Jump to content

శ్రావణ శుక్రవారం

వికీపీడియా నుండి

వర్ష ఋతువు నందు, భాద్రపద మాసానికి ముందు వచ్చు శ్రావణ మాసములో వచ్చు శుక్రవారాలను శ్రావణ శుక్రవారములు అందురు. హిందువులకు ఇది చాలా పవిత్రమైన మాసము. మహిళలందరూ ఈ మాసంలో వచ్చు శుక్రవారాల్లో, మహాలక్ష్మీ దేవిని వర మహాలక్ష్మి దేవిగా ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే ఈ శ్రావణ మాసంలో, శ్రీ మహాలక్ష్మీ దేవిని శ్రీ వరలక్ష్మీ దేవిగా భావించి పూజిస్తారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు శ్రీ వరలక్మీ దేవి వ్రతం చేసుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే, పార్వతీ దేవితో చెప్పినట్లుగా స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. ఆరోజున పుణ్యస్త్రీలందరూ తమ సౌభాగ్యం కొరకు, కుటుంబ శ్రేయస్సు , ఐశ్వర్యం , అభివృధ్ధి కోసం ఈ మాసానికి అధిష్టాన దేవత అయిన శ్రీ వరలక్ష్మీ దేవిని, శ్రీ వరలక్ష్మీ వ్రతం వరలక్ష్మీ వ్రతం విధానంతో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో చాలా విశేషంగా చేసుకుంటారు. ఈ శ్రావణ మాసంలో, ప్రత్యేకించి శ్రావణ శుక్రవారాలలో, శ్రీ వరలక్ష్మీ దేవి అమ్మవారిని పూజిస్తే, సర్వ శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సకల అభీష్టములు నెరవేరుతాయని ప్రతీతి .