Jump to content

టిగ్ వెల్డింగు

వికీపీడియా నుండి
టిగ్ వెల్డింగు

టిగ్ (TIG) అనునది టంగ్‍స్టన్ ఇనెర్ట్ గ్యాసు వెల్డింగు (Tungsten inert Gas welding) కు సంక్షిప్త ఆంగ్లపదము. టంగ్‍స్టన్ లోహకడ్డిని ఆర్కును సృష్టించు ఎలక్ట్రొడుగా వినియోగిస్తూ, వెల్డింగు సమయంలో అతుకబడు లోహాభాగాలు ఆక్సికరణకు లోనుకాకుండ నిరోధించుటకు ఆర్గాను, లేదా హీలియము వంటి జడవాయువు లను వినియోగించు వెల్డింగు ప్రక్రియ.[1] ఈ వెల్డింగు ప్రక్రియను జి.టి.ఎ.డబ్లూ (GTAW:Gas Tugsten arc welding) అని కూడా వ్యవహరిస్తారు. ఈ వెల్డింగు విధానం ఒక విధంగా అభివృద్ధిపరచిన కార్బను ఆర్కువెల్డింగు విధానమని చెప్పవచ్చును. కార్బను ఆర్కువెల్డింగు విధానంలో కర్బనపు కడ్డీని ఆర్కు కల్గించు ఎలక్ట్రోడుగా వాడి, లోహాలను అతుకుటకు ప్రత్యేకంగా పూరక లోహ కడ్డీని వాడినట్లే, టిగ్ వెల్డింగులో కూడా టంగస్టన్ లోహకడ్డీని ఆర్కు ఏర్పరచుటకు మాత్రమే వాడి, లోహాలను ప్రత్యేకంగా మరో లోహాపూరక కడ్దితో అతికెదరు. టిగ్ వెల్దింగులో లోహపూరక కడ్దిపై ఎటువంటి స్రావకము వుండదు. టిగ్ వెల్డింగును కూడా కార్బను ఆర్కువెల్డింగు వలె ఏకముఖ విద్యుత్తు (D.C.) ను వినియోగించెదరు. టిగ్ వెల్డింగులో పూరకలోహాక కడ్దిలు మెటల్ ఆర్కువెల్డింగు ఎలక్ట్రొడుల వలె నిర్ధిష్టమైన పొడవు వుంటాయి. టిగ్ వెల్డింగులోని ఎలక్టొడుగా వాడు టంగ్‌స్టన్ ద్రవీభవన ఉష్ణోగ్రత చాలాఎక్కువ (3422 0C).అందుచే వెల్డింగుసమయంలో టంగ్‌స్టను ఎలక్ట్రొడు అరుగుదల చాలాతక్కువ.అందుచే టంగ్‌స్టను ఎలక్ట్రోడు అరగని/ నాన్‌ కంజ్యూమబుల్ (non consumable) ఎలక్ట్రోడు. అయితే చాలాకాలం వాడిన తరువాత కొద్దిమేర అరుగుదల వుంటుంది.

టిగ్ వెల్డింగు పుట్టుక-అభివృద్ధి

[మార్చు]

