ధర్మవరం రామకృష్ణమాచార్యులు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ధర్మవరం రామకృష్ణమాచార్యులు | |
---|---|
జననం | ధర్మవరం రామకృష్ణమాచార్యులు 1853 అనంతపురం జిల్లా ధర్మవరం |
మరణం | 1912, నవంబర్ 30 కర్నూలు జిల్లా ఆలూరు |
ఇతర పేర్లు | "ఆంధ్ర నాటక పితామహుడు" |
వృత్తి | వకీలు |
ప్రసిద్ధి | సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు |
తండ్రి | కొమాండూరు కృష్ణమాచార్యులు |
తల్లి | లక్ష్మీదేవమ్మ |
ధర్మవరం రామకృష్ణమాచార్యులు (Dharmavaram Ramakrishnamacharyulu) (1853 - 1912) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. ధర్మవరం గోపాలాచార్యులు ఇతని పెద్దతమ్ముడు.
జననం, విద్యాభ్యాసం
[మార్చు]వీరు పరీధావి నామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి దినమున కృష్ణమాచార్యులు, లక్ష్మమ్మ దంపతులకు ధర్మపురి అగ్రహారమున జన్మించారు. తండ్రివద్దనే ఆంధ్ర, సంస్కృత, కన్నడ భాషలు నేర్చుకున్నాడు.1870లో మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. తాతగారి వద్ద రఘువంశము, చంపూరామాయణము, ప్రతాపరుద్రీయము చదివాడు. 1874లో ఎఫ్.ఏ. పరీక్షలోను, సెకండరీగ్రేడ్ ప్లీడర్‌షిప్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు.
కృష్ణమాచార్యులవారి తండ్రిగారు మంచి పండితులు. తాత ముత్తాతలుకూడ విఖ్యాత విద్వాంసులు. తండ్రిగారు బళ్ళారి "వార్థ లా కాలేజి లో నాంధ్ర పండితపద మలంకరించిరి. జనకుని సన్నిధినే కృష్ణమాచార్యుడు సంస్కృతాంధ్రములు కఱచెను. మేధాశక్తి గొప్పది యగుట నిట్టే చక్కని సాహిత్వమలవడుట తటస్థించినది. దానివలన బహుగ్రంథపరిశీళనము గావించి పాండిత్యమునకు స్వయముగా మెఱుగు పెట్టుకొనెను. అష్టశతావధాన ప్రదర్శనము గావించి కొక్కొండ వేంకటరత్న మహా మహోపాధ్యాయుని వంటి వారిచే మెప్పుల గాంచెను. అదియటుండ, నీయన కాంగ్ల భాషాభ్యాసము చేయవలయునని అభినివేశము కలిగినది. పట్టుదల గలవారగుట ఎవ్.ఏ పరీక్షలో నుత్తీర్ణత నందిరి. తరువాత అదవాని 'తాలూకాకచేరీ' లో గొన్నాళ్ళు లేఖకులుగా గుదరవలసి వచ్చినది. కవికి దౌర్గత్యముకూడ నొకకళ యైనదిగదా ! పాపము నాటికి వీరిది పేదకుటుంబము. ఆదవానిలో సంసారము సరిగ జరుగక బళ్ళారికి వచ్చి కంటోన్‌మెంటు మేజస్ట్రేటు కోర్టు లో ప్రైవేటు వకీలు ' గా పనిచేయ మొదలిడిరి. ఆయుద్యోగము వీరి దరిద్ర దేవతను దఱిమివైచినది. వకీలు వృత్తి యందు వీరికి లభించిన యుత్తేజనము ఫస్ట్ గ్రేడ్ ప్లీడరుషిప్ పరీక్షకు బురికొల్పి యందుత్తీర్ణుని గావించెను. నాటినుండి వీరి న్యాయవాదవృత్తి నిరాఘాటముగ సాగి న్యాయస్థానమున కెక్కు నభియోగము లన్నిటను వీరి దొక పక్ష ముండి తీరునంత యున్నతికి గొంపోయెను. ప్రతిపక్షులను సాక్షులను ప్రశ్నించుటలో వీరినేర్పు గొప్పది. వీరి వాదము వినుటకు బ్రజలు గుమిగూడి యుండువారట. బళ్ళారి ప్రాంతీయు లిప్పటికిని వీరి న్యాయవాద దక్షత వేనోళ్ళ జెప్పుకొందురు.
