హెలికాప్టరు
హెలికాప్టరు (ఆంగ్లం Helicopter) గాలిలో ఎగిరే విమానం వంటి వాహనం. కాని, మామూలు విమానం లాగా కాకుండా, దీనికి తలపై రెండు లేక నాలుగు రెక్కలు ఉంటాయి. ఇవి వేగంగా తిరిగినప్పుడు, విమానం నిట్టనిలువుగా పైకి లేస్తుంది. గాలిలో అలా డేగ లాగా కొంతసేపు ఉండగలుగుతుంది. ముందుకు, వెనకకు కూడా పోగలుగుతుంది. మళ్ళీ తిరిగి, భూమి మీదకు ఏటవాలుగా కాకుండా, నేరుగా దిగుతుంది. దీనికి రన్ వే (runway) అవసరం లేదు. హెలిపాడ్ (helipad) ఉంటే చాలు.
హెలికాప్టర్ ఎలా ఎగురుతుంది?
[మార్చు]విమానం చేయలేని పనులను కూడా హెలికాప్టర్ చేయగలదు. రన్‌వే పై పరుగెత్తకుండానే ఉన్న చోట నుంచి నిట్టనిలువుగా పైకి లేవగలదు. కావాలంటే వెనక్కు ఎగరగలదు. ఎగురుతూ కావలసిన చోట ఆగిపోయి ఉండగలదు. గాలిలో పూర్తిగా గుండ్రంగా తిరుగగలదు. ఇన్ని ప్రత్యేకతలతో హెలికాప్టర్ ఎగరడానికి దానిలోని ప్రధాన భాగాలైన మెయిన్ రోటర్, డ్రైవ్ షాప్ట్, కాక్‌పిట్, టెయిల్ రోటర్, లాండింగ్ స్కిడ్స్ దోహదం చేస్తాయి. మన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌ను తీసుకొచ్చి తిరగేసి బిగించినట్టుగా హెలికాఫ్టర్ మీద పెద్ద పెద్ద రెక్కలున్న పంకా ఉంటుంది. ఈ మొత్తం అమరికను 'మెయిన్ రోటర్' అంటారు. ఈ రెక్కలు గిరగిరా తిరగడం వల్లనే హెలికాప్టర్ పైకి లేస్తుంది. అంత బరువైన హెలికాఫ్టర్‌ను పైకి లేపేటంత 'లిఫ్ట్' (బలం) ఏర్పడేలా రెక్కలను వేగంగా తిప్పడానికి ప్రత్యేకమైన ఇంజను ఉంటుంది. పంకా రెక్కలు హెలికాఫ్టర్ చుట్టూ ఉండే గాలిని కిందకు నెడతాయి. ఇది చర్య అనుకుంటే, దీనికి ప్రతిచర్యగా హెలికాప్టర్ పైకి లేస్తుంది.
పంకా తిరగడంతో పైకి లేచిన హెలికాప్టర్ దానికి వ్యతిరేక దిశలో గిరగిరా తిరగాలి కదా. మరి దాన్ని ఆపాలంటే, మెయిన్ రోటర్ తిరిగే దిశకు వ్యతిరేకంగా పనిచేసే సమానమైన బలం కావాలి. ఈ బలాన్ని హెలికాప్టర్ తోకకు ఉండే రెక్కలు (టెయిల్ రోటర్) కలిగిస్తాయి. ఈ రెక్కలు తిరగడం వల్లనే హెలికాప్టర్ పైకి లేచిన తర్వాత స్థిరంగా ఉండ గలుగుతుంది. హెలికాప్టర్ తలమీద, తోక దగ్గర ఉండే రెక్కల్ని ఒకే ఇంజను ద్వారా తిప్పే ఏర్పాటు ఉంటుంది.
ఇక 'కాక్ పిట్'లో పైలట్ దగ్గర రెండు రకాల కంట్రోల్సు ఉంటాయి. ఒకటి 'సైకిక్ కంట్రోల్' అయితే, మరొకటి 'కలెక్టివ్ కంట్రోల్'. సైకిక్ కంట్రోల్ ద్వారా పైలెట్ హెలికాప్టర్‌ను ముందుకు, వెనక్కు, కుడి ఎడమలకు తిప్పకలుగుతాడు. కలెక్టివ్ కంట్రోల్ ద్వారా పైకి, కిందికి తిప్పకలుగుతాడు. పైలట్ కాళ్ల దగ్గర టెయిల్ రోటర్ వేగాన్ని నియంత్రించే పెడల్స్ ఉంటాయి. ఇన్ని సదుపాయాలున్న హెలికాప్టర్‌ని 75 సంవత్సరాల క్రితం ఐగర్ సికోరస్కీ అనే ఇంజనీరు రూపొందించాడు .[1].
