హనుమాన్ జంక్షన్
ఇదే పేరుతో ఉన్న తెలుగు సినిమా హనుమాన్ జంక్షన్ గురించి చూడండి.
హనుమాన్ జంక్షన్ , కృష్ణా జిల్లా, బాపులపాడు మండలానికి చెందిన గ్రామము. ఇది కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్నది. నాలుగు ముఖ్య పట్టణాల కూడలి గనుక ఇది "జంక్షన్" అని వ్యవహరింప బడుతుంది. ప్రధాన కూడలి నుండి నాలుగు రోడ్లను ఏలూరు రోడ్, గుడివాడ రోడ్, నూజివీడు రోడ్, విజయవాడ రోడ్ - అని పిలుస్తారు. ముందు ఒక పల్లెటూరుగా ఉన్న ఈ జనావాసం లారీ రవాణా కేంద్రంగానూ, వ్యాపార కేంద్రంగానూ అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడి పశువుల సంత చుట్టు ప్రక్కల మండలాలలో బాగా ప్రాచుర్యం కలిగిఉంది. మెరక వ్యవసాయమూ, పల్లపు వ్యవసాయమూ కూడా బాగా జరుగుతాయి. ఇక్కడి ఆంజనేయ స్వామి ఆలయం (అభయాంజనేయ స్వామి ఆలయం)లో వాహన పూజలు అధికంగా జరుగుతాయి.
విషయ సూచిక |
[మార్చు] రోడ్లు
ఐదవ నెంబరు జాతీయ రహదారి 5 (NH5) (కలకత్తా - మద్రాసు రోడ్డు) [1], మరియు బందరు-నూజివీడు రోడ్లు ఇక్కడ "హనుమాన్ మందిరం" వద్ద కలుస్తాయి. ఈ నాలుగురోడ్ల కూడలిలో అభయాంజనేయస్వామి మందిరం ఉంది. ఇక్కడి ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాలకంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. స్వామి పాదాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి. ఈ స్వామి భయాలను హరించి రక్షణనిస్తాడని ఇక్కడివాఱి నమ్మకం.ఇక్కడినుండి ఉన్నరోడ్లు
- గుడివాడ రోడ్డు - గుడివాడ, మచిలీపట్నం వెళ్ళేది
- విజయవాడ రోడ్డు - విజయవాడ, నెల్లూరు, మద్రాసు వెళ్ళే NH5 దక్షిణ భాగం.
- ఏలూరు రోడ్డు - ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, కలకత్తా వెళ్ళే NH5 ఉత్తర భాగం.
- నూజివీడు రోడ్డు - నూజివీడు, తిరువూరు, ఖమ్మం, కొత్తగూడెం వెళ్ళేది.
[మార్చు] పట్టణం అభివృద్ధి
1950 దశకంలో చుట్టుప్రక్కల ప్రాంతాలనుండి జనులు ఇక్కడికి వచ్చి స్థిరపడడం మొదలయ్యింది. జాతీయరహదారిపైన ఉన్నందున మొదట్లో హోటళ్ళు వ్యాపారం సాగింది. ఇంద్రభవన్ అనే హోటల్ (ఇప్పుడు ఇది మూత పడింది. ప్రస్తుతం విజయవాడ రోడ్‌లో ఉన్న ఇంద్ర భవన్, ఇది ఒకటి కాదు), రామా స్వీట్స్ (ఇది కూడా మూతపడింది) ఇక్కడ సాగిన మొదటి దుకాణాలలో కొన్ని.
1960 దశకంలో హనుమాన్ కో-ఆపురేటివ్ షుగర్స్' అనే చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో వీరవల్లి వద్ద ప్రారంభించారు. ఇది తరువాత డెల్టా షుగర్స్ అనే ప్రైవేటు కంపెనీగా మారింది. (అమ్మబడింది)[2] ఈ పరిశ్రమ మొదలయిన తరువాత సమీప గ్రామాలలో వరి బదులు చెరకు వ్యవసాయం బాగా పెరిగింది. దానితోపాటు వ్యవసాయ కార్మికుల వలసలు కూడా అధికమయ్యాయి. పట్టణం నాలుగు రోడ్ల వెంటా జనావాసాలు, దుకాణాలు విస్తరించాయి. కోళ్ళ ఫారాలు, పుకాకు వ్యాపారం, పశువుల మారుబేరం, సినిమా హాళ్ళు, బియ్యపు మిల్లులు బాగా పెరిగాయి.
