కళా ఉద్యమం
కళా ఉద్యమం (ఆంగ్లం: Art Movement) అనగా ఒక కళాకారుల సమూహం చే కళ లోని ఒక ప్రత్యేక సిద్దాంతాన్ని లేదా ఒక ఆదర్శాన్ని నిర్ధారిత కాలం వరకూ ఆచరించబడి, విస్తరింపబడ్డ ఒక రకమైన శైలి లేదా ప్రబలమైన ప్రవృత్తి.[1]
రినైజెన్స్
[మార్చు]రినైజెన్స్ ఐరోపా ఖండంలో 14-17వ శతాబ్దాలలో ఏర్పడ్డ ఒక సాంస్కృతిక/రాజకీయ/ఆర్థిక/కళా ఉద్యమం. మధ్య యుగాలు అప్పటికే అంతానికి రావటం, తత్వశాస్త్రం, రచన, కళను పునరుద్ధరించటం; ఈ కళకు శాస్త్రీయత ఆపాదించబడటం, కళాభ్యాసంలో ఇది ఒక భాగం కావటంతో రినైజెన్స్ ఆసక్తిని నెలకొల్పింది. మధ్యయుగాలకు, ఆధునిక ఐరోపాకు వారధి వేసిన కీర్తి రినైజెన్స్ సొంతం చేసుకొంది. అనేక మేధావులు, రచయితలు, రాజనీతిజ్ఞులు, శాస్త్రవేత్తలు, కళాకారులు రినైజెన్స్ కాలంలో వృద్ధి లోకి వచ్చారు. రినైజెన్స్ సమయంలో ప్రపంచాన్వేషణ పెరగటం తో, ఐరోపా వాణిజ్యం ఇతర దేశాలకు, వారి సంస్కృతులకు ఆహ్వానం పలికింది.[2]
ప్లేగు వ్యాధితో ఐరోపాలో పెద్ద ఎత్తులో సంభవించిన మరణాల పిమ్మట ప్రాచీన గ్రీకు భాష, లాటిన్ సాహిత్యాల పై ఆసక్తి పెరగటం, గూటెన్ బర్గ్ లో ముద్రణాలయం స్థాపించబడటం, ఈ సాహిత్యం ఆ ముద్రణాలయం ద్వారా విస్తరించబడటం, పాఠకులు పెరగటం రినైజెన్స్ కు దారులు వేశాయి. హ్యూమనిజం, న్యాచురలిజం, రియలిజం వంటి వాటి యొక్క ప్రభావం కూడా రినైజెన్స్ పై తగినంత పడింది. అందుకే రినైజెన్స్ లో వాస్తవికత, సహజత్వం పాళ్ళు కొట్టొచ్చినట్టు కనబడతాయి.[3]
లియొనార్డో డా విన్సీ
[మార్చు]మైఖెలేంజిలో చే చెక్కబడిన డేవిడ్ శిల్పం మానవ శరీర నిర్మాణం, గాలిలో ఎగురగలిగే విధానం, మొక్కల, జంతువుల శరీర నిర్మాణం వంటి పలు శాస్త్రాలను అధ్యయనం చేస్తున్న డా విన్సీకి చిత్రలేఖనం చేయటానికి సమయం ఉండేది కాదు. అయిననూ అతని చే చిత్రీకరించబడ్డ మోనా లీసా, ద వర్జిన్ ఆఫ్ ద రాక్స్, ద లాస్ట్ సప్పర్ వంటి కళాఖండాలు అతనికి పేరు తెచ్చాయి.
మైఖెలేంజిలో
[మార్చు]మైఖేలేంజిలో చెక్కిన శిల్పాలు పీటా (Pieta), డేవిడ్ లు సాంకేతిక సామర్థ్యం, మానవ శరీర నిర్మాణంలో కొలతలు కలగలిపితే అవతరించే అద్భుతమైన సృష్టికి, వాటి ద్వారా వ్యక్తీకరించగలిగే భావోద్వేగాలకు మచ్చుతునకలుగా మిగిలిపోయాయి. సిస్టీన్ ఛాపెల్ లో మైఖేలేంజిలో వేసిన మ్యూరల్ చిత్రపటం అత్యంత సంక్లిష్టమైన క్రిస్టియన్ థియాలజీని నియోప్లాటోనిక్ ఆలోచనాతత్వాన్ని కలబోతకు కీర్తిప్రతిష్ఠలను అందుకొంది.
రఫాయెల్
[మార్చు]రఫాయెల్ చిత్రీకరణ అయిన ద స్కూల్ ఆఫ్ ఏథెన్స్ అరిస్టాటిల్, ప్లేటో వంటి తత్వవేత్తల ఆలోచనలను కొందరు మేధావులు చర్చిస్తోన్న చిత్రపటం. తొలుత రఫాయెల్ పై లియొనార్డో ప్రభావం కనబడినా, తర్వాత రఫాయెల్ ఈ ప్రభావం నుండి బయటపడి సామరస్యం, స్పష్టతలతో తనదైన శైలులను తీసుకువచ్చాడు.
చిత్ర/శిల్పకళలకు మాత్రమే పరిమితం కాకుండా హై రినైజెన్స్ సంగీతం, భవన నిర్మాణ శాస్త్రాలకు సైతం వ్యాపించింది.
రినైజెన్స్ మ్యాన్
[మార్చు]డా విన్సీ, మైఖేలాంజెలో, రఫాయెల్ ల మధ్య పోటీ హై రినైజెన్స్ కు దారి తీసింది. ముగ్గురి మధ్యన గట్టి పోటీ ఉన్నను అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యుడైన డా విన్సీ యే రినైజెన్స్ మ్యాన్ గా గుర్తింపబడ్డాడు. మైఖెలేంజిలో తన సృజనా శక్తి, మానవ శరీరం భావోద్రేకాల వ్యక్తీకరణకు ఉపయోగించదగ్గ ఒక వాహనం అని తెలిపే ప్రాజెక్టులు చేపట్టి; రఫాయేల్ శాస్త్రీయ అంశాలైన సామరస్యం, అందం, నైర్మల్యాలతో డా విన్సీకి గట్టి పోటీ ఇచ్చారు.
-
డా విన్సీ చే చిత్రీకరించబడిన మోనా లీసా. ఈ చిత్రపటంలో పలు చారిత్రక ప్రశ్నలు, సాంకేతిక అంశాలు ఉండటంతో బాటు, ఇది అపహరణకు గురి కావటం, తర్వాత దొరకటంతో ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన చిత్రపటంగా మిగిలిపోయింది
-
డ విన్సీ చే చిత్రీకరించబడిన The Virgin of the Rocks
-
మైఖెలేంజిలో చే రినైజెన్స్ శైలిలో చెక్కబడిన శిల్పం Pieta
-
మైఖేలేంజిలో చే రినైజెన్స్ శైలిలో చెక్కబడిన డేవిడ్ శిల్పం
-
రఫాయెల్ చే రినైజెన్స్ శైలిలో చిత్రీకరించబడ్డ The School of Athens
మ్యానరిజం
[మార్చు]1520-1580 వరకు మ్యానరిజం చిత్రకళను శాసించింది.[4] మ్యానరిజం చూసేందుకు రినైజెన్స్ ను పోలి ఉన్నా, దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హై రినైజెన్స్ తర్వాతి కాలంలో ఊపందుకొన్న మ్యానరిజాన్ని అందుకే లేట్ రినైజెన్స్ అని కూడా అంటారు. రినైజెన్స్ లో వలె మతం, పౌరాణికం నుండి ప్రేరణ పొందిన చిత్రలేఖనాలే అయిననూ, జాగ్రత్తగా పరిశీలిస్తే మ్యానరిజం శైలి సుస్పష్టం అవుతుంది. అసాధ్య భంగిమలలో వంచబడిన మానవ శరీరాలు, పొడవైన మెడలు, సాధారణ జీవితంలో లేనంత ప్రకాశవంతమైన మేని ఛాయ వంటివి మ్యానరిజంలో సర్వసాధారణం. చిత్రలేఖనం యొక్క నేపథ్యాలు కూడా సుస్పష్టంగా ఉండవు. పరిమాణాలను, దృక్కోణాలను వక్రీకరించి దృశ్యంలో నాటకీయత తేవటమే మ్యానరిజం. ఇటాలియన్ భాషలో మ్యానెరా అనగా శైలి (style) అని అర్థం. కాంతివంతమైన రంగులు, సునిశితమైన వివరాలు, ఇండివిడ్యువలిజం, మానవ శరీర నిర్మాణం వంటి వాటిని రినైజెన్స్ నుండి అరువు తెచ్చుకొన్ననూ, లోపం లేని రినైజెన్స్ నుండి పక్క త్రోవ పట్టారు మ్యానరిస్టులు. శరీర నిర్మాణాన్ని, భంగిమలను, రంగులను అతిశయించి, చిత్రలేఖనంలో సృజనాత్మకత పెంచారు. మ్యానరిజం చిత్రలేఖనాలలో ఘర్షణ ఉంటుంది. ఏదో జరగబోతోందన్న సంజ్ఙలు ఈ చిత్రలేఖనాలు మనకు తెలుపుతాయి. లియొనార్డో డా విన్సీ చిత్రీకరించిన, టింటోరెట్టో చిత్రీకరించిన The Last Supper చిత్రలేఖనాలే రినైజెన్స్, మ్యానరిజం శైలులకు మచ్చుతునకలు. బరోక్ కళా ఉద్యమం రాకతో మ్యానరిజానికి తెరపడింది.