విద్యుత్తు వలయములో అధికప్రమాణంలో కరెంటు ప్రవహించునప్పుడు అనోడు, కేథోడులమద్ధ్య అత్యధిక ఉష్ణోగ్రత, కాంతిని వెలువరించులా ఆయానీకరణ చెందిన ఎలాక్ట్రానుల సమూహ ప్రవాహంతో కూడిన కాంతివలయాన్ని (చాపము) ఏర్పరచవచ్చునని 1800లో హంప్రి ఢేవి కనుగొన్నాడు. సా.శ.1802 లో రష్యన్ శాస్త్రవేత్త వసిలి పెట్రొవ్ (vasily petrov) విద్యుత్తు ట్రాన్సుఫార్మరులో తక్కువ వోల్టేజి (70-100 వోల్టులు), ఎక్కువ అంపియర్ల విద్యుత్తు ఏర్పరచి, ట్రాన్సుఫార్మరు యొక్క ఋణధ్రువ అంచును, ధనధ్రువ అంచుతో తాకించి వాటి మధ్య కొంత దూరముండు నటుల చేసినచో అత్యంత ఉష్ణమును విడుదల చేస్తూ, ఒక ప్రకాశవంతమైన వెలుగు (electric Arc) ఏర్పడటాన్ని కనుగొన్నాడు, వెలువడు ఈ ఉష్ణశక్తితో లోహాలను అతుకవచ్చునని భావించాడు. సా.శ.1881-82 లో రష్యాకు చెందిన నికొలై బెనర్డొస్, విద్యుతుఆర్కు (Arc) తో కార్బన్ ఎలక్ట్రోడ్ నుపయోగించి వెల్డింగు చెయ్యడం కనుగొన్నాడు. అప్పటినుండి విద్యుత్తు నుపయోగించి లోహాలను అతుకు శకము ప్రారంభమైనది. వివిధ రకాలైన్ లోహాలను అవసరానికి అనుకూలంగాం దృఢంగా, ఏకీకృతంగా, ఎక్కువ మన్నిక కలిగిన వెల్డింగు వచేయు విధానాలకై, పద్ధతులకై జరిగిన ప్రయోగాలు, పరిశోధన ఫలితంగా రకరకములైన వెల్డింగు ప్రక్రియలు వాడుకలోకి వచ్చినవి. అలాంటి వాటిలో ఒకటి ఈ టిగ్ వెల్డింగు విధానము. మెటల్ ఆర్కువెల్డింగ్ విధానంలో, ముఖ్యంగా షిల్డెడ్ ఎలక్ట్రోడు నుపయోగించి లోహాలను అతుకుట చాలా సులభతరమైనప్పటికి, ఇనుమేతర (non-ferrous) లోహాలను, ముఖ్యంగా అల్యూమినియం, మెగ్నీషియం వంటి వాటిని ఆర్కువెల్డింగు ద్వారా అతుకుట ఇబ్బందికరంగా వుండెది. ఈ లోహాలు వెల్డింగు సమయంలో గాలితో త్వరగా చర్యనొందటం వలన రంధ్రాలున్న (bloe holes) వెల్డింగు జాయింటులు ఏర్పడటం, వెల్డింగు ఎలక్ట్రోడుల స్రావకపదార్థం కొంత అతుకులలో (weld joints) వుండిపోయి అతుకు లోపభరితం కావడం వంటి సమస్యలు ఎదురైయ్యెవి. ఈ క్రమంలో బాటిలులలో నింపిన జడవాయువు/తటస్థవాయువు లను, రక్షితవాయువుగా వాడటం 1930నుండి మొదలైనది. ఆతరువాత సంవత్సరములలో, ఎ.