హనుమాన్ జంక్షన్‌లో జరిగే పశువుల సంత రాష్ట్రంలోనే అతి పెద్దది కావచ్చును. ప్రతి మంగళవారం, బుధవారం ఈ సంత జరుగుతుంది. కాని ప్రస్తుతం దుక్కి దున్నడానికి ట్రాక్టర్ల వాడకం పెరిగినందువలన ఈ సంతలో అమ్మకాలు కొంత తగ్గాయి. 1980 దశకంలో విజయ కోపరేటివ్ పాల పరిశ్రమ మొదలయ్యింది. ఇది లాభాలలో నడుస్తున్న కొద్ది సహకార పాలపరిశ్రమలలో ఒకటి.
అయితే హనుమాన్ జంక్షన్‌లోని వ్యాపారం ప్రధానంగా రవాణా వాణిజ్యానికి (స్పేర్ పార్టులు, రిపేరులు, లారీ సప్లై వంటివి) సంబంధించినదిగా ఉంటున్నది. 1990-2000 కాలంలో NH5 విస్తరణ కొఱకు చాలా నిర్మాణాలను పడగొట్టారు. తరువాత వాణిజ్యం జంక్షన్‌కు కాస్త దూరంగా పెద్ద పెద్ద భవనాలలోకి మారింది.
[మార్చు] సమస్యలు
వివిధ జిల్లాలు (కృష్ణా, పశ్చిమ గోదావరి), నియోజక వర్గాలు, మండలులు (బాపులపాడు, ఏపూరు), పంచాయితీల (బాపులపాడు, ఏపూరు, తాళ్ళమూడి, అప్పనవీడు)మధ్య పట్టణం విభజింపబడి ఉండడం వలన పౌర సమస్యల పరిష్కారానికి, పట్టణం అభివృద్ధికి అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. హనుమాణ్ జంక్షన్‌కు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్‌కు "నూజివీడు రైల్వేస్టేషన్" అని పేరు (అప్పటికి హనుమాన్ జంక్షన్ జనావాసంగా అభివృద్ధి కాలేదు)
[మార్చు] వ్యవసాయం
వరి, చెరకులతో పాటు ఆయిల్ పామ్ సాగు కూడా పెరిగింది. అంపాపురం వద్ద నూనెమిల్లులో పామాయిల్ ఉత్పత్తి జరుగుతున్నది.
[మార్చు] సినిమాల్లో
హనుమాన్ జంక్షన్ ను కథా కేంద్రంగా 2001 లో హనుమాన్ జంక్షన్ అనే తెలుగు సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హనుమాన్ జంక్షన్ గా చిత్రీకరించిన ఊరికి అసలు హనుమాన్ జంక్షన్ కీ పోలికే లేదు. మలయాళంలో విజయవంతమైన తేన్‌కాశి పట్టణమ్ సినిమాను తెలుగుసేతే ఈ సినిమా. ఎం.రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, అర్జున్, స్నేహ మరియు లయ నటించారు.
నియోజక వర్గాల పునర్విభజన అనంతరం హనుమాన్ జంక్షన్ ఇప్పుడు గన్నవరం శాసనసభ నియోజకవర్గంలో ఉంది.
|
|
|
|---|---|
| సీతారామపురం · పెరికీడు వంతెన · అంపాపురం · ఆరుగొలను · బండారుగూడెం · బాపులపాడు · హనుమాన్ జంక్షన్ · బిల్లనపల్లి · బొమ్ములూరు · బొమ్ములూరు ఖంద్రిక · చిరివాడ · దంటకుంట్ల · కాకులపాడు · కానుమోలు · కోడూరుపాడు · కొత్తపల్లి · కొయ్యూరు · కురిపిరాల · మడిచెర్ల · మల్లవల్లి · ఓగిరాల · రంగయ్య అప్పారావు పేట · రామశేషాపురం · రామన్నగూడెం · రంగన్నగూడెం · రేమల్లె · శేరినరసన్నపాలెం · సింగన్నగూడెం · తిప్పనగుంట్ల · వీరవల్లి · వేలేరు · వెంకటాపురం · వెంకట్రాజుగూడెం · వైకుంఠ లక్ష్మీపురం |