బాహుబలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బాహుబలి విగ్రహం

జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైనమతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్‌ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాత కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు

బాహుబలి పుట్టుక[మార్చు]

కాయోత్సర్గ భంగిమలో ధ్యానం చేస్తున్న బాహుబలి విగ్రహం

విష్ణుపురాణం, జైన గ్రంథాలు, ప్రచారంలో ఉన్న కొన్ని కథలను బట్టి బాహుబలి చరిత్రను తెలుసుకోవచ్చు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సుమంగళి, సునంద అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు. (విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది). భరతుడు గొప్ప వీరునిగాను, రాజనీతి కోవిదుడుగానూ తయారయ్యాడు. బాహుబలి చాలా పొడగరి. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు. అతడి భుజబలం అమోఘమయింది. బ్రహ్మి సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె పేరు మీదే అప్పట్లో 'బ్రాహ్మీ' లిపిని రిషభదేవుడు కనిపెట్టాడంటారు. అశోకుని కాలంలో దొరికిన తొలి శాసనాలు అత్యధికం బ్రాహ్మి లిపిలోనే ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. సుందరి గణితంలో దిట్టయింది. వృషభదేవుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. కాలం గడిచే కొద్దీ ఆయనకు ఐహిక జీవితంపై విరక్తి పుట్టుకొచ్చింది. తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచిపెట్టాడు. తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రభూషణాదులను త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. అనేక ఏళ్ళ తపస్సు అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే 'జినత్వం' పొందడం అంటారు. తాను తెలుసుకున్న సత్యాలను దేశాటన చేస్తూ ప్రజలకు తెలియ చేశాడు రిషభుడు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అనేకమంది రాజులు, వ్యాపారులు, సాధార ప్రజలు రిషభుని మతాన్ని స్వీకరించారు.

చక్రరత్న ఆయుధం[మార్చు]

ధర్మస్థలి లోని బాహుబలి విగ్రహం

రిషభుడు లేదా రిషభదేవుడు అడవులకు వెళ్ళిన తరువాత అతని కుమారుడు భరతుడు ఓ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం బలమైన సైన్యాన్ని నిర్మించడంతో పాటు కొత్త కొత్త ఆయుధాలను తయారుచెయ్యడం ప్రారంభించాడు. అతడి సైన్యం 'చక్రరత్న' అనే ఆయుధాన్ని తయారు చేసింది. దీన్ని భరతుడే ప్రయోగిస్తాడు. ఇది గురితప్పదు. అప్పటి ప్రపంచంలో భరతుని చేతుల్లో ఉన్న ఆయుధాలు మరెవరి దగ్గరాలేవు. అందుకే అతడు పాలిస్తున్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ లొంగిపోయాయి. చివరికి తన 98 మంది సోదరుల రాజ్యాలను కూడా ఆక్రమించుకున్నాడు. తమ్ముళ్ళందరూ తమ రాజ్య భాగాలను అన్నగారికి అప్పగించి తమ తండ్రి ఉంటున్న అడవులకు వెళ్ళి ఆయన శిష్యులుగా మారారు. ఇలా మహా సామ్రాజ్యం స్థాపించడం వల్లనే ఈ భరతుని పేరుమీదుగా భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని జైనమతం ఆధారంగా చెపుతారు. శకుంతల,దుశ్యంతుల కుమారుడైన భరతుని పేరుమీదుగా ఈ పేరు రాలేదన్నది ఈ వాదనలోని ముఖ్యాంశం

అయితే భరతుని జైత్ర యాత్రను అడ్డుకుంటూ ముందుకు వచ్చిన వీరుడు మాత్రం బాహుబలి.

భరతుడు, బాహుబలి ల యుద్ధం[మార్చు]

వేనూర్ లోని బాహుబలి విగ్రహం (1904 CE)
ధర్మస్థలిలోని బాహుబలి విగ్రహం (1973 CE)

