బాహుబలి:ద బిగినింగ్
బాహుబలి | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఎస్.రాజమౌళి |
రచన | విజయేంద్ర ప్రసాద్ |
నిర్మాత | శోభు యార్లగడ్డ దేవినేని ప్రసాద్ కె. రాఘవేంద్రరావు (సమర్పణ) |
తారాగణం | ప్రభాస్ రానా దగ్గుబాటి అనుష్క తమన్నా భాటియా |
ఛాయాగ్రహణం | కె.కె.సెంథిల్ కుమార్ |
కూర్పు | కోటగిరి వేంకటేశ్వరరావు |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | ఆర్కా మీడియా వర్క్స్ |
విడుదల తేదీ | 10 జూలై 2015 |
సినిమా నిడివి | 158 నిమిషాలు |
దేశం | భారత దేశం |
భాషలు | తెలుగు తమిళం హిందీ |
బడ్జెట్ | ₹125 కోట్లు |
బాక్సాఫీసు | 650కోట్లు[1] |
ఓ జానపద కథతో రెండు భాగాలుగా రూపొందించబడిన “బాహుబలి” క్రమంలో మొదటి భాగంగా “బాహుబలి – ద బిగినింగ్” సినిమా 2015వ సంవత్సరం జూలై 10వ తేదీన విడుదలయింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించగా, కె.రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించగా, రాజమౌళి సోదరుడు, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించడం జరిగింది. హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమాను అనువదించి విడుదల చేయడం జరిగింది. భారతదేశంలో అత్యంత వసూళ్ళు సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ సినిమా పేరొందింది. రాజమౌళి ఈ సినిమా కోసం ఎలాంటి స్ట్రాటజీ అనుసరించారు. సక్సెస్ సీక్రెట్ ఏంటి? Archived 2023-07-12 at the Wayback Machine
కథ
[మార్చు]ప్రాణాత్యాగం చేసి రాజమాత శివగామి (రమ్యకృష్ణ) కాపాడిన బిడ్డ అంబులగ్రామం అనే ఓ గూడెంలో శివుడు (ప్రభాస్)గా ఎదుగుతాడు. తన గూడెంకి దగ్గరున్న కొండపై ఏమున్నదో తెలుసుకోవాలనే కుతూహలంతో చిన్నతనం నుండి అనేకసార్లు ఆ కొండ ఎక్కబోయి విఫలమవుతాడు శివుడు. అతడి వింత ప్రవర్తన విడవాలని శివుడి తల్లి సంగ (రోహిణి) తమ గూడెంలోని శివలింగానికి 1016 సార్లు అభిషేకం చేస్తానని మ్రొక్కుబడి పెట్టుకుంటుంది. ఆ క్రమంలో తన తల్లి పడే కష్టం చూడలేక ఆ శివలింగాన్నే పెకలిస్తాడు శివుడు. అతడి బాహుబలాన్ని చూసి గూడెంలోని ప్రజలందరూ నివ్వెరపోతారు. తమ గూడెంలోని జలపాతం క్రింద ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. తన తల్లి కోరిక తీర్చినందుకు తల్లితో సహా అందరూ సంతోషిస్తారు.
ఇంతలో ఆ జలపాతంలోంచి ఓ ముసుగు జారిపడుతుంది. అది చూసి ముగ్ధుడైన శివుడు ఆ ముసుగు వెనుకనున్న ముఖం ఎవరిదో తెలుసుకునేందుకు మళ్ళీ కొండెక్కే ప్రయత్నం చేస్తాడు. ఈసారి అతడి ఊహాసుందరి సాయంతో ఆ కొండను ఎక్కేస్తాడు. ఆ ముసుగు అవంతిక (తమన్నా) అనే అమ్మాయిదని, ఆ అమ్మాయి మాహిష్మతి మహారాజు భల్లాలదేవుడి (రానా దగ్గుబాటి) చెర నుండి తమ మహారాణి దేవసేన (అనుష్క)ని విడిపించే తిరుగుబాటుదారులలో ఒకరని తెలుస్తుంది. దేవసేనను కాపాడే అవకాశం ఈసారి అవంతికకు అప్పజేప్తాడు వారి నాయకుడు (మేక రామకృష్ణ). తన కోసమే మహాపర్వతాలను ఎక్కివచ్చాడని తెలిసి శివుడితో ప్రేమలో పడుతుంది అవంతిక. దేవసేనను విడిపించి అవంతిక ఆశయాన్ని తాను నెరవేరుస్తానని మాహిష్మతి రాజ్యానికి బయలుదేరుతాడు శివుడు.