ఈయాచార్యకవి యద్భుత మేధాశక్తి యెన్నో కళలను గ్రహించినది. ఆయుర్వేదము వీరు లెస్సగ నెఱుంగుదురు. అది వీరి వంశపారంపర్యముగ వచ్చు విద్య. నాడీపరీక్షలో నీయన సిద్ధహస్తులట. జ్యోతిశ్శాస్త్రమునను వీరి ప్రవేశము చాల గొప్పది. వారి నాటకములలో నిందులకు నిదర్శనములు పెక్కుగలవు. చదరంగము మాడుట యన్న వీరికి చెప్పరాని మక్కువ. నెలల తరబడి యనన్య మనస్కులై యాడుచుండువారని ప్రతీతి. అభినయశాస్త్రము వీరికి బరిచితము. డిబేటింగు సొసైటీ నొకటి స్థాపించి పలువురు పురప్రముఖులనందు సభ్యులుగా జేర్పించి 'షేక్సుపియరు ' నాటకములలో ముఖ్యపాత్రల నభినయించెడి వారు. ఆ సరసవినోదినీ సభ కు నాడు పెద్ద ప్రఖ్యాతి వచ్చినది. నాటకబృందముపై గల దొల్లిటి హేయభావము తొలగించిన దీసభయే. ఈ సభామూలమున నొకసారి 'ఆంధ్రకవిపండిత సంఘ సమ్మేళ ' మాచార్యులవా రతి విజృంభణముగా జరిపిరి. మఱొకసారి ఒంటిమిట్టలో వావిలికొలను సుబ్బారావుగారి 'ఆంధ్ర వాల్మీకి రామాయణ ' కృతిసమర్పణోత్సవమునకు వీరి నధ్యక్షులుగా నెన్నుకొనిరి. అప్పుడు వీరి 'పాదుకా పట్టాభిషేకము ప్రదర్శింపగా రూ. 1500 వచ్చినవి. అవి కోదండ రాముని కైంకర్యమునకే యర్పింప బడినవి. వీరి నాటకములకు బ్రజాసామాన్యములో గల గౌరవమునకిది మంచి తారకాణ. అంకములలోని కథ రంగములుగా విభజించుట వీరి నాటకములలోని క్రొత్తపద్ధతి. ఇది పాశ్చాత్య సంప్రదాయము. నాటకము విషాదాంతము చేయుట వీరి కనభీష్టము కాదు. 'సారంగధర ' ను జూచిన మనకది యవగతము. కాళ్ళు చేతులు విఱుగ గొట్టబడి సారంగధరుడు చనిపోయెను. అంతతో నాటకము సమాప్తము. మఱియొక సంప్రదాయముగల కవియైనచో నిది యిట్లు వ్రాసి యుండడు. ఇదియు నాంగ్లేయమే. సారంగధరునిపై నిందమోపిన చిత్రాంగిని విచారించుటకు రాజనరేంద్రుడొక న్యాయస్థానసభ చేసెను. అది సరిగ నినర్గసుందరముగ నుండి కృష్ణమాచార్యులు గారు గొప్ప న్యావాదియని సాక్ష్యమిచ్చు చున్నది.
ఉద్యోగం
[మార్చు]కొంతకాలం ఆదోని తాలూకా కచేరిలో గుమాస్తాగా పనిచేశాడు. తరువాత బళ్లారి కంటోన్మెంట్ మెజిస్ట్రీట్ కోర్టులో వకీలుగా ప్రాక్టీసు పెట్టాడు.
అభిరుచులు
[మార్చు]ఇతనికి సంగీతంలో, ఆయుర్వేదంలో, నాడీశాస్త్రంలో,జ్యోతిశ్శాస్త్రంలో,చదరంగంలో ప్రావీణ్యం ఉంది. కవితాశక్తిని అలవరచుకుని అష్టావధానాలు, శతావధానాలు చేశాడు.