-
డా విన్సీ చే రినైజెన్స్ శైలిలో చిత్రీకరించబడ్డ The Last Supper. దృక్కోణం నేరుగా (యేసుకు ఎదురుగా), చక్కని అమరిక, కొలమానాలతో సన్నివేశం చాలా ప్రశాంతంగా ఉన్నట్లు డా విన్సీ చిత్రీకరించాడు
-
టింటోరెటో చే మ్యానరిజం శైలిలో చిత్రీకరించబడ్డ The Last Supper. దృక్కోణం పైకప్పు ఒక మూల నుండి ఉన్నట్లు, చాలా సన్నివేశం చాలా కోలాహలంగా ఉన్నట్లు టింటోరెటో చిత్రీకరించాడు. పై నుండి ఈ దృశ్యాన్ని వీక్షిస్తున్న దేవదూతలు సాధారణ పరిమాణం కన్నా పెద్దగా చిత్రీకరించటం జరిగింది
బరోక్
[మార్చు]15వ శతాబ్దంలో క్రైస్తవ మతం పై వేయబడిన ప్రశ్నల నేపథ్యంలో బరోక్ కళా ఉద్యమం ఉద్భవించింది.[5] మార్టిన్ లూథర్ కేథలిక్ చర్చిని ప్రశ్నించటంతో మతపరమైన సంస్కరణల ప్రతిపాదన, విమర్శ, వంటివి మొదలయ్యాయి. దీనితో కేథలిక్ చర్చి, క్రైస్తవులను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నించింది. విద్యావంతులైన కొందరిని ఆకర్షించటం కంటే విద్యావంతులు కాని చాలా మందిని ఆకర్షించటమే మేలని తలచిన కేథలిక్ చర్చి, ఈ కార్యానికి కళలను మాధ్యమంగా ఎంచుకొంది. ఈ ఎంపికే బరోక్ కళకు బీజాలు వేసింది. 1600 నాటికి రోమ్, ఇటలీ లలో బరోక్ పెయింటింగ్ వేళ్ళూనుకు పోయింది. 1750 వరకూ ఐరోపా ఖండం లోని ఇతర దేశాలకు విస్తరించింది. దైవం పై నమ్మకాన్ని అందమైన, గొప్ప చిత్రలేఖనాలతో వ్యక్తపరిచేందుకు కళాకారులకు ప్రోత్సాహం లభించింది. తీవ్రమైన వ్యక్తిగత భావాలు, మత మార్పిడులు, మతపరమైన దృష్టి, మృత్యువు, బలిదానం వంటివి బరోక్ పెయింటింగ్ లో కనబడేవి. చిత్రీకరించబడే అంశాలు ఒకదాని ప్రక్కన ఒకటి విడివిడిగా కాకుండా, ఒకదానిపై మరొకటి ఉండేలా చిత్రీకరించబడటం జరిగింది. ముదురు రంగులు, రియలిజం బరోక్ పెయింటింగ్ లో కనబడతాయి. వాస్తవ జీవితంలో జరిగే నాటకీయ సన్నివేశాలను సైతం బరోక్ చిత్రీకరించింది. రెంబ్రాండ్ట్, రూబెన్స్, కారవాజియో, వెర్మీర్ వంటి వారు బరోక్ పెయింటింగ్ లో సిద్ధహస్తులు. బైబిల్ లోని ఘట్టాల చిత్రీకరణ ద్వారా, విద్యార్థులలో పాపపుణ్యాల విచక్షణ, నైతికత పెంచటానికి బరోక్ పెయింటింగులు చూపబడేవి. బరోక్ పెయింటింగ్ లో కొలతలు కచ్చితంగా ఉండేవి. హృదయాంతరాలలో ఆధ్యాత్మికత నాటటం, చిత్రీకరించబడిన దృశ్యంతో వీక్షకుడికి సంబంధం నెలకొల్పటం, మానవుడిపై దైవం యొక్క కరుణ గురించి తెలపటం బరోక్ కళాకారుల ప్రధాన్ ఉద్దేశాలుగా కనబడతాయి. ఒక శక్తివంతమైన మత సందేశాన్ని, అందమైన చిత్రలేఖనంతో నిరక్షరాస్యులకు బరోక్ కళాకారులు తెలిపారు. చరిత్ర పుటల్లో మాత్రమే బరోక్ పెయింటింగ్ భద్రంగా ఉందనుకొన్నా, ఈ శైలిలోని సాంకేతికాంశాలు, భావాలు ఈ నాటికి వాడబడుతోన్నాయనటం అతిశయోక్తి కాదు.
-
పీటర్ పాల్ రూబెన్స్ చే చిత్రీకరించబడ్డ గెలీలియో
-
మేరీ మాత జననం
-
సాబిన్ వనితల బలాత్కారం
రొకోకో
[మార్చు]క్లాసికిజం
[మార్చు]నియో క్లాసికిజం
[మార్చు]1760 లో ఏర్పడిన నియో క్లాసికిజం, 1780-90 లలో పతాక స్థాయి చేరుకొని ఐరోపా, ఉత్తర అమెరికా లలో 1850 వరకు కొనసాగింది.[6][7] అదివరకు భావోద్రేకాలతో ఉత్తేజితమై ఉన్న బరోక్ శైలి నుండి వేర్పడుతూ, శాస్త్రీయ అంశాలను పున:శ్చరణ చేసింది నియో క్లాసికిజం. దేశభక్తి, త్యాగం, ధైర్యం, గౌరవం, మానవ హక్కులు వంటి అంశాలను నియో-క్లాసికిజం చిత్రీకరించిననూ, బరోక్ శైలికి నియో-క్లాసిక్ శైలి పూరిగా భిన్నంగా ఉంటుంది. రొకోకో శైలిలో బలహీనమైన పాత్రలను, భౌతికతను పరిగణించకుండా రినైజెన్స్ వలె సమరూపత (symmetry), పరిమాణం, సారళ్యత వంటి వాటిపై దృష్టిని కేంద్రీకరించాయి. సాంప్రదాయిక కూర్పు, సునిశితమైన వివరాలు, ఘనమైన రేఖలకు నియో-క్లాసికిజం పెట్టింది పేరు. శాస్త్రీయ, పౌరాణిక దృశ్యాలను సమకాలీన వేషధారణ/వాతావరణంలో నియో-క్లాసికిజం చిత్రీకరించింది. సామరస్యత, స్పష్టత, నిగ్రహం, సార్వత్రికత, ఆదర్శవాదాలను నియో క్లాసికిజం రేకెత్తిస్తుంది. పురావస్తు శాస్త్రం అప్పటి కాలంలో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న సమయం కావటంతో కళ నియో-క్లాసికిజం బాట పట్టింది. కళాకారులతో బాటు సాధారణ ప్రజలు కూడా పురాతన కళపై అభిమానాన్ని పెంచుకొన్నారు. గ్రీకు/రోమను కళ, ప్రకృతి కన్నను మేలైన సృష్టికర్త అని అప్పటి పురావస్తు శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు నియో-క్లాసికిజానికి ఊతమిచ్చాయి. నియో-క్లాసికిజం రియలిజం, ఐడియలిజం ల సంగమం అని చెప్పవచ్చును. నియో-క్లాసికిజం సాహిత్యం, భవన నిర్మాణం వంటి కళలకు సైతం విస్తరించాయి. రొమాంటిసిజం ప్రారంభమైనను, నియో-క్లాసిక్జం మాత్రం తన ఉనికిని కోల్పోలేదు.
-
అంటోన్ రఫాయెల్ మెంగ్స్ చే చిత్రీకరించబడ్డ The Judgement of Paris
-
పోంపియో బాటోని చే చిత్రీకరించబడ్ద Diana and Cupid
-
ఘెయోర్ఘే టట్టరెస్కు చే చిత్రీకరించబడ్డ Modern Romania
రొమాంటిసిజం
[మార్చు]అమెరికావి సంయుక్త రాష్ట్రాలులో 1776 లో జరిగిన విప్లవం, ఫ్రాన్సులో 1789 లో జరిగిన విప్లవం ఈ రెండు, రాజరికాన్ని ధిక్కరించి, ప్రజాపాలన కాంక్షించాయి. వీటి నేపథ్యంలో ఉద్భవించిన కళా ఉద్యమమే రొమాంటిసిజం. రొమాంటిసిజం అంటే ఒక జంట పై బాణం సంధించటానికి సిద్ధంగా ఉన్న మన్మథుని చిత్రపటాలు కాదు. రొమాంటిసిజం అనగా తీవ్రమైన భావావేశం (passion). చిత్రకారులు వారు గట్టిగా నమ్మే, వారి మెదిలే భావనలను చిత్రీకరిస్తారు. తీవ్రమైన ఈ వ్యక్తిగత భావ వ్యక్తీకరణ ఏ రసానికి అయిన చెందినది అయి ఉండవచ్చు. వీక్షకుడిలో భావనలు రేకెత్తిస్తుంది. హృదయం గల కళ (Art with Heart) గా రొమాంటిసిజం పేరు పొందింది. రొమాంటిసిజం చిత్రపటాల లోని నాటకీయత విప్లవలతో ప్రభావితం అయినవి.[8]
1800 నుండి 1860 వరకు రొమాంటిసిజం ఉన్నత దశకు చేరుకొంది. రాజకీయ, ఆర్థిక, సాంఘిక తిరుగుబాటులతో పాశ్చాత్య దేశాలు అట్టుడికి పోతోన్న సమయం అది. యావత్ కళా ప్రపంచాన్ని ఈ నేపథ్యం లోని సన్నివేశాలు, వాటి వెనుక భావావేశాలు శాసించాయి. చివరకు సృష్టిని సైతం రొమాంటిసిజం భయానకమైందిగానూ, సర్వశక్తిమంతమైందిగానూ చిత్రీకరించింది.
