సుద్దాల హనుమంతు
సుద్దాల హనుమంతు (డిసెంబర్, 1910 - అక్టోబర్ 10, 1982) ప్రజాకవి. కవిగా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. తెలంగాణ జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత.
జననం - వృత్తిజీవితం
[మార్చు]యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో 1910, జూన్ నెలలో పద్మశాలి కుటుంబంలోని బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ, తర్వాత ఆయన గుండాల మండలం, సుద్దాల గ్రామంలో నివసించడంతో ఆ ఊరు పేరే ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క తెలంగాణ కే పరిమితం కాలేదు, యావదాంధ్ర దేశం మారుమోగిందంటే అతిశయోక్తి కాదు. పాట ద్వారా ప్రజల్లో ప్రచారమై ప్రజాకవిగా నిలబడ్డారు. నాటి నిజాం వ్యతిరేకోద్యమంలో బతికున్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందించి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవి సుద్దాల హనుమంతు. హన్మంతు తండ్రి ఆయుర్వేద వైద్యవృత్తితో కుటుంబం గడుస్తోంది. చిన్ననాటి నుంచే హరికథలు, పాటలు, నాటకాలంటే హనుమంతుకు చాలా ఇష్టం. హరికథలు చెప్పే అంజనదాసు శిష్యుడై, ఆయన బృందంలో చేరాడు. హన్మంతు బతుకుతెరువు కోసం ఉద్యోగానికి హైదరాబాదు చేరాడు. ప్రభుత్వ కార్యాలయంలో అటెండరుగా పనిచేశాడు. ఆర్యసమాజం వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పనిచేశాడు.
తెలంగాణ ఉద్యమంలో
[మార్చు]విద్య పెద్దగా లేదు- ఆనాడు చదువుకు అవకాశాల్లేవు. వీధిబడిలో ఉర్దూ, తెలుగు భాషలు నేర్చుకున్నాడు. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో యక్షగానాలు, కీర్తనలు, భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి వుండేది. అందుకే యక్షగానాల్లో పాత్రలు ధరించారు. గొంతెత్తి పాడటం నేర్చుకున్నాడు. చిన్నతనం నుండే నాటకాల పై ఆసక్తిని పెంచుకున్న హనుమంతుకు ప్రజా కళారూపాలైన హరికథ, బురక్రథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రచారాసాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఆయన బురక్రథ చెబితే ఆనాడు గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదని జనంలో ప్రచారం బలంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బురక్రథల రూపంలో చాటి చెప్పారు. విచిత్ర వేషాలు, ‘గొల్లసుద్దులు’, ‘లత్కోరుసాబ్’, ‘బుడబుక్కలు’, ‘ఫకీరు వేషం’, ‘సాధువు’ మొదలైన కళా రూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించాడు.
కమ్యూనిస్టు పార్టీ దళ సభ్యునిగా చేరి తన పాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు హన్మంతు వాలంటీర్‌గా పనిచేశారు. ఆ మహాసభ ప్రభావంతో సుద్దాల గ్రామంలో `సంఘం’ స్థాపించారు. ఈ `సంఘం’ ఆధ్వర్యంలో ఆందోళనలు, తిరుగుబాటు పోరాటాలు మొదలైనయ్. సంఘం పెట్టి, పాటలు కట్టి ప్రజల్ని ఉద్రేకపరుస్తున్నాడని హనుమంతు పై నిజాం ప్రభుత్వం అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పుడే హనుమంతు అజ్ఞాతవాసంలోకి వెళ్ళాల్సి వచ్చింది.
ఆ రోజుల్లో ఉపన్యాసాలకంటే పాటే జనంలోకి బాగా చొచ్చుకుపోయేది. పాటే జనంలో చైతన్యాన్ని కలిగించేది. వెట్టిచాకిరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ, దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ అనేక పాటలు రాశారు. ఇవన్నీ `వీర తెలంగాణ’ పేరుతో అచ్చయ్యాయి. అపారమైన ఆత్మవిశ్వాసం, అలుపెరగని వీరావేశం ఆయన పాటకు బలాన్ని, బలగాన్ని సమకూర్చి పెట్టాయి.
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు ఎందరినో కవులుగా, గాయకులుగా, ఉద్యమకారులుగా తయారు చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, బానిస జన విముక్తి కోసం జరిగిన ఈ పోరాటం అంతర్జాతీయ స్థాయిలోనే ఒక గుర్తింపును తెచ్చిపెట్టింది.