భరతుడు బాహుబలి ఇద్దరూ బలశాలురే, ఇద్దరి బలగాలూ బలమైనవే కాబట్టి ఈ యుద్ధంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మంత్రులు ఒక ఒప్పందం చేసారు. యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైన అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తమ ఒక ప్రతిపాదన వారి ముందు ఉంచారు. ఇరు సైన్యాలు తలపడితే అపార ప్రాణ నష్టం జరుగుతుందని కాబట్టి, సైన్యాలను యుద్ధంలో దించకుండా అన్నదమ్ములిద్దరే యుద్ధం చెయ్యాలని, ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి రాజ్యం గెలిచినవారికి ఇచ్చివెయ్యాలనేది మంత్రుల ప్రతిపాదన సారాంశం. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ సమ్మతించారు. వీరిద్దరి మధ్య దృష్టి యుద్ధం, జలయుద్ధం, మల్ల యుద్ధం (ద్వంద్వ యుద్ధం) అనే మూడు రకాల యుద్ధాలు జరగాలని మంత్రులు నిర్ణయించారు. అయితే ఎవ్వరూ ఆయుధం ప్రయోగించరాదనే షరతు విధించారు. ముందుగా దృష్టి యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధ నియమం ప్రకారం ఒకరి కళ్ళలోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి. కళ్ళార్పకూడదు. ఎవరు ముందు కళ్ళు ఆర్పుతారో వారు ఓడిపోయినట్లు లెక్క. బాహుబలి తన అన్న భరతుని కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతడిలో ఏవేవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ఈ కళ్ళలోకి క్రోధాగ్నుల్ని ఎలా విరజిమ్మడం... అనుకుంటూ ప్రసన్నవదనంతో అన్నగారి కళ్ళలోకి చూస్తున్నాడు బాహుబలి. భరతుని పరిస్థితీ అలాగే ఉంది. తమ్ముడి ముఖంలో కనిపిస్తున్న ప్రేమ మమకార వాత్సల్యాలకు తనలో ఉన్న కోపాన్ని మరిచిపోయి ప్రశాంత చిత్తుడై కళ్ళు మూసుకున్నాడు. అంతే భరతుడు దృష్టి యుద్ధంలో ఓడిపోయినట్లు మధ్యవర్తులు ప్రకటించారు. కళ్ళుమూసి తెరిచేలోపల ఓటమి పాలవ్వడంతో భరతుడు నివ్వెరపోయాడు. రెండవదైన జలయుద్ధం ప్రారంభమయింది. నదిలో దిగి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకోవడం ఈ యుద్ధం ప్రత్యేకత. యుద్ధం ప్రారంభమైన కొంతసేపటికి భరతుడు అలిసిపోయాడు. ఈసారి కూడా అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలినే విజయం వరించింది. రెండు యుద్ధాల్లో ఓడిపోయిన భరతుడు మల్ల యుద్ధంలోనైనా గెలవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆ యుద్ధమూ ప్రారంభమయింది. ముందుగా భరతుడు బాహుబలునిపై పిడిగుద్దులు కురిపించాడు. రెండో గుద్దుకే బాహుబలి కిందపడిపోయాడు. తమ్ముడు కిందపడిపోవడంతో కంగారు పడ్డాడు భరతుడు. తమ్ముడు మరణిస్తున్నాడేమోనని బాధపడ్డాడు. ఇంతలో తెప్పరిల్లి పైకి లేచాడు బాహుబలి. ఇప్పుడు గుద్దే వంతు అతడిదే. అన్నను రెండు చేతుల్తో పైకి లేపి గిరగిరా తిప్పి జాగ్రత్తగా కిందకు దించాడు. గట్టిగా గుద్దటానికి చెయ్యి పైకి లేపాడు. ఈ దెబ్బతో భరతుడు చనిపోవడం ఖాయమని అక్కడ చేరిన వారందరూ హాహాకారాలు చేశారు. భరతుడు కూడా ప్రాణ భయంతో ఒణికిపోయాడు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆయుధాన్ని వాడరాదనే నియమాన్ని పక్కనబెట్టి తన చక్రరత్న ఆయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కానీ అది పనిచెయ్యలేదని జైన గ్రంథాలు చెబుతున్నాయి. నియమ విరుద్ధంగా ఆయుధాన్ని ప్రయోగించాడనే కోపంతో బాహుబలి అన్నను గుద్దటానికి పిడికిలి ఎత్తాడు. చెయ్యి ఎత్తిన వెంటనే అతడి మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి. నేనేం చేస్తున్నాను. నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యజించిన రాజ్యాధికారం కోసమా తోబుట్టువును చంపబోతున్నాను...తుచ్ఛమైన ఈ రాజ్య భోగభాగ్యాలు వద్దు. తండ్రిగారు, తమ్ముళ్ళ లాగే నేనూ సన్యాసం స్వీకరించి శాశ్వితానందాన్ని విశ్వప్రేమను పొందుతాను... ఇలా సాగింది బాహుబలి ఆలోచన. అంతే తనను క్షమించమని అన్న భరతుని కోరాడు. తన రాజ్య భాగాన్ని కూడా అన్నగారికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటున్నట్లు చెప్పి ఆభరణాలు, దుస్తులను తొలగించుకుని వెంట్రుకలను చేత్తో పీక్కున్నాడు. (జైన మతంలో దీక్ష తీసున్నవారు వెంట్రుకలను పీకడం ద్వారా తొలగించడం ఇప్పటికీ చూడవచ్చు). భరతుడు ఎంత వారిస్తున్నా వినకుండా బాహుబలి దీక్ష తీసుకున్నాడు.