రచనలు
[మార్చు]- గాధినందను చరిత్రము (పద్యకావ్యము) (అసంపూర్ణము)
- ఉన్మాదరాహు ప్రేక్షణికము
- మదనవిలాసము
- చిత్రనళీయము[1] (1916)
- పాదుకా పట్టాభిషేకము
- భక్త ప్రహ్లాద
- సావిత్రీ చిత్రాశ్వము
- మోహినీ రుక్మాంగద[2] (1920)
- విషాదసారంగధర
- బృహన్నల
- ప్రమీళార్జునీయము
- పాంచాలీస్వయంవరము
- చిరకారి[3]
- ముక్తావళి[4] (1915)
- రోషనారా శివాజీ
- వరూధినీ నాటకము
- అభిజ్ఞానమణిమంతము(చంద్రహాస)[5]
- ఉషాపరిణయము
- సుశీలాజయపాలీయము
- అజామిళ
- యుధిష్ఠిర యౌవరాజ్యము
- సీతాస్వయంవరము
- ఘోషయాత్ర
- రాజ్యాభిషేకము
- సుగ్రీవపట్టాభిషేకము
- విభీషణపట్టాభిషేకము
- హరిశ్చంద్ర
- గిరిజాకళ్యాణము
- ఉదాస కళ్యాణము
- ఉపేంద్ర విజయ (కన్నడ)
- స్వప్నానిరుద్ధ (కన్నడ)
- హరిశ్చంద్ర (ఇంగ్లీష్)
- ఆంధ్రనాటకములలోని యుత్తరరంగములు[6] (1906)
పై రచనలలో మొదటిది మినహా మిగిలినవన్నీ నాటకరచనలే.
నాటకరంగం
[మార్చు]1886లో బళ్లారిలో సరసవినోదిని సభ అనే నాటకసభను నెలకొల్పాడు. మొదట స్వప్నానిరుద్ధ అనే కన్నడ నాటకాన్ని ప్రదర్శించాడు. 1887లో చిత్రనళీయము అనే తెలుగునాటకాన్ని బళ్లారి పట్టణంలో మొదటిసారిగా ప్రదర్శించాడు. ఇతడు నాటకకర్తనే కాదు. నటుడు, దర్శకుడు కూడా. ఇతనికి సంగీతంలో ప్రవేశం ఉంది. పాటలు, పద్యాలకు రాగాలు తనే నిర్ణయించేవాడు. మోహన, జంఝాటి, కేదారగౌళ, కమాజు రాగాలంటే ధర్మవరం రామకృష్ణమాచార్యులకు ప్రీతి. రంగస్థలం మీద రాగయుక్తంగా పద్యాలను పాడే ఒరవడి రామకృష్ణమాచార్యులు తెచ్చిపెట్టిందే. ఇతడు దశరథ, బాహుళ, రాజరాజనరేంద్రుడు, చిరకారి, అజామిళ పాత్రలు అభినయించుటలో దిట్ట.
