అర్తమూరు (మండపేట)
అర్తమూరు (మండపేట) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°53′26.4228″N 81°56′31.5470″E / 16.890673000°N 81.942096389°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | మండపేట |
విస్తీర్ణం | 6.74 కి.మీ2 (2.60 చ. మై) |
జనాభా (2011) | 6,326 |
• జనసాంద్రత | 940/కి.మీ2 (2,400/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 3,147 |
• స్త్రీలు | 3,179 |
• లింగ నిష్పత్తి | 1,010 |
• నివాసాలు | 1,875 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 533340 |
2011 జనగణన కోడ్ | 587582 |
అర్తమూరు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం.[2]
ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 4 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,660.[3] ఇందులో పురుషుల సంఖ్య 3,357, మహిళల సంఖ్య 3,303, గ్రామంలో నివాసగృహాలు 1,768 ఉన్నాయి.అక్షరాస్యులు 4073 మంది కాగా అందులో 1981 మంది స్త్రీలు. ఈ గ్రామంలో దళితుల (షెఢ్యూలు కులాలు) సంఖ్య 765 కాగా అందులో 396 మంది స్త్రీలు. ఇక షెడ్యూలు తెగలకు చెందిన వారు 58 మంది. అందులో 27గురు స్త్రీలు.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1875 ఇళ్లతో, 6326 జనాభాతో 674 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3147, ఆడవారి సంఖ్య 3179. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 765 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 58. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587582.[4].
సమీప గ్రామాలు
[మార్చు]ఈ గ్రామానికి పశ్చిమాన ఇప్పనపాడు, తాపేశ్వరం, దక్షిణాన మండపేట, తూర్పున పెడపర్తి, కుతుకులూరు, రామవరం, ఉత్తర దిక్కులో పొలమూరు, అనపర్తి, ద్వారపూడి గ్రామాలు ఉన్నాయి.
స్థల పురాణం
[మార్చు]దూర్వాస మహాముని వలన అజముఖి అనే అతిలోక సౌందర్యరాశికి ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారు మదమత్తులై తండ్రి దూర్వాసుని తపఃఫలం తమకు ధారపోయమని అడుగుతారు. దానికి ఆయన నిరాకరిస్తాడు. దానితో వారు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి వరాలు పొందుతారు. వాతాపిని ఖండ ఖండాలుగా నరికి వేసినా పిలిచిన వెంటనే బ్రతికి వచ్చే మృతసంజీవని విద్యను వరంగా పొందారు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి అడవిలో ఎవరైనా ఒక ముని కాని, బాటసారి కాని ఎదురుపడితే మా ఇంటిలో పితృకార్యం జరుగుతోంది అతిథిగా రమ్మని ఆహ్వనించేవాడు. అతని మాట నమ్మి అతని వెంట వెళ్లిన వాళ్లకు ఇల్వలుడు తన తమ్ముడైన వాతాపిని మేకగా మార్చి మాంసాన్ని వండి వడ్డించేవాడు. అతిథి కడుపు నిండా భుజించాక తమ్ముడా వాతాపీ బయటకు రా అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి ఆ అతిథి పొట్ట చీల్చుకుని వచ్చి అన్నతమ్ములిరువురూ నరమాంసాన్ని భక్షించేవారు. ఈ విధంగా మునులు బాటసారుల సంఖ్య తగ్గిపోసాగింది. ఈ వార్తను మునులు అగస్త్యునికి చేరవేశారు. అగస్త్యుడు వారి సంగతి తేల్చడానికి బయలుదేరాడు. ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణుడి వేషంలో అగస్త్యుడిని భోజనానికి పిలిచాడు. వాతాపి మేకగా మారిపోతాడు. అగస్త్యమహర్షికి అన్నం వడ్డింస్తాడు. అతడు హాయిగా భుజిస్తాడు. మంచి అన్నం పెట్టారంటూ వాతాపి "జీర్ణం వాతాపి జీర్ణం" అంటూ పొట్టను నిమురుకుంటూ వెళ్లివస్తానని బయలుదేరతాడు. ఇల్వలుడు వాతాపిని పిలిచినా రాలేదు. "ఇంకెక్కడి వాతాపి నా కడుపులో జీర్ణమైపోయాడు" అని చిరునవ్వుతో చెబుతాడు అగస్త్యుడు. ఇల్వలుడు కోపంతో అగస్త్యుని చంపడానికి ఎగబడ్డాడు. అగస్త్యుడు కోపంగా కళ్లెఱ్ఱ జేస్తే ఇల్వలుడు భస్మమై పోతాడు. ఇల్వలుడు - వాతాపి దోచుకున్న సంపదను, అర్థాన్ని (ధనాన్ని) ఈ ప్రాంతంలో దాచుకున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి అర్థమూరు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది అర్తమూరుగా మారింది.[5]
