చిందు ఎల్లమ్మ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చిందు ఎల్లమ్మ
Chindu Yellama.jpg
జననం సరస్వతి
ఏప్రిల్ 1, 1914
బాసర, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
మరణం నవంబర్ 10, 2005
నివాసం అమ్ధాపూర్‌, బోధన్ మండలం, నిజామాబాదు జిల్లా, తెలంగాణా రాష్ట్రం, భారత దేశం
జాతీయత భారతీయురాలు
వృత్తి చిందు భాగవత కళాకారిణి.
మతం హిందూ
తల్లిదండ్రులు పిల్లిట్ల నభిసాజ్‌, ఎల్లవ్వ

చిందు ఎల్లమ్మ (సరస్వతి) చిందు భాగవత కళాకారిణి. చిందు తన యింటి పేరుగా చేసుకొని, తను అభినయించిన ఎల్లమ్మ పాత్రని సొంత పేరుగా చేసుకొని జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

జననం[మార్చు]

ఎల్లమ్మ 1914, ఏప్రిల్ 1 న పిల్లిట్ల నభిసాజ్‌, ఎల్లవ్వ దంపతులకు ఆదిలాబాద్ జిల్లా బాసరలో జన్మించింది.[1] నిజామాబాదు జిల్లా, బోధన్ మండలం అమ్ధాపూర్‌ గ్రామంలో స్థిరపడింది.

వివాహం[మార్చు]

ఎల్లమ్మకు 11 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిగింది. కాని చిందు కళకే అంకితం కావాలనే ధ్యేయంతో వైవాహిక జీవితానికి స్వస్తి పలికి, తన వల్ల భర్త నష్ట పోకూడదనే ఉద్దేశంతో స్వయంగా చెల్లెలు రావమ్మను ఇచ్చి తన భర్తకు వివాహం చేసింది.[2]

కళారంగ ప్రవేశం[మార్చు]

నాలుగు సంవత్సరాల వయసులోనే కళారంగంలోకి ప్రవేశించింది. తల్లిదండ్రులతో కలిసి ఊరురా తిరిగి చిందు కళాబృందాలతో వివిధ ప్రదర్శనలు ఇచ్చేది. చిన్నతనంలోనే రంభ వంటి వేషాలు కట్టి అందరినీ ఆకట్టుకునేది. ప్రభావతీ విలాసం, సుందరకాండ, చెంచులక్ష్మీ, సుగ్రీవ విజయం మొదలైన కథలను ఎల్లమ్మ జానపద నృత్యరూపంలో ప్రదర్శించేది. సత్యభామ, మోహిని, సత్యవతి, సావిత్రి, చెంచులక్ష్మీలాంటి స్త్రీ పాత్రలు మరియు అర్జునుడు, నరసింహుడు, వాలీ, శంకరుడు వంటి పురుష పాత్రలు ధరించేది.

1979లో నిజామాబాదు జిల్లా మునిపల్లిలో ఎల్లమ్మకు నటరాజ రామకృష్ణ పరిచయం జరిగింది. అదే సంవత్సరంలో జిల్లా కలెక్టరేట్‌లో చిందు ఎల్లమ్మ తన తొలి అధికారిక ప్రదర్శన ఇచ్చింది. ఆ తరువాత 1980లో అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య సమక్షంలో రవీంద్ర భారతిలో ఇచ్చిన ప్రదర్శన ఎల్లమ్మను కళాభిమానులకు దగ్గర చేసింది.

ప్రశంసలు - పురస్కారాలు[మార్చు]

12వ ఏట నుంచి చిందు భాగవతానికి అంకితమై 50ఏళ్లకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఎల్లమ్మ అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది.

 • రాజీవ్‌ ప్రతిభ పురస్కారం (2004) - రవీంద్రభారతి, హైదరాబాద్‌లో వై.యస్. రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా
 • చంద్రబాబు నాయుడు చే సన్మానం (30వేల రూపాయల పారితోషికం అందజేత) - నల్గొండ జిల్లా
 • కళారత్న అవార్డు - రాష్ట్ర ప్రభుత్వం (1998-99)
 • హంస అవార్డు - రాష్ట్ర ప్రభుత్వం (1999)
 • జాతీయ సాంస్కృతిక మండలిచే సన్మానం - అప్నా ఉత్సవ్‌, ఢిల్లీ (1986)
 • కలెక్టర్‌ బిపి ఆచార్యచే సన్మానం - తెలంగాణ ప్రాంతీయ జానపద గిరిజన కళోత్సవం, వరంగల్ జిల్లా (1991)
 • జిల్లా యువజన సర్వీసుల శాఖచే సన్మానం - స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (1998)
 • సంస్కార భారతి వారి సన్మానపత్రం - రవీంద్రభారతి (1994)
 • నటరాజ రామకృష్ణ చే సన్మానం - ఆంధ్రప్రదేశ్‌ నృత్య అకాడమీ, విశాఖపట్నం (1982)
 • పుట్టపర్తి శాయిబాబా బంగారు గొలుసుతో సత్కారం - పుట్టపర్తిలో 16రోజుల పాటు కళాప్రదర్శనలు జరిపినందుకు
 • రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం (1982)
 • రాష్ట్ర నృత్య అకాడమీ నుండి నెలకు వంద రూపాయలు ఫెలోషిప్‌ మంజూరు (1982)
 • నిజామాబాద్‌ నుంచి బోధన్‌ వరకు గల రహదారికి ఎల్లమ్మ రహదారిగా నామకరణం (2004)

మరణం[మార్చు]

వయస్సు పైబడ్డ తర్వాత ఎటూ కదలలేని ఎల్లమ్మ తన మనవలు, మనవరాళ్లతో కాలం గడుపుతూ వారికి కూడా యక్షగానం, చిందు బాగోతం, ఇతర నాటకాలను నేర్పింది. వృద్ధాప్యంలో ఉన్న ఎల్లమ్మ కీళ్ల నొప్పు లు, ఇతర అనారోగ్య బాధలతో ఉన్న చిందు ఎల్లమ్మ 2005, నవంబర్ 10 న తన 98వ ఏట తుదిశ్వాస విడిచింది.[3]

మూలాలు[మార్చు]

 1. ఆంధ్రజ్యోతి. "చిందు బతుకులు చిగురిస్తాయా? - గడ్డం మోహన్‌రావు". Retrieved 29 June 2017. 
 2. నవతెలంగాణ. "సకల ఆధిపత్యాలపై 'చిందు' ఎల్లమ్మ". Retrieved 29 June 2017. 
 3. ఆంధ్రజ్యోతి. "మూగబోయిన చిందు కళ!". Retrieved 29 June 2017.