ఎం.ఎన్.రాయ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
M. N. Roy
মানবেন্দ্রনাথ রায়
Mn roy2.jpg
Manabendra Nath Roy
జన్మ నామం Narendra Nath Bhattacharya
జననం (1887-03-21)21 మార్చి 1887
Changripota, 24 Parganas, Bengal Presidency, British India
మరణం జనవరి 26, 1954(1954-01-26) (వయసు 66)

ఎం. ఎన్. రాయ్ గా ప్రసిద్ధిచెందిన మానవేంద్ర నాథ రాయ్ (మార్చి 21, 1887జనవరి 25, 1954) హేతువాది, మానవవాది. మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు[1]. భారతదేశంలో మార్క్సిస్టు ఉద్యమ పితామహుడు. ఇస్లామ్ చారిత్రక పాత్ర అనే పుస్తకంలో ఇస్లాం విప్లవాత్మకతను పొగిడాడు. కాంగ్రెస్ పార్టీ కోరుతున్న స్వాతంత్ర్యానికి దీటుగా, రాజ్యాంగం రావాలని, సంఘం మారాలని, పునర్వికాసం వైజ్ఞానిక ధోరణి ప్రబలాలని ఎం.ఎన్. రాయ్ చెప్పాడు. బ్రిటిష్ వారు ఎలాగు దేశం వదలి పోతారు, రెండో ప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎం.ఎన్. రాయ్ కచ్చితంగా చెప్పాడు. ఆలోగా ఫాసిస్టులు, నాజీ నియంతలు, మన దేశంలో బలపడకుండా జపాన్ తిష్ఠవేయకుండా చూడాలన్నారు. తాత్కాలికంగా బ్రిటిష్ వారికి యీ రంగంలో చేయూత నివ్వాలన్నారు[2].

రాజకీయ రంగం[మార్చు]

భారతదేశంలో 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో జరిగిన సాయుధ విప్లవాల్లోనే కాక ఎం.ఎన్.రాయ్ మెక్సికో, చైనాల్లో జరిగిన విప్లవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ వేత్తలైన లెనిన్, ట్రాట్‌స్కే, స్టాలిన్ తదితరులతో కలసి పనిచేశారు. 1920 నాటి నుంచీ జాతీయోద్యమంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా రాయ్ తాత్త్వికత వేరుగానే ఉండేది. ఆయనకు గాంధీజీ ప్రజా సమీకరణ, పోరాటం పట్ల ఉన్న నిబద్ధత వంటివి నచ్చినా, తక్కువ హానికలిగే ఆయన విధానాలు తిరోగమనమైనవని భావించేవారు. జాతీయ విప్లవం ద్వారానే వర్గ సమాజం, సామాజిక అంతరాలు నశిస్తాయని మొదటినుంచీ భావించేవారు. ఆ క్రమంలోనే దేశంలో కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు దృక్పథం బలపడేందుకు కృషిచేశారు.[3]

తెలుగువారిపై రాయ్ ప్రభావం[మార్చు]