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మండపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజానగరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల రాజమండ్రిలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అనపర్తిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మండపేటలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు రాజమండ్రిలోనూ ఉన్నాయి.ఈ గ్రామంలో ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఒక మండల పరిషత్ పాఠశాల, మరో రెండు పాఠశాలలు ఉన్నాయి. 6 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]అర్తమూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.ఈ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం 1965లో ప్రారంభమయ్యింది. ఆరోగ్య కార్యకర్తలు గ్రామంలో పర్యటిస్తూ తగు ఆరోగ్య సలహాలు, అవగాహన కలిగిస్తున్నారు. సమీప కార్పొరేట్ ఆసుపత్రి మండపేటలో ఉంది. ఈ గ్రామంలో మూడు మందులషాపులు ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.ఈ గ్రామానికి రక్షిత మంచినీటి సౌకర్యం ఉంది. ఈ పథకాన్ని ప్రైవేటు యాజమాన్యమైన సత్యభాస్కర త్రాగునీరు, పారిశుధ్య సంఘం 2006 నుండి అమలు చేస్తున్నది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]అర్తమూరులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.రాజమండ్రి - కోటిపల్లి జాతీయ రహదారిలో తాపేశ్వరం వద్ద దిగితే ఈ గ్రామానికి 1.5 కి.మీల దూరం ఉంటుంది. మండపేట - కాకినాడ రహదారిలో తుపాకుల తూము వద్ద దిగితే ఈ గ్రామం సుమారు 1.5 కి.మీ.ల దూరంలో ఉంటుంది. రైల్వే సౌకర్యం ఈ గ్రామానికి సమీపంలో అంటే రమారమి 7 కి.మీ.ల దూరంలో ద్వారపూడి, అనపర్తి గ్రామాల వద్ద ఉంది.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.ఈ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఉంది. ఈ గ్రామంలో సుమారు 100 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]అర్తమూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 100 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 574 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 494 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 80 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట నుండి సాగునీరు అర్తమూరు మీదుగా 6 కాలువల ద్వారా పెడపర్తి, కుతుకులూరు, రామవరం, పొలమూరు మొదలైన ప్రాంతాలకు వెళుతుంది. ఈ గ్రామంలో వ్యవసాయం ఈ సాగునీటిపై ఆధారపడి ఉంది. ఇక్కడ ప్రధాన పంట వరి. కాగా జొన్నలు, కొర్రలు, సామలు, సజ్జలు మొదలైన తృణధాన్యాలను, చెఱకు, నువ్వులు, వేరుశెనగ వంటి వాణిజ్య పంటలను కూడా పండిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయంలో ఆధునిక యంత్రపరికరాలను ఉపయోగిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సేద్యం వైపు ఈ గ్రామస్థులు మొగ్గుచూపుతున్నారు. బెల్లము, జనపనార, బాతుల పెంపకం, ఈము కోళ్ల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వ్యవసాయాధారిత పరిశ్రమలు ఈ గ్రామంలో ఉన్నాయి.అర్తమూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 80 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]అర్తమూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]పరిశ్రమలు
[మార్చు]ఈ గ్రామంలో వ్యవసాయం ఎక్కువమందికి జీవనాధారం. వ్యవసాయానుబంధ పరిశ్రమలుగా రైస్ మిల్లుల పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందింది. 1939లో ఈ గ్రామంలో మొట్టమొదటి సారిగా రామకృష్ణా హల్లర్ రైస్ మిల్ ఇక్కడ స్థాపించబడింది. ప్రస్తుతం ఈ గ్రామంలో 3 రైస్ మిల్లులు ఉన్నాయి. గ్రామీణ పరిశ్రమలు, ఇటుకల తయారీ మొదలైనవి ఈ గ్రామంలో ఉన్నాయి.
