Jump to content

వి.వి.దీక్షితులు

వికీపీడియా నుండి

డా.  వి.వి.దీక్షితులుగా రాజమండ్రి లో ప్రసిద్ధిచెందిన వంగవేటి వెంకటరామ దీక్షితులు (మే 5, 1900 - ఆగస్టు 8 , 1959) భారత స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ దురంధరుడు, ప్రఖ్యాత వైద్యులు. వీరి పూర్వికులది గుంటూరు జిల్లా తెనాలి. ఓపక్క స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటూ, మరోపక్క పేదలకు వైద్యం చేస్తూ నిస్వార్ధ సేవలతో రాణించారు.

జననం - చదువు

[మార్చు]

 ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వంగవేటి లక్ష్మీనరసింహశాస్త్రి, శేషమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా డాక్టర్ వి.వి.దీక్షితులు 1900 మే 5వ తేదీన జన్మించారు.  ఈయన భార్య   రాజేశ్వరి. వీరికి  డాక్టర్  భాస్కరరావు, డాక్టర్  లక్ష్మీనరసింహ శాస్త్రి అనే ఇద్దరు  కుమారులు, వెంకటరమణ, శేషారత్నం అనే ఇద్దరు  కుమార్తెలు ఉన్నారు. ఈయన  ప్రాథమిక విద్య రాజమండ్రిలో పూర్తి చేసుకొని, ఉన్నత వైద్య విద్య కోసం విశాఖపట్నం వెళ్ళి మెడికల్ స్కూలులో లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్(ఎల్ఎంపీ)చదివారు.

విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలోకి

[మార్చు]

    విశాఖపట్నంలో 1922 లో ఎల్ఎంపీ విద్యార్ధిగా ఉన్నప్పుడే గాంధీజీ ఆంధ్రా పర్యటనలు, వారి ఉపన్యాసాల ఫలితంగా  మహర్షి బులుసు సాంబమూర్తి, బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం ల ఉపన్యాసాలకు  ప్రభావితులై జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. అంతకుముందు 1920లో జరిగిన  అఖిల భారత జాతీయ కాంగ్రెసు మహాసభకు  హాజరయ్యారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని 4 నెలలు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. 1924 లో  రాజమండ్రి ఆర్యాపురంలోని స్వగృహంలోనే  వైద్యవృత్తిని ప్రారంభించారు. నాడి పట్టుకుని వ్యాధి ఏమిటో నిమిషాలలో  గ్రహించే శక్తి ఆయనకు ఉండేది. నాడి చూసి, మందులు ఇచ్చేవారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు మంచి వైద్యం అందించే డాక్టరుగా పేరు సంపాదించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా అలాగే తక్కువ ఫీజుతో వైద్యం చేయడమే కాదు, డబ్బున్నవాళ్ళ దగ్గర నుంచి కూడా ఎంత ఇస్తే అంతే తీసుకుని వైద్యం చేసేవారు. అందరి మన్ననలు పొందారు.

సీతానగరం ఆశ్రమంలో చేరిక

[మార్చు]

   డా. బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం పిలుపు మేరకు డాక్టర్ దీక్షితులు  సీతానగరం  “గౌతమీ సత్యాగ్రహాశ్రమం"లో 1929లో ప్రప్రధమంగా చేరి  మద్దూరి అన్నపూర్ణయ్య, క్రొవ్విడి లింగరాజు, చండ్రుపట్ల హనుమంతరావు, బండ రాముడు, ధరణీప్రగడ శేషగిరిరావు, వక్కలంక సుబ్బారావు, డా. బ్రహ్మజోస్యుల తదితరులతో  కలిసి గాంధీ నిర్మాణ కార్యక్రమాల్ని పూర్తిగా  అమలు చేసేవారు. అయితే తాను సీతానగరం ఆశ్రమంలో ఉండడం వలన రాజమండ్రిలోని ఆసుపత్రికి వచ్చే పేదరోగులకు ఇబ్బంది అవుతుందని గమనించి, తన వైద్యశాలలో సమర్ధవంతంగా సేవ చేయగల వైద్యులుగా తన సహచరుడైన  డాక్టరు ఏ.బి. నాగేశ్వరరావు అని భావించారు. అందుకే  బందరు లో ఉన్న ఆయన్ని ఆహ్వానించి, తన స్వగృహంలోనే అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆవిధంగా ఒక నిజాయితీగల నాయకుడిని గోదావరి వాసులకు డాక్టర్ దీక్షితులు పరిచయం చేసారు.

