ఆచంట వేంకటరత్నం నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆచంట వేంకటరత్నం నాయుడు (28-5-1935 - 25-11-2015) ఒక రంగస్థల నటుడు.

జీవితం[మార్చు]

ఈయన 1935, మే 28 వ తేదీన కృష్ణాజిల్లా, కొండపల్లిలో జన్మించారు. శ్రీమతి వెంకట నరసమ్మ, ఆచంట వేంకటేశ్వర్లు వీరి త‍ల్లిదండ్రులు. వెంకటరత్నం నాయుడుగారి తండ్రి ఆచంట వెంకటేశ్వర్లు నాయుడు గారు రంగస్థల కళాకారుడు. అదే వారసత్వంగా ఈయనకు అబ్బింది. గుంటూరు హిందూ స్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి. పాసైన ఆచంటగారు కొంతకాలం ఆయుర్వేద మందులకి రిప్రెజెంటేటివ్‌గా పనిచేసి, వృత్తికీ, ప్రవృత్తికీ సమన్వయం కుదరక వృత్తిని వదులుకొని నాటకాలలో ప్రవేశించారు.తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే నీతిశాస్త్రంలో శ్లోకాలు, పద్యాలు కంఠస్థం చేసి, స్పష్టమైన వాచికంతో, చక్కటి గాత్రంతో పాడుతుంటే స్కూల్లో ఉపాధ్యాయులు ప్రశసించేవారు. కేవలం పద్యనాటకమేకాక అనేక సాంఘిక నాటకాల్లో కూడా ఆచంట తమ ప్రతిభా పాటవాలను ఆంధ్ర దేశ ప్రజలకి తెలియజేశారు.

గుంటూరు నాట్యసమితి ప్రదర్శించిన రామరాజు, నాయకురాలు, అపరాధి వంటి నాటకాలతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తనకంటూ ఓ ముద్ర నేర్పరుచుకున్న నాయుడి ప్రతిభ చూసిన పలు నాటక సంస్థలు ఆయనకి పౌరాణిక చారిత్రక నాటకాల్లో కూడా ప్రధాన పాత్రలను ఇచ్చి ప్రోత్సహించాయి.

ఆంధ్ర లలిత కళాపరిషత్ ప్రదర్శించిన బొబ్బిలినాటకంలో హైదర్‌జంగ్, తులాభారం నాటకంలో వసంతకుడు, సక్కుబాయి నాటకంలో కాశీపతి, రామాంజనేయ యుద్ధం లో యయాతి, హరిశ్చంద్ర లో విశ్వామిత్ర మొదలైన పాత్రలతో విజయదుందుభి మోగించారు.మయసభ ఏకపాత్రాభినయం నాయుడిగారి నట జీవితంలో ఒక మైలురాయి. సాత్విక పాత్రలకంటే తామస పాత్రలు ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనప్రతిభకు మెచ్చిన అనేక సంస్థలే కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సన్మానాలు, సత్కారాలతో ఆయనని అభినందించింది.

ఈలపాట రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయ రాజు, ఎ.వి. సుబ్బారావు, మాధవపెద్ది సత్యం, పీసపాటి నరసింహమూర్తి మొదలైన ఉద్ధండులైన 40 మంది నటులతో ఒక టీమ్‌గా 'తులసీజలంధర' నాటకం ప్రదర్శిస్తే కనకవర్షం కురిసిందట.ఈ నాటకాన్ని ఆంధ్రదేశంలోనే కాక,మద్రాసు, బెంగళూరు, కలకత్తా, ఖరగ్ పూర్,ఢిల్లీ లలో కూడా ప్రదర్శించి తెలుగు భాష తెలియని ప్రేక్షకులను కూడా అలరించారు.

కేవలం రంగస్థలమేకాదు హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమైన 'తులసీ జలంధర' లో జలంధరుడిగా, సావిత్రి నాటకంలో యమధర్మరాజుగా, తన ప్రతిభాసామర్థ్యాన్ని ప్రదర్శించారు.అంతేకాకుండాకె.బి.తిలక్ దర్శకత్వం వహించిన కొల్లేటి కాపురం లోనూ,భూమికోసం,పండంటి జీవితం, మోహన రాగం, శ్రీ దత్త దర్శనం, వంటి అనేక చలనచిత్రాలలోనూ ఎన్నోమంచి పాత్రల్ని పోషించారు. స్వదేశంలోనే కాదు, మారిషస్ మహాసభల్లో కూడాఆచంట వారి హూంకారం వినబడింది.

ఇలా రంగస్థల, టి.వి.,చలనచిత్ర మాధ్యమాల లో తన నట విశ్వరూపాన్ని చూపిన ఆచంట వేంకటరత్నం నాయుడు గా‌రికి అందని గౌరవం లేదు. రంగస్థలం మీద, కనకాభిషేక సత్కారాల్ని అందుకొన్న రంగస్థల శ్రీనాధుడు ఆయన. స్వర్ణకంకణాలు, రజిత పాత్రలు, పట్టుబట్టలు, కాశ్మీరు శాలువలు....

ఈయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతిష్టాత్మకరమైన 'ఎన్.టి.ఆర్.' రంగస్థల పురస్కారం తో సత్కరించి, జీవితమంతా నాటకంతో, నటనతో మమేకమై గడిపిన ఈ 'రంగస్థల రారాజు' 2015 నవంబరు 25వ తేదీన మరణించారు

మూలాలు[మార్చు]