Jump to content

తెలుగు సాహిత్యం - శివకవి యుగము

వికీపీడియా నుండి
(శివకవి యుగము నుండి దారిమార్పు చెందింది)
తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

తెలుగు సాహిత్యంలో 1100 నుండి 1225 వరకు శివకవి యుగము అంటారు. ఈ యుగం నన్నయకు, తిక్కనకు సంధికాలం. దక్షిణ భారతదేశంలో శైవం ప్రబలిన కాలం ఇది. ఆంధ్రాపధంలో కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాధుడు, మల్లికార్జున పండితారాధ్యుడు ఈ యుగంలో శివకవిత్రయం. ఈ కాలంలో రచనా వస్తువు శివగాధామయం. భాషలో సంస్కృత ప్రాబల్యత తగ్గి తెలుగు వాడుక హెచ్చింది.

రాజకీయ, సామాజిక నేపథ్యం

[మార్చు]

ఈ సమయానికి చాళుక్యచోళరాజ్యం క్షీణదశకు చేరుకొంది. తెలంగాణ ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల, రాష్ట్రకూటుల బలం అధికంగా ఉంది. తీరాంధ్రంలో సరైన కేంద్ర పాలన కొరవడిందని, వేంగి రాజ్యంలో రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, చోళులు ఎడతెరిపి లేకుండా యుద్ధాలు జరిపారని తెలుస్తుంది. ఈ సమయంలో చాళుక్యులకు సామంతులుగా ఉండిన కాకతీయులు స్వతంత్రులై తెలంగాణ ప్రాంతంలో బలపడసాగారు.

సాంస్కృతికంగా అప్పటికి బౌద్ధం, జైనం బాగా బలహీనపడ్డాయి. శైవం, వీరశైవం విజృంభించాయి.వీరశైవులు - బౌద్ధ, జైనాలనే కాక వైదిక విధానాలను కూడా నిరసించారు. శివుడు తక్క వేరు దైవము లేదని, శివారాధన చేయనివానిని మన్నింపతగదని వాదించారు. వారికి వాఙ్మయం కూడా మతబోధనకు మార్గం తప్ప దానికి వేరు లక్ష్యం లేదు.

ఈ యుగంలో భాష లక్షణాలు

[మార్చు]

ఈ యుగంలో తెలుగు లిపి

[మార్చు]

ముఖ్య కవులు, రచనలు

[మార్చు]

ఈ యుగానికి చెందిన నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాధుడు అనే కవులను శైవ కవిత్రయంగా పేర్కొంటారు. శ్రీపతి పండితుడు, శివలెంక మంచన, యథావాక్కుల అన్నమయ్య కూడా శివకవులే. శివకవులలో శైవాభిమానం, దేశికవితాభిమానం, శైలీస్వేచ్ఛ ముఖ్య లక్షణాలు. సా.శ. 1160 కాలానికి చెందిన నన్నెచోడుడు కుమార సంభవం రచించాడు. నన్నయ కంటే నన్నెచోడుడు ముందువాడని మానవల్లి రామకృష్ణకవి వాదించాడు కాని ఆ వాదం నిలబడలేదు.[1]. పాల్కురికి సోమనాధుడు 1160-1230 కాలంవాడు కావచ్చును. ఇతడు తెలుగు, సంస్కృతం, కన్నడ భాషలలో గొప్ప పండితుడు. ఇతని రచనలలో అనుభవ సారము, బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, చతుర్వేద సారం అనేవి మాత్రం లభించాయి. శతక వాఙ్మయంలో లమకు లభిస్తున్న మొట్ట మొదటి శతకంగా వృషాధిప శతకాన్ని పేర్కొంటారు. మల్లికార్జున పండితారాధ్యుడు చాలా గ్రంథాలు వ్రాసి ఉండాలికాని శివతత్వ సారము మాత్రం లభిస్తున్నది. మిగిలిన కొన్న గ్రంథాల కర్తృత్వం స్పష్టంగా తెలియరావడంలేదు.

