లాహోర్ ప్రకటన
రకం | వ్యూహాత్మక అణు నిర్వహణ, నియంత్రణ, చట్టం |
---|---|
రాసిన తేదీ | 1998 డిసెంబరు 19– 1999 జనవరి 19 (రాసేందుకు: 1 నెల) |
సంతకించిన తేదీ | 21 ఫిబ్రవరి 1999 |
స్థలం | లాహోర్, పాకిస్తాన్ |
అమలు తేదీ | 21 ఫిబ్రవరి 1999 |
స్థితి | ఇరు పల్క్షాలూ అనుమోదించాలి |
కాలపరిమితి | ఒప్పందం ఇప్పటికీ అమల్లో ఉంది |
చర్చల్లో పాల్గొన్నవారు | ఇరు దేశాల విదేశాంగ మంత్రులు |
సంతకీయులు | అటల్ బిహారీ వాజపేయి (భరత ప్రధానమంత్రి) నవాజ్ షరీఫ్ (పాకిస్తాన్ ప్రధానమంత్రి) |
కక్షిదారులు | India Pakistan |
ఆమోదకులు | భారత పార్లమెంటు పాకిస్తాన్ పార్లమెంటు |
Depositary | భారత ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం |
భాషలు |
లాహోర్ ప్రకటన, భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక, పరిపాలనా సంబంధ ఒప్పందం. లాహోర్‌లో జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం ముగింపులో 1999 ఫిబ్రవరి 21 న ఈ ఒప్పందంపై భారత, పాక్ ప్రధానమంత్రులు సంతకాలు చేయగా, అదే సంవత్సరం ఇరుదేశాల పార్లమెంటులు అనుమోదించాయి.[1]
ఈ ఒప్పందం ద్వారా, అణ్వాయుధాల అభివృద్ధిని, ప్రమాదవశాత్తు గాని, అనధికారికంగా గాని అణ్వాయుధ ప్రయోగాలను నివారించడానికి పరస్పర అవగాహన కుదిరింది. లాహోర్ ప్రకటన అణ్వాయుధ పోటీని, అలాగే సాంప్రదాయేతర, సాంప్రదాయిక ఘర్షణలను నివారించడంలో రెండు దేశాల నాయకత్వాలకు అదనపు బాధ్యతను ఆపాదించింది. ఈ సంఘటన పాకిస్తాన్ చరిత్రలో ముఖ్యమైనది. ఇది రెండు దేశాలకు పరస్పర విశ్వాసంతో కూడిన వాతావరణాన్ని నెలకొల్పింది. ఇరు దేశాల్లో టెలివిజన్‌లో ప్రసారమైన మీడియా సమావేశంలో ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిలు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది రెండు దేశాలు సంతకం చేసిన రెండవ అణు నియంత్రణ ఒప్పందం. 1988 లో సంతకం చేసిన మొదటి ఒప్పందమైన ఎన్‌ఎన్‌ఎఎకు కట్టుబడి ఉంటామని ఇరుదేశాలు ప్రతిజ్ఞ చేసాయి. లాహోర్ ఒప్పందాన్ని భారత, పాకిస్తాన్ పార్లమెంటులు వెంటనే అనుమోదించాయి. అదే సంవత్సరం ఒప్పందం అమలులోకి వచ్చింది.
1998 మేలో రెండు దేశాలు బహిరంగంగా నిర్వహించిన అణు పరీక్షల తర్వాత రెండు దేశాల మధ్య చారిత్రికంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను అధిగమించడంలో లాహోర్ ప్రకటన ఒక ప్రధానమైన పురోగతి. పాకిస్తాన్ ప్రజలలో విస్తృతంగా ప్రాచుర్యం పొంది, అంతర్జాతీయ సమాజంచే ప్రశంసించబడిన ఈ ఒప్పందం కుదిరిన కొద్ది కాలానికే, పాకిస్తాన్ దళాలు కార్గిల్‌లోకి చొరబడడంతో ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ చేసిన ఈ చొత్రబాటు చర్య కారణంగా 1999 మేలో భారత-పాకిస్తాన్ యుద్ధం జరిగింది.
