వైష్ణవ దేవి
వైష్ణవ దేవి మందిరం | |||
![]() | |||
Name: | వైష్ణవ దేవి మందిరం | ||
---|---|---|---|
Creator: | సమాచారం లేదు | ||
Date built: | సమాచారం లేదు | ||
Primary deity: | వైష్ణవ దేవి (శక్తి) | ||
స్థలం: | వైష్ణవ దేవి, జమ్మూ కాశ్మీర్ | ||
వైష్ణవ దేవి ఆలయం, ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు.[1]
ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైనా వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైంది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లే ఇక్కడ కూడ కొండ ఎక్కేవారు జై మాతాజూ అంటూ అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానే అమ్మవారి ఆలయం కనిపిస్తూనే వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయం లోపలికి సెల్ ఫోన్లు, కెమెరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు.[2] వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.[3]
ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన జమ్మూ జిల్లాలోని, కట్రా పట్టణంలో ఉంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. పర్వ దినాలలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య లక్షలలో వుండగా కానుకలుగా ఆలయానికి 15 కోట్ల రూపాయలు వచ్చాయి.[4]
స్థల పురాణం[మార్చు]
జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. త్రికూట పర్వతంగా ఋగ్వేదంలో చెప్పబడిన పర్వతసమూహం ఇదేనని కొందరి వాదన. ఋగ్వేదంలో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుచుండేదని చెప్పబడింది.
వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతంలో ఉంది. కురుపాండవ సంగ్రామంనకు ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి, ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతం చెపుతోంది. "జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే" అనే శ్లోకం ఆధారంతో ఈ దేవస్థానంలోనే అర్జునుడు పూజలు చేసాడని తెలుస్తుంది. [5]
స్థలపురాణం ప్రకారం పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయ నిర్మించారని తెలుస్తుంది. త్రికూటపర్వతానికి పక్కన ఐదు రాతి కట్టడాలున్నాయి. వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు.
మధ్యకాలపు చరిత్ర ప్రకారం మొదటగా సిక్కుల గురువైన గురు గోబింద్ సింగ్, పుర్మండాల్ మీదుగా వచ్చి ఈ పవిత్ర గుహను దర్శించాడని తెలుస్తుంది. గుహలకు ఉన్న ఒక పాత కాలపు నడక బాట ఈ మార్గం గుండా ఉంది.[6]
ఇక్కడ సతీదేవి శిరస్సు పడిన కారణంగా కొన్ని సంప్రదాయాల శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠానికి అత్యంత శక్తివంతమైందిగా భావిస్తారు. కొన్ని సంప్రదాయంల వారు మాత్రం అమ్మవారి కుడిచేయి ఇక్కడ పడిందని భావిస్తారు. హైందవ పవిత్ర పుస్తకాల మూలముగా తెలియవచ్చేది ఏమనగా, కశ్మీరంలో అమ్మవారి కుడిచేయి పడిందని. ఇప్పటికీ మాతా వైష్ణోదేవి ఆలయంలో మనిషి కుడి చేయి రూపములోని కొన్ని శిల్పాలు లభ్యం కావడం ఈ వాదన సరైనదేననడానికి ఊతమిస్తుంది. ఈ చేతి శిల్పంను అమ్మవారి వరద హస్తంగా భక్తులు గౌరవిస్తారు.
శ్రీధరపండితుడు అనే వ్యక్తి 700 సంవత్సరాలకు పూర్వం ఈ కొండగుహలను కనుగొన్నాడని చెపుతారు. తన ఇంటిలోనున్న పూజా సంపుటంలో అమ్మవారి విగ్రహం మాయమవడం చూసిన శ్రీధరపండితుడు కటిక ఉపవాసం చేస్తూ అమ్మవారికి మొరపెట్టుకోగా కలలో దర్శనమిచ్చిన అమ్మవారు తను పర్వత సానువులలో ఉన్నానని దారి చూపించిందని, ఉపవాస దీక్ష మానవలసినదిగా ఆదేశించిందని.ఆమె ఆజ్ఞానుసారం శ్రీధరపండితుడు వెతుక్కుంటూ వెళ్ళగా మూడు రాతుల రూపంలో అమ్మవారు దర్శనమిచ్చిందని చెపుతారు. ఆ మూడు మూర్తులే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ అవతారాలుగా శ్రీధరపండితుడు పూజించాడని చెపుతారు. తరువాత అమ్మవారి ప్రసాదంగా శ్రీధరపండితునికి నలువురు కుమారులు జన్మించారని, తరువాత శ్రీధరపండితుడు తన శేష జీవితాన్ని అమ్మవారి సేవలో గడిపాడని ఒక స్థానిక కథ ఉందంటారు.[7]
ప్రస్తావనలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-24. Retrieved 2017-06-08.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-24. Retrieved 2017-06-08.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-31. Retrieved 2017-06-08.
- ↑ http://timesofindia.indiatimes.com/business/india-business/Money-spinning-mandirs/articleshow/5108844.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-24. Retrieved 2017-06-08.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-24. Retrieved 2017-06-08.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-09-03. Retrieved 2017-06-08.
బయటి లింకులు[మార్చు]
- MataVaishnodevi.com: The complete information Website on Shri Mata Vaishnodevi
- Shri Mata Vaishno Devi Shrine Board
- Vaishno Devi Resources
- Detailed information on Vaishno Devi shrine
- Vaishno Devi Shrine and Yatra
- The detailed website on Meri Maiya Vaishnodevi
- Information About Vaishno Devi Shrine and Yatra
- Story of Vaishno Devi Maa