-
థియోడర్ గెరికాల్ట్ చే చిత్రీకరించబడ్డ The Raft of the Medusa. ఫ్రాన్సు నుండి ఆఫ్రికా బయలుదేరిన నావ ఒకటి దారి తప్పడంతో ఆకలిదప్పులతో 15 ప్రయాణీకులలో 13 మంది చనిపోయారు. ఆ ప్రయాణీకుల తీవ్రమైన భావావేశాలను ఈ కళాఖండంలో చూపటం జరిగింది
-
ఫ్రాన్సెస్కో గోయా చే చిత్రీకరించబడ్డ The Nude Maja. అప్పటి వరకు పాశ్చాత్య చిత్రకళలో న్యూడిజం ఉన్ననూ వివస్త్రలుగా ఉన్న వారు వీక్షకుల కంటిలోకి నేరుగా చూసేవారు కాదు. ఈ చిత్రపటం లోని మజ అనే యువతి వివస్త్ర అయ్యి కూడా నేరుగా వీక్షకుల కంటి లోకి చూడటం వివాదాస్పదమైంది
రియలిజం
[మార్చు]1848 లో ఫ్రెంచి విప్లవం తర్వాత చిత్రకళలోకి రియలిజం ప్రవేశించింది.[9] గుస్తావే కోర్బెట్ అనే కళాకారుడు ఒక చిత్రలేఖనంలో సత్యదూరం కాని, ఉనికిగల వస్తువులు ఉండాలని నమ్మాడు. ఫ్రెంచి కళలో అత్యంత ప్రముఖ కళా ఉద్యమం అయిన రియలిజాన్ని నడిపించింది ఈ నమ్మకమే. ఫ్రెంచి విప్లవంతో బాటు పారిశ్రామిక విప్లవం ఐరోపా, లాటిన్ అమెరికా లను కుదిపేస్తున్న సమయంలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ రియలిజానికి బీజాలు వేశాయి. ప్రజలు ప్రభుత్వాల నుండి సంస్కరణలు రియలిజాన్ని 1880 ల వరకు కొనసాగేలా చేశాయి. రియలిస్టులు దృక్కోణానికి శాస్త్రీయత ఆపాదించిన వారిలో మొదటి తరం చిత్రకారులు. చార్లెస్ డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతం, బలవంతులదే మనుగడ (Survival of the Fittest) అనే అభిప్రాయం సిరి సంపదలలోని అసమతౌల్యాలను ఎత్తి చూపాయి. ఈ అసమతౌల్యానికి ప్రతిస్పందనగా కార్ల్ మార్క్స్ సమాన పంపకం, ఉద్యోగుల హక్కులను పెంచటం వంటివి చోటు చేసుకొన్నాయి. ఆగస్టు కామ్టే కారణం - ప్రభావం (Cause and Effect) మధ్య సంబంధాని తెలిపాడు. దీనికి పూర్వం మతం, తత్వము, వేదాంతం ఇవే పరమ సత్యాలుగా పరిగణించబడేవి. కానీ 1848 నుండి మనుషులు చూడగలిగే, స్పర్శించగలిగే, రుచి చూడగలిగే, వినగలిగే, అనుభూతి చెందగలిగే అంశాలే ఐహిక సత్యాలుగా పరిగణించబడ్డాయి. ఆ కాలంలో కళాకారులకు ఫ్రెంచి రాయల్ అకాడెమీ యొక్క మద్దతు అవసరం అయ్యేది. అకాడెమీ ప్రకారం మంచి కళ అందం, శాస్త్రీయ స్ఫూర్తి, ఫ్రెంచి నైతిక విలువలు కలిగి ఉండాలి. అయితే రియలిస్టు చిత్రకారులు ఆదర్శవంతం కాని, ఆధునిక యుగంలో మధ్య తరగతి/పేద ప్రజల దైనందిన దృశ్యాలను చిత్రీకరించి అకాడెమీ యొక్క ఈ నియమాలను అన్నింటినీ సవాలు చేసారు. ఆదర్శాలను పాటించాలి అనే అభిప్రాయానికి, అది వరకే ఉన్న రొమాంటిసిజం, నియోక్లాసికిజం అనే కళా ఉద్యమాలకు ప్రతిస్పందనగా రియలిస్టిక్ అంశాల చిత్రీకరణ కొనసాగింది. రియలిస్టికి అభిప్రాయాలు నవీన, శాస్తీయ ప్రపంచం యొక్క దృక్కోణం గా, మానవ హక్కులను పరిరక్షించేదిగా పరిగణించబడింది. ఉద్యోగుల జీవితాల సమస్యలను రియలిజం కళ్ళకు కట్టినట్లు చూపింది. సామాన్యుడి జీవితం లోని చిన్న చిన్న సంతోషాల నుండి కఠోర సత్యాల వరకు ఆవిష్కరించింది. రియలిజం శైలి మారుతోన్న సమయంలో ఉద్భవించిన కళా ఉద్యమం. క్లాసికిజం, రొమాంటిసిజం లను ధిక్కరించి రియలిస్టులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సునిశితింగా పరిశీలించి తమ ప్రత్యక్ష అనుభవాన్ని జోడించి సాంఘిక సమస్యలను చిత్రీకరించారు. కళాపరమైన సిద్ధాంతాల తిరస్కరణ, కేవలం మతపరమైన/పౌరాణిక అంశాల చిత్రీకరణ నుండి విరామం, అత్యల్ప ఆదర్శప్రాయాలు, సాంఘిక విమర్శ, శాస్త్రీయత జోడింపు వంటివి రియలిజం యొక్క ప్రధాన లక్షణాలు. రియలిస్టుల ప్రధాన లక్ష్యం మనుషులను, దృశ్యాలను ఉన్నవి ఉన్నట్లుగా చిత్రీకరించటం. తర్వాతి కాలంలో మనుగడ లోకి వచ్చిన ఇంప్రెషనిజం వంటి కళా ఉద్యమాలకు రియలిజం నాంది పలికింది.
గుస్తావే కోర్బెట్
[మార్చు]ఫ్రెంచి రియలిస్టు కళా ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న గుస్తావే కోర్బెట్ తన స్వస్థలంలో ఉన్న గ్రామీణ ప్రజలు, వ్యవసాయదారులను, ప్రకృతి దృశ్యాలను విరివిగా చిత్రీకరించాడు. రియలిస్టు శైలిలో కోర్బెట్ వేసిన చిత్రలేఖనాలు సలోన్ డి ప్యారిస్ లో ప్రదర్శింపబడి యావద్దేశాన్ని కుదిపి వేశాయి. ప్రత్యేకించి స్టోన్ బ్రేకర్స్, బరియల్ ఎట్ ఆర్నన్స్ వంటి రియలిస్టు చిత్రలేఖనాలు సంప్రదాయాల కు, ఆధునిక ఆలోచనా ధోరణులకు సవాళ్ళు విసిరాయి. విమర్శలను తిప్పికొడుతూ కోర్బెట్ ముందుకు సాగాడు. జీన్ ఫ్రాంకోయిస్ మిలెట్, హానరే డామియర్ వంటి వారికి స్ఫూర్తిని ఇచ్చాడు.
-
The Stone Breakers రాళ్ళను కొడుతోన్న ఒక వృద్ధుడు ఒక యువకుడిని చూపుతుంది. కోర్బెట్ వారి ముఖాలను చూపకుండా ఇది అందరి కథ అని తెలిపాడు. నిరుపేదల కష్టాలను, వారి శారీరక శ్రమను కోర్బెట్ ఇందులో చిత్రీకరించాడు
-
తమ బంధువు నిర్యాణం అయిన సందర్భంలో ఖననం చేసే సన్నివేశాన్ని A Burial at Ornans గా చిత్రీకరించి కోర్బెట్ కళాకారుల విమర్శల పాలయ్యాడు. శ్మశాన వాటిక సన్నివేశాలను అది వరకు కళలో భాగం కాకపోవటం, కళ అనేది సత్యానికి చేరువలో ఉండాలనే కోర్బెట్ తత్వం మధ్య ఘర్షణకు ఈ చిత్రలేఖనం ఒక మచ్చుతునక
జీన్ ఫ్రాంకోయిస్ మిలెట్
[మార్చు]జీన్ ఫ్రాంకోయిస్ మిలెట్ సైతం తొలుత రియలిజంతో విమర్శల పాలైనా 1860వ దశకంలో పనులు చేసుకొంటూన వ్యవసాయదారుల గ్రామీణ సన్నివేశాలను చిత్రీకరించటంలో ప్రసిద్ధికి ఎక్కాడు. షీప్ షియరింగ్ బినీత్ ద ట్రీ, ఫస్ట్ స్టెప్స్ వంటి భోవోద్వేగ భరిత రియలిస్టు చిత్రలేఖనాలతో మిలెట్ కట్టిపడేసాడు. ద గ్లీనర్స్ అనే చిత్రలేఖనంలో నిరుపేద మహిళల కష్టాలను చూపాడు.
