స్టడ్ వెల్డింగు
స్టడ్ వెల్డింగు అనునది ఒకరకమైన స్పాట్ వెల్డింగు వంటి మెటల్ ఆర్కు వెల్డింగు .మెటల్ ఆర్కు వెల్డింగులో అతుకబడు రెండులోహ అంచులను ఆర్కుద్వారా ద్రవీకరించి, మేళనం చేసి అతుకుదురు. స్పాట్ వెల్డింగులో అందుకు విరుద్ధంగా, రెండు లోహ ఫలకాలను ఒకదానిమీదనొకటి ఖాళీలేకుండగా దగ్గరగా ఉం చి ఒకప్రత్యేకభాగంలో ఆర్కును కొద్దిసేపుపాటు ఏర్పరచి, లోహం ఆభాగంలో మాత్రమే కరుగునట్లుచేసి, ద్రవీకరణస్థితిలో ఉన్నభాగాన్ని ఒత్తిడితోనొక్కి అతుకుతారు.ఇందుకై ప్రత్యేకంగా గన్ వంటి స్టడ్ వెల్డరు అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.[1] స్టడ్ వెల్డింగు విధానం, స్పాట్ వెల్డింగు, మెటల్ ఆర్కు వెల్డింగు లక్షణాలను, రెండింటిని కొంతమేరకు కలిగి ఉండును. స్టడ్ వెల్డింగులో ఒక లోహ వస్తువునకు, లేదా లోహ వస్తువునకు స్థూపాకారపు లోహకడ్డీని/లోహ తునుక (stud) లేదా లోహ గొట్టపు ఒకచివరను లేదా బోల్టు (bolt) (మరలు వున్న లోహపు కడ్డి), చీల/కీలకము (pivot) అతికించెదరు. ఈ విధానంలో పూరక లోహాన్ని ప్రత్యేకంగా వినియోగించనవసరం లేదు.అతుకుటకు ఉయోగించు తునుక, బోల్టు, చీల అంచునే పూరక లోహాంగా వినియోగిస్తారు. ఆర్కును స్టడ్ అంచుకు, లోహం మధ్య విద్యుత్తు ద్వారా ఏర్పరచడం జరుగుతుంది. స్టడ్ లేదామరచీల (bolt) లేదా కీలకం (pivot) లేదా లోహ గొట్టం (ferrule) ను ఎలక్ట్రోడుగా పనిచేసి, ఆర్కు కారణంగా వాటి అంచు ద్రవీకరణచెంది లోహఫలకము మీదకు చేరును. ఈ సమయంలో ఆర్కును ఆపివేసి స్టడ్/మరచీల/గొట్టాన్ని లోహంపై గట్టిగా నొక్కడం వలన స్టడ్/మరచీల/గొట్టం లోహం నకు అతుకుకొనును.
స్టడ్ వెల్డింగు పద్ధతిలో ఉక్కు లేదా దాని మిశ్రమ లోహాలను అతుకుటకు స్టడ్/బోల్టు ఏలక్ట్రోడుగా, ఋణధ్రువవిద్యుత్తును పంపిణిచేసి అతికెదరు. కాని అల్యూమినియం వంటి తక్కువ సాంద్రత, ద్రవీభవన ఉష్ణోగ్రత (melting point) కలిగిన లోహాలను స్టడ్ వెల్డింగు పద్ధతిలో అతుకునప్పుడు లోహ పట్టీకి ఋణధ్రువం ను, ఎలక్ట్రోడునకు ధనధ్రువాన్ని కలుపుతారు. స్టడ్ వెల్డింగు పద్ధతిలో ఏకముఖ విద్యుత్తును (Direct current) వినియోగించెదరు. ఏకముఖ విద్యుత్తు వలన పోలారిటి మారనందున ఏర్పడే ఆర్కు (విద్యుత్తు ఉష్ణ చాపం) నిలకడగా ఉండటం వలన స్టడ్ ద్రవీకరణ ఏకరీతిలో ఉండును.ఈ వెల్డింగు విధానంలో పూరక లోహాన్ని ప్రత్యేకంగా వాడకపోయునను, స్రావకాన్ని (flux) మాత్రం వాడవలసి ఉంది. స్రావకాన్ని ఎలక్ట్రోడుగా వాడి స్టడ్ అంచునకు పూయుదురు. స్రావకాన్ని మాంగనీసు, సిలికాను, అల్యూమినియం లోహాలమిశ్రమాల నుండి తయారుచేయుదురు. స్టడ్ అంచు కరుగునప్పుడు, లోహద్రవం ప్రక్కలకు ప్రవహించకుండ నిరోధించుటకై స్టడ్/మరచీల అంచు చుట్టు ఒక కాలరు (collar) లేదా కార్ట్రిడ్జి (cartridge) ఉండును. ఈ కాలరు చుట్టు రక్షణ వాయువును ప్రసరింపజేయుదురు. స్రావకాన్ని ఉపయోగించని సందర్భాలలో మాత్రమే రక్షణవాయువును ప్రసరింపచేయుదురు. అల్యూమినియం లోహాన్ని స్టడ్ వెల్డింగు చేయునప్పుడు ఆర్గాను వాయువును రక్షణవాయువుగా వినియోగిస్తారు.