1133-1198 మధ్యకాలంలో ఓరుగల్లును పాళించిన కాకతీయరాజు ప్రతాప రుద్రుడు "నీతి సారము" అనే గ్రంథాన్ని రచించాడని భావిస్తున్నారు. చక్రపాణి రంగన కూడా ఈ యుగంలోనివాడు కాని, తిక్కన యుగంలోనివాడు కాని కావచ్చును.

ఇతరాలు

[మార్చు]

శైవ భక్తిపూర్వకం కాని ఇతివృత్తమేదీ శివకవుల రచనకు ఇతివృత్తం కాలేదు. వారు శ్లాఘించినది ఇతర శివకవులను మాత్రమే. వారి జీవితము, కవిత్వము కూడా శివార్పణమే. భాషా ప్రయోగంలో వీరు చాలా స్వతంత్ర ధోరణి అవలంబించారు. ఛందో వ్యాకణాది నియమాలను ఉల్లంఘించడానికి, అన్యభాషాపదాలను వాడడానికి శివకవులు ఏమాత్రం వెనుకాడలేదు. వారి భక్తిపారవశ్యం ఇతర విషయాలపట్ల దృష్టిని పెట్టనీయలేదు. జాను కవిత, దేశి రచన అనే సంప్రదాయాభిమానం కలిగించింది శివకవులే. చాలా ముఖ్యమైన మత గ్రంథాలను వీరు తెలుగులో వ్రాయడం వలన ఇతర భాషలలో పండితులు కూడా తెలుగు కావ్యాలు చదివేలా చేశారు.[2]

జాను తెనుగు

[మార్చు]

నన్నెచోడుడు మొట్టమొదటిసారిగా "జాను తెనుగు", వస్తు కవిత" అనే పదాలను వాడాడు. జాను తెనుగు అంటే ఏమిటనే విషయంపై పండితుల మధ్య చాలా చర్చలు జరిగాయి. కన్నడంలో "జాణ్ణుడి" (చమత్కారమైన నుడి) అనే పదం నుండి "జాను కవిత" అనే ప్రయోగం వచ్చిందని ఒక అభిప్రాయం. "జాను" అనగా ఇంపైన, అందమైన, స్పష్టమైన భావం కల తెలుగు అని కొందరన్నారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి జి.నాగయ్య చెప్పిన నిర్వచనం - "తెలుగు భాషలో స్వభావసిద్ధంగా వాడే సంస్కృత సమాసాలను జనసామాన్యంలో వాడబడే దేశిదాలతో అన్వయించి, అన్వయ క్లిష్టత లేకుండా మంజులమై, సరసమై, ప్రసన్నమైన తెలుగు జాను తెనుగు"[1]

జాను తెనుగును వాడిన వారిలో రెండవవాడు లింగాయతకవి పాల్కూరికి సోమనాధుడు.

ప్రాచీనులెవ్వరూ దీని అర్ధమును నిర్వచించలేదు. వాజ్మయములోని ప్రయోగముల మూలమున దీని అర్ధమును తెలుసొకోవాలే తప్ప. కాని యిట్టి ప్రయోగములు యెన్నియో లెవు. లభ్యమైన ఆంధ్ర గ్రంథములలో మూడునాలుగు మాత్రమే కానవచ్చుచున్నవి. ఇందొకటి నన్నెచోడుడి కుమారసంభవము లోనిది.

సరళముగా భావములు జానుదెనుంగున నింపుపెంపుతో
బిరిగొన వర్ణనల్ ఫణితివేర్కొన నర్ధము లోత్తగిల్ల బం
దూరముగ బ్రాణముల్ మధుమృదుత్వరసంబున గందళింప న
క్షరములు సూక్తు లార్యులకు గర్ణరసాయనలీల గ్రాలగాన్. [కుమారసంభవము,1-35]

ఇందు నన్నెచోడుడు తాను కావ్యమును జానుతెనుంగున రచియించెదనని చెప్పెనేకాని ఆ జానుతెనుగు స్వభావమెట్టిదో తెలియపరచలేదు.