ఫలించని తపస్సు[మార్చు]

ఘోరమైన తపస్సు చేస్తున్నా బాహుబలికి జ్ఞానోదయం కాలేదు. అలా జ్ఞానోదయం కాకపోవడానికి కారణం అతడిలో ఇంకా మిగిలి ఉన్న గర్వమే. ఈ విషయాన్ని గ్రహించిన రిషభనాథుడు తన కుమార్తెలను బాహుబలి దగ్గరకు పంపించి గర్వాన్ని వదిలితేనే జ్ఞానోదయం అవుతుందని చెప్పమంటాడు. బ్రహ్మి, సుందరి అన్న బాహుబలి దగ్గరకు వెళ్ళి తండ్రి చెప్పిన విషయాన్ని చెబుతారు. దీంతో తప్పు తెలుసుకున్న బాహుబలి ఏక దీక్షతో తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందుతాడు.

తెలంగాణలో బాహుబలి[మార్చు]

బాహుబలుడు రాజ్యం చేసింది తెలంగాణలోనే. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న బోధన్‌ను పూర్వం పౌదన్యపురం అనీ, పోదన పురం అనీ పిలిచేవారు. ఇదే బాహుబలుని రాజధాని. ఈ విషయాన్ని చెప్పే కొన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. పోదనపురం గురించి మహాభారతంలో కూడా ఉంది. అక్కడ జైన, బౌద్ధ, వైదిక మతాలు సమానంగా విలసిల్లాయి. అటువంటి పట్టణాన్ని బాహుబలుడు తన రాజధానిగా చేసుకున్నట్లు జైన గ్రంథాలు, విష్ణుపురాణం చెబుతున్నాయి. బోధన్‌లో అనేక జైన విగ్రహాలు, ఆలయాలు కనిపించడంతో బాహుబలుని రాజధానిగా నిజంగానే ఈ పట్టణం విలసిల్లిందేమో అని కొందరు చరిత్రకారులు అంటున్నారు.

భోదన్ లో ఒకప్పుడు అతిపెద్ద బాహుబలి విగ్రహం వుండేది[మార్చు]

కర్నాటకలోని శ్రావణ బెళగోళలో విగ్రహానికి స్ఫూర్తినిచ్చిన విగ్రహం బోధన్‌లో ఉండేదని చరిత్రక ఆధారాలు చెపుతున్నాయి. బోధన్‌లో ఉన్న విగ్రహం బాహుబలునిది. ఇది శ్రావణ బెళగోళలో ఉన్న గోమఠేశ్వర విగ్రహం కంటే పొడవుగానూ, భారీగానూ ఉండేది. దీన్ని చూడటానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేవారు. అయితే కాలక్రమంలో ఆ విగ్రహం ఉన్న ప్రాంతం అంతా అడవిగా మారిపోయింది. ఒకసారి కర్నాటక ప్రాంతాన్ని ఏలుతున్న పశ్చిమగాంగ రాజు రాచమల్లుని మంత్రి చాముండరాయడు తమ ఆస్థానాన్ని సందర్శించిన ఓ కవి ద్వారా బోధన్‌లోని బాహుబలి విగ్రహం గురించి తెలుసుకున్నాడు. పౌదన్యపురంలో ఉన్న బాహుబలి విగ్రహం 500 ధనస్సుల పొడవు ఉందని ఆ కవి చెబుతాడు. అంతేకాదు అది మనుషులు చేరడానికి వీలు లేని కీకారణ్యంలో ఉందనీ చెబుతాడు. దీంతో చాముండరాయడు బోధన్‌ వెళ్ళి బాహుబలుని అద్భుతమైన విగ్రహాన్ని దర్శించుకుంటాడు. దాదాపు విగ్రహం అడవుల్లో అదృశ్యమయ్యే స్థితిలో ఉండటంతో ఇదే పరిమాణం, రూపం ఉన్న విగ్రహాన్ని శ్రావణ బెళగోళలో ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నాడు. తాను అనుకున్న విధంగా బాహుబలుని భారీ ఏకశిలా విగ్రహాన్ని శ్రావణ బెళగోళలో ఉన్న వింధ్యగిరిపై చెక్కించి ప్రతిష్టించాడు. ఆ సమయంలో వేయించిన శాసనం బోధన్‌ బాహుబలి విగ్రహం చుట్టూ భయంకరమైన కుక్కుట సర్పాలు తిరుగాడుతున్నాయని, అక్కడికి వెళ్ళడం కష్టంగా మారిందని, అందువల్ల చాముండరాయడు బోధన్‌లో ఉన్న విగ్రహానికి సమానమైన మరో విగ్రహాన్ని ఇంద్రగిరి కొండపై ప్రతిష్టించడానికి ప్రయత్నించాడని కానీ అంత ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించలేకపోయాడని చెబుతోంది. దీన్ని బట్టి బోధన్‌లో ఉన్న విగ్రహం ఎంతపెద్దదో అర్థంచేసుకోవచ్చు. చాముండరాయని గోమఠుడు అని కూడా అంటారు. అందుకే ఆయన ప్రతిష్టించిన బాహుబలుని విగ్రహానికి గోమఠేశ్వర విగ్రహం అని పేరువచ్చిందని అంటారు. మరికొందరు బాహుబలి విగ్రహాన్ని గోమఠేశ్వరునికి అంకితం ఇవ్వడం వల్లే ఆ పేరు వచ్చిందని అంటున్నారు. ఉత్తరభారతదేశంలో ఎక్కడా గోమఠేశ్వర విగ్రహాలు లేవు. అతడు పూర్తిగా దక్షిణ భారతానికే పరిమితమైన సిద్ధుడు. అది కూడా దిగంబర జైన శాఖకు చెందినవాడు. మొదట్లో కేవలం బోధన్‌ ప్రాంతానికే బాహుబలి (గోమఠేశ్వర) విగ్రహం పరిమితమై ఉందని చెప్పవచ్చు. ఆ తరువాత కర్నాటకలో శ్రావణ బెళ్గోళాతో పాటు మరి కొన్ని చోట్ల గోమఠేశ్వరుని విగ్రహం ప్రతిష్టితమయింది. ఆంధ్రప్రాంతంలో విజయనగరరాజుల కాలంలో అమరాపురంలో గోమఠేశ్వరుని విగ్రహం ప్రతిష్టించేవరకు అక్కడ ఆయన విగ్రహమే కనిపించదు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయం నిజానికి గోమఠేశ్వరుని ఆలయం అని హిందువులు దాన్ని ఆక్రమించారని చరిత్ర కారులు అభిప్రాయ పడుతున్నారు. బోధన్‌లో ప్రారంభమైన అతి పెద్ద విగ్రహాల ప్రతిష్టాపన ఆ చుట్టుపక్కల ప్రాంతానికీ విస్తరించింది. బోధన్‌ గోమఠేశ్వరుని స్ఫూర్తితో అనేక జైన తీర్థంకరుల నిలువెత్తు విగ్రహాలను జైన శిల్పులు చెక్కారు. ప్రస్తుతం అవి హైదరాబాదులో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రధాన మ్యూజియంలో ఉన్నాయి.