ఇదిలావుండగా, మాహిష్మతి రాజ్యంలో భల్లాలదేవుడి పాలనలో ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. ఓ అడవి దున్న నుండి తనను కాపాడే ప్రయత్నంలో గాయపడిన కట్టప్ప (సత్యరాజ్)ను ఏదైనా వరం కోరుకోమంటాడు భల్లాలదేవుడు. పాతికేళ్ళుగా దేవసేన అనుభవిస్తున్న శిక్ష నుండి ఆమెని విముక్తురాలిని చేయమని కట్టప్ప కోరగా, అందుకు బదులుగా దేవసేనను చంపి ఈ లోకం నుండే విముక్తురాలిని చేయమంటాడు భల్లాలదేవుడు. అది కుదరకపోతే దేవసేన శిక్షను అనుభవించాల్సిందేనని చెబుతాడు. ఆ రాత్రి దేవసేనను రహస్యంగా కలిసిన కట్టప్ప తనను తప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పగా, భల్లాలదేవుడు చనిపోయేంతవరకూ తన సంకెళ్ళను తెంచనని చెప్పి అతడికోసం చితిని పేర్చడం కొనసాగిస్తుంది దేవసేన.
మాహిష్మతి రాజ్యంలో శివుడు ప్రవేశించిన రోజున భల్లాలదేవుడి వందడుగుల స్వర్ణ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూవుంటుంది. ఆ ప్రయత్నం మధ్యలో తడబడగా, శివుడు దాన్ని మోసే మనుషులకు సాయపడతాడు. శివుడిని చూసి “బాహుబలి” అని ఓ వ్యక్తి గుర్తుపట్టగా, ఆ ప్రాంగణమంతా ఆ పేరుతో మారుమ్రోగిపోతుంది. అందుకు, భల్లాలదేవుడు పరాభవంతో నొచ్చుకుంటాడు.
చీకటి పడగా, శివుడు దేవసేనను తప్పించే ప్రయత్నం మొదలుపెడతాడు. అది చూసిన భల్లాలదేవుడి కొడుకు భద్రుడు (అడివి శేష్), కట్టప్ప శివుడిని అడ్డుకుంటారు. ఆ క్రమంలో భద్రుడితో పోరాడి అతడి తల నరికిన శివుడిని చంపబోయిన కట్టప్పకు అతడు శివుడు కాదని అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కొడుకు మహేంద్ర బాహుబలి అని తెలుసుకొని జరిగిన కథను చెప్పడం మొదలుపెడతాడు.
విక్రమదేవుడు (ప్రభాస్), బిజ్జలదేవుడు (నాజర్) అన్నదమ్ములు. బిజ్జలదేవుడి అవలక్షణాలు అతడిని రాజ్యాధికారానికి దూరం చేయగా, విక్రమదేవుడు రాజ్యబాధ్యతను స్వీకరిస్తాడు. కానీ తన అవిటితనమే తనకు రాజ్యాన్ని దక్కనివ్వలేదని కుమిలిపోతూవుంటాడు బిజ్జలదేవుడు. విక్రమదేవుడు మరణించిన తరువాత రాజ్యం బాధ్యత బిజ్జలదేవుడి భార్య శివగామి, కట్టప్ప సాయంతో నిర్వర్తిస్తూవుంటుంది. అమరేంద్ర బాహుబలికి జన్మనిచ్చిన విక్రమదేవుడి భార్య పురిట్లోనే ప్రాణాలు కోల్పోగా, తన కొడుకు భల్లాలదేవుడితో పాటు బాహుబలిని కూడా అక్కున చేర్చుకుంటుంది శివగామి. రాజు లేని సింహాసనాన్ని ఆక్రమించే ఆలోచనతో తిరుగుబాటు చేస్తాడు మార్తాండ (భరణి శంకర్). కట్టప్ప సాయంతో అతడ్ని, అతడి అనుచరులను హతమార్చిన శివగామిని సింహాసనం అధిస్టించమని మంత్రులు కోరగా, అందుకు ఆమె నిరాకరిస్తుంది. సింహాసనంపై అర్హత తన బిడ్డలిద్దరికే ఉన్నదని. పెద్దయ్యాక ఎవరు పెట్టిన పరీక్షలలో నెగ్గి, దేశ ప్రజల మన్నన పొందుతారో వారిదే సింహాసనమని చెబుతుంది శివగామి.
యుక్తవయసులోకి వచ్చిన యువరాజులిద్దరూ అన్ని పరీక్షలలో సమానమైన ప్రతిభను కనబరుస్తారు. ఇంతలో రాజ్యంలోని సాకేతుడు మాహిష్మతి సైన్య రహస్యాలను అపహరించి కాలకేయులకు అమ్మేస్తాడు. దాంతో కాలకేయులతో యుద్ధం తథ్యమవుతుంది. ఆ యుద్ధంలో కాలకేయులతో తలపడిన బాహుబలి, భల్లాలదేవుళ్ళలో ఎవరైతే విజయం సాధిస్తారో వారిదే సింహాసనమని చెప్పి, సైన్యాన్ని యువరాజులకు సమంగా పంచమని చెబుతుంది శివగామి. త్రిశూల వ్యూహం పన్ని కాలకేయునితో తలపడతారు. కాలకేయ నాయకుడు (ప్రభాకర్)తో తలపడిన బాహుబలి అతడిని చంపబోగా, బాహుబలికంటే ముందే కాలకేయుని అంతం చేస్తాడు భల్లాలదేవుడు. తన కొడుకే రాజు కాబోతున్నాడన్న ఆనందంతో పొంగిపోతాడు బిజ్జలదేవుడు. కానీ భల్లాలదేవుడిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి, అమరేంద్ర బాహుబలిని కాబోయే మహారాజుగా ప్రకటిస్తుంది శివగామి. కారణం, భల్లాలదేవుడు శతృసంహారం చేయాలన్న ధ్యేయంతో, ఆపదలోనున్న తన ప్రజలను కాపాడుకోలేకపోతాడు. బాహుబలి ఓ ప్రక్క శతృవుతో పోరాడుతూనే మరో ప్రక్క తన ప్రజలను కూడా కాపాడుకుంటాడు. రాజుకి ఉండాల్సిన లక్షణాలు బాహుబలిలోనే కనిపించడంతో రాబోయే ముహూర్తానికి అతడిని మాహిష్మతికి మహారాజుగా పట్టాభిషిక్తుడుగా చేయాలని ప్రకటిస్తుంది శివగామి.
ఈ కథ చెబుతూ అమరేంద్ర బాహుబలి చనిపోయాడని చెబుతాడు కట్టప్ప. ఎవరు చంపారని శివుడు ప్రశ్నించగా, తానే బాహుబలిని వెన్నుపోటు పొడిచి చంపానని కట్టప్ప చెప్పడంతో మొదటి భాగం ముగుస్తుంది.
నటీనటులు
[మార్చు]- ప్రభాస్ (ద్విపాత్రాభినయం: బాహుబలి, శివుడు)
- అనుష్క (దేవసేన)
- రానా దగ్గుబాటి (భల్లాలదేవ)
- తమన్నా భాటియా (అవంతిక)
- రమ్య కృష్ణ (శివగామి)
- నాజర్ (బిజ్జలదేవ)
- అడివి శేష్ (భద్ర)
- సత్యరాజ్ (కట్టప్ప)
- సుదీప్ (అస్లంఖాన్)
- ప్రభాకర్ గౌడ్ (కాలకేయ)
- తనికెళ్ళ భరణి (స్వామి)
- రోహిణి (సంగ - శివుడి పెంపుడు తల్లి)
- మేక రామకృష్ణ (తిరిగుబాటు దారుల నాయకుడు)
- భరణి శంకర్ (మార్తాండ)
- చరణ్దీప్
- సుబ్బరాయ శర్మ (మంత్రి)
- పి. ప్రభాకర్ (శివుడి పెంపుడు తండ్రి)
- దేవబత్తుల జార్జి[2]
- రాయల హరిశ్చంద్ర
- కల్పలత
సాంకేతికవర్గం
[మార్చు]- కథ: విజయేంద్ర ప్రసాద్
- మాటలు : విజయ్ చిత్నీడి, జి. అజయ్ కుమార్, దేవ కట్టా (యుద్ధంలోని మాటలు)
- కళ: సాబు సిరిల్
- కెమెరా: కె.కె.సెంథిల్ కుమార్
- గ్రాఫిక్స్ : శ్రీనివాస్ మోహన్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- సౌండ్ సూపర్ విజన్ : కోడూరి కళ్యాణ్
- ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు
- పోరాటాలు: పీటర్ హెయిన్స్
- నృత్యాలు : కె.శివ శంకర్, ప్రేమ్ రక్షిత్, దినేష్ కుమార్, జాని
- మేకప్ : నల్ల శ్రీను
- కాస్ట్యూమ్స్ : కుడిపూడి కృష్ణ
- కాస్ట్యూమ్ డిజైనర్లు : రమా రాజమౌళి, ప్రశాంతి తిపిరినేని
- సమర్పణ: కె రాఘవేంద్రరావు
- నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
- కథనం, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాణం
[మార్చు]అభివృద్ది
[మార్చు]ఈ కథకు బీజం రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ నది దాటుతూ ఓ బిడ్డని కాపాడి తన ప్రాణాలను కోల్పోయిన శివగామి పాత్రను గురించి చెప్పగా పడింది. ఆ తరువాత కొన్నేళ్ళకు కట్టప్ప పాత్ర గురించి చెప్పడం ఈ సినిమా తీయడానికి రాజమౌళిని ప్రేరేపించింది. పురాణాల పట్ల రాజమౌళికి ఉన్న ఆసక్తి, అమర్ చిత్ర కథల ప్రభావం ఈ సినిమా చేయడానికి అతడిపై పడింది. ఈ కథ మొదటి డ్రాఫ్టుని పూర్తి చేయడానికి రచయితలకు మూడు నెలలు పట్టింది.[3]
కిలికిలి భాష
ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి “కిలికిలి” లేదా “కిలికి” అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు. సినిమాలో కనిపించే కాలకేయులు అనే తెగ ఈ భాష మాట్లాడుతుంది. ఒక సినిమా కోసం ఓ భాషను రూపొందించడం భారతదేశంలో ఇదే ప్రథమం.[4]
కార్కి ఆస్ట్రేలియాలో పీ.హెచ్.డి చదువుతున్న సమయంలో, పార్ట్ టైం పనిగా ఓ శిశు సంరక్షణాలయములో పని చేసేవారు. ఆ సమయంలో అవలీలగా అర్థమయ్యే ఓ భాషను కనిపెడితే బాగుండును అనే ఆలోచనలో ఈ భాషకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా, మొదట కొన్ని చిన్న పదాలు రూపొందించి వాటిని తిరగేసి వాటి వ్యతిరేకాలు రూపొందించారు. ఉదాహరణకు, “మిన్” అంటే “నేను” అని, “నిమ్” అంటే “నువ్వు” అనే అర్థాలు వచ్చేలా రూపొందించారు. 100 పదాలతో రూపొందిన భాషను “క్లిక్” అని వ్యవహరించారు. ఇదే “కిలికి” అనే పదానికి బీజం వేసింది.[5]
ఈ భాషను 750 పదాలతో, 40 వ్యాకరణ సూత్రాలతో రూపోదించారు. కార్కి పదము యొక్క అర్థాన్ని బట్టి కొన్ని కఠినమైన హల్లులు, మరికొన్ని సున్నితమైన హల్లులను వాడడం జరిగింది. సినిమా విడుదలయిన తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఈ భాష ఒకేలాగే వినిపిస్తుంది.[6]
నటీనటుల ఎంపిక
[మార్చు]ఫిబ్రవరి, 2011లో రాజమౌళి తన తదుపరి సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్నాడని ప్రకటించారు.[7] జనవరి, 2013లో ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ని బాహుబలిగా ప్రకటించారు. క్రమంగా, సినిమాకు కూడా అదే పేరుతో నామకరణం చేశారు.[8] ప్రభాస్ కు జోడిగా అనుష్కను, ప్రతినాయకుడిగా రానా దగ్గుబాటిని ఎంచుకున్నారు.[9] సినిమాలో ముఖ్యపాత్రైన కట్టప్పకు తమిళ నటుడు సత్యరాజ్ ను ఎంపిక చేశారు.[10] మరో ముఖ్యపాత్ర శివగామి కోసం మొదట శ్రీదేవితో సంప్రదింపులు జరిపింది. శ్రీదేవి అధిక పారితోషికం కోరడంతో ఆ అవకాశాన్ని రమ్యకృష్ణకు ఇవ్వడం జరిగింది.[11] మరో తమిళ నటుడు నాజర్ ని మరో ముఖ్యపాత్రకు ఎంపిక చేసిన చిత్ర బృందం కన్నడ నటుడు సుదీప్ ని ఓ చిన్న పాత్రకు ఎంపిక చేసింది.[12] పంజా సినిమాలోని తన నటన రాజమౌళిని ఆకట్టుకోవడంతో మరో ముఖ్య ప్రతినాయక పాత్రకు అడివి శేష్ ని ఎంచుకున్నారు.[13] డిసెంబరు 20, 2013న ఈ సినిమాలో మరో కథానాయికగా తమన్నాను ఎంచుకున్నట్టుగా చిత్రబృందం ఒక ప్రెస్ నోట్ లో తెలిపింది.[14]
ప్రీ ప్రొడక్షన్
[మార్చు]ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. 15,000 స్టొరీ బోర్డు స్కెచ్చులు రూపొందించారు. ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకే మొదటిసారి.[15] ఈ సినిమాలోని తమ పాత్రలకు అనుగుణంగా ప్రభాస్, అనుష్క, రానాలు కత్తిసాము నేర్చుకోగా, ప్రభాస్, రానాలు అదనంగా గుర్రపుస్వారీలు నేర్చుకోవడం జరిగింది.[16]
చిత్రీకరణ
[మార్చు]ఈ సినిమా చిత్రీకరణ జూలై 6, 2013న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాతి ఉద్యానవనంలో మొదలైంది.[17] సినిమాలో భాగమైన మాహిష్మతి రాజ్యానికి సంబంధించిన భారీ సెట్టుని రామోజీ ఫిలిం సిటీలో కళా దర్శకుడు సాబు సిరిల్ నేతృత్వంలో నిర్మించారు. ఆగష్టు, 2013లో ప్రధాన తారాగణంపై అక్కడే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కొనసాగింది.[18] ఆగష్టు 29, 2013కి రెండో షెడ్యూల్ పూర్తయింది.[19] మూడో షెడ్యూల్ హైదరాబాదులో అక్టోబర్ 17, 2013న మొదలైంది.[20] ఆ నెల చివరికి రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సన్నివేశాల కోసం ఒక మొక్కజొన్న పంటను ప్రత్యేకంగా పండించడం జరిగింది. కానీ చిత్రీకరణ మొదలయ్యే వారం ముందు అకాల వర్షాల కారణంగా అది ధ్వంసమైంది. నవంబర్, 2013 లో కర్నూలులో చిత్రీకరణ మళ్ళీ ప్రారంభమైనప్పటికీ, వర్షాల కారణంగా నిలిపివేయడం జరిగింది. సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, చిత్రీకరణ జరిగే ప్రదేశానికి దాదాపుగా 30వేల మంది జనాలు రావడంతో వారిని అదుపు చేయడం చిత్రబృందం వల్ల కాలేదు. ప్రభాస్, రానాల చొరవతో జనాలు అదుపులోకి వచ్చాక, దర్శకుడు రాజమౌళి వారి మధ్యలో నిలబడి “జై బాహుబలి” అని గట్టిగా నినాదాలు చేయమని పిలుపునిచ్చారు. ఆ నినాదాలను సినిమాలో కావలసిన చోట దాన్ని వాడుకోవాలని సినిమా శబ్దగ్రహణ విభాగం వారు రికార్డు చేశారు.[21]
సంగీతం
[మార్చు]ఎం.ఎం.కీరవాణి స్వరపరిచిన ఈ సినిమా పాటలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో జూన్ 13, 2015న విడుదలయ్యాయి.[22][23]
సం. | పాట | పాట రచయిత | గానం | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "మమతల తల్లి" | కె.శివశక్తి దత్త | సత్య యామిని | 4:04 |
2. | "జీవనది" | ఇనగంటి సుందర్ | గీతా మాధురి | 1:55 |
3. | "ధీవర" | కె.శివశక్తి దత్త, రామజోగయ్య శాస్త్రి | రమ్య బెహ్రా, దీపు | 5:43 |
4. | "శివుని ఆన" | ఇనగంటి సుందర్ | ఎం. ఎం. కీరవాణి, మౌనిమ | 3:32 |
5. | "పచ్చ బొట్టేసిన" | అనంత శ్రీరాం | కార్తీక్, దామిని | 4:33 |
6. | "మనోహరి" | చైతన్య ప్రసాద్ | మోహన భోగరాజు, రేవంత్ | 3:52 |
7. | "నిప్పులే శ్వాసగా (మాహిష్మతి)" | ఇనగంటి సుందర్ | ఎం. ఎం. కీరవాణి | 3:26 |
8. | "ధీవర (ఆంగ్లం)" | నోయెల్ సేన్, ఆదిత్య | రమ్య బెహ్రా, ఆదిత్య | 3:26 |
మొత్తం నిడివి: | 27:08 |
వివాదం
[మార్చు]ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ ఈ చిత్రంలో ఉపయోగించిన పదానికి సంబంధించిన వివాదాన్ని ఎదుర్కొంది. 22 జూలై 2015 న, మదురైలోని 'తమిళ, జయ' మల్టీప్లెక్స్ వెలుపల దళిత సమూహం పురచ్చి పులికల్ ఇయక్కం కార్యకర్తలు ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ను ప్రదర్శించారు. ‘పగడై’ (జూదగాడు) అనే పదాన్ని చేర్చడంపై ఈ చిత్రానికి వ్యతిరేకంగా దళిత సమూహం పురచ్చి పులికల్ ఇయక్కం నిరసన వ్యక్తం చేశారు. అరుణతియార్ దళిత ఉప కుల సభ్యులను ఉద్దేశించి కుల హిందువులు ఉపయోగించే పదాలను దళితుల పట్ల అవమానకరంగా భావిస్తున్నట్లు ఈ బృందం సభ్యులు పేర్కొన్నారు. తమిళ వెర్షన్ డైలాగ్ రచయిత మాధన్ కార్కీ క్షమాపణలు చెప్పారు.[24]
సినిమా ప్రచారం
[మార్చు]దర్శకుడు రాజమౌళి తెరకెకిస్తున్న ఈ చిత్రరాజాన్ని మొదులు పెట్టిన నాటి నుంచి ఈ సినిమాని నిత్యం ప్రచార మాద్యమాలలో ఎల్లప్పుడు కానవస్తూనే ఉంది. ఎన్ని విధాలుగా ప్రచారం చేయాలో అన్ని విధాలని అచరణలో ఉంచారు ఈ చిత్ర నిర్మాతలు. మొదట ప్రభాస్ జన్మదినం సందర్భంగా సినిమా యొక్క నిర్మాణ వీడియోని విడుదల చేసారు అది మొదలుకొని నిత్యం ఏదో ఒక సందర్భన్ని పురస్కరించుకొని సినిమాని జనాన్ని అనుసందానిస్తూనే వున్నారు చిత్ర నిర్మాతలు. ఆ తరువాత అనుష్క జన్మదినం సందర్భంగా ఒక వీడియో, రానా జన్మదినం సందర్భంగా ఒక వీడియో,[25][26][27][28][29][30] తమన్నా జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్, ఇంకా దేశ రాజధానిలో జరిగిన ప్రఖ్యాత "కామిక్ కాన్" సమ్మేళనంలో బాహుబలి మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది.[31][32]
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Baahubali budget to go beyond 175 cr. - The Times of India Retrieved 8 September 2014
- ↑ The Hans India, Vijayawada (24 June 2021). "Theatre personality Devabattula George passes away". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2021. Retrieved 25 June 2021.
- ↑ "Baahubali: The Beginning". Wikipedia. Retrieved 23 September 2018.
- ↑ "Baahubali does a Lord of the Rings! The film establishes a new language called Kilikili – Firstpost". 14 July 2015. Archived from the original on 20 December 2016.
- ↑ "5 Sentences And Their Translations in Kiliki, The Fictitious Language Used In 'Baahubali'". Huffington Post India. Archived from the original on 2016-11-14. Retrieved 24 సెప్టెంబరు 2018.
- ↑ Cinema, Telugu. "Welcome to new language 'Kilikili' from Baahubali". Archived from the original on 2016-11-14. Retrieved 24 సెప్టెంబరు 2018.
- ↑ "Prabhas-Rajamouli film announced". Archived from the original on 24 September 2015.
- ↑ "Rajamouli-Prabhas' film is titled Bahubali". The Times of India. 13 January 2013. Archived from the original on 5 అక్టోబరు 2013. Retrieved 14 January 2013.
