Jump to content

మెటల్ ఆర్కు వెల్డింగు

వికీపీడియా నుండి
Shielded metal arc welding
మెటల్ ఆర్కు వెల్దీంగును కనుగొన్న శాస్త్రవేత్త-స్లావనోవ్

మెటల్ ఆర్కు వెల్డింగు (Metal Arc Welding) అనగా ఒక సన్నని నిడుపాటి లోహకడ్దిని ఎలక్ట్రోడుగా, పూరక లోహంగా ఉపయోగించి, ఆర్కు వలన ఏర్పడిన ఉష్ణోగ్రతతో పూరకలోహాన్ని, లోహాల రెండు అంచులను కరగించి అతుకు ప్రక్రియ.[1] రష్యాకు చెందిన విజ్ఞానశాస్త్రవేత్త వసిలె పెట్రొవ్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఒక సజీవ విద్యుత్తు వలయంలో ఏనోడు (ధనధ్రువము), కాథోడు (ఋణధ్రువము) ల మధ్య ఆర్కును (తేజోవంతమైన ఉష్ణకాంతి వలయము) ను ఏర్పరచినప్పుడు ఉత్పన్నమగు ఉష్ణం నుండి లోహాలను కరగించివచ్చునని, రెండు లోహాల అంచులను ఏకీకృతంగా (coalescence) అతుకవచ్చుననేది ఆయన ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతమును సాకారం చేస్తూ 1881-82లో రష్యాకు చెందిన మరోశాస్త్రవేత్త నికొలై బెనర్డొస్ రాగి తొడుగు కలిగిన కర్బనపు కడ్దిని కాథోడుగా నుపయోగించి లోహాలాంచులను కరగించి (fusion) అతికి, మొదటి ఆర్కు వెల్డింగ్ విధానమును ప్రపంచానికి అందించాడు. అటు తరువాత ఈ విధనానికన్న మెరుగైన ఆర్కు వెల్డింగు విధానమైన, లోహకడ్డిని ఎలక్ట్రోడుగా ఉపయోగించి లోహాలను అతుకు మెటల్ ఆర్కు వెల్డింగు ను 1888లో రష్యాకు చెందిన నికొలై స్లావ్యనోవ్ , అమెరికాకు చెందినా సి.ఎల్.కోఫిన్ (1890) కనుగొన్నారు. ఈ వెల్దింగు విధానములో A.C., D.C విద్య్త్తుత్తు నుపయోగించి వెల్దింగు చెయ్యవచ్చును. పూరకలోహకడ్దినే ఎలక్ట్రోడుగా ఉపయోగించడం వలన వెల్డింగు మరింత సులభతరమైనది. కార్బను ఆర్కువెల్డింగులో పూరకలోహం విద్యుత్తు వలయంలో భాగంగా వుండదు. కార్బను ఆర్కు వెల్డింగులో విద్యుత్తు వలయం కర్బనపు ఎలక్ట్రోడు, అతుకవలసిన లోహాల మధ్య మాత్రమే ఏర్పరచబడుతుంది. కాని మెటల్ ఆర్కు వెల్డింగులో పూరక లోహాన్నే (Filler metal) ఎలక్ట్రోడుగా వాడటం వలన, ఈ విధానంలో అతుకవలసిన లోహాలు, అతుకు లోహాం విద్యుత్తు వలయం నేర్పరచును. మెటల్ ఆర్కు వెల్డింగులో కార్బను ఆర్కు వెల్డింగు పద్ధతిలో లా ప్రత్యేకంగా పూరకకడ్దిని, స్రావకాన్ని ఉపయోగించ నవసరము లేదు.

కార్బను ఆర్కు విధానములో ఎలక్ట్రోడును క్యాథోడు ధ్రువానికి, జోడించు/అతుకు భాగాలను ఆనోడు ధ్రువాలకు కలిపి వెల్డింగ్ చేయుదురు. ఎందుకనగా ఆనోడు ధ్రువం వద్ద, కాథోడు ధ్రువం వద్ద కన్న ఎక్కువ ఉష్ణోగ్రత వెలువడుతుంది. అందుచే ఆనోడుగా కర్బనపు ఎలక్ట్రోడును వాడిన కర్బనపుకడ్దికి త్వరగా కరగిపోయి, ఎలక్ట్రోడులోని కర్బనము, వెల్డ్ మెటల్ (అతుకులోహం) లో కలసిపోవటం వలన ఏర్పడిన వెల్డింగు జాయింటులు పెలుసుగా మారటం, నాణ్యత లేకపోవడం జరుగుతుంది. అందుచే కార్బను ఆర్కు వెల్డింగులో ఆనోడుగా జోడింపబడు లోహ పలకలను ఎన్నుకోవడం వలన, లోహాలు, ఈ ఉష్ణక్షేత్రములోకి తేబడిన పూరక లోహం, త్వరగా వేడెక్కి, కరిగి సమ్మేళనం చెందును. కాని మెటల్ ఆర్కు వెల్డింగులో పూరక లోహాన్నే ఎలక్ట్రోడుగా వాడుచున్నందున, పూరకలోహాం త్వరగా వెడెక్కి, కరిగి, పూరకలోహం, అతుకబడుచున్న లోహాల అంచుల లోహాంతో మిలితమై ఏకీకృతమవడంవలన వెల్డింగు బలిష్టంగా, దృఢంగా వుంటుంది. అందుచే మెటల్ ఆర్కు వెల్డింగులో పూరక లోహ ఎలక్ట్రోడును ఆనోడుకు, జోడింపబడు/అతుకబడులో హాన్ని కాథోడుకు అనుసంధానము చేయుదురు.

వెల్డింగు విధానం

[మార్చు]
SMAW weld area

మెటల్ ఆర్కు వెల్దింగును ఎ.సి.కరెంటు, డి.సి.కరెంటులను రెండిలో దేని నుపయోగింనైనను వెల్డింగుచేయు అనుకూలం ఉంది. ఎక్కువగా ఎ.సి.కరెంటు నుపయోగించి వెల్డింగు చేయుదురు. మెటల్ ఆర్క్రు వెల్డింగులో వాడు పూరక ఎలక్ట్రోడు పైభాగమున ఘనరూపంలో మందమైన పూతగా పూసిన స్రావకాన్ని (Flux) కలిగివుంటుంది. వెల్డింగు సమయంలో ఈ స్రావకపదార్థాలు కరిగి ద్రవరూపము చెంది, వెల్డింగు జాయింట్‍పైన తెట్టు (Slag) గా ఏర్పడి, వెల్డింగు జాయింటు గాలిలోని ఆక్సిజనుతో ఆక్సిజకరణ చెందకుండా కాపాడును. వెల్డింగు జాయింటును కప్పివుంచి, త్వరగా చల్లబడకుండగా ఉష్ణనిరోధంగా పనిచేయును. వెల్డింగు జాయింట్ త్వరగా చల్లబడిన, జాయింట్ యొక్క కఠినత్వం పెరిగే అవకాశము ఉంది. ఎలక్ట్రోడుపై పూతగా లోహా అక్సైడు లను ఉపయోగిస్తారు. మెటల్ ఆర్కు వెల్డింగును రెండు రకాలుగా చేయుదురు. ఒకటి MMAW (Manual metal arc welding), రెండోవది ఆటో మెటల్ ఆర్కు వెల్డింగు.మెటల్ ఆర్కు వెల్డింగులో ఎలక్ట్రోడులుగా నుపయోగించు పూరకలోహాపు కడ్దిలు (Welding sticks) స్రావాకాన్ని పూతగా కల్గివుండటం వలన ఈ వెల్డింగు పద్ధతిని షీల్డెడ్ మెటల్ ఆర్కు వెల్డింగు (shielded metal Arc welding:SMAW) అని కూడా అంటారు.

మెటల్ ఆర్కు వెల్డింగు చేయుటకు కావలసిన పరికరములు

[మార్చు]
Various accessories for SMAW
  1. ఎ.సి.స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్ లేదా డి.సి.వెల్డింగ్ మెచిన్.
  2. వెల్దింగ్ ఎలక్ట్రోడు
  3. ఎలక్ట్రోడు హోల్దరు
  4. రబ్బరుతోడుగు వున్న వెల్డింగు కేబులు
  5. రక్షిత ఉపకరణములు

స్టెప్ డౌన్ ట్రాన్స్ ఫార్మర్

[మార్చు]

ఏకాంతర విద్యుచ్చాలక బలాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి వినియోగించే సాధనాన్ని ట్రాన్స్ ఫార్మర్ (Transformer) అంటారు. ఇది ఫ్లెమింగ్ కుడిచేతి బొటనవేలి నిబంధన ప్రకారం పనిచేస్తుంది. సాధారణంగా ఒక వోల్టేజి నుండి మరొక వోల్టేజికి ఆల్టర్నేటింగ్ కరెంట్ను మార్చడానికి ట్రాన్స్‌ఫార్మర్ ఉపయోగపడుతుంది.దీనిలో రెండు తీగ చుట్టలను అవిచ్ఛిన్నంగా ఉండే ఇనుప కాండం (ఐరన్ కోర్) పై చుడుతారు. ప్రాథమిక తీగ చుట్ట (ప్రైమరీ) ద్వారా విద్యుచ్చాలక బలాన్ని అనువర్తింప చేసినపుడు (వోల్టేజి అప్లై చేసినపుడు) స్వయం ప్రేరకత వలన ప్రాథమిక తీగచుట్టలోను, అన్యోన్య ప్రేరణ (మ్యుచువల్ ఇండక్షన్) వలన రెండవ లేదా గౌణ తీగ చుట్ట (సెకండరీ) లోను విద్యుచ్చాలక బలం ప్రేరేపితం అవుతుంది.[2]

మెటల్ ఆర్కు వెల్డింగులో డి.సి.కరెంటు, ఎ.సి.కరెంటు రెండింటిని ఉపయోగించి వెల్డింగు చెయ్యవచ్చును. డి.సి.వెల్డింగు అయ్యినచో ఆనోడు, కేథోడులను ఎలక్ట్రోడు హొల్డరుకు, అతుకవలసిన లోహాలకు రెండు విధాలుగా అమర్చదరు. ఒక పద్ధతిని DCSP (Direct current straight pole), రెండవ విధానాన్ని DCRP (Direct current reverse pole) అంటారు. DCSP పద్ధతిలో వెల్డింగు రెక్టిఫైర్ నుండి వచ్చు ఆనోడు (+ ధనధ్రువము) ను జోడించవలసిన లోహాలకు, కాథోడును ఎలక్ట్రోడు హొల్డరుకు కలిపి వెల్డింగు చేయుదురు. DCRP పద్ధతిలో రెక్టిఫైయరు నుండి వచ్చు ఆనోడును వెల్డింగు హోల్డరుకు, క్యాథోడును అతుకవలసిన లోహాలకు కలుపుతారు. ఎ.సి. ట్రాన్సుఫార్మరు అయినచో ఎలక్ట్రోడుకు ఆనోడు, లోహాలకు క్యాథోడును కలుపుతారు. ప్రధానవ్యాసం:ట్రాన్స్‌ఫార్మర్ చూడండి.

వెల్డింగు ఎలక్ట్రోడు

[మార్చు]
స్రావకపూతవున్న ఎలక్ట్రొడులు-వెల్డింగు హోల్డరు

మెటల్ ఆర్కు వెల్డింగులో ఎలక్ట్రోడు అత్యంత ప్రధానమైనది. ఎందుకనగా మెటల్ ఆర్కు వెల్డింగులో ఉపయోగించు ఎలక్ట్రోడు వెల్డింగుకు అవసరమైన ఆర్కును కలుగచేయుట, లోహాలాతుకుటలో అతుకునకు తగినంత పూరక లోహాన్ని చేర్చుట, వెల్డింగు జాయింటు ఆక్సికరణ చెందకుండ స్రావకాని కూడా కలిగివుండటం. ఈ లోహాన్ని అతుకుతున్నారో అదే లోహంతో ఎలక్ట్రోడు చెయ్యబడి వుండును. మెత్తని స్టీలు (Mild steel) ను వెల్డింగుచేయు ఎలక్ట్రోడు మెత్తని స్టీలుతోను, స్టెయిన్‍లెస్‍ స్టీలును అతుకు ఎలక్ట్రోడు స్టెయిన్‍లెస్‍ స్టిలుతోను చెయ్యబడి వుండును.అలాగే పోత ఇనుము (cast Iron) ను వెల్డింగు చేయుటకు వాడు ఎలక్ట్రోడు పోత ఇనుప లోహాంతోను చెయ్యబడి వుండును. భిన్న లోహాలను అతుకుటకు వాడు ఎలక్ట్రోడు కూడా ఆ రెండు లోహాలను బలిష్టంగా అతుకు విధంగా మిశ్రమలోహంతో చేయబడివుండును.కొన్నిస్టీలు ఎలక్ట్రోడుకు రాగిబ్పూత వుండును, కొన్నింటిని ఎక్కువ కార్బను వున్న ఉక్కుమిశ్రమలోహంతోను, కొన్నింటిలో3% నికెల్ మిశ్రమం వుండును[3] చేతితో వెల్డింగు (manual) చేయు ఎలక్ట్రోడులు ఒక నిర్ధిష్టమైన పొడవును కలిగి వుండును. అందుచే ఈ ఎలక్ట్రోడులను కడ్ది ఎలక్ట్రోడులని (stick electrodes) కూడా అంటారు. ఈ ఎలక్ట్రోడుల పొడవు, ఎలక్ట్రోడుల యొక్క లోహకడ్ది యొక్క వ్యాసాన్ని అనుసరించి వుండును. ఎలక్ట్రోడు యొక్క వ్యాసం పెరుగుకొలది, ఎలక్ట్రోడు పొడవు పెరుగును. ఎలక్ట్రోడు వ్యాసంను, ఎలక్ట్రోడు పైనున్న రసాయనిక పదార్థముల మందమును మినహాయించి లెక్కించెదరు.

స్రావకపూత (flux) కలిగిన ఎలక్ట్రోడుల వ్యాసం -వాటి పొడవు

ఎలక్ట్రోడు వ్యాసం (మి.మీ) ఎలక్ట్రోడు పొడవు (మి.మీ).
1.5 250
2.0 300
2.5 350
3.15/3.25 450
4,5,6,6.3 450

ఎలక్ట్రోడుల పరిమాణాన్ని (size) /వ్యాసాన్ని మి.మీ.లలోనే కాకుండగా గేజి (Guage) లలో కూడా వ్యవహరిస్తారు, ఉదా:14 గేజ్,12 గేజ్,10 గేజ్. 2.0 మి.మీ. వ్యాసమున్న ఎలక్ట్రోడును 12 గేజ్, 2.5 మి.మీ వ్యాసమున్న ఎలక్ట్రోడును 10 గేజ్ యని,3.15/3.25 మి.మీ వ్యాసమున్న ఎలక్ట్రోడును 8 గేజ్ యని. ఇలా వ్యవహరిస్తారు. అంతియే కాకుండగా ఎలక్ట్రోడులను అంతర్జాతీయ కోడు నిబంధనల కనుగుణ్యంగా తయారు చేయుదురు. ఎలక్ట్రోడు మీదన్నున అక్షరాలు, సంఖ్యను బట్టి సదరు ఎలక్ట్రోడును ఏ రకపు లోహాలను అతుకవచ్చునో సులభంగా తెలిసిపోతుంది. ఒక్కోదేశము ఒక్కో కోడును కల్గివుండును.

కొన్నిదేశాల ఎలక్ట్రోడు సంకేతాలు(code)

[మార్చు]
  1. AWS=American Welding Society
  2. ASTM Internatinal=American Society for Testing and materials
  3. BS=British system
  4. IS=Indian system

ఫ్లక్సు కలిగిన ఎలక్ట్రోడు ఒక చివరన 20-30 మి.మీ.పొడవున స్రావకము (flux) పూత వుండదు. ఈ భాగాన్ని వెల్డింగు హోల్డరుతో పట్టుకొని వెళ్డింగు చేయుదురు. ఈ భాగంనకు దిగువన స్రావకపు పూతపై ఎలక్ట్రోడు యొక్క కోడు నెంబరు ముద్రించి వుండును. ఆ కోడు నెంబరును బట్టి ఆ ఎలక్ట్రోడుతో ఏ లోహాలను వెల్డు చెయ్యవచ్చునో తెసిపోతుంది.

ఉదా: ఎలక్ట్రోడుపై AWS:E 6013 అనే పేరువున్నచో ఈ వెల్దింగు ఎలక్ట్రోడును ఉపయోగించి మెత్తని స్టీలు (Mild steel) యొక్క లోహగొట్టాలు (M.S.pipe lines), ట్రక్కు బాడిలు, స్టీలు కిటికి ఫ్రేములు, వంతెన స్టీలు భాగాలు, రైల్వే వ్యాగను బాడిలు, ఓడలు, ట్రైలర్సు (trailers) నిల్వటాంకులు (M.s.storage Tanks) భవనపు స్టీలు నిర్మాణాలు, బాయిలరులోని ప్రెసరు లేని భాగాలు తదితరాలు వెల్డింగు చెయ్యవచ్చును. ఈ ఎలక్ట్రోడుకు సమానమైనవి బ్రిటిసు స్టాండర్డుకు చెందిన BS:E 307, 316, 317, అలాగే ఇండియాను స్టాండర్డుకు చెందిన IS:M 307264, 307263, 307274. ఎలక్ట్రోడులు వున్న ప్యాకింగు పెట్టె పై ఎలక్ట్రోడు ఏ కోడులకు సమానమైనది, ఎలక్ట్రోడు పొడవు, పెట్టెలో వున్న ఎలక్ట్రోడుల సంఖ్య, తయారుచేసిన కాలం, ఎంతకాలం లోపుగా వాడాలి, ఏలావాడాలి, ఏరకమైన వెల్డింగు జాయింట్ కు అనుకాలం వంటి వివరాలన్ని ముద్రించి వుండును. ఎలక్ట్రోడు తయారిదారులు ఎలక్త్రోడుల అమ్మకం కోడు నెంబరుతో కాకుండగా వారి బ్రాండు పేరుతో అమ్మెదరు.ఉదా:AWS:E6013 నెంబరు ఎలక్ట్రోడును కొందరు వెల్డార్కుయని, కొందరు మెటలార్కు యని, ఒవరుకొర్డు యని వివిధ పేర్లతో మార్కెటింగు చేస్తున్నారు.స్రావకపూత కలిగిన ఎలక్ట్రోడులను వెల్డింగు చేయుటకు ముందు వరకు జాగ్రత్తగా భద్రపరచివుంచాలి. ఫ్లక్సు వూడిపోయిన ఎలక్ట్రోడులతో వెల్డింగు చెయ్యరాదు. స్రావకం లేనందున చేసిన వెల్డింగు జాయింట్ నాణ్యత తగ్గుతుంది. ఎలక్ట్రోడు వాతావరణంలోని చెమ్మను ఎలక్ట్రోడు పైనున్న స్రావకపూత పీల్చుకొను అవకాశము ఇవ్వరాదు. ఎలక్ట్రోడులను మూతవున్న పెట్టెలో వుంచాలి. కొన్నిరకాల ఎలక్త్రోడులను ఎయిరుఒవను (Air oven) లో 1-2 గంటలు 110-120o C ఉష్ణోగ్రతలో వుంచి, గాలి తగలని ప్రదేశంలో చల్లబరచి వాడవలెను. కొన్నింటిని 150o C వరకు వెచ్చ చెయ్యవలసి వుండును (ఉదా: BS:E 616H or IS:16478Hఎలక్ట్రోడు). వాడుటకు ముందు ఎలక్ట్రోడు మీద వున్న కోడు నెంబరు చెరిగి పోకుండ చూడవలెను.లేనిచో ఏ రకం లోహానికి చెందినదో తెలియదు.

ఎలక్ట్రోడుల రకాలు

[మార్చు]

(ఎలక్ట్రోడు మీదనున్న స్రావకపు పూత మందాన్ని బట్టి)

  1. స్రావకరహిత ఎలక్ట్రోడు (Bare electrode) :ఈ ఎలక్ట్రోడు ఎటువంటి స్రావకాన్ని కలిగివుండదు.మిశ్రమ లోహంతోచెయ్యబడివుండును.పలుచటి పలకలను (very thin sheets) అతుకుటకు ఉపయుక్తము.
  2. పలుచని స్రావకపూత ఎలక్ట్రోడు (Lightly coated) : స్రావకాన్ని చాలా పలుచగా కలిగివున్న ఎలక్ట్రోడు. ఈ ఎలక్త్రోడుల కోటింగు ఫ్యాక్టరు (coating factor) 1.25 వరకుండును. ఉదా: అద్వాని ఒర్లికిన్ వారి సిటొబెస్ట్ (cito best) ఎలక్ట్రోడు.
  3. మధ్యరకము మందము స్రావకపూత (medium coated) కలిగిన ఎలక్ట్రోడు. కోటింగు ఫ్యాక్టరు:1.45 వుండును. ఉదా: ఒవర్‍కొర్డ్-C
  4. అధిక మందస్రావక పూత (Heavily coated) కలిగిన ఎలక్ట్రోడు. కోటింగ్‍ ఫ్యాక్టరు:1.6-2.2 వరకుండును. ఉదా: సిటొఫైన్ (citpfine)

కోటింగ్‍ ఫ్యాక్టరు = స్రావకపుపూతమందంతోకూడి ఎలక్ట్రోడు వ్యాసం/పూరకకడ్ది అసలు వ్యాసం

స్రావకము(Flux)

[మార్చు]

మెటల్ ఆర్కువెల్డింగులో ఎలక్ట్రోడుల మీద పూతగా పూయు స్రావకము కూడా వెల్డింగులో కొంతమేర ప్రభావము చూపించును. స్రావకము వెల్డింగు సమయములో, ఎలక్ట్రోడుతోపాటు కరగి ద్రవ రూపములో వెల్డింగు జాయింటుపై తెట్టుగా ఏర్పడి, వెల్డింగు లోహం నేరుగా గాలిలోని ఆక్సిజనుతో సంయోగము చెంది అక్సీకరణ చెందకుండ నిరోధించును, వెల్డింగు జాయింటు వేగంగా చల్లబడకుండ ఉష్ణనిరోధకంగా కూడా పని చేయును. స్రావకము వెల్డింగు జాయింటును కప్పి వుంచడం వలన వెల్డింగు జాయింటులోని లోహద్రవ బిందువులు పక్కకు తుళ్ళేవకాశాన్ని నిరోధిస్తాయి. అలాగే స్రావకము నుండి వెలువడు పొగతో కూడిన వాయువులు వెల్డింగు జాయింటు చుట్టూదట్టంగా వ్యాపించి, పరిసరాలలోనిగాలిని వెల్డింగు జాయింటుకు దూరముగా నెట్టివేయును. వెల్డింగుమీద తెట్టు (slag) ఏర్పడుటకై స్రావకములో సోడియము, పొటాషియం, మెగ్నిషియము, అల్యూమినియంల సిలికెటులను, ఐరను అక్సైడు, చీనామన్ను, మైకా వంటివాటిని ఉపయోగిస్తారు.ఇవి ద్రవీకరణచెందినప్పుడు తెట్టుగా మారును.ఈ తెట్టుసాంద్రత వెల్డింగుజాయింటులోని లోహాలసాంద్రతకన్న తక్కువకావడం వలనస్రావకపుతెట్టు వెల్డింగుజాయింటుపై తేలి, కప్పివుంచును.అలాగే స్రావకములోకలుపు సెల్యులోస్, కర్రపొడి (wood flour, పిండిపదార్థము, కాల్సియంకార్బోనేటువంటివి వెల్డింగుసమయంలో మండి పోగరూపంలో వెల్డింగు ప్రదేశాన్ని ఆవరించి, వెల్డింగుజాయింటుకు రక్షణకల్పించును[4] _.అలాగే వెల్డింగుజాయింటును డిఆక్సిడైసింగుచేయుటకు ఫెర్రొ-మాంగనీసు, ఫెర్రో-సిలికానులను వాడెదరు.వెల్డ్ జాయింటులోని లోహం అతుకుతున్నలోహంతో సమ్మేళనంచెంది దృఢత్వమున్నఏకీకృతంగా లోహంగా ఏర్పడుటకు మాంగనీసు, మోలిబ్డినము మిశ్రమలోహాలను చేర్చెదరు.

వెల్డింగు హోల్దరు

[మార్చు]
రక్షితౌపకరణములు ధరించి వెల్డింగువేయుట

వెల్డింగు వేయు ఎలక్ట్రోడును వెల్డింగు హోల్డరుకు బిగించి వెల్డింగు చేయుదురు. వెల్డింగు హోల్డరు ముందు భాగంలో లోహంతో చేసిన రెండు దవడలవంటి భాగముండును. వీటితో వెల్డింగు ఎలక్ట్రోడు యొక్క స్రావకంలేని భాగాన్ని పట్టు కొనెదరు. హోల్దరు వెనుకభాగంలో చేతితోపట్టుకొనుటకై అనువుగా, విద్యుత్తు, ఉష్ణనిరోధకపదార్థంతో చేసిన గొట్టంవంటి హెండిల్ వుండును. హెండిల్ దిగువన స్ప్రింగు బిగించిన లివరు వుండును. హెండిలును కుడిచేతితో పట్టు కొని, క్రింది లివరును హెండిల్‍కు దగ్గరకు వచ్చెలా నొక్కిన, హోల్డరు ముందు భాగంలోని దవడల వంటి భాగం తెరచుకొనును. దవడలవంటి భాగంలో సన్ననిగాడులు (ఎలక్ట్రోడు కడ్ది వ్యాసానికి సరిపడేలా) వుండును. ఈ గాడులలో ఎలక్ట్రోడు చివరను వుంచి, లివరును వదలినచో, హోల్డరు దవడలు ఎలక్ట్రొడును బలంగా పట్టుకొనును. దవడయొక్క లోహాపట్టికకు ట్రాన్సుఫార్మరు యొక్క ఆనోడు కెబులు కలుపబడివుండును. వెల్డింగుహొల్దరు చూచుటకుY ఆకారంలో వుండును.