జైన గ్రంథాలు, శ్రావణ బెళ్గోళాలో ఉన్న శాసనం బట్టి మన బోధన్‌లో ప్రపంచంలోని ఎత్తయిన బ్రహ్మాండమైన విగ్రహం ఒకటి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆ విగ్రహం ఏమైపోయినట్లు? శాసనంలో పేర్కొన్నట్లు బాహుబలుని విగ్రహం అప్పట్లోనే అడవుల్లో కలిసిపోయిందా? కాల క్రమంలో విగ్రహం నేలపై ఒరిగి భూమిలో పూడుకుపోయి ఉండవచ్చు. మొత్తం దేశంలోనే భారీ విగ్రహాల ప్రతిష్టకు అంకురార్పణ చేసింది బోధన్‌ బాహుబలి విగ్రహం. అటువంటి విగ్రహం ఒకటుందనే విషయం చాలామందికి తెలియదు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి బాహుబలి తెచ్చిన పేరు సామాన్యమైనది కాదు. ఆయన్ని పూజించే కోట్లాది జైనుల ఆచార సంప్రదాయాలు మన తెలుగువారి జీవితంతో పెనవేసుకున్నాయి. ఆ విధంగా బాహుబలి మన సంస్కృతిలో ఒక భాగమయ్యాడు. అటువంటి బాహుబలి భారీ విగ్రహాన్ని విలువకట్టలేని సంపదగా గుర్తించి వెలికి తీసే పనిని చేపట్టాలని చరిత్రకారులు కోరుతున్నారు.

బోధన్ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారు?[మార్చు]

బోధన్‌లో బాహుబలి విగ్రహాన్ని బాహుబలి అన్న భరతుడే నిలిపాడని జైనులంటున్నారు. ఉత్తర భారతం నుంచి తమ్ముడి రాజ్యంపై దండెత్తి వచ్చిన భరతుణ్ణి బోధన్‌లో ఎదుర్కొని గెలిచిన బాహుబలుడు రాజ్యపరిత్యాగం చేసిన తరువాత కాయోత్సర్గ భంగిమలో (నిలువు కాళ్ళపై నిలబడి) తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బాహుబలి కాళ్ళకు, చేతులకు తీగలు, పాములు చుట్టుకుంటాయి. అతడి చుట్టూ పుట్టలు పెరుగుతాయి. ఈ దృశ్యాన్ని చూసిన అన్న భరతుడు అప్పటి రూపాన్ని ప్రతిబింబించే 525 ధనుస్సుల పొడుగున్న బాహుబలి శిలా విగ్రహాన్ని తయారు చేయించాడని జైన మతస్తుల్లో ప్రచారంలో ఉన్న కథ. భరతుడు ప్రతిష్టించిన ఈ విగ్రహాన్ని కుక్కుటేశ్వరుడని పిలిచేవారు.

శ్రావణ బెళగొళ లోని గోమఠేశ్వర విగ్రహం[మార్చు]

ధర్మస్థలలోని గోమఠేశ్వర విగ్రహం

బాహుబలి లేదా గోమఠేశ్వర విగ్రహం కర్ణాటక లోని శ్రావణబెళగొళ లో ఉంది.

శ్రావణ బెళగోళలో గోమఠేశ విగ్రహం పాదాల దగ్గర ఉన్న శాసనాలు ఆ విగ్రహాన్ని, చుట్టు ఉన్న కట్టడాలను ఎవరు నిర్మించారో తెలియచేస్తున్నాయి. ఒక శాసనంలో కల్కియుగం అంటే 600 చైత్రమాసం సూర్యపక్షం ఐదవ రోజు ఆదివారం కుంభలగంలో చాముండరాయడు గోమఠేశుని విగ్రహాన్ని బెళ్గుళ నగరంలో ప్రతిష్టించినట్లు ఉంది. అయితే శాసనంలో పేర్కొన్న తేదీ, సంవత్సర నిర్ణయంలో చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. అందుకే కొందరు 981 సంవత్సరంలో ప్రతిష్టించారంటే మరికొందరు 983లో అంటున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ విగ్రహం క్రీస్తుశకం 980-984 మధ్య ప్రతిష్టించబడిందని చెప్పవచ్చు. మరో శాసనంలో విగ్రహం చుట్టు ఉన్న కట్టడాలను గంగరాజు నిర్మించినట్లు ఉంది.

రెండు కొండల మధ్య ప్రకృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే "బెళగొళ" కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు.అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్వాణం పొందడానికి ఈ కొండలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు.శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను శ్రమణ బెళగొళ అనేవారు.క్రమంగా శ్రావణ బెళగొళగా మారింది. స్థానికులు బెళగొళ అనే పిలుస్తారు.చంద్రగిరి,ఇంద్రగిరి కొండల మధ్య ఉన్న బెళగొళను చుడడానికి దేశంలో ఉన్న ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తారు.

ఇక్కడ ఉన్న 58 అడుగుల గోమఠేశ్వరుని విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల,శ్రమణుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీ.శ.983వ సంవత్సరంలో చాముండరాయ అనే మంత్రి గోమఠేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం.దీనికే గోమఠేశ్వరుని ఆలయంగా వాడుక.ఇక్కడ ఆలయం కట్టడం, విగ్రహాన్ని ప్రతిష్టించడం జరగలేదు.కొండ చివరి భాగంలో విగ్రహం మలిచారు.బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుని విగ్రహాన్ని చెక్కడంలో శిల్పి అర్త్సమేణి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూడాల్సిందే.ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా,సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వేదాన్ని చక్కగా మలిచారు.ద్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అలుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు,ఆకులను అద్భుతంగా చెక్కారు.విగ్రహం కాలి గోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు. ఒక సాధారణ మనిషి విగ్రహం దగ్గర నిలబడితే బాహుబలి పాదం ఎత్తుకు సరిపోతారు.

మహా మస్తకాభిషేకం[మార్చు]

బాహుబలి మహామస్తకాభిషేకం సందర్భంగా భక్తులు అభిషేకం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే అభిషేకించగలరు. గోమఠేశ్వరునికి కేన్ల కొద్దీ పాలు, తేనె, పెరుగు, అన్నం , కొబ్బరి పాలు, నెయ్యి, చక్కెర, బాదం పప్పు, కుంకుమ పువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూట్స్, పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు.పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా స్ట్రక్చర్ కడతారు.దీని మీదకు వెళ్ళి అభిషేకం తంతు పూర్తి చేస్తారు. పర్యాటకులకు మహామస్తకాభిషేకం సమయంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే అనువుగా ఉంటుంది. ఈ ఆలయం కొండమీద ఉంటుంది.ఈ కొండ ఎక్కువ ఎత్తు లేకపోయినా ఎక్కడం కష్టమే.మెట్లు ఎత్తుగా ఉండడంతో యువకులు కూడా మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎక్కుతారు. మొత్తం మీద పదిహేను-ఇరవై నిమిషాల కంటే పట్టదు.బాహుబలి విగ్రహం తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ దాదాపుగా జైనమత ప్రాధాన్యం ఉన్నవే.జైన తీర్థంకరుల దేవాలయాలు ఉన్నాయి.వీటిలో చంద్రగిరి పర్వతం మీద అశోకుడు నిర్మించినట్లు నిర్మించినట్లు చెబుతున్న చంద్రగుప్త బస్తీ ముఖ్యమైనది.ఇందులో సెమీ ప్రిషియస్ స్టోన్స్ పొదిగి అద్భుతంగా చెక్కిన ఎనిమిది విగ్రహాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి.ఇక్కడ ఉన్నన్ని శాసనాలు మన్ దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు.

చారిత్రక శాసనాలు[మార్చు]

చరిత్ర పరిశోధకులు 523 శాసనాలను గుర్తించారు.ఇందులో చిన్న కొండ మీద 271,పెద్ద కొండ మీద 172,80 శాసనాలు బెళగొళలో,మరో 50 బెళగొళ పరిసర గ్రామాల్లో ఉన్నాయి.ఇవన్ని కూడా క్రీ.శ.600-19వ శతాబ్దం మధ్యనాటివే.లెక్కకు మించిన శాసనాలే కాక లెక్కలేనన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.జైనతీర్థాంకురుల స్మృతి చిహ్నాలుగా పర్యాకులను ఆకర్షిస్తాయి. గోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి ఒక కథ వాడుకలో ఉంది.బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు ఋషబుని కుమారుడు.(రామాయణంలో శ్రీరాముని వంశానికి మూల పురుషుడు ఋషబుడని ఉంది.) ఇతడికి ఇద్దరు భార్యలు.రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు.పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు.భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది.తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు.బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు.అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు.స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు.భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి,అంతలోనే పునరాలోచనలో పడతాడు.

జినత్వం[మార్చు]

బాహుబలి ఏకశిలా విగ్రహం కాకర్ల (1432 CE)

బాహుబలి ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి,రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విసృతం కాలేదు.జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు.కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు.శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు.వీరు సంసార జీవితం కొనసాగిస్తారు.దిగంబరులు సన్యాసులు.వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని కృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.

బయటి లింకులు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బాహుబలి&oldid=1548516" నుండి వెలికితీశారు