చరిత్రాత్మకంగా జరిగిన ఈ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రాంతాలకు చెందిన 4 వేల మంది ప్రజలు ప్రాణ త్యాగాలు చేస్తే ఇందులో సగం మంది నల్లగొండ జిల్లా వారేనంటే సాయుధపోరాటంలో ఆ జిల్లా పాత్ర ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
ప్రాణ త్యాగాల్లోనే కాకుండా సాయుధ పోరాటానికి ఇరుసుల్లా పనిచేసే గొప్ప నాయకత్వాన్ని, తిరుగులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసి ప్రజల్ని గెరిల్లా పోరాట వ్యూహాలకు కూడా సిద్ధం చేసింది.
రాజపేట మండలం రేణుకుంటలో కమ్యూనిస్టుల గ్రామసభలో మాభూమి నాటకం, గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తున్నారు. అక్కడ సుద్దాల హనుమంతుతో పాటు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కురారం రాంరెడ్డి, రేణుకుంట రాంరెడ్డి, ఎలుకపల్లి యాదగిరిలు ఉన్నారు. గ్రామసభను చెదరగొట్టేందుకు నిజాం మూకలు వస్తున్నాయని బాల కళాకారులు సమాచారాన్ని చేరవేశారు. దీంతో సభలో ఉన్న వారు చెట్టుకొక్కరు...పుట్టకొక్కరు పారిపోతున్నక్రమంలో ఓ ముసలామె చేతిలో ఉన్న కర్రను సుద్దాల హన్మంతు అందుకుని భూమిపై కర్రను కొడుతూ 'వెయ్.. దెబ్బ దెబ్బకు దెబ్బ...' అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. దీంతో అంతా కలిసి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకూ తరిమికొట్టారు.[1]
మరణం
[మార్చు]ఒక చేత్తో పెన్నూ, మరో చేత్తో గన్నూ పట్టుకొని పోరాటంలో పాల్గొన్న వీరసేనాని హనుమంతు. జానపద కళా రూపాలకు జీవం పోసి, అనేక పాటలను ప్రజలకు అందించిన సుద్దాల హనుమంతు క్యాన్సర్ వ్యాధితో 1982, అక్టోబర్ 10 న అమరుడయ్యాడు.[2]
పాటలు
[మార్చు]హనుమంతు పాటల్లో యతిప్రాసలు అచేతనంగా పడేవి. పల్లెటూరి పిల్లగాడ (మాభూమి), రణభేరి మ్రోగింది తెలుగోడ, వేయ్ వేయ్ దెబ్బ, ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కన్నులో భగా భగా కడ్పుల్లో ధడా ధడా, భళిరె తెలంగాణ వహరె తెలంగాణ ఇలా ఎన్నో పాటలు ఆయనకు పేరు తెచ్చాయి. హనుమంతు రాసిన 22 పాటల పుస్తకం సాహితీ సర్కిల్ వారు ప్రచురించారు.[3]
ఇతర వివరాలు
[మార్చు]ఇతని కుమారుడైన సుద్దాల అశోక్ తేజ 2010 అక్టోబర్ 13లో సుద్దాల ఫౌండేషన్ ను ప్రాంరంభించి తన తల్లిదండ్రుల పేరుతో సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారంను ఏర్పాటుచేసి ప్రతి ఏటా ఒకరికి పురస్కారాన్ని అందజేస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ 10టీవీ. "సుద్దాల హన్మంతు పాటల తూటా..." Archived from the original on 13 నవంబరు 2015. Retrieved 5 April 2017.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ నమస్తే తెలంగాణ. "తొలి తెలంగాణ ప్రజాకవి సుద్దాల హనుమంతు". Retrieved 5 April 2017.
- ↑ వెబ్ ఆర్కైవ్. "పాటను తూటాగా మలిచిన సుద్దాల". web.archive.org. Archived from the original on 5 ఏప్రిల్ 2017. Retrieved 5 April 2017.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- తెలుగు సినిమా పాటల రచయితలు
- తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా వ్యక్తులు
- తెలంగాణా విముక్తి పోరాట యోధులు
- తెలుగు జానపద కళాకారులు
- తెలుగు కళాకారులు
- 1908 జననాలు
- 1982 మరణాలు
- యాదాద్రి భువనగిరి జిల్లా కవులు
- యాదాద్రి భువనగిరి జిల్లా సినిమా పాటల రచయితలు