మరి మూడు ప్రయోగములు పాల్కూరికి సోమనాధుని గ్రంథములనుండి

ఉరుతరగద్యపద్యోక్తులకంటే-సరసమై పరగిన జానుదెనుంగు
చర్చించగా సర్వసామాన్యమగుట- గూర్చెద ద్విపదల గోర్కేదైవార [బసవపురాణము పుట-5]
ఆరూఢగద్యపద్యాదిప్రబంధ-పూరిత సంస్కృతభూయిష్ఠరచన
మానుగా సర్వసామాన్యంబుగామి- జానుదెనుగు విశేషము బ్రసన్నతకు. [ప్రండితారాధ్యచరిత్ర, దీక్షాప్రకరణము పుట-18]

ఈ ద్విపదలవలన గద్యపద్యాది ప్రబంధ సంస్కృత భూయిష్టము గానిది జానుదెనుగు అని బోధపడుచున్నది. ఇంతేకాదు; వృషాధిశతకమున జానుదెనుగు స్వభావమిట్టిదని ఈ క్రిది పద్యములో పాల్కూరి చెప్పినాడు.

బలుపొడతోలు సీరయును బాపసరుల్ గిలుపారు కన్ను వె
న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గుపూ
సల గల ఱేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
వలపు మదిం దలిర్ప బసవా బసవా వృషాధిపా.

కావున పాల్కూరికి సోముని మతమున జానుదెనుగు అనగ అచ్చ తెలుగుఅని తెలియవచ్చుచున్నది.

జానుదెనుగు సమస్తపదము. జాను+తెనుగు అను రెండుమాటల కలయిక వల్ల యేర్పడినది. దీనియందలి తెనుగు భాషానామము; జాను శబ్ద మా భాషా స్వభావమును దెలుపుచున్నది. జాను శబ్దము దేశ్య శబ్దమని కొందరి అభిప్రాయము. ఇది జ్ఞాశబ్దభవ మనియు; 'జాణ' కు తోబుట్టువని అంటారు. దీనికి 'అందము', 'సౌందర్యము' అని అర్ధము. అందువలన జానుదెనుగు అనగా సొంపైన, లేక నుడికారము గల తెనుగని అంవయించుకోవచ్చును. తెనుగు కవులు జానుదెనుగును ప్రశంసించినట్లు కర్ణాటకులు 'జాణ్ణుడి' ని (జానుకన్నడము) ప్రశంసించియున్నారు.

కర్ణాటక 'జాణ్ణుడి' యే జానుదెనుగునకు మతృక అని కొదరు తలిచెదరు. తెనుగున కావ్య రచన లేనికాలమున నూతనాంధ్ర కావ్యనిర్మాణమునకు గడంగిన నన్నెచోడుడు కర్ణాటక వాజ్మయమునుండి పెక్కు విషయములను గ్రహించినట్లు 'జాణ్ణుడి' గొని దానిని జానుదెనుగుగా మార్చెననియు, నతని గ్రంథములనుండి పాల్కూరికి సోముడు గ్రహించెనని తలిచెదరు.

సూర్యరాయ నిఘంటువులో జాను పదమునకు అర్ధములు :

1. సొగసు : సౌదర్యము : అందము ఈ అర్ధములే శబ్దరత్నాకరము లో, ఆంధ్రవాచస్పత్యములో ఉన్నాయి.

2. ఒప్పు : శోభ ఈ అర్ధమునకు ప్రయోగము -

జానరిపశుపతినురకవి
ధానమహారంభుడైన దక్షుండనున
జ్ఞానికి మునుకొనివచ్చు న
మానంబన నమరి సతివిమానము వచ్చెన్.

3. విధము. ఈ అర్ధమునకు ప్రయోగము -

మాటలబిచ్చిల్లు మధురంబు దలచు సరసంబు లాడెడి జానుదలంచు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 తెలుగు సాహిత్య చరిత్ర - రచన: ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
  2. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం

వనరులు

[మార్చు]
  • కాళ్ళకూరు వెంకటనారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము (1936) - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)

బయటి లింకులు

[మార్చు]