Jump to content

అమ్రాబాద్ పులుల అభయారణ్యం

అక్షాంశ రేఖాంశాలు: 16°21′21″N 78°50′01″E / 16.3557°N 78.8335°E / 16.3557; 78.8335
వికీపీడియా నుండి
అమ్రాబాద్ పులుల అభయారణ్యం
అమ్రాబాద్ పులుల అభయారణ్యం ప్రవేశద్వారం
పటం
పటం
తెలంగాణ రాష్ట్రంలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం
Locationనల్గొండ జిల్లా, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
Coordinates16°21′21″N 78°50′01″E / 16.3557°N 78.8335°E / 16.3557; 78.8335
Area2,611.4 కి.మీ2 (1,008.3 చ. మై.)
Established2014-15

తూర్పు కనుమల్లోని నల్లమల కొండల్లో ఉన్న అమ్రాబాద్ పులుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు పులుల అభయారణ్యాల్లో ఒకటి. ఒకప్పుడు తూర్పు కనుమలు, మధ్య భారతదేశంలోని అడవులు కలిసిపోయి ఉండేవి. కాలక్రమేణా ఈ రెండు ప్రాంతాల్లోని అడవులు విడిపోయి ఇప్పుడు ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాయి. అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ అభయారణ్యం ఎత్తైన కొండలు, లోయలు, కొండమార్గాలు, దట్టమైన అడవులతో నిండి ఉంది. ఈ ప్రాంతంలో చెంచు తెగ వారు అధికంగా నివసిస్తారు. ఇక్కడి అడవులు అయనవృత్తీయ పొడి ఆకురాల్చే (ట్రాపికల్ డ్రై డెసిడ్యువస్) రకానికి చెందినవి. సమృద్ధిగా వృక్ష, జంతు సంపదతో పాటు ఇక్కడ శ్రీశైలం, ఉమామహేశ్వరం, మద్దిమడుగు, అక్కమహాదేవి గుహలు, కడలి వనం గుహలు, మల్లెలతీర్థం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టత ఉన్న ప్రదేశాలు ఉన్నాయి.[1]

నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లో 2,611.4 కి.మీ2 (1,008.3 చ. మై.) మేర విస్తరించి ఉన్న అమ్రాబాద్ అభయారణ్యం భారత్‌లోని అతిపెద్ద పులుల అభయారణ్యాల్లో ఒకటి. మొత్తం 51 పులుల అభయారణ్యాల్లో కోర్ విస్తీర్ణం దృష్ట్యా ఇది రెండవ స్థానంలో ఉండగా, మొత్తం విస్తీర్ణంలో ఆరవ స్థానంలో ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, అచ్చంపేట అటవీ డివిజన్‌లు, నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అటవీ డివిజను కలిపి ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. 1983 నుంచి నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యంగా ఉన్న ఈ ప్రాంతాన్ని, 2014-15లో తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో విభజించి తెలంగాణలో ఉన్న భాగాన్ని అమ్రాబాద్ పులుల అభయారణ్యంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న భాగాన్ని నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యంగానే ఉంచారు. కృష్ణా నదిపై రెండు ప్రధాన ఆనకట్టలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 140 కి.మీ. దూరంలో ఉంది.[1][2] అమ్రాబాద్ అభయారణ్యానికి నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉంటుంది. లోయల్లోని ఏర్లు, సరస్సులు ఏడాది పొడవునా నీటితో ఉంటాయి; వేసవిలో మెట్ట ప్రదేశాల్లోని జలవనరులు అడుగంటిపోతాయి. అందువల్ల ఇక్కడి జంతువులు వర్షాకాలంలో మెట్ట ప్రదేశాల్లోనూ, వేసవిలో లోయల్లోనూ ఎక్కువగా ఉంటాయి.

2022లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చేపట్టిన సర్వేలో అభయారణ్యంలో దాదాపు 16 పులులను గుర్తించారు. వీటిలో 12 ఇక్కడే నివాసం ఉంటుండగా 4 అభయారణ్య వనరులను ఉపయోగించుకుంటున్నట్టు భావిస్తున్నారు.[3]

జీవవైవిధ్యం

[మార్చు]

వృక్షజాలం

[మార్చు]

ఈ అభయారణ్యం మొత్తం ఒకే రకమైన వర్షపాతం, ఎత్తు, మట్టి ఉండవు. అందువల్ల ఇక్కడ కనపడే మొక్కలు, చెట్లలో మితంగా వైవిధ్యం కనిపిస్తుంది. 109 కుటుంబాలకు చెందిన 1400 రకాల వృక్షజాతులు ఇక్కడ ఉన్నాయి. వీటిలో 88 కుటుంబాలకు చెందిన 353 జాతుల్లో ఔషధ గుణాలు ఉన్నట్లు గుర్తించారు. అభయారణ్యంలోని 30% ప్రాంతంలో దట్టంగా, 20% ప్రాంతంలో చెదురు మదురుగా గడ్డి ఉంది. ప్రధాన చెట్లు ఇనుమద్ది లేదా మొసలి బెరడు చెట్టు, యేపి (ఏపి) (హార్డ్‌విక్కియా బినాటా), ఇప్ప, బీడీ ఆకు చెట్టు, అడవి బిక్కి, సిరిమాను చెట్టు, బిల్లుడు (క్లోరోక్సిలాన్ స్వీటెనియా), టేకు, తాండ్ర చెట్టు.[2]

