్‌ సప్రమాణంగా వివరించారు. ఆ తరువాత జాతీయోద్యమానికి కొనసాగింపుగా జరిగిన పోరాటాలలో పాల్గొన్న యోధులకు కూడా తన గ్రంథంలో స్థానం కల్పిస్తూ, తెలంగాణా ప్రాంతంలోని దేశ్‌ముఖ్‌ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం సాగిస్తూ దారుణ హత్యకు గురైన షేక్‌ బందగీ సాహెబ్‌ (కామారెడ్డి గూడెం), విద్యార్థిగా జాతీయోద్యమం చివరి థలో ఉద్యమించడం మాత్రమే కాకుండా కార్మిక-కర్షక హితాన్ని ఆశిస్తూ పోరుబాట సాగి చివరకు పాకిస్థాన్‌ జైలులో అమరత్వం పొందిన సయ్యద్‌ హసన్‌ నాసిర్‌ (హైదరాబాద్‌), తెలంగాణా సాయుధపోరాట యోధుడు షేక్‌ నన్నే బచ్చా, నిజాం వంశీకుడైనా పాత్రికేయుడిగా ప్రజల పక్షం వహించిన జహందర్‌ అఫ్సర్‌ లాంటి యోధుల సాహసోపేత చరిత్రలను దృశ్యమనంగా నశీర్‌ అహమ్మద్‌ 'భారత స్వాతంత్ర్యోద్యమం ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథంలో స్థానం కల్పించారు.

ఒక శతాబ్థిలో వచ్చిన ఒక గ్రంథాన్ని మనం చదవకపోతే మనం అసమగ్రులం అయినట్లయితే ఆ గ్రంథం ఉత్తమ గ్రంథం కాగలదు. అంటే ఆ గ్రంథానికి మనల్ని పూరించే శక్తి ఉంది. రచయిత మనకు తెలిసిన వాడే కావచ్చు. తెలియని అనంత విషయాలను మనకు చెబుతున్నారు. ఆ కారణంగా 'భారత స్వాతంత్ర్యోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' ప్రతి ఆంధ్రుని చేతిలో ఉండితీరాల్సిన ఉత్తమ గ్రంథం. ఈ గ్రంథం పాఠ్యగ్రంథంగా ఉండదగింది. బ్రాహ్మణవాద చారిత్రక అంశాలు పాఠ్యగ్రంథాలుగా ఉండటం వలన ద్వితీయ పార్శ్యం విద్యార్థులకు బోధపడటం లేదు. ఇటువంటి గ్రంథాలు రావడం వలన చారిత్ర సృహ విస్త్రుతి పొందుతుంది. సబాల్ట్రన్‌ స్టడీస్‌కు అమూల్య గ్రంథం చేర్చిన చరిత్రకారుడు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ కంట్రిబ్యూషన్‌ మరువలేనిది. అది పాఠకుల అధ్యయనంతో సుసంపన్నం అవుతుంది.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
 1. "'ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ముస్లిం పోరాట యోధులు' పుస్తకావిష్కరణ | Prajasakti::Telugu Daily". web.archive.org. 2019-11-05. Archived from the original on 2019-11-05. Retrieved 2019-11-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 2. "ముస్లిం పోరాట యోధులు పుస్తకావిష్కరణ - EENADU". web.archive.org. 2019-11-04. Archived from the original on 2019-11-04. Retrieved 2019-11-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]
 • ఈ ఆర్టికల్ నెటి నిజం 08-12-2011 సంచికలో ప్రింట్ అయ్యింది. ]