శ్రీమత్కృష్ణమాచార్యకవికి బూర్వము తెలుగులో స్వతంత్రనంవిధానము గలనాటకములు లేవు. ఉన్న నాటకములు సంస్కృతమున కనువాదములు. ఆ కారణమున నాంధ్రరంగస్థలములు విస్తరించి వెలయలేదు. పాశ్చాత్య సంప్రదాయము, ప్రాచీన సంప్రదాయము నెఱిగి యొకరకమగు క్రొత్తత్రోవదీసి నాటకములు రచించి స్వతంత్ర నాటకరచయితలకు మార్గదర్శి యనిపించుకొనిన మహాశయు డీయన. వీరి కృషిని గుర్తించి గద్వాల మహారాజవరుడు 1910 లో నీయాచార్యకవిని, రత్నస్థగితమగు పతకముతో 'ఆంధ్రనాటక కవితా పితామహు 'డని బిరుదమొసగి గౌరవించెను. విచిత్రసమ్మేళనము గావించి నాటకపాత్రములకు గేవ లాంధ్ర త్వము నాపాదించి తొలుదొల్త స్వతంత్రనాటకములు రచించినావాడగుటచే నీ కవివరున కీబిరుద మన్వర్థ మని నాడు పెక్కుపండితు లగ్గించిరి. పురప్రముఖులు ముగ్దులై యొక కిరీటమర్పించిరి. ఆచార్యుల వారు నాటక కర్తలేకాక నటకులు కూడాను. చిత్రనళీయములో బాహుకుడు, విషాదసారంగధరములో రాజనరేంద్రుడు, పాదుకాపట్టాభిషేకములో దశరథుడు, అభిజ్ఞానమణిమంతములో దుష్టబుద్ధి, ఈ పాత్రములు ప్రత్యేక ప్రశంసాపాత్రములుగా నటించెడివారు. దశరధ పాత్రధారిత్వమున కృష్ణమాచార్యులవారికి సాటి కృష్ణమాచార్యులవారే యని పలువురు చెప్పుకొందురు. ఆచార్యులవారు తమ మరణము నాటక రంగముననో న్యాయస్థానముననో యుండునని యప్పు డప్పు డనుచుండువారు. అది తధ్యముగ వారు 1912 లో నొక యభియోగము నడపుటకు వెళ్ళి 'ఆలూరు ' లో న్యాయస్థానమున నాకస్మికముగ గాలు జారిపడి 'రామచంద్రా' యనుచు నసువులు బాసిరి. వారి మృతకళేబరము నాలూరునుండి బళ్ళారికి దెచ్చి యంత్యక్రియ నడవు సందర్భమున జరిగిన యూరేగింపుటుత్సవము పలువు రిప్పటికి చెప్పుకొందురు. నాటకాచార్యుడై గడించిన కీర్తియు, న్యాయవాదియై సంపాదించిన పేరును నాడు ప్రకటితమైనవి. స్త్రీలు పురుషులు వృద్ధులు యువకులు నొక రననేమి, వేలకొలది పుష్పమాలికాదులచే నాచార్యకవి కంత్యసమ్మాన మొసంగిరి. ఇట్టి మహాశయుని శక్తి యుక్తులు ముచ్చటించు కొందముగాక !
చిత్రనళీయము
[మార్చు]వీరి నాటక చక్రములో 'చిత్రనళీయము ' మిన్నందిన ప్రఖ్యాతి గొన్నది. అందలి పద్య గద్యములు ప్రబంధములకు దీటు వచ్చినవి. అది ప్రదర్శించుట కొక పాటినటకుడు పనికిరాడు. సంపూర్ణమైన యర్థజ్ఞానము కలిగిన మరల నిట్టి కవిత్వము వ్రాయ గలనన్నవాడు వీరి నాటకములు నోట బట్టగలడు. తెలుగులో ననువాదములు రెండుమూడు తప్ప స్వతంత్ర నాటకములు రచించు నలవాటు నాటికి లేకుండుటచే బ్రాబంధిక వాసన వీరి నాటకములలో నననేల, ఆనాడు వ్రాసిన నలుగురైదుగురు కవుల నాటకములలో గూడ వెల్లి విరిసినది.
ఆచార్యులు గారి చిత్రనళీయము చూడుడు. ప్రథమాంకములో స్వయంవరరంగమున భారతిచేత దమయంతికి భుజంగ ప్రయతాదులైన యెన్ని ప్రాబంధిక వృత్తములతో జెప్పించెనో ! ఇప్పుడు బొత్తిగా నాట కములలో బద్యములను బరిహరింపవలయు ననుచున్నారు, అది యౌచితీపోషక మని - అటువంటి యిప్పుడు పృధ్వీవృత్తములు - మత్తకోకిలములు దృశ్యకావ్యములలో నుపయోగించుట యొకరకముగానుండును. నాటినటకులుకూడ సర్వసమర్ధులు ఇప్పు డిట్టివి యాడువారు నూటికి గోటికిని - ఇంచుమించుగా శ్రీనివాసరావుగారివి, కృష్ణమాచార్యులు గారివి కూడ బద్యనాటకప్రాయములు. అడుగడుగునకు బద్యము. తిరుపతి వేంకటకవులుల పాండవనాటకములలోను పద్యములపా లెక్కువయే. కానివారు కొంతశైలి తేలికపఱిచిరి.