అవలోకనం
[మార్చు]దక్షిణాసియాలో సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి, భారత పాకిస్తాన్‌ల సంబంధాలను సాధారణీకరించడానికీ లాహోర్ ఒప్పందం, అత్యంత ముఖ్యమైన, చారిత్రక ఒప్పందాలలో ఒకటి. 1971లో జరిగిన యుద్ధం తర్వాత శాంతియుత సంబంధాలను నెలకొల్పేందుకు 1972 లో సిమ్లా ఒప్పందం కుదిరింది. శాంతియుత చర్చలతో, పరస్పర సహకారంతో ద్వైపాక్షిక వివాదాలను పరిష్కరించుకోవడానికి ఆ ఒప్పందం ద్వారా రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి. రెండు దేశాల మధ్య అణు పోటీని పరిమితం చేయడానికి, దక్షిణాసియా అణు ఆయుధ రహిత జోన్ (SANWFZ) ఏర్పాటుకు 1978 లో పాకిస్తాన్ ఒక ప్రతిపాదన చేసింది. దానిపై చర్చలు ఎప్పటికీ ముగియలేదు.
1988 లో భారత పాకిస్తాన్‌లు అణ్వాయుధాలను నియంత్రించడంలో ఒక ముఖ్యమైన అవగాహనకు వచ్చి, అణ్వాయుధేతర దాడి ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రతిపాదనలు అనేకం ఉన్నప్పటికీ, అణు పోటీ మాత్రం కొనసాగింది, కాశ్మీర్ సమస్యపై ప్రచ్ఛన్న యుద్ధం పెరిగింది. దేశీయ ఒత్తిడి వలన, పెరుగుతున్న రాజకీయ ఊపుల వలన ఒకవైపు అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నప్పటికీ, 1998 మేలో భారతదేశం అణు పరీక్షలు నిర్వహించింది. భారత పరీక్షలకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్ కూడా 1998 మే నెల చివరిలో అణు పరీక్షలను నిర్వహించి, తర్వాత దక్షిణాసియాలో అణుపాటవాన్ని సమం చేసింది.[2] ఈ పరీక్షల వలన రెండు దేశాలూ ఖండనలు, ఆర్థిక ఆంక్షలకు గురయ్యాయి. ఘర్షణ తీవ్రత పెరిగిన ఈ నేపథ్యంలో, అణు యుద్ధానికి దారితీస్తుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.
చర్చలు
[మార్చు]1998 లో, ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి శాంతి ప్రక్రియను ప్రారంభించాయి. 1998 సెప్టెంబరు 23 న రెండు ప్రభుత్వాలు శాంతి భద్రతల వాతావరణాన్ని నిర్మించడం, అన్ని ద్వైపాక్షిక వివాదాలను పరిష్కరించడం అనే సూత్రాలతో కూడిన ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఇదే లాహోర్ ప్రకటనకు ఆధారమైంది.[1] 1999 ఫిబ్రవరి 11 న రెండు దేశాల మధ్య ప్రవేశపెట్టిన తొలి బస్సు సర్వీసులో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పర్యటించనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది.[3]
భారత ప్రధాని రాకకు ముందు, న్యూఢిల్లీ, లాహోర్‌ల మధ్య ప్రారంభమైన తొలి బస్సు ద్వారా వాఘాకు చేరుకున్న భారత ప్రధాని వాజ్‌పేయికి ఘన స్వాగతం లభించింది.[4] ఆయనకు ప్రధాని నవాజ్ షరీఫ్ స్వాగతం పలికగా, పాక్ సైనిక దళాలు భారత ప్రధానికి గౌరవ వందనం చేసాయి.[4] ఇది పాకిస్తాన్‌కు భారత ప్రధాని చారిత్రాత్మక పర్యటన మొదలైంది. న్యూఢిల్లీని ప్రధాన పాకిస్తానీ నగరమైన లాహోర్‌తో కలిపే బస్సు సేవ, రెండు దేశాల ప్రజలకు ముఖ్యమైన రవాణా సంబంధాన్ని ఏర్పరుస్తుంది.[4] ప్రారంభ బస్సులో దేవ్ ఆనంద్, సతీష్ గుజ్రాల్, జావేద్ అక్తర్, కులదీప్ నాయర్, కపిల్ దేవ్, శత్రుఘ్న సిన్హా, మల్లికా సారాభాయ్ వంటి భారతీయ ప్రముఖులు కూడా ఉన్నారు.[5] అణుపరీక్షల వివాదంపై అంతకు ఏడాది ముందు వాగ్వాదానికి దిగిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్ వాఘా వద్ద వాజపేయికి స్వాగతం పలకడం అభిమానుల, మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ శిఖరాగ్ర సమావేశం ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ప్రధానమైన పురోగతిగా, మైలురాయిగా, ఈ ప్రాంతంలో ఘర్షణలు, ఉద్రిక్తతలను అంతం చేసే దిశలో ఒక చారిత్రాత్మకమైన అడుగుగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.[5]
