శ్రీపాద పినాకపాణి
శ్రీపాద పినాకపాణి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1913 ఆగస్టు 3 |
మూలం | శ్రీకాకుళం, మదరాసు రాష్ట్రం |
మరణం | 2013 మార్చి 11 | (వయసు 99)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | వైద్యం |
క్రియాశీల కాలం | 1930 - 2013 |
రోగాలను, రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాక పాణి (ఆగష్టు 3, 1913 - మార్చి 11, 2013). వైద్య, సంగీత రంగాలలో నిష్ణాతులైన పలువురు వీరి శిష్యులే.. గురువులకే గురువు డా. శ్రీ పాద.. శాస్త్రీయ సంగీతం తెలుగునాట అంతంత మాత్రంగా ఉన్న దినాలవి. నాటక పద్యాలలోనో, హరికథలలోనో తప్ప శాస్త్రీయ సంగీతం వినబడని ఆరోజులలో, తమిళ నాట లాగే శాస్త్రీయ సంగీతం తెలుగునాట పరిమళించాలని ఆకాంక్షించారు. ఆ దిశగా ఎందరో సంగీత శిఖామణులను తెలుగు వారికి అందచేశారు.
జననం, బాల్యం, విద్యాబ్యాసం
[మార్చు]శ్రీపాద శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో 1913, ఆగష్టు 3 వ తేదిన కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు జన్మించాడు. రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు గారి వద్ద తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు దగ్గర శిష్యరికం చేశాడు. 1939వ సంవత్సరంలో విశాఖపట్నం ఆంధ్ర వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.ఎస్. పట్టా తీసుకున్నాడు. 1945వ సంవత్సరంలో జనరల్ మెడిసన్లో ఎం.డి. పూర్తి చేశాడు.
రోగ నిర్మూలన
[మార్చు]ఎం.డి. పూర్తి చేసిన పిమ్మట డా. శ్రీ పాద రాజమండ్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ప్రభుత్వ సేవలో చేరారు..1951 నుండి 1954 వరకు విశాఖ పట్నంలో వైద్యకళాశాలలో సివిల్ సర్జన్ గా పనిచేసారు.. 1957లో కర్నూలు వైద్యకళాశాలకు బదిలీ అయ్యారు. అక్కడే కళాశాల ప్రిన్సిపాల్ గా, సూపరింటెండ్ గా పనిచేసి 1968 లో పదవీ విరమణ చేసారు..కర్నూలులో స్ధిర నివాసం ఏర్పర్చుకున్నారు.
రాగ సాధన
[మార్చు]సంగీతం వింటూనే నొటోషన్స్ రాయగల నైపుణ్యం వీరి కుంది.. పదవీ విరమణానంతరం, త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీ కారం చుట్టారు..సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి..పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర పుస్తకాలు రచించారు.
శిష్యప్రముఖులు
[మార్చు]డా. నోరి దత్తాత్రేయుడు వైద్యరంగంలో శ్రీపాద వారి ప్రముఖ శిష్యులలో ఒకరు కాగా, నూకల చినసత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు, నేతి శ్రీరామశర్మ సంగీతంలో వారి శిష్యులు..
బిరుదులు, పురస్కారాలు
[మార్చు]- వారి ఇతర బిరుదులు సంగీతకళా శిఖామణి, సప్తగిరి సంగీత విద్వాన్ మణి, గానకళాసాగర, కళాప్రపూర్ణ ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు వారు అందుకొన్నారు.. వారి సంగీతాన్ని కేంద్రనాటక అకాడమీ రికార్డ్ చేసి ఆర్కైవ్స్ లో పొందు పరచింది.
- సంగీత కళానిధి అవార్డు అందుకున్నారు.
- 1977 లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు.
- 1978 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం చే కళాప్రపూర్ణ బిరుదు అందుకున్నారు.
- 1984 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
- 2011 లో సంగీత నాటక అకాడమీ ఠాగూర్ ఫెలో గౌరవాన్ని పొందారు.
- 2012, ఆగష్టు 3 న తన 99 వ జన్మదిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే "జ్ఞాన విద్యా వారథి" బిరుదుయివ్వబడింది.
జయంతి ఉత్సవాలు
[మార్చు]శత వసంతంలో అడుగిడిన శ్రీ పాద పినాక పాణి గారిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శుక్రవారం కర్నూలు సునయన ఆడిటోరియంలో ఆయన శిష్యులతో సంగీత కార్యక్రమాన్ని రాష్ట్ర సాంస్కృతిక విభాగం, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి, జిల్లా కలెక్టర్ వారికి సువరణ కంకణం బహుకరించారు. తిరుమల తిరుపతి దేవస్ధానం రూ.10,01,116 లతోపాటు గాన విద్యావారధి బిరుదు ప్రదానం చేసారు.గణపతి దత్త పీఠం వారు సన్మాన పత్రాన్ని అంద చేసారు.. భీమిలి శివగంగ పరిషత్ చీఫ్ పాట్రన్ శివానంద మూర్తి గారు శ్రీ పాద వారిని శాలువతో సత్కరించారు.
బయటి లింకులు
[మార్చు]- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1913 జననాలు
- సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు
- పద్మభూషణ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- కళాప్రపూర్ణ గ్రహీతలు
- తెలుగువారిలో వైద్యులు
- 2013 మరణాలు
- కర్ణాటక సంగీత విద్వాంసులు
- శ్రీకాకుళం జిల్లా వైద్యులు
- శ్రీకాకుళం జిల్లా సంగీత విద్వాంసులు