-
The Sheepshearers. మాంసం కోసం వధించబడిన ఒక గొర్రె
-
First Steps. తన పనిముట్లను నేలపైన పెట్టిన ఉద్యోగి, తమ పాపను పిలుస్తోండగా, ఆ పాప తల్లి, పాపను తండ్రి వైపు నడిపించే భావోద్వేగ భరిత చిత్రలేఖనం
-
The Gleaners. నేల పై పడిన ధాన్యాన్ని సేకరిస్తోన ముగ్గురు మహిళల చిత్రం, వారి పేదరికాన్ని తెలుపుతుంది
హానరే డామియర్
[మార్చు]హానరే డామియర్ తన రియలిస్టు చిత్రలేఖనాలతో రాజును సైతం అవహేళన చేసాడు. ఇతనిచే చిత్రీకరించబడ్డ ఫస్ట్ క్లాస్ క్యారేజ్, సెకండ్ క్లాస్ క్యారేజ్, థర్డ్ క్లాస్ క్యారేజ్ ధనిక/మధ్య తరగతి/ పేదవర్గాల మధ్య వ్యత్యాసాన్ని సుస్పష్టంగా చూపుతుంది.
-
విలాసవంతమైన The First Class Carriage
-
మధ్య తరగతి ప్రజల The Second Class Carriage
-
నిరుపేదల The Third Class Carriage
ఇంప్రెషనిజం
[మార్చు]మాడర్న్ ఆర్ట్లో అత్యంత కీలకమైన కళా ఉద్యమాలలో ఇంప్రెషనిజం ఒకటి. మొదట్లో ఇంప్రెషనిజం అనే పదం అవమానకరంగా ఉపయోగించబడేది. క్లాడ్ మోనెట్ చిత్రీకరించిన సన్ రైజ్ అనే చిత్రపటాన్ని ఉద్దేశించి లూయిస్ లీ రాయ్ అనే కళా విమర్శకుడు ఈ పదాన్ని తొట్టతొలుత ఉపయోగించాడు. అదివరకు చిత్రలేఖనంలో కేవలం చరిత్రకు లేదా పౌరాణిక ఘట్టాలకు మాత్రం పరిమితం అయ్యింది. కానీ ఇంప్రెషనిజం ఈ సంప్రదాయాన్ని తిరస్కరించింది. ఫ్రెంచి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ రియలిస్టిక్ ఆర్ట్ (పోర్ట్రెయిట్ లకు, చారిత్రక చిత్రలేఖనాల) కు పరిపూర్ణ మద్దతు ప్రకటించింది. ల్యాండ్ స్కేప్ స్టిల్ లైఫ్ పెయింటింగులు నాసిరకమైనవిగా భావించింది. అప్పటి యువ చిత్రకారులు అయిన క్లౌడ్ మానెట్, పియర్ రెన్వా, ఆల్ఫ్రెడ్ సిసిలీ, ఫ్రెడెరిక్ బజీర్ అకాడామీ యొక్క దృక్కోణాన్ని, కళాత్మక శైలులను విమర్శించారు. ఇంప్రెషనిస్టు శైలిలో వీరు చేసిన చిత్రీకరణలు అకాడమీ ధిక్కారానికి, కళా ప్రపంచంలో వాదోపవాదాలకు తెర తీశాయి. ఈ చిత్రలేఖనాలపై తమకంటూ ఒక అభిప్రాయం కలదని, కావున వాటిని సందర్శించే సదుపాయం కలుగజేయాలని సాధారణ ప్రజానీకం అప్పటి రాజు అయిన నెపోలియన్ iii కు విన్నవించుకోగా, The Salon of the Refused లో ఈ చిత్రలేఖనాలు ప్రదర్శింపబడ్డాయి. కళలోని ఈ క్రొత్త శైలిని, సాంకేతికతను ప్రజలు ఆస్వాదించసాగారు. సలోన్ ప్రారంభించిన మూడవ యేట (1876) ఇంప్రెషనిజం ఊపందుకొంది. 1886 వరకూ ఇంప్రెషనిజం చిత్రలేఖనంలో రాజ్యం ఏలింది.
ఇంప్రెషనిస్టు చిత్రలేఖనంలో స్పష్టమైన వివరాలు ఉండవు. చిన్న కుంచె ఘతాలతోనే చిత్రీకరణ జరుగుతుంది. చైతన్యం ఇంప్రెషనిజంలో కీలకమైన అంశం. రంగులను ఒకదానితో ఒకటి కలపకుండా, ఒకదాని ప్రక్కనే మరొకదానిని పేరుస్తూ, కళాకారులు ఈ చైతన్యాన్ని చిత్రలేఖనంలో చొప్పించేవారు. చారిత్రక/పౌరాణిక దృశ్యాలకు భిన్నంగా పట్టణాలలోని పలు దృశ్యాలను చిత్రీకరించేవారు. చిత్రీకరించబడే అంశాలు సాధారణ కాంతిలోనే ఉన్నట్టుగానే చిత్రీకరించటం ఇంప్రెషనిజంలో మరొక మెళకువ. అయితే మానేతో రెండు నెలలు కలిసి పనిచేసి, ఇంప్రెషనిజంలో కృషి చేసిన రెన్వా, తర్వాత ఈ శైలిని తన చిత్రలేఖనంలో పలు పోర్ట్రెయిట్ లకు కూడా అన్వయించాడు. అప్పటి కళాకారులకు రెన్వా యొక్క ఈ ప్రయోగం కూడా నచ్చలేదు. డేగా కూడా సాంప్రదాయ కళను ఇంప్రెషనిజాన్ని కలగలిపి పలు కళాఖండాలను ఆవిష్కరించాడు. ఔట్ లైన్ ల పట్ల స్పష్టత, గీతల వంపులలో కొనసాగింపు లతో డేగా ఇంప్రెషనిజంలో తనదైన ముద్ర వేశాడు.[10] సంప్రదాయాలను ధిక్కరించిన ఇంప్రెషనిజం, కళను క్రొత శిఖరాలకు తీసుకువెళ్ళటమే కాక, కళను మనం చూసే విధానాన్ని కూడా మార్చివేసింది.
-
ఎడ్వార్డ్ మానెట్ చే చిత్రీకరించబడిన Luncheon on the Grass
-
క్లౌడ్ మోనెట్ చే చిత్రీకరించబడ్డ Woman with a Parasol. (తన భార్య, కుమారుడిని) అస్పష్టమైన ముఖ కవళికలతో చిత్రీకరించటం జరిగింది
-
ఎడ్గార్ డెగాస్ చే చిత్రీకరించబడ్డ After the bath, woman drying herself
-
గుస్తావే కెయిల్లెబొట్టె చే చిత్రీకరించబడ్డ Paris Street; Rainy Day
పోస్ట్ ఇంప్రెషనిజం
[మార్చు]1880వ దశకపు ద్వితీయార్థంలో ఇంప్రెషనిజానికి కొనసాగింపుగా మరికొందరు చిత్రకారులు మరొక క్రొత్త కళా ఉద్యమానికి దారులు వేశారు. అదే పోస్ట్ ఇంప్రెషనిజం. పాల్ సెజాన్, విన్సెంట్ వాన్ గోఘ్, గోగాన్ వంటి చిత్రకారులు పోస్ట్ ఇంప్రెషనిజానికి ఆద్యులు. ప్రకృతి దృశ్యాలను ఇంప్రెషనిస్టు శైలిలో చిత్రీకరించటమే పోస్ట్ ఇంప్రెషనిజం.[10] ఇంప్రెషనిజం స్ఫూర్తిగా మరొక వైపు సింబాలిజానికి ఆదరణ పెరగటం మొదలు అయ్యింది. దృశ్యపరమైన అంశాలు, రంగులలో సమతౌల్యం పోస్ట్ ఇంప్రెషనిజంలో లక్షణాలు. సెజాన్ యొక్క నిర్మాణాత్మక శైలి, రంగుల వినియోగంలో గల నియంత్రణ క్యూబిజం అనే విప్లవాత్మక కళా ఉద్యమానికి పునాదులు వేసింది.