రాతకోతలు, సంతకాలు
[మార్చు]లాహోర్ ప్రకటన, 1988 నాటి ఒప్పందం, 1972 సిమ్లా ఒప్పందాల తర్వాత కుదిరిన ఒక ముఖ్యమైన ఒప్పందం.[6] ఇద్దరు ప్రధానమంత్రులు ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శులు షంషాద్ అహ్మద్, భారతదేశ[పు కె. రఘునాథ్ లు 1999 ఫిబ్రవరి 21 న ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, భద్రతల వాతావరణాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన చర్యలను అందులో పొందుపరచారు.[6] ఐరాస చార్టర్ లోని సూత్రాలు, ప్రయోజనాల పట్ల ఇరు ప్రభుత్వాల నిబద్ధతను ఆ అవగాహనా ఒప్పందం పునరుద్ఘాటించింది.[6]
సిమ్లా ఒప్పందాన్ని ప్రత్యక్షరాన్ని, స్ఫూర్తితో అమలు చేసేందుకు రెండు దేశాల సంకల్పాన్ని ఎమ్ఒయు పునరుద్ఘాటించింది. శాంతి, భద్రతతో కూడిన వాతావరణం లోనే రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యల పరిష్కారానికీ ఇది అవసరం అనీ ఈ అవగాహనా ఒప్పందం పేర్కొంది.[6] రెండు దేశాల పార్లమెంటులు ఈ ఒప్పందాలను త్వరగా అనుమోదించాయి.[6]
అంశాలు
[మార్చు]లాహోర్ ప్రకటనపై ఫిబ్రవరి 21న భారత్, పాక్ నేతల మధ్య మూడు రౌండ్ల చర్చల అనంతరం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై సంతకాలు జరిగాయి.[1][7] దాని కంటెంట్‌లో, రెండు ప్రభుత్వాలు శాంతి, సుస్థిరత, పరస్పర పురోగతిల పట్ల తమ నిబద్ధతను, సిమ్లా ఒప్పందం, ఐరాస చార్టర్ పట్ల నిబద్ధతనూ నొక్కిచెప్పాయి. లాహోర్ ప్రకటన ద్వారా రెండు ప్రభుత్వాలు అణ్వాయుధాల అభివృద్ధి సంఘర్షణను నివారించడంలో రెండు దేశాలకు అదనపు బాధ్యతను పెట్టింది. విశ్వాసాన్ని పెంపొందించే చర్యల ప్రాముఖ్యతను ప్రోత్సహించింది. ముఖ్యంగా ప్రమాదవశాత్తు గాని, అనధికారికంగా గానీ అణ్వాయుధాలను ఉపయోగించకుండా నిరోధించింది.[1][7] బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు, అణు వివాదాన్ని నివారించడానికి అణ్వాయుధాలను ప్రమాదవశాత్తూ లేదా వివరించలేని వినియోగానికి సంబంధించి ఒకరికొకరు ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వాలని భారత, పాకిస్తాన్‌లు నిర్ణయించుకున్నాయి.[7] ఇతర అంశాలతో పాటు దానిలోని ముఖ్యమైన అంశాలు ఇవి:
- రెండు దేశాల భద్రతా వాతావరణం లోని అణుకోణం, వాటి మధ్య సంఘర్షణను నివారించాల్సిన బాధ్యతను తెస్తుందని ఈ ప్రకటన గుర్తించింది.[8]
- ఐక్యరాజ్యసమితి చార్టర్ లోని సూత్రాలు, ప్రయోజనాలకూ, శాంతియుత సహజీవనం పట్ల విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన సూత్రాలకూ కట్టుబడి ఉంటుంది.[8]
- సార్వత్రిక అణు నిరాయుధీకరణ, నాన్‌ప్రొలిఫరేషన్ లక్ష్యాలకు రెండు దేశాలకు కట్టుబడి ఉంటాయి.[8]
లాహోర్ ప్రకటన్, ఆ తరువాత చేసుకున్న అవగాహనా ఒప్పందం, కాశ్మీర్ వివాదం, ఇతర వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నాలను తీవ్రతరం చేయడానికి, ద్వైపాక్షిక చర్చలను మెరుగుపరచడానికీ, అణు భద్రతను అమలు చెయ్యడానికి, సంఘర్షణలను నివారించడానికి అవసరమైన చర్యల అమలు పట్ల ఉమ్మడి నిబద్ధతను పొందుపరిచాయి. రెండు ప్రభుత్వాలు తీవ్రవాదాన్ని ఖండించాయి. పరస్పరం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని, మానవ హక్కులను ప్రోత్సహించడంలో దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి పెట్టుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉన్నాయి.[1]
