Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 31వ వారం

వికీపీడియా నుండి

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.


ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాలు గురించి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం ప్రకారం

  1. శాంకరి - శ్రీలంక
  2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు
  3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
  4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక
  5. జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్
  6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్
  7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర
  8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర
  9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్
  10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్
  11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్, ఒరిస్సా
  12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్
  13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం
  14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్
  15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్
  16. మంగళ గౌరి - గయ, బీహారు
  17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్
  18. సరస్వతి - జమ్ము, కాష్మీరు

పూర్తి వ్యాసము, పాతవి