రక్షిత తొడుగుగల కేబుల్సు

[మార్చు]

వెల్డింగు చేయుటకై ఉపయోగించు ట్రాన్సుఫార్మరు యొక్క నిర్గమ కరెంటు యుక్క ఆనోడు, క్యాథోడు ధ్రువాలను, వెల్డింగు హోల్దరుకు, వెల్డింగు చేయు లోహాఫలకాలను అసునంధానము చేయుటకు రక్షిత తోడుగు గల రాగితీగెల కేబుల్లను వాడవలెను. రాగితీగపైన విద్యుత్తు ఘాతం తగలకుండాగా, విద్యుత్తు నిరోధక గుణమున్న మందమైన రబ్బరును తొడుగా వినియోగిస్తారు. కేబుల్ లోపల సన్నని అల్యూమినియం లేదా రాగి తీగలు, దగ్గరగా పెనబడి వుండును. అల్యూమినియం కేబుల్ ఎక్కువ కరెంటుతో (మందమైన లోహాలను అతుకునప్పుడు) తొందరగా వెడెక్కును. రాగితీగల కేబుల్ కన్న లావుగా వుండుట వలన కేబులును అటుఇటు కదుపటతో శ్రమ అధికము. ఎక్కువ కరెంటుతో వెల్డింగు చేయుటకు రాగితీగెలను కలిగివున్న కేబుల్లనే వాడటం వుత్తమము.

రక్షిత ఉపకరణములు

[మార్చు]

వెల్డింగు ఆర్కు నుండి ప్రకాశవంతమైన కాంతి వెలువడుతుంది. అంతియేకాదు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు కూడా ఉత్పత్తి అవుతాయి. అందుచే అర్కుయొక్క వెలుగును నేరుగా కంటితో చూడటం ప్రమాదకరం. ఆర్కు యొక్క ప్రకాశవంతమైన కాంతి కిరణాలను, అతినీలకిరణాలను నిరోధింటకు ప్రత్యేకంగా చేసిన నల్లటి అద్దాన్ని కళ్లకు అడ్దుగా పెట్టుకొని వెల్డింగు చేయుదురు. ఇవి ప్రమాదకరమైన కాంతి కిరణాలను వడబోతచేసి, ప్రమాదకరము కాని కాంతిని మాత్రమే కంటికి చేరునట్లు చేయును. ఈ రక్షిత అద్దాన్ని కళ్ళఅద్దాలుగా లేదా ఒక హెల్మెటుకు ముందుభాగంలో అమర్చి ఉపయోగిస్తారు. రక్షిత అద్దం బిగించిన హెల్మెటును తలకు, ముఖానికి అడ్దుగా వుండేలా ధరించి, లేదా చేతితో పట్టుకుని, ముఖానికి అడ్దుగా పెట్టుకొని వెల్డింగు వేయుదురు. అలాగే ఆర్కునుండి వెలువడు ఉష్ణోగ్రతనుండి రక్షణగా చేతికి తోలు తొడుగులు, కాళ్లకు ఉష్ణనిరోధక పదార్థాల చేసిన పాదరక్షాలను ధరించెదరు. అలాగే వెల్డింగు చేయున్నప్పుడు నైలాను, పాలిస్టరువంటి తేలికగా కాలే దుస్తులను కాకుండాగా, నూలుదుస్తులను, వాటిపై ఆప్రానును ధరించాలి.[5]

ఇవికూడా చూడండి

[మార్చు]
  1. వెల్డింగ్
  2. కార్బను ఆర్కువెల్డింగు
  3. ఫ్లక్సుకోర్డు ఆర్కువెల్డింగు

బయటి లింకులు

[మార్చు]
  1. [1] మెటల్ ఆర్కు వెల్డింగు

సూచికలు

[మార్చు]
  1. "Manual Metal Arc Welding". stellite.co.uk. Archived from the original on 2014-02-22. Retrieved 2014-03-03.
  2. "The Basics of Arc Welding". www.esabna.com/. Retrieved 2014-03-03.
  3. "Types of Materials Used to Make Welding Rods". www.ehow.com. Retrieved 2014-03-04.
  4. "LESSON III". esabna.com. Retrieved 2014-03-03.[permanent dead link]
  5. "Arc Welding Safety". www.lincolnelectric.com. Retrieved 2014-03-03.