సి.కరెంటుకు ప్రత్యామ్నయంగా డి.సి.కరెంటుతో జడవాయువులను రక్షితవాయువుగా నుపయోగించి మెగ్నీషియం లోహాలను అతకడం విమాననిర్మాణ పరిశ్రమలలో ముమ్మరమైనది. సా.శ.1941 నాటికి ప్రస్తుత టిగ్ వెల్డింగుకు మూలరూపమైన హీలిఆర్కు (heliarc) లేదా టంగుస్టను ఆర్కు వెల్డింగు అస్థిత్వంలోకి వచ్చింది. ఈ విధానములో టంగుస్టనును ఎలక్ట్రోడుగా, హీలియం (helium) వాయువును రక్షితవాయువుగా (shielding gas) ఉపయోగించి వెల్డింగు చెయ్యడం ప్రారంభమైనది. అయితే ఈ పద్ధతిలో ఒక లోపముండెది, టంగుస్టను లోహం యొక్క ద్రవీభవనౌష్ణొగ్రత ఎక్కువైనప్పటికి (3422 0C ) వెల్డింగు సమయంలో టంగుస్టను ఎలక్ట్రోడు త్వరగా వేడెక్కి, మెత్తబడి, ఎలక్ట్రోడు అంచు కొద్దిగా కరిగి వెల్డ్ మెటలులో కలసిపొయ్యెది. ఈ సమస్యను అధికమించుటకై వెల్డింగు ట్రాన్సుఫార్మరు యొక్క పొలారిటిని మార్చి చూడటమైనది.అంతకుముందు టంగుస్టను ఎలక్ట్రొడుకు ధనధ్రువము (ఆనోడు) కలుపబడివుండెది, దానిని ఋణధ్రువంగా (కాథోడు) గా మార్చడం జరిగింది. కాని ఈ పద్ధతిలో ఉక్కేతర లోహాలను అతుకడం కష్టంగా వుండెది. అయితే ఎ.సి.ట్రాన్సుఫార్మరులో స్థిర వోల్టెజి వుంచిన పైన పేర్కొన్న ఉక్కేతర థాతువులను సులభంగా అతుకవచ్చునని కనుగొన్నారు. వెల్డింగు సమయంలో ఉత్పన్నమగు అధిక ఉష్ణోగ్రత వలన టంగుస్టను వెల్డింగు టార్చు త్వరగా వెడెక్కడం వలన మధ్యలో కొంచెముసేపు వెల్డింగును ఆపవలసి వచ్చెది, లిండె ఎయిరు ప్రొడక్ట్సువారు ఎలక్ట్రోడు టార్చును నీటితో చల్లబరచు పద్ధతి కనుగొన్నారు. అటుపిమ్మట హీలియం వాయువు ఖరీదైనది కావటంవలన దానికన్న చౌవకైన కార్బనుడైఆక్సైడు వాయువును షీల్డు గ్యాసుగా వాడటం మొదలుపెట్టారు. అయితే ఈగ్యాసుతో వెల్డింగు చేసిన అల్యూమినియం, మెగ్నిసియం లోహాలఅతుకు అంతనాణ్యతగా లేకపోవడం వలన ఉక్కువేతర లోహాలను అతుకుటకు హీలియం లేదా ఆర్గాన్ వాయువుల వాడకం తప్పనిసరి అయ్యినది.[2] ప్రస్త్తుతం కార్బనుడైఆక్సైడును అతిఅరుదుగా మాత్రమే వినియూగిస్తున్నారు.