ఉపయోగాలు
[మార్చు]హెలికాప్టరు యొక్క ప్రత్యేకమైన లక్షణాల మూలంగా విమానాల వలన కాని కొన్ని క్లిష్టమైన పనులను సులువుగా చేయగలుగుతున్నారు. ఈనాడు వీటిని రవాణా, నిర్మాణ రంగం, అగ్నిమాపక దళాలు, మిలటరీ వ్యవస్థలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
-
Sikorsky S-64 Skycrane lifting a prefab house
-
Kern County (California) Fire Department Bell 205 dropping water on fire
-
A British Westland WAH-64 Apache attack helicopter
-
HH-65 Dolphin demonstrating hoist rescue capability
-
A Sikorsky S76-C+ air ambulance being loaded by firefighters
-
CH-46 Sea Knight Helicopter
- హెలికాప్టరును గాలిలో ఎగిరే క్రేన్గా దృఢమైన తాళ్లతో బంధించిన బరువైన పరికరాల్ని గాలిలోకి లేపి ఎత్తైన భవనాల మీద లేదా కొండల మీద ఉంచడానికి ఉపయోగిస్తున్నారు. దట్టమైన అరణ్యాలలో వృక్షాల్ని తరలించడానికి కూడా వాడుతున్నారు.[2],[3]
- వరద ల సమయంలో వీటి సేవలు అమోఘమైనవి.వరదలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి, వరద బాధితులకు అహారపొట్లాలు,మంచినీరు అందించడానికి ఇవి ఉపకరిస్తాయి.
- హెలికాప్టరులను అంబులెన్స్ క్రింద అత్యవసర పరిస్థితులలో సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో తరళించడానికి కొన్ని దేశాలలో ఉపయోగిస్తున్నారు. వీని ద్వారా సాధారణ అంబులెన్స్ చేరలేని ప్రాంతాలకు సైతం ఇవి వైద్య సేవలను అందించగలవు. ఇలాంటి అంబులెన్స్ హెలికాప్టరులలో అత్యవసర వైద్య సౌకర్యాలు కూడా ఉంటాయి.
- పోలీసు వ్యవస్థలో హెలికాప్టరు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. భూమి మీది బలగాలకు ముఖ్యమైన సమాచారాన్ని అందించి అవసరమైనప్పుడు నేరస్తుల్ని గాలిలోనుండే దాడిచేసి నిర్వీర్యుల్ని చేయగలిగే సామర్థ్యం కలిగువున్నాయి. వీటికి రాత్రి సమయంలో కూడా పనిచేయడానికి అవసరమైన ఆయుధాలు, సెర్చి లైట్లు, కెమెరాలు అమర్చబడి వుంటాయి.
- మిలిటరీ బలాలు హెలికాప్టరును గాలిలోంచి భూమి మీది ప్రాంతాలపై దాడి చేయడానికి ఉపయోగిస్తున్నారు. వీటికి గన్లు, మిసైల్స్ అమర్చబడి వుంటాయి. వీరు సైనికుల్ని, వారికి కావలసిన పరికరాల్ని కీలకమైన స్థావరాలకు తరలించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
- విదేశాలలో వీటిని వ్యవసాయం,అరణ్య అభినృద్ది (Seeding) లాంటి పనులకు వాడుతున్నారు.అనగా అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాలలో ఎరువులు చల్లడానికి,అడవుల అభివృద్ధి కోసం ఆకాశంనుండి విత్తనాలను వెదజల్లడం లాంటివి.
ప్రమాదాలు
[మార్చు]హెలికాప్టరు ప్రమాదాలు అరుదుగా జరుగుతాయి. వీనిలో ప్రముఖ వ్యక్తులు వై.యస్. రాజశేఖరరెడ్డి, జి.ఎం.సి.బాలయోగి, సినీనటి సౌందర్య ప్రాణాలు కోల్పోయారు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-05. Retrieved 2014-10-15.
- ↑ Day, Dwayne A. "Skycranes" Archived 2007-04-09 at the Wayback Machine. Centennial of Flight Commission. Accessed on 1 October 2008.
- ↑ Webster, L. F. The Wiley Dictionary of Civil Engineering and Construction. New York: Wiley, 1997. ISBN 0-471-18115-3