దేవాలయాలు
[మార్చు]- శ్రీ ఉమా అగస్త్యేశ్వరాలయం:ఈ ఆలయంలోని శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతున్నది. వాతాపి ఇల్వలులను చంపిన అగస్త్యుడు బ్రహ్మ హత్య పాతకం తొలగించుకోవడానికి శివుడిని ప్రతిష్ఠించి పూజించాడు. అగస్త్యునిచే నెలకొల్పబడిన ఈ లింగానికి అగస్త్యేశ్వరుడని పేరు. ఈ శివలింగం చుట్టుపక్కల ఉన్న శివలింగాలకంటే పెద్దది.
- శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం:ఈ ఆలయం కూడా అగస్త్యేశ్వరాలయం ప్రాంగణంలోనే ఉంది. దీనిని కూడా అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయంలో విష్ణు భక్తిని చాటిన 12 అళ్వారుల విగ్రహాలు ఉన్నాయి. ఈ రెండు ఆలయాలను 1860 వరకు పెద్దాపురం రాజులు పోషించేవారు. తరువాత ప్రభుత్వం వశం అయినాయి.
- ఇతర దేవాలయాలు:ఇంకా ఈ గ్రామంలో రామాలయం, ఆంజనేయస్వామి దేవస్థానం, సిద్ధివినాయక దేవాలయం, వెంకటేశ్వర దేవాలయం, ముత్యాలమ్మ గుడి, వేపాలమ్మ గుడి, పుంతలో ముసలమ్మ గుడి, గొల్లాలమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి ఉన్నాయి.
గ్రామానికి చెందిన ప్రముఖులు
[మార్చు]పెద్దజీయరు స్వామి
[మార్చు]ఇతని అసలు పేరు శ్రీమన్నారాయణాచార్యులు. ఇతడు చూడాంబ, మంగయాచార్యులకు 1909లో కాకినాడ సంతచెర్వులో జన్మించాడు. పిదప ఇతడిని అర్తమూరులోని ఆకులమన్నాటి చిలకమఱ్ఱి లక్ష్మీనరసమ్మ, కృష్ణమాచార్య దంపతులు దత్తత స్వీకరించారు. శ్రీమన్నారాయణ సంస్కృత కావ్యాలను, తర్క, వేదాంత, మీమాంస, న్యాయ శాస్త్రాలను చదువుకున్నాడు. తెలుగు, సంస్కృత, తమిళ, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.1939లో అర్తమూరులో విశిష్టాద్వైత ప్రచార సంఘాన్ని స్థాపించాడు. జీర్ణదేవాలయాల ఉద్దరణ ధ్యేయంగా పనిచేశాడు. 1948లో యతిరాజ ఉభయ వేదాన్త పాఠశాలను, భక్తినివేదన పత్రికను ప్రారంభించాడు. గాంధీమహాత్ముని పిలుపు అందుకుని గోసేవ, విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ధారణ మొదలైనవాటిని ఆచరించాడు. అర్తమూరు, ద్వారపూడిలలో హరిజనవాడలు కాలిపోతే తన ఆస్తి మొత్తము ఖర్చుపెట్టి సహకార పద్ధతిలో 108 గృహాలను నిర్మించి ఇచ్చాడు. దళితులు కృతజ్ఞతగా ఇతని విగ్రహాన్ని వారి పేటలో నిర్మించుకున్నారు. ఇతడు 1954 మే నెలలో వానమామలై వెంకటరాజ జీయర్ వద్ద సన్యాస దీక్షను స్వీకరించి త్రిదండి జియ్యర్‌గా మారాడు. సన్యాసాశ్రమం స్వీకరించేవరకు ఇతడు అర్తమూరులో నివసించాడు. జియ్యర్‌గా ఇతడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పర్యటించి విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశాడు. 108 రామకోటి స్తంభాలను స్థాపించాడు. అర్తమూరులో 47వ రామకోటి స్తూపము 1964లో నిర్మించాడు. పెద్దజీయరు అష్టోత్తర శతనామావళిలో "అర్తమూరు గ్రామవాసీ" అని ఈ గ్రామం ప్రస్తావన ఉంది. ఇతడు 1979, డిసెంబరు 31న తనువు చాలించాడు.