టిగ్ వెల్దింగులో వినియోగించు పరికరాలు

[మార్చు]
  1. వెల్డింగు ట్రాన్సుఫార్మరు (డి.సి.లేదా ఎ.సి.)
  2. వెల్డింగు టార్చు
  3. పూరకలోహము
  4. రక్షితవాయువు
  5. రక్షిణ ఉపకరణాలు

వెల్డింగు ట్రాన్స్ ఫార్మరు/టిగ్‌వెల్డరు

[మార్చు]
వెల్డింగు ట్రాన్సుఫార్మరు-AC/DC కరెంటు వున్నది

టిగ్ వెల్డింగులోఆర్కును సృష్టించుటకై తక్కువ వోల్టెజి, ఎక్కువ కరెంటు (ఆంపియర్లు) పొందుటకై స్టెప్‍డౌన్ ట్రాన్సుఫార్మరును వినియోగిస్తారు. కొన్నిరకాల లోహాలను అతుకుటకై ఎ.సి. ట్రాన్సుఫార్మరును, కొన్ని రకాల లోహాలను అతుకుటకై డి.సి. కరెంటునిచ్చు రెక్టిఫైరు ట్రాన్సుఫార్మరును వినియోగిస్తారు. ఆయా లోహాలను బట్టి డి.సి, కరెంటులో కొన్ని లోహాలను వెల్డుచేయునప్పుడు DCSP పద్ధతిలోను, అనగా ఆనోడును వెల్డింగు చేయవలసిన లోహాలకు కలుపుతారు. కొన్ని లోహాలను DCRP పద్ధతిలోను, అనగా ఆనోడును వెల్డింగు టార్చునకు కలిపి వెల్డింగు చేయుదురు. ఏకముఖవిద్యుత్తు (DCSP) విద్యుత్తు కరెంటు నుపయోగించి సాధారణంగా స్టెయిన్‍లెస్‍ స్టీలు, నికెలు, రాగి, రాగి యొక్క మిశ్రమథాతువు లోహాలను అతికెదరు. DCRP లేదా A.C. కరెంటు నుపయోగించి అల్యూమినియం, మెగ్నిషియం లోహాలను వాటి మిశ్రమథాతువు (alloy) లోహాలను అతికెదరు. ఎ.సి.ట్రాన్సుఫార్మరు నుపయోగించి వెల్డింగు చేయునప్పుడు ఎక్కువ ఫ్రిక్వెన్ని కరెంటును ఉపయోగించినచో వెల్డింగు ఆర్క్ నిలడగా వుండును.[3]