1885 నుండి 1914 వరకు పోస్ట్-ఇంప్రెషనిజం చిత్రకళలో ఒక వెలుగు వెలిగింది. కంటికి ఇంపైన రంగులతో, ఆకర్షణీయమైన ఆకారాలతో కళను ఒక భావోద్రేక అనుభవంగా పోస్టు-ఇంప్రెషనిస్టులు మలిచారు. ఇంప్రెషనిజాన్ని అతిశయించి చిత్రీకరించటమే పోస్ట్-ఇంప్రెషనిజం అని తెలుపవచ్చును. ఇంప్రెషనిజం శైలి లాగానే పోస్ట్-ఇంప్రెషనిజం కూడా రెప్పపాటులో వీక్షకుడి మదిలో ఆలోచనలు మెదిలేలా చేస్తుంది. అయితే రంగులు, వెలుగులు ఇంప్రెషనిజంలో అత్యంత సహజ సిద్ధంగా చిత్రీకరించబడితే, కొలత వేయబడ్డ సమ్మేళనాల తో, సింబాలిజం అంశాలతో వారి కళాఖండాలలో అర్థాలను ఆపాదించారు. ఇంప్రెషనిజం ఆధునిక, పట్టణ సన్నివేశాలను కళాంశాలుగా ఎంచుకొంటే, పోస్ట్-ఇంప్రెషనిజం గ్రామీణ, సహజ సిద్ధమైన దృశ్యాలను చిత్రీకరించింది. పోస్ట్-ఇంప్రెషనిజం చిత్రాంశాలు సర్వసాధారణమైనవి గా, వ్యక్తిగతమైనవిగా ఉంటాయి.[11]
జార్జెస్ స్యూరట్
[మార్చు]రంగుల మిశ్రమాన్ని కాన్వాస్ పై అద్దే బదులు, వాటిని ఒక దాని ప్రక్క ఒకటి సున్నితంగా కాన్వాస్ పై నొక్కుతూ జార్జ్ ఏ సెరా పోస్ట్-ఇంప్రెషనిజంలో ఒక నూతన శైలిని తెచ్చాడు. దీనితో ఒకే చిత్రలేఖనం వేర్వేరు వీక్షకులకు పరిపరి విధాలుగ అవగతం అయ్యేది. జార్జెస్ స్యూరట్ ఇంప్రెషనిజంలో రేఖలు, వివరాలు తక్కువగా ఉండటం పై పెదవి విరిచాడు. రంగుల మచ్చలతో స్యూరట్ పాయింటిలిజం (స్యూరట్ దృష్టిలో ఇది డివిజనిజం) అనే శైలిని సృష్టించాడు. రంగులలో ఉన్న వర్ణాన్ని మిగితా వాటితో కలుషితం చేయకుండా యథాతథంగా వాడటాన్ని ప్రారంభించాడు. వీక్షకుడే స్వయానా తమ కళ్ళతో తమ ఊహలకు అనుగుణంగా చిత్రలేఖనంలోని రంగులను కలుపుకోవాలని స్యూరట్ తెలిపేవాడు. ఈ శైలితో స్యూరట్ సున్నితమైన షేడింగులు ఆసక్తికరమైన రంగుల మిశ్రమాలు తీసుకువచ్చాడు. స్యూరట్ చిత్రలేఖనాలు సాంప్రదాయ చిత్రలేఖనాల వలె, బోధించటానికి కాకుండా సంబంధ బాంధవ్యాల గురించి, వీక్షకుడిలో ఆలోచనలు, భావనలు రేకెత్తించేవిగా ఉండేవి.
పాల్ సెజాన్
[మార్చు]పాల్ సెజాన్ ఇదే పద్ధతిలో ప్యాలెట్ నైఫ్ ను ఉపయోగించి చిత్రీకరణ చేశాడు. వివిధ అంశాలను ప్రాథమిక రేఖాగణిత ఆకారాలకు కుదించాడు. కళాంశాలు సరళీకృతం కావటంతో చిత్రకళకు ఆబ్స్ట్రాక్ట్ కోణం ఏర్పడింది. దృశ్యపరమైన అంశాలలో దుష్ఫలితాలను తొలగించే, వాటి మధ్య సామరస్యాన్ని నెలకొల్పే ప్రక్రియ ఇంప్రెషనిజంలో కొరవడింది అనే ఫిర్యాదు సెజాన్ కు ఉండేది. పోస్ట్-ఇంప్రెషనిస్ట్ కళ నుండి క్యూబిజం ఉద్భవించేందుకు ఇదే ఫిర్యాదు దోహద పడింది. దాదాపు 300 ఏళ్ళుగా నిర్లక్ష్యం చేయబడ్ద స్టిల్ లైఫ్ ను సెజాన్ తిరిగి పరిచయం చేశాడు. మందంగా ఉండే ఆయన రంగుల మరకలు స్టిల్ లైఫ్ లో పరిమాణాన్ని, వ్యక్తీకరణను చేకూర్చాయి. ఒకే స్టిల్ లైఫ్ చిత్రానికి పలు దృక్కోణాలు ఉండేలా చిత్రీకరించగలగటం సెజాన్ పోస్ట్-ఇంప్రెషనిజంలో సాధించిన ఒక నూతన ఆవిష్కరణ.
విన్సెంట్ వాన్ గోఘ్
[మార్చు]ద స్టారీ నైట్, సన్ ఫ్లవర్స్, కేఫే టెరేస్ ఎట్ నైట్ వంటి కళాఖండాలతో విన్సెంట్ వాన్ గోఘ్ కళలో రంగుని మించింది మరేదీ లేదని తెలిపాడు. వాన్ గోఘ్ ఆలోచనా ధోరణి ఇంప్రెషనిస్ట్ గానే అనిపించిననూ, అతని సన్నివేశాలు మాత్రం శాస్త్రీయతను కాకుండా ప్రవృత్తి ఆధారిత స్పందనలను తెలియజేసేవి. వాన్ గోఘ్ దృశ్యం యొక్క వెలుగు నీడలను అధ్యయనం చేయకుండా రంగుల సమ్మేళనాలతో దృశ్యం లోని వివరణలను అతిశయించో లేదా తగ్గించో చిత్రీకరించాడు. రియలిజం నుండి వాన్ గోఘ్ దూరం అయిననూ కళలోని భావోద్వేగాన్ని మాత్రం పక్కన పెట్టలేదు.
పాల్ గ్వాగ్విన్
[మార్చు]ద యెల్లో క్రైస్ట్ అనే కళాఖండంలో పాల్ గ్వాగ్విన్ సరళమైన రేఖలు, ఆకారాలు ఉపయోగించిననూ, రంగులను మాత్రం అతిశయించి వాడాడు. శిలువ వేయబడ్డ క్రీస్తు చుట్టూ మోకాళ్ళ పై కూర్చొని ప్రార్థిస్తున్న ముగ్గురు మహిళలు గల ఈ చిత్రపటం యొక్క దృశ్యంలో తీక్షణను వారి భావోద్రేక స్థితిని తెలుపటంలో ఇంప్రెషనిస్టు శైలిని తన శైలిలో తెలుపటంలో గ్వాగ్విన్ కృతకృత్యుడయ్యాడు.
-
పాల్ సెజానే చే చిత్రీకరించబడ్డ Le panier de pommes (The Basket of Apples). ఈ చిత్రపటంలో సెజానే ఆపిల్ పళ్ళకు ఒక దృక్కోణాన్ని, ప్రక్కనే పళ్ళెంలో ఉన్న బిస్కట్లకు మరొక దృక్కోణాన్ని ఆపాదించాడు
-
విన్సెంట్ వాన్ గోఘ్ చే చిత్రీకరించబడ్డ The Starry Night
-
పాల్ గ్వాగ్విన్ చే చిత్రీకరించబడ్డ Le Christ Jaune (The Yellow Christ)
ఆర్ట్ నోవో
[మార్చు]1890-1910 వరకు ఐరోపా చిత్రకళలో ఆర్ట్ నోవో (Art Noveu) కొనసాగింది.[12] గీతలు, ఆకారాలు, వీటి అరమరిక (texture) వంటి అంశాలతో చిత్రకళ అభ్యాసం చాలా క్లిష్టతరంగా ఉండేది. ఆదర్శప్రాయమైన మనుషుల, ప్రకృతి దృశ్యాల చిత్రీకరణే చిత్రకళ యొక్క ప్రధాన ధ్యేయంగా ఉండేది. అప్పటివరకు చిత్రకళను విశ్వవిద్యాలయాలలో నేర్చుకొన్నవారే చిత్రకారులుగా గుర్తించబడేవారు. ఆర్ట్ నోవో ఈ అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది.
చిత్రకారులలోని ఒక వర్గం ఈ సాంప్రదాయలను తుచ్ఛంగా చూసింది. కేవలం గణితం లాగానో, శాస్త్రం లా కళను అభ్యసించవలసిన అవసరం లేదని, కళ అనేది ఆత్మ నుండి వెలువడుతుంది అని, చైతన్యం నుండి మెలికలు తిరుగుతుందని, దాని అందంతో జీవితాన్ని అలంకరిస్తుందని వీరు అభిప్రాయపడ్డారు. కళారంగంలో వీరి శైలిని ఇనుమడింపజేసిన ఈ విప్లవ చిత్రకారుల వర్గమే ఆర్ట్ నోవో అనే కళా ఉద్యమం ఉద్భవించటానికి కారకులయ్యారు.
ఫ్రెంచి భాషలో ఆర్ట్ నోవో అనగా నూతన కళ అని అర్థం. వాస్తవికతను ప్రతిబింబించే సాంప్రదాయ కళ నుండి దూరం అయ్యి ప్రకృతి యొక్క పారే, మలుపులు తిరిగే రేఖలు, ఆకారాల వైపు నడిచింది. ఆర్ట్ నోవో కళాఖండాలలో ప్రతి అంశం సహజసిద్ధంగా అలంకరించబడి ఉంటుంది. కళారంగంలో వీటినే విప్ లాష్ కర్వ్స్ (whiplash curves) అంటారు. జపాన్ తో అంతర్జాతీయ సంబంధాలు నెలకొనటంతో అక్కడి వుడ్ బ్లాక్ ప్రింట్స్ ఐరోపా చిత్రకళను ప్రభావితం చేశాయి. జపనీయుల చిత్రలేఖనం లోని సారళ్యత, మరీ ప్రకాశవంతంగా లేని రంగులు అర్ట్ నోవో లక్షణాలయ్యాయి. చేతి పని ఎక్కువగా ఉండే కళా ఖండాల, పోస్ట్ ఇంప్రెషనిస్టుల ఎక్స్ప్రెసివ్ చిత్రలేఖనాల ప్రభావం కూడా ఆర్ట్ నోవో పై ఉంది.