పరికరాలు
[మార్చు]స్టడ్ వెల్డింగు చేయుటకు 1. విద్యుత్తును నిరతంతరంగా సరఫరా చేయు విద్యుత్తు పరికరము, 2. స్టడ్ వెల్డింగు గన్ (stud welding Gun), 3. స్రావకం (flux), 4. రక్షణవాయువు (shielding gas), 5.రక్షణ ఉపకరణాలు (safety equipment) కావలయును.
విద్యుత్తు పరికరము(power source)
[మార్చు]స్టడ్ వెల్డింగునకై ఏకముఖ విద్యుత్తు (DC current) ను వినియోగిస్తారు. ఇందుకై ఏకముఖ విద్యుత్తు జనక/ఉత్పాదన యంత్రాన్ని (DC Generator) లేదా రెక్టిఫయరు అమర్చిన ట్రాన్సుఫార్మరును వాడెదరు. విద్యుత్తు ప్రవాహశక్తి గరిష్ఠం 400 అంపియర్ల వరకు స్థిర స్థితిలో వెల్డింగు చేయునంతసేపు నిరంతరం, అంపియర్ల లలో హెచ్చు, తగ్గులు లేకుండా ఇవ్వగలిగిన సామర్థ్యం విద్యుత్తు సరఫరా పరికరమునకు ఉండవలెను. కెపాసిటరు (capacitor) డిశ్చార్జి వెల్డింగు మెషినును కూడా వాడవచ్చును. స్టడ్ వెల్డింగు గన్ కు ఉన్న లీవరు/స్వీచ్ ఆపరేట్ చెయ్యడం ద్వారా విద్యుత్తు ప్రవాహాన్ని నియంత్రణ చేయుదురు.
వెల్డింగు
[మార్చు]స్టడ్ వెల్డింగు విధానం రెండు రకాలు .ఒక రకం కెపాసిటర్ డిస్‌చార్జ్ స్టడ్ వెల్డింగు (capacitor discharge stud welding) పద్ధతి, రెండవది డ్రాన్ ఆర్కు పద్ధతి (Drawn arc method).కెపాసిటర్ డిస్‌చార్జ్ వెల్డింగు పద్ధతిలో పలుచటి లోహాలకు స్టడ్‌లను అతికెదరు.డ్రాన్‌ఆర్కు విధానంలో ఎక్కువ వ్యాసమున్న స్టడ్‌లనుమందమైన వస్తువులకు అతికెదరు[2]
స్టడ్ వెల్డింగ్ గన్(stud welding gun)
[మార్చు]అతుకవలసిన మరచీల (bolt) లేదా లోహపు ముక్కను (stud), ఉక్కు గొట్టం (ferrule) యొక్క పైఅంచును/చివరను గన్ యొక్క ఒక కొల్లెట్ (collect) ద్వారా పట్టుకొను ఏర్పాటు ఉండును. ఈ కొల్లెట్ ద్వారానే విద్యుత్తు పరికరంలోని ఒక ధ్రువం నుండి విద్యుత్తు స్టడ్ కు ప్రవహించును. స్ప్రింగు అమరిక ఉన్న ఒక సాలినాయిడ్ కు ఈ కొల్లెట్ అమర్చబడి ఉండును. సాలినాయిడ్ వాల్వు (కవాటం) కు విద్యుత్తును పంపడంద్వారా కొల్లెట్ కు బిగించిన లోహపుముక్క వెనుకకు, ముందుకు కావలసిన మేర జరుగును. స్టడ్ అతుకవలసిన లోహభాగాన్ని పీఠ/అడుగు లోహం (base metal) అంటారు. దానికి విద్యుత్తు పరికరంయొక్క ధన ధ్రువపు తీగెను కలుపుతారు. స్టడ్ గన్ యొక్క ఉపరితల నిర్మాణం చేతితోపట్టుకొనుటకు అనువుగా తయారుచెయ్యబడి ఉండును. స్టడ్ వెల్డింగ్ పరికరం చూచుటకు ఇంచుమించు గన్ ఆకారంలో కన్పించును.
స్రావకము
[మార్చు]కొన్నిరకాల లోహాల స్టడులను అతుకునప్పుడు స్రావకాన్ని వాదవలసివుండును.స్రావకాన్నిస్టడ్ యొక్క అడుగుభాగంలో పూతలాలేపనంచేయుదురు.ఉక్కులోహం లేదా/, దాని మిశ్రమలోహాలను అతుకుటకు స్రావకాన్ని తప్పనిసరిగా వినియోగించెదరు.అల్యూమినియంవంటి తక్కువసాంద్రత (light metals) ను అతుకునప్పుడు కేవలం రక్షణవాయువును వెల్డింగును ఆవరించివున్న కాలరు/కార్ట్రిడ్జి (collar/cartridge) చుట్టూ ప్రసరింపచేయుదురు.