జంతుజాలం

[మార్చు]

క్షీరదాలు

[మార్చు]

అమ్రాబాద్ పులుల అభయరణ్యంలో 80కి పైగా జాతుల క్షీరదాలను గుర్తించారు. వాటిలో పులి, చిరుత, అడవి కుక్క, తోడేలు వంటి పెద్ద మాంసాహర జంతువులు ఉన్నాయి. అడవి పిల్లి, నామాల పిల్లి, వివిధ జాతుల పునుగుపిల్లులు (స్మాల్ ఇండియన్ సివెట్, ఇండియన్ పామ్ సివెట్) ఇక్కడ ఉండే చిన్న మాంసాహార జంతువుల్లో కొన్ని. సర్వభక్షకాల్లో స్లాత్ ఎలుగుబంటి, తేనె కుక్క (హనీ బ్యాడ్జర్), అడవి పంది ఉన్నాయి. వివిధ రకాల జింకలు - చింకారా, నీల్‌గాయ్, కృష్ణ జింక, కొండ గొర్రె (ఫోర్ హార్న్డ్ యాంటిలోప్), దుప్పి, సాంభర్ జింక - ఉన్నాయి. వానర జాతుల్లో హనుమాన్ లంగూర్, బానెట్ కోతి, రీసస్ కోతి ఉన్నాయి.[2]

పక్షులు

[మార్చు]

ఈ అభయారణ్యంలో 303 పైగా పక్షి జాతులను గుర్తించారు. వీటిలో ప్రధానమైనవి గద్ద, పావురం, కోకిల, వడ్రంగి పిట్ట, డ్రాంగో, పిగిలి పిట్ట (బుల్బుల్), ఫ్లవర్ పెకర్, అడవి రైతు (గ్రే హార్న్‌బిల్), సన్ బర్డ్, స్విఫ్ట్, లకుముకి పిట్ట, గుడ్లగూబ, వివిధ రకాల బార్బెట్లు, జిట్టలు, చకోరపక్షులు, గోరింక, త్రష్, వివిధ రకాల కొంగలు. ఇక్కడ కనిపించే స్థానిక పక్షి జాతుల్లో ఎల్లో త్రోటెడ్ బుల్బుల్, బ్లూ రాక్ త్రష్ విలక్షణమైనవి.[2]

సరీసృపాలు

[మార్చు]

ఈ ప్రాంతంలో 54 వివిధ జాతుల సరీసృపాలను గుర్తించారు. రక్త పింజరి, ఇసుక పింజరి, నాగుపాములు ఈ అడవుల్లో కనిపించే అత్యంత విషపూరిత పాములు. కట్లపాములు, నల్ల తాబేళ్ళు, ఉడుములు, ఊసరవెల్లులు, తొండలు, కొండ చిలువలు, పసరిక పాములు మొదలైన సరీసృపాలు కూడా కనిపిస్తాయి.[2]

ఉభయచరాలు, కీటకాలు

[మార్చు]

వివిధ రకాల కప్పలు సహా 20 జాతుల ఉభయచరాలు ఇక్కడ కనిపిస్తాయి.[2]

కీటకాల్లో లెపిడాప్టెరా ఆర్డర్‌కు చెందిన సీతాకోకచిలుకలు, చిమటలు అత్యధికంగా కనిపిస్తాయి. 100 జాతుల సీతకోకచిలుకలు, 57 జాతుల చిమటలు ఈ అభయారణ్యంలో ఉన్నాయి. ఇవే కాక మిడతలు, గొల్లభామలు, రకరకాల పురుగులు, ఈగలు, చెదలు, సాలెపురుగులు ఇక్కడ కనిపిస్తాయి.[2]

ప్రకృతి పర్యాటకం

[మార్చు]

పర్యాటకుల కోసం మన్ననూరులో వసతి సదుపాయం, మన్ననూరు, ఫరాహాబాదు ప్రాంతాల్లో సఫారీ ఏర్పాట్లు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Nautiyal, J. P., Lone, A. M., Ghosh, T., Malick, A., Yadav, S.P., Ramesh, C., & Ramesh, K. (2023). An Illustrative Profile of Tiger Reserves of India. EIACP Programme Centre, (MoEFCC), Wildlife Institute of India, Chandrabani, Dehradun-248001, Uttarakhand, India. pp – 314.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Amrabad Tiger Reserve". amrabadtigerreserve.com. Retrieved 2024-07-11.
  3. Qamar Qureshi, Yadvendradev V. Jhala, Satya P. Yadav and Amit Mallick (eds) 2023. Status of tigers, co-predators and prey in India, 2022. National Tiger Conservation Authority, Government of India, New Delhi, and Wildlife Institute of India, Dehradun ISBN No: 81-85496-92-7