గ్రాఫిక్ ఆర్ట్ కు ప్రత్యేకించి పోస్టర్ ఆర్ట్ కు పెద్దపీట వేసిన తొట్టతొలి కళా ఉద్యమంగా ఆర్ట్ నోవో కొనియాడబడింది. ఆల్ఫోన్స్ మూకా అనే చెక్ పెయింటర్, పాశ్చాత్య దేశాలలో ఉన్న నాలుగు ఋతువులు (ఫాల్, స్ప్రింగ్, సమ్మర్, వింటర్) లను మూర్తీభవించిన అందమైన స్త్రీలుగా ఆర్ట్ నోవో శైలిలో చిత్రీకరించాడు.
కేవలం 20 ఏళ్ళు మాత్రమే కొనసగిననూ, ఆర్ట్ నోవో చిత్రకళలో చెరగని ముద్ర వేసింది. మాడర్న్ ఆర్ట్ కు, ఆర్ట్ డెకో అనే కళా ఉద్యమాలకు బాటలు వేసింది.
-
ఆకు రాలు కాలం (Autumn)
-
చిగురించే కాలం (Spring)
-
వేసవి కాలం (Summer)
-
చలికాలం (Winter)
ఫావిజం
[మార్చు]ఫావిజం 20వ శతాబ్దపు ప్రారంభంలో ఫ్రాన్సులో ఉద్భవించిన ఒక కళా ఉద్యమం.[13] కొట్టొచ్చినట్టు కనబడే విధంగా రంగులను ఉపయోగించటం ఈ కళ యొక్క ప్రత్యేకత. చిత్రలేఖనంలో సాధారణంగా రంగులు నీటిలో కానీ, నూనెలో కానీ కలిపి వినియోగించటం జరుగుతుంది. కానీ ఫావిజంలో రంగులు దేనితోనూ కలపకుండా నేరుగా ట్యూబు ల నుండి కాన్వాస్ పై వేయబడ్డాయి. గ్రాఫిటీ లేక స్ప్రే బాంబ్ పెయింటింగ్ వలె ఫావిజం విప్లవాత్మకం కాదు. కానీ సాంప్రదాయ పద్ధతులను ధిక్కరించటంతో ఈ కళా ఉద్యమం స్వాగతించబడలేదు. డ్రాయింగు (రేఖలు) సరళంగా ఉన్ననూ, రంగులు మాత్రం అతిశయించి చూపబడ్డాయి. సాంప్రదాయ పద్ధతుల నుండి, ఇంప్రెషనిస్టు పద్ధతుల నుండి కూడా వేర్పడి అతిశయించిన వర్ణాలతో ప్రయోగాలు చేసిన హెన్రీ మాటిస్సే, ఆండ్రే డెరెయిన్ వంటి వారు ఫావిజం ఉద్భవించటానికి కారకులయ్యారు. వీరి చిత్రలేఖనాలలో విషయాలు బలమైన కుంచె ఘతాలతో చిత్రీకరించారు. తొలుత ఈ కళా ఉద్యమం ఆడంబరమైనది గా, అసభ్యకరమైనదిగా అభివర్ణించబడిననూ, ఫ్రెంచి భాషలో le foes అనే పదం ( క్రూర మృగాలు) అనే పదం నుండి దీనికి ఫావిజం అనే నామకరణం చేశారు.
రంగుల ద్వారా భావాలను వ్యక్తీకరించటం వంటివి ఇంప్రెషనిజం నుండి స్వీకరించబడ్డాయి. వాన్ గోఘ్ తన భావోద్రేకాలను వ్యక్తపరచటానికి శక్తివంతమైన రంగులను ఎంచుకొంటే, గోగాన్స్ తన ఆధ్యాత్మిక చింతనను వ్యక్తపరచటానికి రంగులను ఒక మాధ్యమంగా వాడుకొన్నాడు. దీనితో చిత్రలేఖనంలో స్వేచ్ఛ, ఆకస్మికత పెరిగాయి. అయితే హెన్రీ మాటిస్సే మాత్రం పోస్టు-ఇంప్రెషనిస్టుల వలె తాను రంగుల ఎంపికలో శాస్త్రీయతను ఉపయోగించలేదని, పరిశీలన/అనుభవాలకు తాను ప్రాముఖ్యతను ఇచ్చానని చెప్పుకొచ్చాడు. ఇంప్రెషనిస్టుల నగర నేపథ్యాల నుండి, ఫావిజం గ్రామ సన్నివేశాల వైపు, తీరిక సమయాల వైపు మళ్ళింది. రంగుల అధిపత్యాన్ని సమతౌల్యం చేయటానికి ఫావిజం శైలి చిత్రీకరణలో వివరాలను తగ్గించవలసిన అవసరం ఏర్పడింది. కళా విమర్శకులు "ఒక కుండ నిండా రంగులు ప్రజల ముఖం పై కొట్టినట్టు ఉంది" అని ఫావిజం పై పెదవి విరిచారు. అయితే ఫావిజం శైలి యొక్క అందం లోతును భ్రమింప జేసే తీరు లో, సృష్టించే ఘన పరిమాణంలో కలదు అనేది గమనించవలసిన విషయం. ఫావిజం చిత్రలేఖనాలను ఒక రెప్ప వేసి మరల పరిశీలనగా గమనించినచో అంతకు ముందు చూసిన చిత్రానికి, రెప్ప వేసిన తర్వత చూసిన చిత్రానికి మధ్య తేడా మనకే గోచరిస్తుంది.
ఫావిజం క్రమబద్ధంగా ఏర్పడిన కళా ఉద్యమం కాదు. ఒకే విధమైన ఆలోచనా ధోరణి ఉన్న, కేవలం ఒక పరిమిత గుంపు నుండి అకస్త్మాత్తుగా ఏర్పడింది. కేవలం కొన్ని ఏళ్ళు మాత్రం పరిఢవిల్లినందుకు బహుశా ఇది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు.
ఫావిజం తర్వాతి కాలంలో క్యూబిజం కు, జర్మన్ ఎక్స్ప్రెషనిజానికి బాటలు వేసింది. రంగుల ప్రాముఖ్యతను తెలపడంలో ఫావిజం ఇప్పటికీ కళా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయింది.
-
అలెక్సిస్ మెరోడాక్ జెయాన్యూ చే చిత్రీకరించబడిన The Yellow Dancer
-
ఆర్థర్ నావేజ్ చే చిత్రీకరించబడిన The Conversation
-
రాబర్ట్ ఆంటోయిన్ పింఛొన్ చే చిత్రీకరించబడ్డ The Pont Audemer market
ఎక్స్ప్రెషనిజం
[మార్చు]జర్మనీ, ఆస్ట్రియా ల లోని వివిధ ప్రాంతాల నుండి 1910 లో ఎక్స్ప్రెషనిజం ఉద్భవించింది.[14] పాల్ గాగ్విన్, ఎడ్వార్డ్ మంచ్, విన్సెంట్ వాన్ గాఘ్ వంటి సింబాలిస్టు కళాకారుల నుండి ఎక్స్ప్రెషనిజం పురుడు పోసుకొంది. ఎక్స్ప్రెషనిజం భావనల (expressions) కు పెద్ద పీట వేయటంతో ఈ శైలికి ఈ పేరు వచ్చింది. డ్రెస్డెన్ లోని ఒక కళాకారుల సమూహం తమను తాము Die Brücke (The Bridge) అని వ్యవహరించుకొన్నారు. సాంప్రదాయ సంకెళ్ళ నుండి విముక్తులు అయిన వీరు, తమ కళ భవిష్యత్తుకు వారధిగా వ్యవహరిస్తుంది అనే వీరి భావన ఈ పేరుకు కారణం. ఎర్న్స్ట్ లూడ్విగ్ కిర్ష్నర్ Die Brücke లో కీలక సభ్యుడు. ఇతని చే చిత్రీకరించబడిన జపనీస్ థియేటర్ అనే కళాఖండం, ఎక్స్ప్రెషనిజానికి మచ్చుతునకగా మిగిలిపోయింది. వాస్సిలీ కాండిన్స్కీ చే ఎక్స్ప్రెషనిజం శైలిలోనే చిత్రీకరించబడ్డ Der Blau Reiter (The Blue Rider) పేరుతో నే మరో కళాకారుల సమూహం ఏర్పడింది. ఈ సమూహం యొక్క చిత్రలేఖనాలు ఇహలోకానికి సంబంధం లేకుండా ఆధ్యాత్మికంగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్స్ప్రెషనిస్టుల భావాలను వ్యతిరేకిస్తూ, వాస్తవానికి దగ్గరగా ఉంటూ New Objectivity అనే మరొక కళా ఉద్యమం పైకి వచ్చింది. ఈ కళా ఉద్యమంలో జార్జ్ గ్రోస్జ్ వంటి వారు అణగారిన వర్గాలకు బాసటగా నిలుస్తూ అణచివేసేవారి నిజస్వరూపాలు అసహ్యకరమైనవిగా అవినీతిపరులుగా చిత్రీకరించాడు. ఆధునిక, పారిశ్రామిక ప్రపంచం ఎక్స్ప్రెషనిస్టులకు, రియలిస్టులకు గొడ్డలిపెట్టు అయ్యింది. 1933 లో అడాల్ఫ్ హిట్లర్ అధికారం లోకి రావటం, కళాకారులు/వారి కళాఖండాలలో జోక్యం చేసుకోవటం తో, కళ క్రొత్త పుంతలు త్రొక్కటం మానేసింది. కళలోని ఆధునిక అంశాలు, కళను దిగజారుస్తున్నాయని హిట్లర్ అభిప్రాయపడ్డాడు. ఆధునిక కళను ఖండించాడు. ఆధునికత జర్మను విలువలను కాలరాస్తోందని, దానిని సెన్సార్ చేయటం ప్రారంభించాడు. కళను దిగజారుస్తున్న వారిని హిట్లర్ ముప్పుతిప్పలు పెట్టడం ప్రారంభించాడు. దీనితో కొందరు కళాకారులు తమ స్వదేశాలు విడిచి పారిపోవటం, లేదా ఆత్మాహుతికి పాల్పడటం చేశారు. కానీ ఎక్స్ప్రెషనిస్టులు మాత్రం వారి కృషిని ఆపలేదు. తర్వాతి కాలంలో కూడా ఈ శైలి అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజానికి, నియో ఎక్స్ప్రెషనిజానికి బాటలు వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్స్ప్రెషనిజం జర్మన్ వారసత్వ సంపదగా గుర్తింపబడి తిరిగి వెలుగు లోకి వచ్చింది. 70/80వ దశకాలలో ఎక్స్ప్రెషనిజం పై తిరిగి దృష్టి సారించిన కళాకారులు, వారిని వారు నియో ఎక్స్ప్రెషనిస్టులుగా సంబోధించుకొన్నారు. కళ మనిషి ఆత్మ నుండి ఉద్భవిస్తే, మనం ఆశ్చర్యపోవాలా? అనే ప్రశ్నకు మానవాళికి వదిలేసింది ఎక్స్ప్రెషనిజం.
