సిరిసిల్ల వ్యవసాయ కళాశాల
రకం | వ్యవసాయం |
---|---|
స్థాపితం | 2023, ఏప్రిల్ 12 |
స్థానం | జిల్లేళ్ళ, తంగళ్ళపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | పట్టణ |
అనుబంధాలు | ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం |
సిరిసిల్ల వ్యవసాయ కళాశాల (ఆచార్య జయశంకర్ వ్యవసాయ కళాశాల) అనేది తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, జిల్లేళ్ళ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వ్యవసాయ కళాశాల. 69.50 కోట్లతో 35 ఎకరాల్లో నిర్మించబడిన ఈ వ్యవసాయ కళాశాల ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా నిర్వహించబడుతోంది. ఇది రాష్ట్రంలోనే రెండవ వ్యవసాయ కళాశాల.[1]
శంకుస్థాపన, నిర్మాణం
[మార్చు]2018 ఆగస్టు 9న ఈ వ్యవసాయ కళాశాల భవనాల సముదాయానికి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కనేవున్న 35 ఎకరాల స్థలంలో 69.50 కోట్లతో ప్రత్యేక భవనం నిర్మించబడింది. ఇందులో 16 ఎకరాల్లో జీ ప్లస్ 2 పద్ధతిలో కళాశాల భవనం, విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరు వసతి గృహాలు, 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం, ఫాంలాండ్స్ నిర్మించబడ్డాయి. కంప్యూటర్ ల్యాబ్‌లు, ప్రయోగశాలలు, సెమినార్ హాళ్లు, అధ్యాపకుల గదులు, అసోసియేషన్ డీన్ చాంబర్, మోడ్రన్ లైబ్రరీ వంటి సదుపాయాలున్నాయి.[2]
ప్రారంభం
[మార్చు]వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను 2023 ఏప్రిల్ 12న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శాసనసభా సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరయ్యారు.[3]
కార్యకలాపాలు
[మార్చు]2018లో పీజీటీఎస్‌ఏసీ ఆధ్వర్యంలో ఎంసెట్ ద్వారా విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభం కాగా, సర్దాపూర్‌లోని వ్యవసాయ పాలిటెక్నిల్ కళాశాలలో తరగతులను ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో 56 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, వారు 2022 ఆగస్టులో వ్యవసాయ డిగ్రీలో పట్టభద్రులయ్యారు. ఒక బ్యాచ్ పూర్తి కాగా, ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్‌లో 190 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. కొత్త భవనంలోకి మార్చిన తర్వాత మరిన్ని కోర్సులతోపాటు ప్రతి విభాగంలో 120 సీట్లకు అప్‌గ్రేడ్ చేయనున్నారు. ప్రస్తుతం 23 మంది బోధన, 19 మంది బోధనేతర సిబ్బంది ఈ డిగ్రీ కళాశాలలో సేవలు అందిస్తున్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ ABN (2023-04-12). "సిరిసిల్లకు మరో మణిహారం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-12. Retrieved 2023-04-12.
- ↑ telugu, NT News (2023-04-12). "మానేటిగడ్డకు మరో మకుటం". www.ntnews.com. Archived from the original on 2023-04-12. Retrieved 2023-04-12.
- ↑ "సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల ప్రారంభం". Prajasakti (in ఇంగ్లీష్). 2023-04-12. Archived from the original on 2023-04-12. Retrieved 2023-04-12.
- ↑ "వ్యవసాయాభివృద్ధికి బాటలు". Sakshi. 2023-04-12. Archived from the original on 2023-04-12. Retrieved 2023-04-12.