- ↑ "Rana's groundwork for 'Baahubali'". raagalahari.com. 7 March 2013. Archived from the original on 23 అక్టోబరు 2013. Retrieved 23 సెప్టెంబరు 2018.
- ↑ "Sathyaraj joins Baahubali's cast". 123telugu.com. 25 April 2013. Archived from the original on 27 April 2013. Retrieved 26 April 2013.
- ↑ "Baahubali: Ramya Krishnan was not SS Rajamouli's first choice to play Sivagami. It was Sridevi". indianexpress.com. 7 May 2017. Retrieved 23 September 2018.
- ↑ Shekhar (18 April 2013). "I am doing a small role in Rajamouli's Bahubali: Sudeep". Oneindia Entertainment. Archived from the original on 21 April 2013. Retrieved 19 April 2013.
- ↑ "Adivi Sesh in Rajamouli's Bahubali". The Times of India. 6 April 2013. Archived from the original on 10 ఏప్రిల్ 2013. Retrieved 7 April 2013.
- ↑ "Tamanna To Star With Prabhas in Baahubali: First Look Released As Birthday Gift". Oneindia Entertainment. 20 December 2013. Archived from the original on 21 December 2013. Retrieved 21 December 2013.
- ↑ "Baahubali: The Beginning". Wikipedia. Retrieved 23 September 2018.
- ↑ "Prabhas,rana,anushka practicing sword fighting". IndiaGlitz. Archived from the original on 5 February 2013. Retrieved 23 February 2013.
- ↑ "'Baahubali' shooting starts tomorrow". IndiaGlitz. 5 July 2013. Archived from the original on 6 August 2015. Retrieved 19 July 2014.
- ↑ "Prabhas shooting at RFC for Bahubali". The Times of India. 29 August 2013. Archived from the original on 5 July 2015. Retrieved 19 July 2014.
- ↑ "'Bahubali' Second Schedule Finished". IndiaGlitz. 29 August 2013. Archived from the original on 6 August 2015. Retrieved 19 July 2014.
- ↑ "Prabhas' Bahubali begins new schedule". The Times of India. 17 October 2013. Archived from the original on 5 July 2015. Retrieved 19 July 2014.
- ↑ "'Baahubali' captures public's attention in Kurnool". IndiaGlitz. 6 November 2013. Archived from the original on 6 August 2015. Retrieved 19 July 2014.
- ↑ "Official: Baahubali Audio Launch On June 13". Filmibeat. 9 June 2015. Retrieved 12 December 2016.
- ↑ "Baahubali (@BaahubaliMovie) on Twitter".
- ↑ https://www.newindianexpress.com/states/tamil-nadu/2015/jul/23/Dalit-Party-Members-Hurls-Bomb-on-Baahubali-Theatre-790146.html
- ↑ "Watch: The making of SS Rajamouli's 'Baahubali'". CNN-IBN. 23 October 2013. Archived from the original on 31 డిసెంబరు 2014. Retrieved 16 ఏప్రిల్ 2014.
- ↑ Karthik, Pasupulate (14 December 2013). "Rana Baahubali making video goes viral". The Times of India. Retrieved 16 ఏప్రిల్ 2014.
- ↑ Shekhar (6 February 2014). "Baahubali New Video: Rajamouli Teaches How To Climb Elephant". entertainment.oneindia.in. Archived from the original on 31 మార్చి 2014. Retrieved 16 ఏప్రిల్ 2014.
- ↑ Karthik, Pasupulate (23 October 2013). "Prabhas Bahubali first look goes viral". The Times of India. Archived from the original on 2014-01-30. Retrieved 16 ఏప్రిల్ 2014.
- ↑ Sangeetha, Seshagiri (19 March 2014). "'Baahubali' Team's Video on Exam Tips Goes Viral".
- ↑ Sangeetha Seshagiri (7 November 2013). "Anushka Shetty Gets 'Baahubali' Making Trailer, 'Rudhramadevi' First Look as Birthday Gifts [VIDEO+POSTER]". International Business Times. Retrieved 16 ఏప్రిల్ 2014.
- ↑ "Baahubali Motion Print". reveye.in. 7 February 2014. Archived from the original on 23 మార్చి 2014. Retrieved 21 March 2014.
- ↑ "IF ONLY YOU WERE A 'BAAHUBALI'". wowsomeapp.com. Archived from the original on 2015-05-21. Retrieved 2015-05-19.