చర్చలు ముగిసిన తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, తమ విదేశాంగ మంత్రులు కాలానుగుణంగా సమావేశమవుతారని, ప్రపంచ వాణిజ్య సంస్థ, సమాచార సాంకేతికతకు సంబంధించిన సమస్యలపై పరస్పరం సంప్రదింపులు జరుపుతారని రెండు ప్రభుత్వాలు తెలిపాయి.[6] మానవ హక్కుల సమస్యలు, పౌర ఖైదీలు, తప్పిపోయిన యుద్ధ ఖైదీలపై దర్యాప్తు చేయడానికి ఇద్దరు సభ్యుల మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేయాలి. భారత ప్రధాని, పాక్ ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో భారతదేశంలో జరిపే శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానాన్ని అందించారు.[1]
బహిరంగ చర్చలు, స్పందనలు
[మార్చు]పాకిస్తాన్ ప్రజలు, మీడియా అభిప్రాయం
[మార్చు]లాహోర్ ఒడంబడికకు పాకిస్తాన్ పౌర సమాజ రంగంలో బాగా ప్రాచుర్యం వచ్చింది.[9][10] భారతదేశంతో సంబంధాలను సాధారణీకరించడానికి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను సాధారణ ప్రజలు విస్తృతంగా స్వాగతించారు.[10] నవాజ్ షరీఫ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను వార్తా ఛానెల్‌లు, టెలివిజన్ అవుట్‌లెట్‌లు ప్రింట్ మీడియా విస్తృతంగా ప్రశంసించాయి. జమాత్ ఎ ఇస్లామీ పార్టీ ఒక్కటి తప్ప, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో సహా పాకిస్తాన్‌లోని అన్ని ప్రధాన రాజకీయ శక్తులు, లాహోర్ ఒప్పందాన్ని స్వాగతించాయి, కుదుర్చుకున్నందుకు నవాజ్ షరీఫ్‌ను అభినందించాయి.[4][10]
అయితే, పాకిస్తాన్ సైన్యంలోని చాలా మంది ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదని, తత్ఫలితంగా దానిని అణచివేయడానికి, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచడానికి వారు పనిచేశారని భారత వార్తా మీడియాలో ఊహించారు.[11] వాజ్‌పేయిని "శత్రు దేశ" నాయకుడిగా అభివర్ణిస్తూ అతనికి పాకిస్తాన్‌లో జరిగిన స్వాగత సత్కారాలను పాకిస్తాన్ సైనిక నేతలు బహిష్కరించారు. వారిలో ఛైర్మన్ జాయింట్ చీఫ్‌లు, ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్, ఎయిర్ చీఫ్ ACM PQ మెహదీ, నావికా చీఫ్ అడ్మిరల్ ఫసిహ్ బోఖారీలు ఉన్నారు.[12]
భారతీయ ప్రజానీకం, మీడియా అభిప్రాయాలు
[మార్చు]లాహోర్ ప్రకటన భారతదేశంలో, గ్లోబల్ మీడియాలో, ఇతర దేశాల ప్రభుత్వాలచే హృదయపూర్వకంగా ప్రశంసలు పొందింది. 1998 అణు పరీక్షలపై ప్రపంచ ఉద్రిక్తతల తర్వాత ఆశావాదం ఏర్పడింది.[5] ఈ ఒప్పందంతో భారతదేశంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి ప్రజాదరణ పెరిగింది, రాజనీతిజ్ఞుడిగా అతని స్థానాన్ని సుస్థిరం చేసింది.[5]
అనంతర పరిణామాలు, స్థితి
[మార్చు]1999 మేలో కార్గిల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, పాకిస్తానీ సైనికులు కాశ్మీర్‌లోకి చొరబడడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయి.[13][14] పాకిస్తాన్ సైనికులను తరిమికొట్టడానికి, వివాదాస్పద భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం మోహరించింది.[13] రెండు నెలల పాటు జరిగిన ఈ వివాదం ఇరువైపులా వందలాది మంది సైనికుల ప్రాణాలను బలిగొంది. రెండు దేశాలను పూర్తి స్థాయి యుద్ధానికి, అణు సంఘర్షణకు దగ్గరగా తీసుకువచ్చింది.[6][10] ఈ వివాదం తర్వాత, "లాహోర్ ఒప్పందం" నిలిచిపోయింది. 1999 ఫిబ్రవరిలో లాహోర్‌లో మొదలైన చర్చలు, విశ్వాసాన్ని పాదుకొలిపే చర్యలపై రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు జరగలేదు.[10]