-
వాస్సిలీ కండిన్స్కీ చే చిత్రీకరించిన Der Blaue Reiter పేరుతోనే ఒక కళాకారుల సమూహం ఏర్పడింది
-
ఎడ్వార్డ్ ముంచ్ చే చిత్రీకరించబడిన The Scream. వాట్సాప్ లో స్క్రీం అనే స్మైలీ ఐకాను కూడా ఇదే విధంగా ఉండటం ఈ నాటికి కూడా చిత్రలేఖనం యొక్క ప్రభావం తెలుపుతుంది
-
ఆగస్టు మేకే చే చిత్రీకరించబడ్డ Lady in a Green Jacket
అబ్స్ట్రాక్ ఎక్స్ప్రెషనిజం
[మార్చు]నియో ఎక్స్ప్రెషనిజం
[మార్చు]సింబాలిజం
[మార్చు]సింబాలిజం 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఏర్పడ్డ ఒక కళా ఉద్యమం.[15] కవిత్వం నుండి మొదలై, సంగీతం, నాటకరంగం వంటి వాటి గుండా, సింబాలిజం దృశ్య కళల వరకూ ప్రయానించింది. రియలిజం, ఇప్రెషనిజం, న్యాచురలిజం వంటి కళా ఉద్యమాలకు ప్రతిచర్యగా ఉద్భవించిందే సింబాలిజం.[16] ఈ మూడు కళా ఉద్యమాలు పుణికిపుచ్చుకొన్న వాస్తావాధారిత ప్రాతినిధ్యానికి భిన్నంగా సింబాలిజం ఊహాత్మక, కల్పిత ప్రాతినిధ్యానికి, ఐడియలిజానికి ప్రాధాన్యతనిచ్చింది. ఒక భావనకు ఇంద్రియ తత్వం ఇవ్వగలగటమే కళ యొక్క ఉద్దేశం అనే అభిప్రాయం నెలకొంది. అంతర్గత అవగాహనను దృశ్య భావన ద్వారా తెలుపుటకై ఆత్మాశ్రయమైన, ప్రతీకాత్మకమైన, అలంకారప్రాయమైన కళాంశాల ప్రాముఖ్యతను సింబాలిజం గుర్తించింది. తెలివి యొక్క ఆత్మాశ్రయాన్ని ఆకారాల ద్వారా మేల్కొల్పుటకై సింబాలిస్టులు మార్మికత, క్షుద్రవిద్యల వైపు సైతం మొగ్గారు. జీవితం యొక్క రహస్యాలను ఛేదించటానికి శాస్త్రాన్ని ఉపయోగించకుండా, సింబాలిస్టులు వ్యక్తిగతమైన కళా భావనను ఉపయోగించదలిచారు. సార్వత్రిక సత్యాలను శోధిస్తూనే ఊహాజనిత లోకాలపై ఆసక్తి కలిగి ఉన్నారు. అలంకరించబడ్డ, విలాసవంతమైన గుళ్ళ, రాజప్రాసాదాల వంటి అంతర్గత దృశ్యాల చిత్రీకరణ, పరిమిత వస్త్రధారణ కల మనుషులను విగ్రహాల వలె చిత్రీకరించటం, అన్యదేశ శృంగారం, అలంకార శోభలు, ఆధ్యాత్మికత, ఊహాచిత్రాల చిత్రీకరణ, భయానక సన్నివేశాల చిత్రీకరణ, స్వాప్నిక దృశ్యాల చిత్రీకరణ వంటివి సింబాలిజం యొక్క ప్రధాన లక్షణాలు. ఆందోళన, పాపం, ప్రేమ, మృత్యువు, ఆశ-నిరాశలు వంటివి సింబాలిస్టుల ప్రధానంశాలయ్యాయి.
పలువురు ఫ్రెంచి, బెల్జియన్, ఇంగ్లీషు, ఆస్ట్రియన్, నార్వేజియన్ కళాకారులు సింబాలిస్టు చిత్రలేఖనాలను వేశారు. సర్రియలిజం, ఎక్స్ప్రెషనిజం వంటి కళా ఉద్యమాలకు సింబాలిజం దారి తీసింది.
-
ఫ్రెంచి చిత్రకళాకారుడు పాల్ గ్వాగ్విన్, తహితి అనే ప్రదేశపు దృశ్యాన్ని సింబాలిస్టు శైలిలో చిత్రీకరించాడు. దీని పేరు Where do we come from? Who are we? Where are we going?
-
ఎడ్వార్డ్ ముంచ్ చే చిత్రీకరించబడ్డ, The Scream
డాడాయిజం
[మార్చు]1916 లో స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ లోని క్యాబరే వోల్టేయిర్ (Cabaret Voltaire) అనే ప్రదేశంలో ప్రారంభం ఐన ఒక వైరాగ్య కళా ఉద్యమం .[17] మొదటి ప్రపంచ యుద్ధం వలన చాలా మంది కళాకారులు స్విట్జర్లాండ్ కు వలసలు వెళ్ళటం ప్రారంభం అయ్యింది. ఇలా వలస వచ్చిన కళాకారులు ఒక సమూహంగా ఏర్పడి యుద్ధ వ్యతిరేకత, మధ్య తరగతి వ్యతిరేకత, దేశభక్తి వ్యతిరేకత, సంస్థాపన వ్యతిరేకత, పురావస్తు ప్రదర్శనశాల వ్యతిరేకత, భౌతిక వాద వ్యతిరేకత లను కలగలిపి సృష్టించిన కళా ఉద్యమమే డాడాయిజం. రొమేనియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల కళాకారులు డాడాయిజాన్ని అనుసరించటం మొదలు పెట్టటంతో ఇది ఒక అంతర్జాతీయ కళా ఉద్యమంగా ఎదిగింది. తమ చుటూ జరుగుతోన్న దానికి భిన్నంగా మరొక క్రొత్త సృష్టిని చేయటానికి డాడా కళాకారులు ప్రయత్నించారు. డాడాయిజం ఒక మానసిక స్థితిగా వర్ణింపబడింది. నియమాలకు, సంస్థాపలకు, ఆదర్శాలకు డాడాయిస్టు కళాకారులు వీడ్కోలు పలికారు. సమంజసమైన ప్రతిదానిని నాశనం చేయట పై గురి పెట్టారు.
జర్మన్-ఫ్రెంచి శిల్పి, చిత్రకారుడు, కవి అయిన జీన్ ఆర్ప్
“ | డాడా తెలివిని ఉపయోగించని వారి కోసమే, కానీ తెలివితక్కువది కాదు. ప్రకృతి లాగే, డాడా కూడా తెలివిని ఉపయోగించదు. |
” |
అని ఉద్ఘటించాడు.
డాడా అర్థం సర్వస్వం. డాడా అర్థం శూన్యం. డాడా కవిత్వం అర్థం లేని పదజాలంతో నిండిపోయి ఉండేది. గీతలు సైతం డాడా ప్రభావితం కావటంతో డాడా శైలి సంగీతం, సాహిత్యం ఉద్భవించాయి. సహజత్వం, అవకాశవాదం డాడాయిజం యొక్క లక్షణాలు అయ్యాయి. యుద్ధం అంతం అవ్వటంతో డాడాయిస్టులు ఇతర ప్రదేశాలకు తరలటంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలుకు సైతం డాడా ప్రాకింది.
జర్మనీలో డాడాయిజం రాజకీయాలను విమర్శించింది. సైనికుడి బొమ్మకు పంది తలను అంటించి దానిని కూడా కళాఖండంగా పేర్కొన్నారు. ఆధునిక యువతి ఎలా ఉండాలో హాస్యాస్పదంగా తెలుపటానికి వార్తాపత్రికలలోని పదాలను, బొమ్మలను ఒక క్రమపద్ధతి లేకుండా అంటించడం డాడాయిజంలో భాగం అయ్యింది.
