అక్షాంశ రేఖాంశాలు: 13°47′56″N 79°38′2″E / 13.79889°N 79.63389°E / 13.79889; 79.63389

ముచ్చివోలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముచ్చివోలు
ఉన్నత పాఠశాల, ముచ్చివోలు
ఉన్నత పాఠశాల, ముచ్చివోలు
పటం
ముచ్చివోలు is located in ఆంధ్రప్రదేశ్
ముచ్చివోలు
ముచ్చివోలు
అక్షాంశ రేఖాంశాలు: 13°47′56″N 79°38′2″E / 13.79889°N 79.63389°E / 13.79889; 79.63389
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
మండలంశ్రీకాళహస్తి
విస్తీర్ణం11.72 కి.మీ2 (4.53 చ. మై)
జనాభా
 (2011)[1]
1,823
 • జనసాంద్రత160/కి.మీ2 (400/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు932
 • స్త్రీలు891
 • లింగ నిష్పత్తి956
 • నివాసాలు485
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్517536
2011 జనగణన కోడ్595841

ముచ్చివోలు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి మండలానికి చెందిన అతి పెద్ద పంచాయితీలలో ఒకటి. శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తి నుంచి ఆం.ప్ర.రా.రో.ర.సం. బస్సులలో సుమారు 30 నిమిషాలలో ఈ గ్రామానికి చేరుకొనవచ్చును. గ్రామ దేవత బైకమ్మ. చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోకీ విద్యావంతుల గ్రామంగా దీనికి పేరుంది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పశు పోషణ. అంగన్ వాడీ నుంచి పదవ తరగతి వరకూ విద్యా సౌకర్యం ఉంది. మూడు ప్రధాన ఆలయాలు, మూడు చిన్న ఆలయాలు ఉన్నాయి. సాంప్రదాయకంగా జరుపుకునే సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి మొదలైన పండుగలే కాక పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, బైకమ్మ సంతర్పణ ఘనంగా నిర్వహిస్తారు.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 485 ఇళ్లతో, 1823 జనాభాతో 1172 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 932, ఆడవారి సంఖ్య 891. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 466 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595841[2].

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామ జనాభా - మొత్తం 1,732 - పురుషుల 894 - స్త్రీల 838 - గృహాల సంఖ్య 417

గ్రామ చరిత్ర

[మార్చు]

బైకమ్మ

[మార్చు]
గ్రామంలోని ప్రధాన వీధి

గ్రామానికి ప్రధాన గ్రామదేవత బైకమ్మ. ప్రతి యేటా వూరి చెరువుగట్టుపై ప్రతిష్ఠించబడిన ఈ దేవతకు భక్తి శ్రద్ధలతో సంతర్పణ జరుపుతారు. ఈ సందర్భంగా గ్రామస్థులు చిన్న-పెద్ద, పేద-ధనిక, కుల-మత భేదాలు లేకుండా చెరువు గట్టునే సహపంక్తి భోజనం చేస్తారు. ఈ వేడుకలలో చిన్నా పెద్దా తేడాలేకుండా గ్రామస్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ దేవత గురించి ఒక ఉదాత్త మైన గాథ ఒకటి ఉంది. ఒకానొక కాలంలో ఈ ఊరి చెరువుకు చిన్న గండి పడి, క్రమేపీ పెద్దదవసాగింది. అది పెద్దదైతే ఊరంతా జలమయం కావడం ఖాయం. పంటలు పండక ఊరి జనం అంతా ఒక సంవత్సరం పాటు పస్తులు ఉండాల్సి వస్తుంది. గ్రామస్థులు తమ శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ గండి మూతపడలేదు. అప్పుడు గ్రామంలోని విజ్ఞుడొకడు ఎవరైనా గంగమ్మ తల్లికి ఆత్మార్పణ కావించుకొంటే శాంతిస్తుందేమోనని సలహా ఇచ్చాడు. ఊరి క్షేమాన్ని పరమావధిగా భావించిన బైకమ్మ ఆ గండికి అడ్డంగా నిలబడి పూడ్చివేయమని కోరింది. గండి మూతపడి పోయింది. అప్పటినుంచీ ప్రజలు ఆమె తమ గ్రామాన్ని కాపాడడానికి వచ్చిన దేవతగా భావించి పూజలు చేస్తుంటారు.