ఈ సంఘర్షణ తరువాత అట్లాంటిక్ విమానం కూల్చివేత సంఘటనలో భారత వైమానిక దళం పాకిస్తాన్ నేవీకి చెందిన నిఘా విమానాన్ని అడ్డగించి కూల్చివేసింది. మొత్తం పదకొండు మంది పాకిస్తాన్ నౌకాదళ సిబ్బంది మరణించారు. మిలిటరీ, న్యాయవ్యవస్థతో నెలల తరబడి వివాదాస్పద సంబంధాల తరువాత, పాకిస్తాన్ సాయుధ దళాలు ఆ దేశ రాజకీయ నాయకత్వంపై సైనిక తిరుగుబాటు చేసి, నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడగొట్టి, కార్గిల్ దండయాత్రకు నేరుగా కారణమని భావిస్తున్న సైనిక దళాల జాయింట్ చీఫ్ అయిన జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారం చేపట్టాడు.[14] తద్వారా రెండు దేశాల మధ్య సంబంధాల భవిష్యత్తుపై సందేహాలు తీవ్రతరమయ్యాయి.[14] అనేక రాజకీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ, సిమ్లా, లాహోర్ ఒప్పందాలను అమలు చేయవలసిన అవసరాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనలకు, సరిహద్దు తీవ్రవాద సమస్య పరిష్కారానికీ భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 The Lahore Declaration
- ↑ Shakti tests
- ↑ Hasan Akhtar (13 February 1999). "Nawaz-Vajpayee agenda includes Kashmir, N-issue". Dawn Wire Services, 13 1999. Archived from the original on 15 ఫిబ్రవరి 2010. Retrieved 15 February 2013.
- ↑ 4.0 4.1 4.2 4.3 Ashraf Mumtaz (19 February 1999). "Vajpayee arrives today: Open-ended agenda for summit". Dawn Wire Service 1999. Retrieved 15 February 2013.[permanent dead link]
- ↑ 5.0 5.1 5.2 5.3 Vajpayee drives across the border into Pakistan and history
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 6.7 Lahore Declaration. "Lahore Declaration". Governments of India and Pakistan. Much Thanks to NTI for providing the text. Retrieved 15 February 2013.
- ↑ 7.0 7.1 7.2 Vajpayee, Sharief sign Lahore Declaration
- ↑ 8.0 8.1 8.2 Press. "Lahore Declaration Text" (PDF). Governments of India and Pakistan. Thanks much to CNS. Archived from the original (PDF) on 25 October 2011. Retrieved 15 February 2013.
- ↑ Ashraf Mumtaz (19 February 1999). "Vajpayee arrives today: Open-ended agenda for summit". Dawn Wire Service 1999. Archived from the original on 15 అక్టోబరు 2009. Retrieved 15 February 2013.
- ↑ 10.0 10.1 10.2 10.3 10.4 Staff (1 June 2003). "The Lahore Declaration". Story of Pakistan (Ateam Developments). Retrieved 15 February 2013.
- ↑ Tribune India
- ↑ Pakistani military chiefs boycott welcome
- ↑ 13.0 13.1 Kargil War; Blasting Peace Archived 22 నవంబరు 2008 at the Wayback Machine
- ↑ 14.0 14.1 14.2 Musharraf Vs. Sharif: Who's Lying? Archived 11 అక్టోబరు 2007 at the Wayback Machine