6 మి.మీ మందమున్న వివిధలోహలను అతుకుటకు కావలసిన కరెంటు, ఆర్గాను గ్యాసు తదితరాల వివరాల పట్టిక

వెల్డుజాయింటు రకము=బట్ట్ (But)

వెల్డింగు పొజిసను=ఫ్లాట్ (Flat)

అతుకు లోహము కరెంటు (ఆంపియర్లు విద్యుత్తురకం ఎలక్ట్రోడు వ్యాసం, మి.మీ పూరకకడ్ది వ్యాసం, మి.మీ ఆర్గాను లీ/నిమిషానికి
ఎం.ఎస్.స్టెయిన్‍లెస్‍స్టీలు 250-350 DCSP 3.0 3-4 7
గ్రే కాస్ట్ ఐరను 160 AC/DCSP 3.0 5.0 8
అల్యూనియం 200-300 A.C 4.5 3-5 9
మెగ్నిషియం 100-150 A.C 2.5 4.0 10
రాగి 250-375 DCSP 3.0 4.0 7
సిలికాన్‍బ్రోంజు 150-200 DCSP 2.5 3-4 9

వెల్డింగు టార్చు

[మార్చు]
వెల్డింగుటార్చు-భాగాలు

టిగ్ వెల్డింగులో టంగుస్టనుతో చేసిన ఎలక్ట్రోడును కలిగిన వెల్డింగు టార్చు ప్రధానమైనది. టార్చులో వున్న టంగుస్టను ఎలక్ట్రోడుతో అతుకవలసిన భాగంలో విద్యుత్తు ఆర్కు ఏర్పరచబడును. టార్చుపైభాగం స్తూపాకరంగా వుండి దానికి శాంఖాకారంగావున్న నాజిలు వుండును. స్తూపాకారపు భాగంనకు నొకప్రక్క విద్యుత్తు నిరోధకపదార్థములతో చేసిన గొట్టమువంటి భాగముండును. దీనిని చేతితో పట్టుకొనే పిడి (handle) గా వుపయోగిస్తారు. ఈ పిడి ద్వారానే వెల్డింగు జాయింటును కప్పివుంచే ఆర్గాను లేదా హీలియం వాయులు వచ్చు రబ్బరుగొట్టము కలుపబడి వుండును. ఈ గొట్టము ద్వారానే ట్రాన్సుఫార్మరు కేబులు ఎలక్ట్రోడును బిగించిన కొల్లెట్ ద్వారా కలుపబడివుండును. టార్చు హెండిల్ మీదనే విద్యుత్తును ఆపుటకు, ఆన్ చేయుటకు ఒక స్విచ్చు కూడా బిగింపబడి వుండును. నాజిలు లోపల ఒక కొల్లెటుకు దృఢముగా టంగుస్టను ఎలక్ట్రోడు బిగించబడి వుండును. కొల్లేటు మరలను తిప్పుట ద్వారా ఎలక్ట్రొడును పైకి, క్రిందికి జరుపుటకు ఆవకాశమున్నది. ఈ టంగుస్టను ఎలక్ట్రొడు కడ్డివ్యాసం 0.5 నుండి 6.5. మి.మీ. వరకు, పొడవు 75-100 మి.మీ. వుండును. తక్కువ మందమున్న లోహాలను అతుకుటకు తక్కువ వ్యాసమున్న టంగుస్టను ఎలక్ట్రొడున్న టార్చిని, ఎక్కువ మందమున్న లోహాలను అతుకుటకు ఎక్కువ వ్యాసమున్న టంగుస్టను ఎలక్ట్రోడును ఉపయోగిస్తారు. టంగుస్టను ఎలక్ట్రోడు వెలుపల నుండి ఆర్గాను లేదా హీలియం వాయువులు ప్రసరింపబడి నాజిల యొక్క ముఖరంధ్రము నుండి బయటకు వచ్చును. నాజిల్ చివరరంధ్రము మొదటచిన్నగా వుండి అ తరువాత వెడల్పుగా సాగివుండును. ఇలా వుండం వలన నాజిలు రంధ్రము నుండి వచ్చు వాయువులు నేరుగా వెల్డింగు జాయింటు మీదికి కాకుండగా, వెల్డింగు పరిసరప్రాంతములో ప్రసరించి, గాలిని వెల్డింగు జాయింటుకు దూరముగా నెట్టివేయును. వెల్డింగు టార్చులోని టంగుస్టను ఎలక్ట్రోడు యొక్క చివరిఅంచు, వెల్డింగుచేయు కరెంటును బట్టి వివిధ రకాలుగా వుండును. DCSP (dirct current straight ple) పద్ధతిలో ఆనోడును అతుకవలసిన లోహాలకు, కాథోడును టంగుస్టనుకు కలుపుతారు. ఈ రకపు వెల్డింగు చెయ్యునప్పుడు టంగుస్టను ఎలక్ట్రొడు అంచు కొనదేరి సూదిలా శీర్షాగ్రము కలిగివుండును. DCRP (direct current reverse pole) పద్ధతిలో కాథోడును వెల్డింగు చేయు లోహభాగాలకు, ఆనోడును ఎలక్ట్రొడుకు కలుపబడి వుండును. ఈ రకపు వెల్డింగు చేయు టార్చులోని ఎలక్ట్రొడు యొక్క దిగువభాగం శంకాకారంగా వుండి, అంచు కొద్దిగా ఉబ్బి చిన్నపాటి గోళాకారంలో వుండును. AC కరెంటు అయినచో ఎలక్ట్రొడు దిగువభాగం స్తూపాకారంగా వుంది, కొనభాగం గోళాకారంగా వుండును. వెల్డింగు కరెంటు 150 అంపియర్లు దాటి చెయ్యునప్పుడు. వెల్డింగు టార్చుని నీరు/గాలి సరఫారా ద్వారా చల్లబరచు అమరిక వుండును. వెల్డింగుటార్చులోవాడు ఎలక్ట్రోడును కేవలం టంగుస్టనులోహంతోనేకాకుండ, టంగుస్టనును జిర్కొనియ, థొరియ, సెరియ వంటిలోహాలతో కలిపితయారుచేయుదురు.కేవలం టంగుస్టనుతోచేసిన ఎలక్ట్రొడును అల్యూమినియం, మెగ్ని షియంవంటి లోహాలను అతుకుటకు వాడెదరు.కేవలం టంగుస్టనుతో చేసిన ఎలక్ట్రొడులకన్న పైనపెర్కొన్న లోహలమిశ్రమములతోచేసిన ఎలక్ట్రొడులు ఎక్కువమన్నిక వుండును.జిర్కొనియంకలిగిన ఎలక్ట్రొడు, థొరియం కలిగిన ఎలక్ట్రొడులను ఎక్కువగా వినియోగిస్తారు.

