రావిశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావిశాస్త్రి
Rachakonda Viswanathasastry.png
జననంరాచకొండ విశ్వనాధశాస్త్రి
జూలై 30, 1922
శ్రీకాకుళం
మరణంనవంబర్ 10, 1993
ఇతర పేర్లురావిశాస్త్రి
ప్రసిద్ధిరచయిత, నటుడు
తండ్రినారాయణమూర్తి
తల్లిసీతాలక్ష్మి

రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి) (1922 - 1993) వృత్తి రీత్యా న్యాయవాది, కథా రచయిత. ఆయన కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.

తొలి జీవితము[మార్చు]

రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922, జూలై 30న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామం. ఈయన తండ్రి, న్యాయవాది తల్లి, సహితీకారిణి.


రావి శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి 1946లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని 1950లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు. ఆరంభములో కఠోర కాంగ్రేసువాది అయినా 1960లలో మార్క్సిష్టు సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు.

1947 ప్రాంతంలోలో న్యాయవాది వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగాడు. పట్టణ జీవితంలో వస్తున్న పెనుమార్పులను గమనించాడు. గురజాడ అప్పారావు, శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న నమాజంలో గిలగిలలాడే వారి ఆరాటాలను తన రచనలలో చిత్రించాడు. రావిశాస్త్రి కథా కథన పద్థతి చాలా పదునైనది, కాపీ చేస్తే తప్ప అనితరసాథ్యం.

రచనలు[మార్చు]

తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ "చైతన్య స్రవంతి" ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేమస్ జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రావిశాస్త్రినే. ఇది ఆయన మొట్టమొదటి నవల.

ఈ నవలను ఆయన 1952లో రచించాడు. తరువాత రాజు మహిషీ,రత్తాలు-రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే.

ఆంధ్రలో మద్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ఆరుసారా కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన నిజం నాటకంలో వ్యక్తం చేసాడు.


రచనల జాబితా[మార్చు]

  • కథాసాగరం (1955)
  • ఆరుసారా కథలు (1961)
  • రాచకొండ కథలు (1966)
  • ఆరుసారో కథలు (1967)
  • రాజు మహిషి (1968)
  • కలకంఠి (1969)
  • బానిస కథలు (1972)
  • ఋక్కులు (1973)
  • ఆరు చిత్రాలు (1974)
  • రత్తాలు-రాంబాబు (1975)
  • సొమ్ములు పోనాయండి
  • గోవులోస్తున్నాయి జాగ్రత్త
  • బంగారం
  • ఇల్లు

నాటకం / నాటికలు

  • నిజం నాటకం
  • తిరస్కృతి నాటిక
  • విషాదం నాటిక

రావిశాస్త్రి విశిష్టత[మార్చు]

1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. అంతే కాకుండా 1966లో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేసాడు.

ఆయన కథకుడే కాదు నటుడు కూడా . ఆయన వ్రాసిన నిజం నాటకంలోను, గురజాడ కన్యాశుల్కం నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.

మరణం[మార్చు]

"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను" అన్నాడు రావిశాస్త్రి. 1922 జూలై 30న పుట్టి, పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం.. తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993, నవంబర్ 10 న రావిశాస్త్రి పెన్ను, కన్నుమూశాడు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]