వివరాలు

[మార్చు]
ఒక భవనంపై నుంచి గ్రామంలోని ఇళ్ళు

బలిజ కులస్తులు అత్యధిక సంఖ్యలో ఉండగా ఇతర కులాలైన వెలమ, కాపు, గొల్ల చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. శ్రీకాళహస్తి నుంచి బస్సులో వెళ్ళి దిగగానే నిలువెత్తు వీరాంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళితే కావమ్మ గుడి వస్తుంది. గ్రామం ప్రధాన వీధులన్నీ సిమెంటు రోడ్లే. ఈ ఊరికి దగ్గరే ఉన్న రైల్వే స్టేషను అక్కుర్తి. అయితే ఇక్కడ ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి. రైలులో దూర ప్రయాణం చేయాలంటే శ్రీకాళహస్తికి వెళ్ళాలి.ఊరికి తూర్పుగా దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ముచ్చివోలు హరిజనవాడ ఉంది. గ్రామస్థులకు నారు నాటడం, కలుపు తీయడం, కుప్ప నూర్చడం వంటి వ్యవసాయ పనుల్లో సహాయకార్లుగా ఉంటారు. హరిజనవాడకు ప్రత్యేకంగా ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే ఉన్నత పాఠశాల మాత్రం ఒకటే.

జీవనాధారం, వృత్తులు

[మార్చు]

ఎక్కువ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. రైతులు వరి, వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. ఆవులు, బర్రెల పెంపకం ద్వారా పాలు అమ్మి గ్రామస్థులు చెప్పుకోదగిన ఆదాయాన్ని గడిస్తుంటారు. ఈ పాలు కొనుక్కోవడానికి శ్రీకాళహస్తి పాల సరఫరా సహకార సంఘం వారు, కొన్ని ప్రైవేటు డైరీలు, ప్రైవేటు వ్యక్తులు వస్తుంటారు. ప్రాచీన గ్రామీణ వ్యవస్థ లాగే ఇక్కడ రజకులు, మంగలి వారు, కుమ్మరులు, వడ్రంగులు మొదలైన అన్ని రకాల వృత్తుల వారు నివసిస్తుంటారు. ఇంకా కొన్ని కుటుంబాలు గొర్రెల/మేకల పెంపకం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తారు.

వ్యవసాయం

[మార్చు]

గ్రామంలో సాగునీటికి ఎక్కువ మంది ఊరికి పడమటగా ఉన్న చెరువు మీదే ఎక్కువగా ఆధారపడతారు. కొద్ది మంది బావులు, గొట్టపు బావుల మీద ఆధారపడతారు. ఈ చెరువు చుట్టుపక్కల గ్రామాల చెరువుల్లో కల్లా పెద్ద చెరువు. వర్షాకాలంలో ఇంటికి ఒక మనిషి చొప్పున గ్రామస్తులంతా వెళ్ళి, తిరుమల కొండలపై నుంచి పారే నీటిని చెరువులోకి మళ్ళిస్తారు. దీనినే వరవ కట్టడం అంటారు. ఒక వేళ చెరువు నిండి పోతే అదనపు నీటిని విడుదల చేయడానికి రెండు కలుజులు ఉన్నాయి. చెరువులో చేపలు పట్టుకోవడానికి గ్రామ పంచాయితీ ప్రతి సంవత్సరం వేలం నిర్వహిస్తుంది. అందులో పాడుకున్న వాళ్ళు మాత్రమే ఆ సంవత్సరం చేపలు పట్టి అమ్ముకోవడానికి అర్హులు.గ్రామంలో మూడు బియ్యం మరలు (రైస్ మిల్లులు) ఉన్నాయి. చాలా మంది గ్రామస్థులు బియ్యం ఇక్కడే మరాడించుకుని వెళుతుంటారు. కొద్ది మంది తమ పంటను ఇక్కడికి వచ్చే వ్యాపారస్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటుంటారు. వ్యవసాయానికి ఎక్కువగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వాడతారు. దాదాపు ప్రతీ ఇంటిలోనూ పాడి సంపద ఉండటం వల వాటి వ్యర్థాలను తమ పంట పొలాలను ఎరువుగా వాడుకుంటారు.