జైలు జీవితం

[మార్చు]

    1932 లో సీతానగరం ఆశ్రమంపై పోలీసుదాడి  జరిగినప్పుడు ఆశ్రమం రక్తసిక్తమైంది.  డాక్టరు దీక్షితులు తనకు తగిలిన దెబ్బల నుంచి రక్తం కారుతున్నా సరే,  ఓర్చుకుని దెబ్బలు తగిలిన మిగతా వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళి కట్టుకట్టి, తాను కట్టుకుని పోలీసుల వెంట వెళ్లారు.  డా. దీక్షితులుకి 4 సంవత్సరాల  కఠిన కారాగార శిక్ష విధించారు. అయితే 1932 ఫిబ్రవరి 1నుండి 31జనవరి 1934 వరకు రెండు సంవత్సరాల  శిక్ష పూర్తయ్యాక  విడుదల చేశారు.  1934 నుండి 1942 సంవత్సరం  వరకు డా. దీక్షితులు సీతానగర ఆశ్రమంలోనే ఉంటూ, ఆ ప్రాంత వాసులకు నిస్వార్ధ వైద్య సేవలందించి నిస్సహాయులను ఆదుకున్నారు. ఆశ్రమ వైద్యశాలకు వన్నెతెచ్చారు. ఆశ్రమానికి  వైద్య కేంద్రాన్ని వెన్నెముకలా తీర్చిదిద్దారు.అంతేకాదు, చుట్టు ప్రక్కల గ్రామాలలో కూడ సహాయ వైద్యకేంద్రాలను ఏర్పరచి గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యారు.

మున్సిపల్ రాజకీయాల్లో

[మార్చు]

1938-41, 1947-50 లలో  రెండుసార్లు రాజమండ్రి  పురపాలక సంఘ సభ్యులుగా  ఎన్నికై సేవలందించారు. 1952లో రాజమండ్రి తుమ్మలావ, తాడితోట ప్రాంతాల ఇళ్ళు అగ్నికి ఆహుతై, ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో పేపర్ మిల్లు డాక్టరుగా ఉన్న దీక్షితులు ఐదురోజులపాటు బాధితులకు ఆశ్రయం కల్పించి ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పించారు. 1953లో  వరదలు వచ్చినప్పుడు కూడా  ఆయన చేసిన సేవలు అపూర్వం. 1955లో పురపాలక సంఘ అధ్యక్ష పదవికి పోటీపడ్డా, ఫలితం దక్కలేదు. అప్పటికే ఉన్న వెన్నుపోటు రాజకీయాలే ఇందుకు కారణం.  క్రొవ్విడి లింగరాజు,  డాక్టర్ ఏ.బి. నాగేశ్వరరావు తో కల్సి డాక్టర్ దీక్షితులు కార్యక్రమాలు నిర్వహించారు. కవిత్రయం మాదిరిగా అప్పట్లో  వారు ముగ్గురూ రాజమండ్రి నాయకత్రయంగా పేరుగాంచారు. ముఖ్యంగా డాక్టర్ ఏ.బి. సాధించిన విజయాలలో డాక్టర్ దీక్షితులు సైనికుని మాదిరిగా అందించిన తోడ్పాటు కారణం. 1959 ఆగస్టు 8న డా. దీక్షితులు కన్నుమూశారు. ఆయన విగ్రహాన్ని డాక్టర్ ఏ.బి. నాగేశ్వరరావు పార్కులో పెట్టారు.  

మూలాలు

[మార్చు]

 :చల్లా సత్యవాణి రచించిన 'రాజమహేంద్రిలో ఒకనాటి నాయకత్రయం' పుస్తకం(01-11-2008)

వివిధ పత్రికలలో కథనాలు, వ్యాసాలు