Jump to content

తొలిఏకాదశి

వికీపీడియా నుండి
(తొలి ఏకాదశి నుండి దారిమార్పు చెందింది)

ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.

పురాణ నేపథ్యం

[మార్చు]

ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన.తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు, బ్రహ్మ వర బలము గల మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.

సాంఘిక అంశం

[మార్చు]

ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే... భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.

పురాణం - సాంఘికం

[మార్చు]

సూర్య వంశంలో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మము తప్పడు, సత్యసంధుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారము ఉన్నది పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది