Jump to content

శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (ఖమ్మం)

వికీపీడియా నుండి
(నరసింహ స్వామి గుట్ట (ఖమ్మం) నుండి దారిమార్పు చెందింది)
నరసింహస్వామి ఆలయం (ఖమ్మం)
నరసింహస్వామి ఆలయం, ఖమ్మం
నరసింహస్వామి ఆలయం, ఖమ్మం
పేరు
ఇతర పేర్లు:నరసింహస్వామి గుట్ట
ప్రధాన పేరు :నరసింహస్వామి ఆలయం (ఖమ్మం)
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఖమ్మం జిల్లా
ప్రదేశం:ఖమ్మం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:లక్ష్మీనర్సింహస్వామి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ

శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఖమ్మం జిల్లా ప్రధానకేంద్రం ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఒక ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇది తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. ప్రహ్లదుడిని రక్షించేందుకు నరసింహస్వామివారు ఒక స్తంభంలోనుంచి బయటకు వచ్చారని కథనం. అటువంటి స్తంభాన్నికలిగివున్న ప్రాంతం కాబట్టి స్తంభాద్రి, స్తంభశిఖరి, కంభంమెట్టు అనే పేర్లనుంచి కాలక్రమంలో ఖమ్మం అనే పేరు ఏర్పడింది అని చెపుతారు.[1][2]

స్థల పురాణం

[మార్చు]

పూర్వం మౌద్గల మహర్షి ఈ స్థంబాధ్రి ప్రాంతంలో శ్రీ హరి గురించి తపస్సు చేయగా శ్రీహరి లక్ష్మీసమేత నరసింహుడిగా ప్రత్యక్షమయాడు. శ్రీ హరి ముని కోరిక మేరకు ఇక్కడే భక్తుల దర్శనార్థం ఒక గుహలో కొలువు తీరాడని స్థల పురాణం. ఖమ్మం కోట నిర్మాణ సమయంలో కాకతీయ చక్రవర్తి స్వామివారికి ఆలయం నిర్మించాడని చరిత్ర వలన తెలుస్తున్నది.[3]

ఆలయ చరిత్ర

[మార్చు]

శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో హిరణ్యకశిపుడనే రాక్షసుడిని సంహరించి ఆయన కుమారుడు ప్రహ్లాదుడిని కాపాడే కథ చాలా ప్రముఖమైనదే. ఆనాడు స్తంభము నుండి ఉద్భవించిన స్వామియే ఈ కొండపై ఉన్న గుహలో వెలిసాడని అందుచేతనే కొండకు స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెపుతారు.అంతేకాక ఈ కొండమొత్తంగా కూడా ఒక స్తంభంఆకారంలో వుంటుంది. కాబట్టి కూడా పట్టణానికి స్తంభాద్రి అనే పేరు వచ్చేందనేది మరొక కథనం.అంతేకాక ఆరోజులనుంచే కంభంమెట్టు అనే పేరు వుందని ఖమ్మంజిల్లా ఆదికవి హరిభట్టు తన వరాహ పురాణములో పేర్కొన్నాడు.

1953వ సంవత్సరంలో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా అవతరించిన తర్వాత ఖమ్మం మెట్టును ఖమ్మంగానూ అదేవిధంగా అప్పటివరకూ వరంగల్ జిల్లాలో భాగంగా మాత్రమే వున్న ఖమ్మ జిల్లాను ఒక ప్రత్యేక జిల్లాగానూ గెజిట్ ద్వారా మార్చారు. ఇలా జిల్లా పేరుకు ప్రధాన కారణంగా ఈ ఆలయం కావటం మరింత ప్రత్యేకత.

ఆలయ విశిష్టత

[మార్చు]

కొండను తొలచి చేసిన స్థంభాలపై చెక్కిన కాకతీయుల శిల్ప కళాశైలి చూపరులను అబ్బుర పరుస్తుంది. రాతితో నిర్మించిన ఏకశిలా ధ్వజస్థంభం ఇక్కడి ప్రత్యేకత. మరో విశేషమేమంటే స్వామి వారు దక్షిణాభిముఖంగా ఉండటము. గర్బగుడిలో స్వామి వారికి ఎడమవైపున లక్ష్మీదేవి, కుడివైపున అద్దాల మండపం ఉంటాయి. ధ్వజ స్తంభం ప్రక్కనే ఆంజనేయ స్వామి మందిరం, గుట్టపై సుబ్రమణ్యస్వామి, విష్ణుమూర్తి, ఆంజనేయ మందిరం, శ్రీవేంకటేశ్వరాలయం ఉన్నాయి. ఇక్కడున్న స్వామివారి కోనేరులో నీరు అన్ని వేళలా ఉంటుంది. వర్షాకాలంలో నీరు ఎక్కువై ఆలయంలోని స్వామి వారి నాభి వరకు నీరు చేరుతుంది. ఆ సందర్భంలో ఆ నీటిని బయటకు పంపుతారు. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏమంటే నల్లరాతిలో చెక్కిన సాయిబాబా విగ్రహము. నల్లరాతి సాయిబాబా విగ్రహం ఉన్న ఆలయం మన రాష్ట్రంలో ఇదొక్కటే నని చెపుతారు.[4]

పూజలు

[మార్చు]

స్వామి వారికి మూడు పూటలా పూజలు జరుగుతాయి. ప్రతీ శుక్రవారం లక్ష్మీదేవికి క్షీరాభిషేకము, ప్రతి ఆదివారము అన్నదానము చేస్తుంటారు. నరసింహ స్వామి పానక ప్రియుడంటారు. అందుకే నిత్యం పానకం తోనే స్వామి వారికి అభిషేకము చేస్తుంటారు. ఇక్కడున్న ఆరున్నర అడుగుల ఎత్తుండే నల్ల రాతి సాయి బాబాను భక్తులు శ్రీకృష్ణుని అంశంగా భావించి శ్రీకృష్ణాష్టమి నాడు సాయిబాబాకు విశేష పూజలు నిర్వహిస్తారు. నరసింహ స్వామి అవతరించి నట్లుగా చెప్పే వైశాఖ శుద్ధ చతుర్థశి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అయిదు రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో స్వామి వారికి పవిత్రోత్సవాలు, అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా దసరా నాడు స్వామిని అశ్వ వాహనంపై ఊరేగిస్తారు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమంటే హిందువులతో పాటు ముస్లిములు కూడా తమ పెద్దల స్మారకార్థం ఏటా ఉగాదినాడు ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించి కానుకలు సమర్పించుకుంటారు. చాలా శతాబ్దాలుగా జరుగుతున్న ఎక్కడా లేని ప్రత్యేకమైన సాంప్రదాయం ఇది.[4]

ఆలయ ప్రత్యేకతలు

[మార్చు]

దక్షిణాభిముఖుడు

[మార్చు]

సాధారణంగా దేవాలయాలు తూర్పులేదా ఉత్తరదిశలకు తిరిగి వుంటాయి కానీ ఇక్కడి నరసింహస్వామి మాత్రం దక్షిణాభిముఖుడుగా వుంటాడు.

స్వయంభూవుగా వెలసిన నారసింహ స్వామి

[మార్చు]

ఎత్తైన కొండలపై వెలసిన నారసింహమూర్తి శిల్పం సహజంగానే వెలసిందని, శతాబ్ధాల కాలం నుంచి అది అక్కడే వున్నట్లు భావిస్తారు.

అత్యంత ప్రాచీన శిల్పనిర్మాణ శైలి

[మార్చు]

ఈ ఆలయ స్తంభాలపై కనిపించే స్తంభాల శిల్పనిర్మాణ శైలి కాకతీయుల స్తంభాలను పోలి వున్నప్పటికి అంతటి పూర్తి స్థాయి నగిషీలు లేక చాలా ప్రాథమిక దశలోనే వున్నట్లు కనిపిస్తుంది. అంతేకాక గర్భగుడికి ముందున్న నిర్మాణంలో ముందస్తుగా ఏర్పరచిన స్తంభాలకూ ఆ తర్వాత విస్తరణలో అభివృద్ధి పరచిన స్తంభాలకూ మధ్య భేదాన్ని గమనించ గలుగుతాం.

నలుపలకల ఏకశిలా ధ్వజస్థంభం

[మార్చు]

ఇక్కడి ధ్వజస్తంభం పూర్తిగా శిలతో నిర్మించినదే, మరి అత్యంత ఎత్తుగా కాక గుడికంటే కొంత ఎత్తుగా మాత్రం వుంటుంది. అంతే కాకుండా ధ్వజస్తంభం గుండ్రని నిర్మాణంతో స్తూపం ఆకారంలో కాక ఇది నలుపలుకలుగా దీర్ఘఘనం ఆకారంలో వుంటుంది.

స్వామి వారి చూపుని అనుసరించి ఐమూలగా ధ్వజస్తంభ నిర్మాణం

[మార్చు]

సాధారణంగా దేవాలయాలలో గర్భగుడిలోని మూలవిరాట్టుకు కచ్చితంగా ఎదురుగా వుండేలా ధ్వజస్తంభ నిర్మాణం చేస్తారు. కానీ ఇక్కడ మూల విగ్రహానికి ఎడమ వైపు ఐమూలగా కొంత కోణంలో ధ్వజస్తంభం వుంటుంది. ఇలా వుండటానికి కారణం మూలవిరాట్లు ముందుకు లంబంగా కాక కొంత కోణంలో పక్కకు చూస్తున్నట్లుగా ఉంటుంది.

రాతి ధ్వజస్తంభంపై అత్యంత ప్రాథమిక రూపంలో గీసిన ఒక పక్షివంటి రూపం ఉంది. అంటే దానిని నరసింహావతారం ప్రాథమిక రూపమైన విష్ణుమూర్తికి వాహనం అయిన గరుత్మంతునిగా భావించి గీచి వుండవచ్చు. అలాగే మరోపక్క ధ్వజస్తంభంపై చేపవంటి ఆకారం కనిపిస్తోంది. బహుశా స్తంభం తొడుగులోపల పరిశీలిస్తే దశావతారాలు పూర్తిగా వుంటాయేమో. ఈ చేప మత్చావతారానికి ప్రతీకగా గీచి వుండవచ్చు.[4]

కొండమీద నీటి కొలను

[మార్చు]

ఇంత ఎత్తుగా వున్న కొండపై సంవత్సరం పొడవునా నీటినిల్వలు వుంటాయి. కొండను రెండుగా చీల్చినట్లున్న ప్రాంతంలో అంతమైన కొలను కనిపిస్తుంది.

నాభిసూత్ర జలాభిషేకం

[మార్చు]

ఉగ్రరూపుడైన నరసింహుని శాంతిపజేయటానికా అన్నట్లు కొలను నిండుగా వున్నప్పుడు అక్కడినుండి వున్న నాభివంటి అంతర్గత మార్గాల ద్వారా స్వామివారిని చల్లబరిచే అభిషేకం జరుగుతుందట. కొన్నిసార్లు కేవలం చెమ్మవంటి తడిమాత్రమే కాక ఏకంగా ప్రవాహంలాగా నీరు కొండమీది కొలనునుంచి గర్భగుడిలోని స్వామివారి విగ్రమాన్ని తడుపుతూ నీళ్ళు చేరుటాన్ని ఈ అర్చకులు చాలా సార్లు గమనించారట. దీనిని దేవాలయ మహాత్మ్యానికి విశేష ఉదాహరణగా పేర్కొంటారు.

కోడె స్తంభం

[మార్చు]

మూలవిరాట్టుకు కొంత కోణంలో రాతి ధ్వజస్తంభం నిర్మిస్తే సరాసరి ఎదురుగా ఒక నిలువెత్తు రాతి స్తంభం భూమిలో పాతి నిలబెట్టి వుంటుంది.దానికి మధ్యలో ఒక గంటుకూడా ఉంది. దీనిని మొక్కుబడులు తీర్చుకునే కోడె స్తంభంగా ఆలయ అర్చకులు పేర్కొన్నారు. మొక్కుబడులను అనుసరించి ఈ స్తంభానికి వారు దారంతో కొంత సమయం మేర కట్టేసుకోవడం ద్వారా మొక్కుబడిని చెల్లించుకుంటారని తెలియజేసారు. బహుశా జంతుబలులకు కట్టుస్తంభంగా కానీ వధ్యశిలగా కానీ ఇది వాడుకుని వుండొచ్చనే విశ్లేషన కూడా ఒకటి ఉంది.

క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి

[మార్చు]

ఈ నారసింహ క్షేత్రానికి క్షేత్రపాలకుడు హనుమంతుడి, దక్షిణదిశగా తిరిగి వున్న ఈ ఆలయంలో ఆగ్నేయ దిశలో క్షేత్రపాలకుని మందిరం వుంటుంది.

పానకఫు అభిషేకం

[మార్చు]

చాలా నరసింహ క్షేత్రాలతో స్వామివారికి నైవేద్యపానియంగా పానకాన్ని సమర్పిస్తారు. మంగళగిరి నరసింహస్వామికి ఎన్నిబిందెలు పానకం పోసినా స్వీకరిస్తాడని అయినప్పటికి భక్తులకు ప్రసాదంగా కొంత మిగుల్చుతాడని కథనంగా చెప్పుకుంటారు. ఆవిధంగా మిగిల్చే పద్ధతిలో శిల్పాన్ని నిర్మిస్తూ శిల్పులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడి ఖమ్మం గట్టు నరసింహస్వామికి పానకంతో అభిషేకం చేయడం ప్రత్యేకత. అత్యంత ఉగ్రరూపుడైన స్వామివారిని శాంతింపజేసేందుకు పానకంతో అభిషేకం చేయడం అనే పద్ధతి పూర్వకాలం నుంచి వస్తోందని తెలియజేసారు.

సర్పశిలలు

[మార్చు]

సర్పదోష మొక్కుబడులకూ దోష నివారణకూ సర్పశిల లేదా ఇప్పటి రోజుల్లోలాగా లోహసర్పాలనూ పూజలో వుంచి దేవాలయాల వద్దవదిలేసే ఆనవాయితీ ఉంది. దానిని సూచిస్తున్నట్లు ఇక్కడ అనేక రకాలైన అనేక సర్పశిలలు కనిపిస్తాయి.

ఆహ్లాద కరమైన పార్కు

[మార్చు]

దేవాలయం ఆవరణలో వున్న విశాలమైన పార్కు ప్రధాన ఆకర్షణ. మెట్లదారిలో ఎక్కుతూ రావడానికి కష్టం అయిన వారికి పార్కువైపు నుంచి వాహనాల ద్వారా చేరుకునే ఏర్పాట్లు చేయడం వల్ల భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తిభావంతోనే కాకుండా ప్రశాంత వాతావరణాన్ని అనుభవించేందుకు కూడా ఈ స్తంభశిఖరి అత్యంత అనుకూలమైన ప్రాంతం

రవాణా సౌకర్యాలు

[మార్చు]

వివిధ ప్రాంతాలనుంచి ఖమ్మం పట్టణానికి రైలు లేదా బస్సుద్వారా సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి కేవలం 195 కిలోమీటర్ల దూరంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడనుంచి కేవలం 125 కిలోమీటర్ల దూరం లోనూ ఉంది.

తెలుగులో శ్రీనృసింహ గాధలు

[మార్చు]

ప్రముఖ నరసింహ క్షేత్రాలు

[మార్చు]

ప్రార్థనలు

[మార్చు]

విశేషాలు

[మార్చు]
  • ప్రత్యేకించి ఆరోగ్యంకోసం నరసింహ స్వామిని ఆరాధించడం ఒక ఆచారం.
  • నరసింహాలయాలు ఉన్న కొండలను "వేదాద్రి" అని పిలవడం చాలాచోట్ల జరుగుతుంది.
  • మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ప్రహ్లాదుని అవతారమని కథ, భక్తుల విశ్వాసం
  • తెలుగునాట బాగా ప్రసిద్ధి చెందిన పౌరాణిక నాటకాలలో "భక్త ప్రహ్లాద" ఒకటి. "భక్త ప్రహ్లాద" వంటి నాటకాలు వేసేప్పుడు నరసింహపాత్రధారిగా కాస్త చిన్న బాలుడిని తీసుకొంటారు (స్తంభంలో పట్టడానికి అనువుగా). నరసింహావిర్భావం సీనులో స్తంభం చీలి (ఉగ్రమూర్తిగా)స్వామి (పాత్రధారి) బయటకు రాగానే శాంతింపజేయడానికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడం ఆనవాయితీ.
  • తెలంగాణాలో యాదగిరిగుట్ట చుట్టుప్రక్కల జిల్లాలలో "యాదగిరి" అనేది సర్వ సాధారణమైన పేరు. దూరదర్శన్ తెలంగాణా ఛానల్ కు కూడా ‘యాదగిరి’ అనే పేరునే పెట్టారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో (అప్పల నరసింహస్వామి పేరుమీద) అప్పారావు, అప్పలరాజు, అప్పలసామి, అప్పలమ్మ, నరసరాజు, నరసమ్మ వంటివి సాధారణమైన పేర్లు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో (పానకాల నరసింహస్వామి పేరుమీద) పానకాలు పేరు పెట్టుకొంటారు. అలాగే నరసింహ, సింహ, నరహరి వంటి పదాలతో కూడిన పేర్లు అతిసాధారణం.
  • అన్నమయ్య కీర్తనలలో శ్రీవేంకటేశ్వరుని రూపాన్ని స్తుతించేవి అధికాధికం. తరువాత శ్రీనారసింహుని స్తుతించే కీర్తనలు కూడా చాలా ఉన్నాయి.
  • తెలుగు సినిమా పేర్లలో కూడా "సింహ" బాగా ప్రాచుర్యాన్ని పొందింది. (సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహాద్రి, లక్ష్మీనరసింహా, నరసింహుడు .. )
  • చెంచులక్ష్మి సినిమాలో నృసింహావతారం ఉత్తరభాగంగా చెప్పబడే కథ ఉంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "యాదాద్రి కాకుండా తెలంగాణ‌లో ఉన్న న‌ర‌సింహ‌స్వామి ఆల‌యాలు ఇవే." Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-06.
  2. Kishore, Sajjendra (2018-09-22). "ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?". telugu.nativeplanet.com. Retrieved 2022-07-06.
  3. "Stambadri Lakshmi Narasima Swamy / స్తంభాధ్రి లక్ష్మీ నరసింహస్వామి". www.telugukiranam.com. Archived from the original on 2022-07-06. Retrieved 2022-07-06.
  4. 4.0 4.1 4.2 "మహిమాన్వితుడు స్తంభాద్రి నృసింహుడు - Andhrajyothy". web.archive.org. 2022-07-06. Archived from the original on 2022-07-06. Retrieved 2022-07-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లంకెలు

[మార్చు]