కోలంక వెంకటరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోలంక వెంకటరాజు
Kolanka venkatrao.jpg
కోలంక వెంకటరాజు
జననం1910
వృత్తికర్ణాటక సంగీత విద్వాంసుడు (మృదంగం)
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ అవార్డు

కోలంక వెంకటరాజు మృదంగ విద్యాంసుడు.

విశేషాలు[మార్చు]

ఇతడు మృదంగ విద్వాంసుల కుటుంబంలో 1910లో జన్మించాడు. ఇతడు మొదట తన పినతండ్రి చినరామస్వామి వద్ద మృదంగం అభ్యసించాడు. తర్వాత కాకినాడలో మురమళ్ళ గోపాలస్వామి వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. తన 8వ యేట నుండే ఇతడు అనేక మంది విద్వాంసులకు మృదంగ సహకారాన్ని అందించాడు. తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, ద్వారం వెంకటస్వామి నాయుడు,అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, పల్లడం సంజీవరావు, ఈమని శంకరశాస్త్రి, స్వామినాథ పిళ్ళె,హరి నాగభూషణం, పారుపల్లి రామక్రిష్ణయ్య, మునుగంటి వెంకట్రావు, ఈమని అచ్యుతరామశాస్త్రి, జి.ఎన్.బాలసుబ్రమణియం, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్, టి.ఆర్.మహాలింగం, శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, టి.కె.జయరామ అయ్యర్, మహరాజపురం విశ్వనాథ అయ్యర్, మధురమణి అయ్యర్, ముదికొండన్ వెంకట్రామ అయ్యర్, టి.కె.రంగాచారి, ఓలేటి వెంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి వంటి విద్వాంసుల కచేరీలలో మృదంగం వాయించాడు. మద్రాసు, కలకత్తా, బొంబాయి, పూనా, నాగపూర్, బెంగళూరు, హైదరాబాదు, ముజఫర్‌పూరు వంటి దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో, పట్టణాలలో ఇతని కచేరీలు జరిగాయి. అంతే కాక విజయనగరం, బొబ్బిలి, పర్లాకిమిడి, పిఠాపురం, మందస, టెక్కలి, వెంకటగిరి, కసింకోట మొదలైన సంస్థానాలలో ఇతని విద్యా ప్రదర్శన జరిగింది.

ఇతడు తునిలో ఇంటివద్దనే గురుకుల పద్ధతిలో ఎంతో మంది శిష్య ప్రశిష్యులను తయారు చేయడంతో బాటు విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, హైదరాబాదు శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలలో అనేక మందికి మృదంగాన్ని నేర్పించాడు.

ఇతడిని అనేక సంస్థలు సన్మానించాయి. 1930లో విజయనగరం ఆంధ్రభారతీ తీర్థ, 1942లో కాకినాడ సంగీత విద్వత్సభ, 1971లో విజయవాడ విజయదుర్గా సంగీత విద్వత్సభ మొదలైన సంస్థలు ఇతడిని సత్కరించాయి. తన స్వగ్రామం తునిలో పౌరులు ఇతనికి 1957లో "మృదంగ ఆదిత్య" అనే బిరుదుతో గౌరవించారు. ఇంకా ఇతనికి పలు సంస్థల నుండి "మార్దంగికాగ్రేసర", "మార్దంగిక శిరోమణి", "మృదంగలహరి" వంటి బిరుదులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి ప్రారంభం నుంచి సభ్యునిగా ఉన్నాడు[1]. 1979లో ఇతనికి కర్ణాటక సంగీత వాద్యం విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి అవార్డు లభించింది[2].

మూలాలు[మార్చు]

  1. మధునాపంతుల వెంకట సూర్యనారాయణ శర్మ (1 December 1962). "మార్దంగిక శిరోమణి శ్రీ కోలంక వెంకట్రాజు". గానకళ. 1 (7): 17–21. Retrieved 6 February 2021.
  2. సంగీత నాటక అకాడమీ సైటేషన్