వెల్డింగులో వినియోగించు రక్షణ వాయువులు

[మార్చు]
రక్షణవాయు సరఫరా విధానము

టిగ్ వెల్డింగులో అతుకులను నింపుటకువాడు పూరకలోహం (filler) తో పాటు స్రావకాన్ని ఉపయోగించడం వుండదు.వెల్డింగును సాధారణవాతవారణంలోవే చెయ్యడం వలన, ఎటువంటిస్రావకాన్ని వాడకపోవడంవలన వెల్డింగుసమయంలో గాలిలోని ఆక్సిజను, నైట్రొజనువాయువులతో అత్యధికఉష్ణోగ్ర్తతలో ద్రవరూపంలోవున్న లోహపుఅతుకుభాగం చర్యజరపడంవలన, వెల్డింగుజాయింట్లో లోపాలుఏర్పడును.వెల్డుజాయింటులో గాలివుండి, బ్లోహోల్సు, ఏర్పడును.వెల్డింగులో కఠినత్వముపెరిగి, చల్లారినతరువాత వెల్డింగు బీటలుబారును.వెల్డింగుఅతుకులో దృఢత్వం తగ్గటంవలన, ఎక్కువ ఉష్ణోగ్రతవద్ద, వత్తిడివద్ద వెల్డింగుజాయింటువిడిపోవును.అందువలన తప్పని సరిగా టిగ్ వెల్డింగులో, వెల్డింగుసమయంలో వెల్డింగుజాయింటుపైన గాలిచేరకుండగా, లోహాలతోచర్యజరుపని మరోరకపువాయువులను వినియోగించాల్సిన అవసరంవున్నది.అందుకు అనువైనవి, లోహాలతో అంతత్వరగా చర్య జరుపనిజడవాయువులు ( హీలియం, ఆర్గాను, నియాను, క్రెప్టాను వంటివి).టిగ్ వెల్డింగులో ఈదిగువనపేర్కొన్నవిధంగా రక్షణవాయువులను (shield gases) ఉపయోగిస్తారు.

  1. ఆర్గాను వాయువు
  2. హీలియం వాయువు
  3. ఆర్గాను-హీలియంల మిశ్రమము
  4. ఆర్గాను-హైడ్రొజను మిశ్రమము.

అతుకుచున్నలోహాల భౌతిక, ఇతరగుణాలనుబట్టి రక్షణవాయువులను మార్చివాడవలసివున్నది. హీలియాన్ని రక్షణవాయువుగా మొదట ఎక్కువగా వాడెవారు.హీలియంవాయువుకాసి ఖరీదైనది కావడం వలన ఆర్గాను వాయువును రక్షణవాయువుగా వినియోగించడం మొదలైనది.ఆతరువాత లోహాలనుబట్టి పైన పేర్కొన్నట్లుగా ఒకటి, రెండు వాయువులమిశ్రమాన్నికూడా వాడుచున్నారు.ఎ.సి.కరెంటును ఉపయోగించి వెల్డింగు చేయునప్పుడు ఆర్గాను వాయువునూపయోగించడం సాధారణం.హీలియంవాయువును.ఎక్కువ ఉష్ణవాహకగుణంవున్న అల్యూమినియం, రాగి వంటిలోహాలను అతుకునప్పుడు ఉపయోగిస్తారు.హీలియం వాయువును వాడేటప్పుడుకలిగే ఇబ్బంది ఏమిటనగా ఆతుకు ప్రారంభమ్లో ఆర్కు వెంటనే ఏర్పడదు.అలాగే హీలియం-ఆర్గాను వాయువులమిశ్రమాన్ని ఎ.సి.కరెంటును వాడి అల్యూమినియంవంటి లోహాలను అతుకుటకు వాడెదరు.

పూరకలోహ కడ్దిలు

[మార్చు]

టిగ్ వెల్డింగులో ఉపయోగించు పూరకకడ్డిలు సన్నగా స్తూపాకారముగా వుండును. పొడవుగా కాని, లేదా చిన్నచుట్తలుగా (coils) చుట్టబడివుండును. పొడవుగా వున్నకడ్దిలను వెల్డింగుచేయుటకు అనువుగా తగిన సైజుకు కత్తరించి వాడెదరు .పూరకలోహా కడ్దిల వ్యాసం 1.5మి.మీ లనుండి 4.5మి.మీ.వరకు వుందును.అంతకుమించిన సైజు పూరకలోహకడ్దిలను సాధారణంగా వాడరు. కారణము.టిగ్ వెల్డింగు విధానంలో గరిష్ఠంగా 6-9 మి.మీ మందమున్నలోహాలను సింగిలు V గ్రూవ్ పద్ధతిలో మాత్రమే అతికెదరు. అంతకు మించినచో అంతకు మంచి 12.5మి.మీ మందమువరకు లోహాలను డబుల్ V (X) పద్ధతిలో అతికెదరు.లేదా మెటల్ ఆర్కుపద్ధతిలో వెల్డింగు చేయుదురు బాగాపలుచని లోహాలను అతుకుటకు పూరకలోహాం అవసరములేదు.ఏ లోహాలనైతే అతుకవలెనో ఆలోహాలతో చేసిన పూరకలోహకడ్దిలనువాడెదరు.