రక్షణవాయువు(shielding gas)
[మార్చు]సాధారణంగా రక్షణవాయువుగాఆర్గాను వాయువును వాడెదరు.
రక్షణ ఉపకరణాలు
[మార్చు]స్టడ్ వెల్డింగుచేయుటకు ఎక్కువకరెంటు (250-400 అంపియర్లు వరకు) ఉపయోగించవలసి ఉంది. అందువలన అజాగ్రత్తగా ఉన్నప్పుడు విద్యుత్తు ఘాతం (electric shock) తగిలే అవకాశం మెండుగా ఉంది. అందుచే విద్యుత్తు నిరోధక గుణమున్న చేతితొడుగులు, పాదరక్షలు, దుస్తులు తప్పనిసరిగా ధరించవలెను. కళ్ళకు అతినీలలోహిత కిరణాలను అడ్దుకొను అద్దాలు అమర్చిన కళ్లజోడును ధరించాలి.
స్టడ్ వెల్డింగు చేయుటకు అనువైన లోహాలు
[మార్చు]- తక్కువశాతంలో కర్బనం కలిగిన ఉక్కులోహాలు
- మధ్యస్తంగాను, ఎక్కువ కర్బనంకలిగిన కర్బన ఉక్కు (ఈ లోహాలను అతుకుటకు ముందు తగినంతగా వేడిచేసి, అటుపిమ్మట అతికెదరు. లేనిచో అతుకు బీటలు వారును)
- ఎక్కువ ధారుఢ్యమున్న మిశ్రమలోహాలు
- తుప్పుపట్టని ఉక్కులోహం
- 1.కెపాసిటర్ డిస్‌చార్జ్ పద్ధతిలో అతుకు వస్తువులు:
షీట్ మెటల్ వర్కు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో, స్విచ్‌బోర్డు తయారిలో, ప్రయోగశాల, వైద్యసంబంధిత వస్తువుల నిర్మాణంలో, ఆహార ఉత్పత్తులపరిశ్రమలలో, ఇంటిలో వాడు వస్తువుల తయారిలో, సమాచార ఇంజనిరింగులో, ఆటో మాటిక్ గా వస్తువులను అమ్ము యంత్రాలలో, కిటీకిలు, గాజు, అద్దాల ప్రేములు తయారుచేయుటలో ఈ అతుకు పద్ధతిని వాడేదరు[3]
- 2.డ్రాన్‌ఆర్కు వెల్డింగు పద్ధతిలో అతుకు వస్తువులు:
ఉక్కు నిర్మాణాలు.మెకానికల్ ఇంజనీరింగులో, ఓడల నిర్మాణంలో, సివిల్ ఇంజనీరింగు నిర్మాణలలో, విద్యుత్తు ఉత్పత్తి పరిశ్రమలలో, బాయిలరు నిర్మాణ పరిశ్రమలలో, పరిశ్రమలలో ఉపయోగిస్తారు.[3]
స్టడ్ వెల్డింగులోని అనుకూలతలు
[మార్చు]- సరళమైన వెల్డింగు విధానం : వెల్డింగుతో వేగంగా ఎక్కువ వస్తువులను అతుకవచ్చును. ముఖ్యంగా పిన్నులు (pins), మరచీలలు (bolts), రివిట్లు, రాడులు వంటివాటిని లోహఫలకాలకు లేదా ఏదైన నిర్మాణమునకు సులభంగా అతుకవచ్చును.
- స్టడ్ వెల్డింగువలన దృఢమైన, బలిష్టమైన అతుకు ఏర్పడును.
- ఈ విధానంలో సమతల వెల్డింగు (Flat welding) మాత్రమే కాకుండగా, నిలువు (vertical) గా, తలపైభాగం (overhead) నిర్మాణాలను కూడా సౌకర్యంగా అతుకవచ్చును.
బయటి లింకులు
[మార్చు]- [1] stud-welding-process
- [2] Archived 2012-11-27 at the Wayback Machine stud-welding
- [3] స్టడ్ వెల్డింగు చిత్రాలు
ఇవికూడా చూడండి
[మార్చు]సూచికలు
[మార్చు]- ↑ "What is Stud Welding". sunbeltstudwelding.com. Retrieved 2014-03-05.
- ↑ "Capacitor Discharge Stud Welding Machines". artechengg.com. Retrieved 2014-03-05.
- ↑ 3.0 3.1 "Where is stud welding used?" (PDF). a2-technika.pl/. Retrieved 2014-03-05.