చిత్రవళీయము చతుర్థాంకములో "శరద్రాత్రి" ని వారివారి యుపాలంభనములు యిరువదియైదు పద్యములలో నాచార్యులవారు వర్ణించి వైచిరి. నిజముగా నాపద్యము లే వసుచరిత్రాది ప్రబంధములకునందని యుదాత్తభావములు కలవి. భాషయు నట్టిదే. విరహ వ్యధావిధురుడైన బాహుకభూమికాధారి యొక్క పెట్టున నాపద్యములు చదువవలయునన్న డొక్క బ్రద్దలగును. నాటి నటకులు కాబట్టి చిత్రవళీయాదుల కంత ప్రఖ్యాతి ప్రజాసామాన్యములో గూడదీసికొని రాగలిగిరి. నటకులై ఖండాంతర ప్రసిద్ధిగాంచిన తాడిపర్తి రాఘవాచార్యులుగారికి మనఆచార్యులుగారు మేనమామ. వీరి నాటకపద్యములు చాలమందికి నోటికి వచ్చినవే యై యుండును. అయినను రెండుమచ్చు:
అతిమాత్రంబుగ దు:ఖమున్ సుఖము దైవాతీనతం గర్మ సం
గతిమై బ్రాణికిగల్గుగా యిపుడు దు:ఖప్రాప్తి మల్లాడె శ్రీ
యుతుడాభూభూరమణుండు వెండియును నేడోఱేపో యాకాల దు
స్థితి దీఱంగను సర్వసౌఖ్యముల నిశ్చింతాత్మీతం జెందడే?
బళి రే కంటినిగంటి సప్తజలధి ప్రావేష్టితాఖండ భూ
లలనాధీశ కిరీట వారిరుహరోలంబాయమాస ప్రభో
జ్జ్వలితారిందమనూపురాత్త సదసేవాప్రీతగోత్రాధవున్
నళభూమీధవు నాశ్రితౌ ఘ కరుణా నవ్య ప్రభామాధవు
సన్మానాలు
[మార్చు]- 1891లో మధ్రాసులో సంస్కృత పండితుడు ఓపర్ట్ ఇతని నాటకాన్ని చూసి మెచ్చి రత్నఖచిత బంగారు పతకం బహూకరించాడు.
- 1910లో గద్వాల మహారాజు ఇతడిని ఆంధ్రనాటకపితామహుడు అనే బిరుదుతో సత్కరించాడు.
- బళ్లారి పురప్రముఖులు ఇతడిని రత్నఖచిత కిరీటంతో సన్మానించారు.
ఇవి కూడా చదవండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ధర్మవరం రామకృష్ణమాచార్యులు, పి.ఎస్.ఆర్.అప్పారావు, సాహిత్య అకాడమి, న్యూఢిల్లీ, 1989. పూర్తి పుస్తకం
- రాయలసీమ రచయితల చరిత్ర
మూలాలు
[మార్చు]- ↑ చిత్రనళీయ నాటకము, ఆర్కీవులో పూర్తి పుస్తకం.
- ↑ ఆర్కీవులో మోహినీ రుక్మాంగద నాటకము పూర్తి పుస్తకం.
- ↑ రామకృష్ణమాచార్యులు, ధర్మవరం. చిరకారి. Retrieved 2020-07-12.
- ↑ ముక్తావళి నాటకము, ఆర్కీవులో పూర్తి పుస్తకం.
- ↑ రామకృష్ణమాచార్యులు, ధర్మవరం. అభిజ్ఞాన మణిమంతము. (గతంలో DLI లో వుండేది)
- ↑ ఆంధ్రనాటకములలోని యుత్తరరంగములు ఆర్కీవులో పూర్తిపుస్తకం.