1937 జూలైలో మద్రాసు యువజన సభలో పాల్గొన్న ఎం.ఎన్. రాయ్ ఆగస్టు 1న తొలిసారి ఆంధ్రలో అడుగుపెట్టారు. నెల్లూరులో వెన్నెల కంటి రాఘవయ్య ఆధ్వర్యాన జరిగిన వ్యవసాయ కార్మికుల మహాసభకు ఎం.ఎన్. రాయ్ ప్రధాన వక్తగా వచ్చారు. అక్కడ జబ్బుపడ్డారు.ములుకుట్ల వెంకటశాస్త్రి, ఎం.ఎన్. రాయ్ ను కాకినాడకు తీసుకెళ్ళారు. విశాఖపట్టణం నుండి అబ్బూరి రామకృష్ణారావు (యూనివర్శిటీలో లైబ్రేరియన్, థియేటర్ నిపుణులు) వచ్చారు. ఎం.ఎన్. రాయ్ ను వారిరువురూ ఆంధ్రకు పరిచయం చేశారు. వీరితో కలిసిన వెన్నెలకంటి రాఘవయ్య సాంఘిక విప్లవ బీజాలు నాటారు. గుర్రం జాషువా, గోరా, త్రిపురనేని రామస్వామి పురాణాల తిరోగమనాన్ని వ్యతిరేకిస్తుండగా స్త్రీ స్వేచ్ఛకై చలం సాహిత్య పోరాటం చేశారు. ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ ధోరణి, సాహిత్యం చాలా మందిని ఆకట్టుకున్నాయి. సినిమా రంగంలో గూడవల్లి రామబ్రహ్మం సంస్కరణ చిత్రాలు తీసి కొత్త వెలుగు చూపారు. ప్రజా మిత్ర పత్రిక ద్వారా ఎం.ఎన్. రాయ్ వ్యాసాలు, ఆయన అనుచరుల సాహిత్యాన్ని జనానికి అందించారు. అబ్బూరి రామకృష్ణారావు స్జేజి నాటక రంగంలో కొత్త దారులు చూపారు. పి.హెచ్. గుప్తా విశాఖ నుండి రామాయణ విమర్శ అందించారు. గుంటూరులో బండారు వందనం దళితుల మధ్య పునర్వికాసానికి నాంది పలికారు. కార్మిక రంగంలో పెమ్మరాజు వెంకటరావు నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికులతో ఆరంభించి, కార్మిక పత్రిక నడిపారు. ఎలవర్తి రోశయ్య విద్యార్థులకు భావ విప్లవ సాహిత్యాన్ని పరిచయం చేశారు. పాములపాటి కృష్ణచౌదరి రాడికల్ విద్యార్థి పత్రిక నడిపారు. గుత్తికొండ నరహరి, బండి బుచ్చయ్య ములుకోల సాహిత్య ప్రచురణలు, కోగంటి రాధా కృష్ణ మూర్తి తెనాలి నుండి నలంధా ప్రచురణలు, ప్రజా సాహిత్య గ్రంథాలు వెలికి తెచ్చారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి వ్యాసోపన్యాసకుడుగా ఎం.ఎన్. రాయ్ భావ ప్రచారం చేసి, లౌకిక వివాహాలు జరిపాడు. 1954లో ఎం.ఎస్. రాయ్ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికల సంపాదకీయాలు రాసినా, నార్ల ఆ పని చేయలేదు. ఎవడో అనామకుడు చనిపోతే “తారరాలింది, వటవృక్షం కూలింది” అని రాసే నార్లకు ఎం.ఎన్. రాయ్ ఎవరో తెలియదా అని ఆవుల గోపాలకృష్ణ మూర్తి గుంటూరు ఏకాదండయ్య హాలులో సభా ముఖంగా దెప్పి పొడిచారు. అది బాగా ఆయనకు గుచ్చుకున్నది. వెంటనే గుత్తి కొండ నరహరి ద్వారా ఎం.ఎన్. రాయ్ రచనలు తెప్పించుకొని చదివారు. అవి కళ్ళు తెరిపించగా, నార్ల అప్పటి నుండి రాయ్ అభిమానిగా, క్రమేణా మానవవాదిగా పరిణమించి ఇంగ్లీషులో గీతపై విమర్శ గ్రంథం తెచ్చారు. ఎం.ఎన్.రాయ్ 1936 లో ప్రారంభించిన ఇండిపెండెంట్ ఇండియా పత్రిక చదివి ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ కట్టమంచి, లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు మానవవాదులయ్యారు. ఎం.ఎన్. రాయ్ మానవ వాద ధోరణి శ్లాఘిస్తూ సంజీవ దేవ్ రాశారు. పాలగుమ్మి పద్మరాజు పుంఖాను పుంఖంగా మానవ వాద రచనలు చేసి రెండో అశోకుడి ముణ్ణాళ్ళ పాలన రచనతో పార్టీ రహిత ప్రజాస్వామ్యం చూపాడు. కూచిపూడి లో కోగంటి సుబ్రమణ్యం కోగంటి రాధాకృష్ణమూర్తి లీగాఫ్ రాడికల్ కాంగ్రెస్ మెన్ స్థాపించారు. 1940లో తెనాలి రత్నా టాకీస్ లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ మొదటి సభ జరిగింది. త్రిపురనేని గోపీచంద్ రాయ్ రచనలు అనువదించారు.ఆవుల సాంబశివరావు తొలినాళ్లలో, సమాజంలో బానిసత్వం, పేదరికం, వెనకబాటుతనం, అంధ విశ్వాసాలు ఇవన్నీ రూపుమాసిపోవాలంటే కమ్యూనిస్టు భావజాలమే శరణ్యం అని భావించినా, ఎం.ఎన్. రాయ్ స్ఫూర్తితో నవ్య మానవవాదాన్ని అవలంబించారు. 1952 తెనాలి లో ఆవుల గోపాలకృష్ణమూర్తి జరిపిన హ్యూమనిస్టు సభకు ఎం.ఎన్.రాయ్ ప్రారంభోపన్యాసాన్ని పంపారు. మల్లాది వెంకట రామమూర్తి 1967లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎం.ఎన్.రాయ్ భావాల ప్రకారం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గము నుండి పార్టీ రహిత అభ్యర్ధిగా పోటీ చేశారు.

మూలాలు[మార్చు]

  1. This date found in the Dictionary of National Biography and accepted by Sibnarayan Ray, In Freedom's Quest: Life of M.N. Roy (Vol. 1: 1887–1922). Calcutta: Minerva Associates, 1998; p. 14. This is based on the diary of Dinabandhu. Samaren Roy in The Restless Brahmin claims that Bhattacharya was born on 22 February 1887 in Arbelia.
  2. "Manabendra Nath Roy," Banglapedia, www.banglapedia.org/
  3. ఎం.ఎన్.రాయ్:వి.బి.కార్నిక్:నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా:1980

ఇతర లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఎం.ఎన్.రాయ్&oldid=1246341" నుండి వెలికితీశారు