రక్షణ(భద్రత)ఉపకరణాలు

[మార్చు]
రక్షణకళ్ళజోడు
  1. వెల్డింగు చేయుసమయంలో, వెల్డింగుచేయు వ్యక్తి (వెల్డరు) తప్పనిసరిగా రక్షణౌపకరణములను వాడవలెను.వెల్డింగుసమయంలో వెలువడు ప్రకాశవంతమైన కాంతికిరణాలను, అతిలోహితనీలకిరణాలను నిరోధించి పరావర్తనం చెయ్యగల నల్లటి రక్షణఅద్దం బిగించిన శిరస్త్రాణం (helmet) లేదా కళ్ళజోడు (goggles) ధరించవలెను.వెల్డింగుసమయంలో ఒకచేతితో వెల్డింగుటార్చు, మరోచేతితో పూరకలోహకడ్దిని పట్టుకోవలసినందున, మెటల్ ఆర్కు వెల్డింగులోలా చేతితోపట్టుకొనే రక్షణషీల్డును ఉపయోగించుటకు కుదరదు.
  2. కాళ్ళకు రక్షకపాదుకలు, చేతులకు రక్షక తోలుతొడుగులు తప్పనిసరిగా ధరించాలి.[4]
  3. వెల్డింగు ట్రాన్సుఫార్మరులో ఏదైన సమస్యవచ్చిన వెల్డింగుచేయువ్యక్తికి విద్యుత్తుఘాతము (elwctric shock) తగులకుండ, వెల్డింగుట్రాన్సుఫార్మరునుండి ఎర్తువైరు భూమికి కలుపబడివుండాలి.
  4. రక్షణవాయువు ప్రసరించుగొట్టాలు దృఢంగావుండాలి, గ్యాసుసిలిండరుకు బిగించిన గేజులు, వాల్వులు సరిగా పనిచేయుస్థితిలో వుండవలెను.