విద్య

[మార్చు]

గ్రామం.లో ఒక అంగన్‌వాడీ కేంద్రం, ఒక ప్రాథమిక పాఠశాల, ఉన్నత విద్యా పాఠశాల ఉన్నాయి. ప్రక్క గ్రామాలైన మంగళపురి, ఎర్రగుడిపాడు, ముద్దుమూడి నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికే వచ్చి విద్యనభ్యసిస్తుంటారు. కళాశాల చదువుకు మాత్రం ఎవరైనా ప్రక్కనే ఉన్న శ్రీకాళహస్తికి వెళ్ళాల్సిందే. అక్షరాస్యాతా శాతం 75%. ఇక్కడి నుంచి చాలామంది ఇంజనీర్లుగా (ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగంలో ఐ.టి) బెంగుళూరు, అమెరికాలలో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇంకా బోధన, ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్, మీడియా, టెలికాం, న్యాయ శాస్త్రం మొదలైన అన్ని రంగాలలోనూ ఈ ఊరి వారు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఊరి ప్రజలకు ఇది గర్వకారణం.గ్రామ ఉన్నత పాఠశాల 2005 నుంచీ పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని పాఠశాలన్నింటిలోకెల్లా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తోంది. 2008 లో ఒక విద్యార్థిని 600 మార్కులను గాను 562 మార్కులు సాధించి నియోజక వర్గానికి ప్రథమురాలిగా నిలిచింది. ఇంతకు మునుపు గ్రామం లోపల ఉన్న ఈ బడిని 1998 లో ఊరి వెలుపలనున్న కొత్త భవనాలకు మార్చడంతో ఆటస్థలం, లాంటి కొన్ని సౌకర్యాల లేమి ఉంది.

ఆలయాలు-ఉత్సవాలు

[మార్చు]
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విజయగణపతి దేవాలయ నమూనా
భజన చేస్తున్న భక్త బృందం

గ్రామంలో నాలుగు దేవాలయాలు ఉన్నాయి.

  • శ్రీ పాండురంగ స్వామి దేవాలయం
  • శ్రీ రామాలయం
  • శ్రీ విజయ గణపతి దేవాలయం
  • శ్రీ వేమాలమ్మ దేవాలయం
  • కావమ్మ గుడి.
  • ఆంజనేయ స్వామి గుడి.

పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు

[మార్చు]
గ్రామాలయంలో పాండురంగ స్వామి ప్రతిమ
అగ్నిగుండం

ప్రతి యేటా పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పాండురంగ స్వామి భక్తబృందం దీని నిర్వహణా బాధ్యతలు చేపడుతుంది. ఈ భక్త బృందం లోని సభ్యులందరూ తప్పనిసరిగా ఉత్సవాలు జరిగిన అన్ని రోజులూ పండరి భజనలో పాల్గొంటారు. కొన్ని గ్రామాల్లో కోలాటం కూడా ప్రదర్శిస్తారు. చుట్టుపక్కల గ్రామాలనించి కూడా ప్రజలు వచ్చి ఈ ఉత్సవాలను తిలకించడం విశేషం. ఐదురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో ప్రధానంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి.