చిన్నజీయరు స్వామి
[మార్చు]ఇతని పేరు రామానుజ శ్రీమన్నారాయణ. ఇతడు అర్తమూరు గ్రామంలో అలమేలు మంగతాయారు, వేంకటాచార్యులు దంపతులకు 1956, నవంబరు 3వ తేదీన జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం రాజమండ్రిలోని ఓరియంటల్ స్కూలు, గౌతమీ విద్యాపీఠంలలో జరిగింది. ఇతడు తన 23వ యేట త్రిదండి జీయర్‌గా సన్యాస దీక్షను స్వీకరించాడు. ఇతడు వైష్ణవ మత ప్రచారంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. 1982లో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్)ను స్థాపించి గుంటూరు, హైదరాబాదు, రాజమండ్రి, చెన్నై, నేపాల్‌లోని నారాయణ కుందు, అమెరికాలోని న్యూజెర్సీ, ఇల్లినాయిస్, వాషింగ్‌టన్ డి.సి., కాలిఫోర్నియా, డల్లాస్, హోస్టన్, ఫోనిక్స్, కెనడాలోని టోరెంటో, ఇంగ్లాండులోని బోస్టన్ వంటి అనేక ప్రదేశాలలో విద్యాలయాలను నడుపుతున్నాడు. ఇంకా వేదాచార్య పీఠం, భక్తి నివేదన (పత్రిక), వికాస తరంగిణి, బదిరి అన్నదానం, మేల్కోటే అన్నదానం వంటి పథకాలను అమలు చేస్తున్నాడు.
మరింగంటి పెద వెంకటాచార్యులు
[మార్చు]ఇతడు శ్రీ శమంతకమణి ప్రభావం అనే గ్రంథాన్ని రచించాడు.
మరింగంటి వెంకటాచార్యులు
[మార్చు]ఇతడు సంగీత విద్వాంసుడు. ఇతడు సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ఆస్థాన సంగీత విద్వాంసుడిగా నియమించబడ్డాడు.
మేడపాటి వెంకటరెడ్డి
[మార్చు]ఇతడు యోగవిద్యలో నిష్ణాతుడు. సికిందరాబాదులోని ప్రభుత్వ వేమన యోగ పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌గా, ఆరోగ్య వైద్యశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ యోగాధ్యయన పరిషత్తుకు కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నరు గారికి యోగచికిత్సా నిపుణుడిగా సేవలను అందించాడు. ఇతడు హఠరత్నావళి, వేమన యోగము, తెలుగు యోగులు, స్వరశాస్త్రమంజరి, సైబర్ నిపుణులు - యోగ, వేమన యోగి -ధ్యానములు, యోగాభ్యాసములు వంటి తెలుగు గ్రంథాలను, యోగిక్ థెరపి, యోగ ఫర్ సైబర్ వరల్డ్, యోగిక్ ప్రాక్టీసెస్, సైంటిఫిక్ స్టడీస్ కండక్టెడ్ అట్ వేమన యోగిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి ఆంగ్ల గ్రంథాలను రచించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-05.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-05.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ మేడపాటి, వెంకటరెడ్డి (2015). అర్తమూరు గ్రామ చరిత్ర.