వెల్డింగుచేయు విధము

[మార్చు]
టిగ్ వెల్డింగు చేయువిధము

మొదట అతుకవలసిన లోహాల అంచులను బాగా శుభ్రపరచవలెను. గ్రీజు, నూనెమరకలవంటివి వున్నచో హైడ్రోకార్బను ద్రవాలను ఉపయోగించి తొలగించవలెను. మట్టి, తుప్పువంటీతరమలినాలు వున్నచో గరుకు కాగితము (emery paper, ఉక్కుతీగెలకుంచె (steel wire brush) లను ఉపయోగించి మెరుపు వచ్చెలా రుద్దవలెను.3.0మి.మీ కన్నమందమైన పలకలైనచో చివరిఅంచులను 600 లకోణంవచ్చెలా'V'అకారంవచ్చెలా చెక్కవలెను. ఫ్లాట్ వెల్డింగు అయినచో వెల్డింగుచేయు లోహపలకలను భూమికి సమతలంగా వుండునట్లు జాగ్రత్త పడవలెను. ఇప్పుడు అతుకవలసిన రెండు అంచులు దగ్గరగావుండెలా చూడవలెను. మొదట వేరే లోహపలక మీద వెల్డింగుటార్చితో ఆర్కుపుట్టించి, వెల్డింగుకు సరిపడేలా అర్కుఏర్పడునట్లు, ట్రాన్సుఫార్మరులో కరెంటు వచ్చెలా చేసుకోవాలి. ఆతరువాత వెల్డింగుటార్ఛిఎలక్ట్రొడును అతుకవలసిన జాయింట్ మీదతగిలింఛి ఆర్కునుపుట్టించాలి.ఎలక్ట్రొడుఅంచుకు, లోహాలకు కనీసం3-4 మి.మీ.దూరమున్నచో నిలకడగల ఆర్కుఏర్పడును.ఆర్కువలన లోహాభాగాలు కరగడం మొదలవ్వగానే రక్షణవాయుగొట్టం వాల్వునుతెరచి వాయువులు వెల్డీంగు జాయింటు చుట్టూ ప్రసరించేలా చూడాలి, అదేసమయంలో ఎలక్ట్రొడు ఏర్పరచిన ఉష్ణకాంతివలయంలోకి పూరకకాడ్దిఅంచును జొప్పించవలెను. పూరకలోహం, అతుకవలసిన లోహాభాగాలు కరగి అతుకువద్ద సమ్మేళనంచెంది ఏకీకృతముచెందటం మొదలవ్వగానే మెల్లగా అర్కును, పూరకకడ్దిని క్రిందికి జరుపవలెని. ఆవిధముగా ఆర్కును (వెల్డింగుటార్చును) పూరకలోహాకడ్డిని క్రిందికి క్రమముగా జరుపుతూ అతుకవలెను.మధ్యమధ్యలో పూరకకడ్దిని కొద్దిగా వెనుకకు, ముందుకు ఆర్కులోపల జరుపుచూ, పూరకకడ్దికరగిన లోహాన్ని వెల్డింగు జాయింటులో సమముగా వ్యాపించేలా చూడాలి. టార్చునుకూడా అతుకుజాయింట్ సమముగా కరుగునట్లుజరుపుచూ, పూరకకడ్దిని అవసరానికి తగ్గట్టుగా ప్రక్కలకు, ముందుకు జరుపుతుండవలెను.వెల్డింగు పూర్తయ్యిన తరువాత, టార్చును వెనక్కి లాగిన ఆర్కు ఆరిపోవును. వెల్డింగు ఆపిన తరువాత కొన్ని క్షణాలవరకు రక్షణవాయునువెల్డింగుజాయింట్ పైన ప్రసరింపచేయాలి. వెల్డింగు చేయునప్పుడు పూరకకడ్డిని ముందుకు, వెనక్కి కదలించునప్పుడు, పూరకకడ్ది చివర ఆర్కు వలయం నుండి బయటకు రాకుండ చూడవలెను.లేనిచో వాతావరణంలోని అక్సిజనువలన పూరకకడ్దిఅంచు అక్సికరణచెంది, మరలపూరకకడ్దిని ఆర్కులోనికి జొనిపినప్పుడు, ఆక్సీకరణచందినభాగం వెల్డు మెటలులోకలిసే ప్రమాదమున్నది.

టిగ్ వెల్డింగు విధానములో అతుకుటకు అనువైనలోహాలు[5]

[మార్చు]
  1. కార్బను ఉక్కు, దాని మిశ్రమథాతులోహాలు (Alloys)
  2. స్టెయిన్‍లెస్ స్టీలు
  3. ఎక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత వున్న కఠినత్వమున్న లోహాలు (Refractory metals)
  4. అల్యూమినియం దాని మిశ్రమథాతువులు
  5. రాగి, దాని మిశ్రమథాతువులు
  6. మెగ్నిసియం-మిశ్రమలోహాలు
  7. నికెలు-మిశ్రమలోహాలు
  8. టిటానియం/టైటానియం

టిగ్ వెల్డింగులో అనుసరించు వెల్డింగుజాయింట్ల రకాలు

[మార్చు]

టిగ్ వెల్డింగుపద్ధతిలో అన్నిపొజిసను వెల్డింగులు అనగా సమతలం (Flat), క్షితిజ సమాంతరము (horizontal) నిలువుగా (vertical) తలపైభాగంలో (over head) లోహలను అతుకవచ్చును.

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి వనరులు

[మార్చు]
  • [1] టిగ్‌వెల్డింగు

సూచికలు

[మార్చు]
  1. "How to Weld - TIG Welding". instructables.com. Retrieved 2014-03-04.
  2. "TIG Welding Tips". millerwelds.com. Archived from the original on 2008-10-13. Retrieved 2014-03-04.
  3. "TIG Welders". millerwelds.com. Archived from the original on 2004-02-07. Retrieved 2014-03-04.
  4. "Gloves for TIG Welding and Plasma Cutting Applications". weldersupply.com. Retrieved 2014-03-04.
  5. "A Beginner's Guide to TIG Welding" (PDF). metalwebnews.com. Archived from the original (PDF) on 2011-01-05. Retrieved 2014-03-04.