అమెరికాలో మార్సెల్ డు చాంప్ అనే కళాకారుడు మూత్రవిసర్జన చేసే తొట్టిని అడ్డంగా పెట్టి దానిని The Fountain అనే కళాఖండంగా పేర్కొన్నాడు. కళాంశం కాక, కళాకారుడు సృష్టించేదే కళాఖండం అని డు చాంప్ అర్థం. కళలో మంచి-చెడులు ఉండవు అనేది అతని వాదం. కళ కేవలం కళ కాదు అనేది అతని తత్వం. ఈ భావనలే మాడర్న్ ఆర్ట్ యొక్క చరిత్రను తిరగరాసింది. కాల ప్రవాహం ముందుకు సాగటం, సర్రియలిజం వంటి కళా ఉద్యమాలు రావటంతో డాడాయిజం సన్నగిల్లింది. కళలో పలు ఆధునిక వాదాలకు కాంటెంపరరీ ఆర్ట్ వంటి సమకాలీన కళా ఉద్యమాలకు నాంది పలికి డాడాయిజం ఇప్పటికీ అదే ప్రాముఖ్యతను సొంతం చేసుకొంది.
సర్రియలిజం
[మార్చు]సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనలు చదివి 1924 లో ఆండ్రీ బ్రెటాన్ అనే కవి సర్రియలిజం అనే కళా ఉద్యమానికి నాంది పలికాడు.[18] ఉపచేతన మనస్సు లోని భావాలు విప్లవాన్ని సృష్టించగలవని సర్రియలిస్టులు భావించారు. ఈ భావజాలంతో ప్రపంచాన్ని మార్చటానికి సర్రియలిస్టులు నడుం కట్టారు. డాడా నుండి సర్రియలిజం ఉద్భవించింది. డాడా వలె, సర్రియలిజం కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో మారణ హోమానికి కారణమైన భ్రష్ఠు పట్టిన కపటపూరితమైన సమాజాన్ని విమర్శించింది. సింబాలిజం ప్రభావాలు కూడా సర్రియలిజం పై ఉన్నాయి. సింబాలిస్టులను బ్రెటన్ సర్రియలిస్టులకు పూర్వీకులుగా పరిగణించాడు. ఉపచేతన మదికి సర్రియలిస్టులు స్వేచ్ఛను ఇచ్చారు. సాల్వడార్ డాలి వంటి చిత్రకారులు స్వాప్నిక దృశ్యాలను చిత్రీకరించి సర్రియలిజాన్ని విస్తరించారు. హేతువును ఉపయోగించకుండా వేసే చిత్రలేఖనాలను ఆటోమేటిజంగా వర్ణించి మీరో వంటి చిత్రకారులు సర్రియలిజంలో నూతన ఒరవడిని సృష్టించారు.
ఫ్రాన్సులో మొదలైన సర్రియలిజం ప్రపంచమంతా విస్తరించింది. 1936 లో లండన్లో అంతర్జాతీయ సర్రియలిస్టుల ప్రదర్శన జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం వలన చాలా మంది సర్రియలిస్టులు ఉత్తర, దక్షిణ అమెరికా లకు వలస వెళ్ళారు. క్రొత్త తరాల కళాకారులకు ప్రేరణను అందించారు.
ఫ్యూచరిజం
[మార్చు]డీ స్టిజ్ల్
[మార్చు]క్యూబిజం
[మార్చు]పాబ్లో పికాసో, జార్జెస్ బ్రేక్ ల చే, పారిస్ నగరంలో 1907 నుండి 1914 వరకు అభివృద్ధి చేయబడింది. ఒకే అంశాన్ని పలుకోణాల నుండి చూచి, ఈ అన్ని కోణాలను ఒకదాని ప్రక్కన/పైన/క్రింద మరొకటిగా, ముక్కలు ముక్కలుగా జోడించినట్లు, ఒకే చిత్రపటంలో చిత్రీకరించటమే క్యూబిజం.[19] దృక్కోణం, లోతు, మాడలింగ్, వెలుగు-నీడలు వంటి శాస్త్రీయ అంశాలను, కళ సృష్టిని అనుకరించాలనే వాదనను ధిక్కరించి బల్లపరుపు పై ఉన్నట్టు, ద్విపరిమాణాత్మక (two-dimensional) దృష్టితో వేసే చిత్రలేఖనమే క్యూబిజం. ఆకారాలను, ఆకృతి/నేతలను, రంగులను, స్థలాలను యథాతథంగా చిత్రీకరించాలి అనే భావనకు భిన్నంగా ఉంటూ, చిత్రీకరించబడ్డ అంశం ముక్కలు చెక్కలు చేసి చిత్రీకరించటం జరిగింది.[20]
20వ శతాబ్దపు ప్రారంభంలో సాంకేతిక విప్లవం, రాజకీయ రంగంలో మార్పులు, సాంఘిక మార్పులు క్యూబిజానికి ప్రేరణను ఇచ్చాయి. ఫోటోగ్రఫీ రంగం విస్తరించటంతో చిత్రకళాకారులు వాస్తవికతకు దగ్గరగా ఉండవలసిన అవసరం పోయింది. ఆధునిక జీవితంలో మానవుడు ఎదుర్కొనే సంఘర్షణను ఆవిష్కరిస్తూ కళలో నూతనత్వం రావాలి అని పికాసో, బ్రేక్ అభిప్రాయపడ్డారు. పాల్ సెజాన్నే అనే పోస్ట్-ఇంప్రెషనిస్ట్ ప్రేరణగా ఆకారాలను రేఖాగణిత అంశాలుగా చిత్రీకరించటంతో క్యూబిజం అవతరించింది. దీనితో ఒక చిత్రలేఖనం లోని సౌందర్యాన్నో, వాస్తవికతనో అభినందించటం కాకుండా, వీక్షకుడిని ఆ భావనకు, సారాంశమునకు గురిచేయగలిగిండి క్యూబిజం. 1913 లో న్యూయార్క్లో జరిగిన ఆధునిక కళ యొక్క ప్రదర్శనోత్సవంలో క్యూబిజం కళా ప్రేమికులను భయభ్రాంతులకు, ఆశ్చర్యానికి, ఆసక్తికి గురి చేసింది. మొదట పలువురికి అర్థం కాకున్నను, పలు విమర్శలు మూటగట్టుకొన్ననూ, పోనుపోను వచ్చిన కళా ఉద్యమాలతో క్యూబిజం ప్రజలకు మరింత దగ్గరయ్యింది, అర్థమయ్యింది. పికాసో చూసిన కొన్ని ఆఫ్రికన్ మాస్కులు కూడా క్యూబిజానికి ఒక ప్రేరణ. యంత్రాలకు, మనుషులకుఈ మధ్య ఘర్షణ, ఆధునికతతో పాషాణ హృదయాలుగా మారిపోయిన మహానగరాలు కూడా క్యూబిజంలో తచ్చాడుతూ ఉంటాయి.[21]
క్యూబిజం దృశ్య కళలులో నూతన/అనంతమైన అవకాశాలను తీసుకు రావటమే కాక, ఫ్యూచరిజం, కన్స్ట్రక్టివిజం, డాడా, సర్రియలిజం, నియో-ప్లాస్టిసిజం వంటి ఇతర కళా ఉద్యమాల సృష్టికి కారణం అయ్యింది. అనలిటిక్ క్యూబిజం, సింథటిక్ క్యూబిజాలు క్యూబిజంలో విభాగాలు.[19][21]
-
బ్రేక్ చే చిత్రీకరించబడ్డ కలెక్టో రెక్టో
మాడర్నిజం
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "List of art and design movements of the 20th century". britannica.com. Retrieved 19 October 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Renaissance". britannica.com. Retrieved 26 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Renaissance". encyclopedia.com. Retrieved 26 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Hansen, Phil. "Mannerism - Overview". youtube.com. Retrieved 22 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Hansen, Phil (16 March 2014). "Baroque - Overview - Goodbye-Art Academy". Retrieved 24 February 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Hansen, Phil. "Neoclassicism - An Overview". youtube.com. Retrieved 5 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Neoclassicism". britannica.com. Retrieved 5 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Hansen, Phil. "Romanticism - Overview". youtube.com. Retrieved 20 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Hansen, Phil. "Realism - Overview". youtube.com. Retrieved 9 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 10.0 10.1 Hansen, Phil. "Impressionism - Overview". youtube.com. Retrieved 29 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Hansen, Phil. "Post Impressionism". youtube.com. Retrieved 6 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Hansen, Phil. "Art Nouveu - Overview". youtube.com. Retrieved 7 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Hansen, Phil. "Fauvism - Overview". youtube.com. Retrieved 29 November 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ galleries, national. "What is Expressionism? Art Movements and Styles". youtube.com. Retrieved 24 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Muse, Curious (20 August 2021). "Symbolism in 10 Minutes: Why Is It The Most Mysterious Art Movement?". youtube.com.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Symboist Painting". britannica.com. Retrieved 4 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Muse, Curious (7 May 2021). "Dadaism in 8 Minutes: Can Everything Be Art?". Youtube. Retrieved 10 February 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Galleries, National (7 Jun 2018). "What is Surrealism? Art Movements & Styles". youtube.com. Retrieved 10 March 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 19.0 19.1 "Cubism". tate.org.uk. Retrieved 17 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Cubism". britannica.com. Retrieved 17 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 21.0 21.1 Hansen, Phil. "Cubism - Overview". youtube.com. Retrieved 17 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link)