  • ధ్వజారోహణం: కాషాయపు జెండాని ప్రతిష్ఠించడం.
  • కంకణ ధారణ: గుండ ప్రవేశం ముందురోజు రాత్రి దీనిలో పాల్గొనే వారంతా కంకణాలు (పసుపు కొమ్ము) కట్టుకోవలసి ఉంటుంది. ఇలా కంకణం కట్టుకున్న వారు గుండ ప్రవేశం చేసేంత వరకు కొన్ని నియమాలు పాటించాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. భోజనానికి సాధారణంగా వాడే కంచాల్ని వాడకుండా విస్తరాకులు, లేదా అరటి ఆకులు మాత్రమే వాడాలి. మంచాల్ని తాకరాదు. కటిక నేల మీద, కుర్చీ మీద లేదా చాప మీద మాత్రమే కూర్చోవాలి లేదా పడుకోవాలి. కాళ్ళకి పాదరక్షలు వేసుకోకూడదు. పసుపు బట్టలు ధరించాలి.
  • గుండ ప్రవేశం: ఈ రోజంతా గుండ ప్రవేశం చేయబోయే భక్తులు పైన చెప్పిన నియమాల్ని పాటిస్తూ. నిర్ణీత కాలవ్యవధిలో గ్రామం చేలల్లో గల వివిధ వ్యవసాయ బావుల్లో స్నానం చేసి వస్తుండాలి. ఇలా ఎన్ని సార్లు చేయలనేది. గుండం ఎన్ని మూరలు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గుండం 13 మూరలదైతే ఆ రోజు మొత్తం 13 సార్లు స్నానం ఆచరించాల్సి ఉంటుంది. గుండ ప్రవేశం ముందు ఆఖరి స్నానం ఉంటుంది. ఈ ఆఖరి స్నానం మంగళ వాయిద్యాలతో, బాణ సంచా కాల్పులతో అట్టహాసంగా జరుగుతుంది. గుండ ప్రవేశం చేసేటప్పుడు పురుషులు చొక్కా, కానీ బనియన్ కానీ వేసుకోకూడదు. సాధారణంగా ఈ ఉత్సవమంతా ఒక భజన గురువు సారథ్యంలో జరుగుతుంది. ముందుగా భజన గురువు ఒక పూల చెండును నిప్పులపై దొర్లిస్తూ ఆయన నడిచిపోతే, మిగతా భక్తులంతా ఆయనను అనుసరిస్తారు. గుండ ప్రవేశం పూర్తయిన తర్వాత కొద్ది సేపు భక్తులందరూ పరవశంతో ఆనందతాండవం చేస్తారు. తరువాత స్వామికి జోలపాడి, భక్తులందరూ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోతారు.
  • వసంతోత్సవం: గుండ ప్రవేశం అయిన మరుసటి రోజు వసంతోత్సవం. ఇందులో భాగంగా రుక్మిణీ సమేత పాండురంగ స్వామిని పురవీధుల్లో ఊరేగిస్తారు. భజన బృందం పాటలు పాడుతుండగా, ఉత్సాహవంతులైన యువకులు వసంతం ( పసుపు, కుంకుమ మొదలైనవి కలిపిన నీళ్ళు) పోసుకుంటుండగా ఇది ఆద్యంతం ఉల్లాసంగా సాగిపోతుంది.
  • గుండశాంతి: గుండాన్ని పూడ్చి వేస్తారు.
  • పారువేట: ఈ భాగంగా మొదట్లో ఒక కుందేలును తెచ్చి. దానిని విడిచిపెట్టి, గ్రామస్తులంతా దానిని పట్టుకోవడానికి పరుగులు పెట్టేవారు. కానీ ఇప్పుడు కుందేళ్ళు అంత సులభంగా అందుబాటులో లేక పోవడంతో ఒక కొబ్బరి కాయను అలా విసిరేసి దాన్ని దొరకబుచ్చుకుని సరిపెట్టేస్తుంటారు.

ప్రత్యేక కార్యక్రమాలు

[మార్చు]

గుండ ప్రవేశం రోజు రాత్రి, గ్రామం లోని యువకులందరూ కలిసి ఒక సాంఘిక నాటకం ప్రదర్శించడం ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ ప్రదర్శన అందరికీ ఉచితమే. ఇంకా ఉత్సవాల్లో భాగంగా, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన హరికథా భాగవతార్ల చే పురాణ కాలక్షేపం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి.ఇంకా ప్రతి యేటా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వేమాలమ్మ తిరునాళ్ళు, నాగుల చవితి నాడు నాగులమ్మకు పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కావమ్మ గుడి దగ్గర కావమ్మ కథను హరికథా కాలక్షేపం మూడురోజుల పాటు జరిపిస్తారు. ఇక్కడ కూడా మూడవరోజు అగ్నిగుండ ప్రవేశం (నిప్పుల్లో నడవడం) చేస్తారు.

ఇరుగు-పొరుగు గ్రామాలు

మంగళపురి, ఎర్రగుడిపాడు, ముద్దుమూడి, వేలవేడు, మాదమాల, అక్కుర్తి.

విశేషాలు

జెమిని టివిలో ప్రసారమౌతున్న మొగిలిరేకులు అనే సీరియల్ ను కొద్దిభాగం ఈ గ్రామంలో చిత్రీకరించడం జరిగింది.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ముచివోలులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టరు ఒకరు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ముచ్చివోలులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ముచివోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 327 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 10 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 8 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 256 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 56 హెక్టార్లు
  • బంజరు భూమి: 56 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 456 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 169 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 399 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ముచివోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 156 హెక్టార్లు
  • చెరువులు: 242 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ముచ్చివోలులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, వేరుశనగ

రాజకీయాలు

[మార్చు]

ముచ్చివోలు గ్రామం అదే పంచాయితీ పరిధిలోకి వస్తుంది. శాసనసభ నియోజక వర్గం శ్రీకాళహస్తి. పార్లమెంటు నియోజక వర్గం తిరుపతి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు

[మార్చు]