హైదరాబాదు బాంబు పేలుళ్ళు, 2007, ఆగష్టు 25

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎప్పుడూ రద్దీగా ఉండే గోకుల్ చాట్
సందర్శకులతో కిటకిటలాడే లుంబిని పార్క్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, హైదరాబాదు నగరంలో ఆగష్టు 25న జనసమ్మర్దంగా ఉండేచోట్ల బాంబు పేలుళ్ళు జరిగి 42 మంది వరకు మరణించారు, మరో 70 మంది గాయపడ్డారు.[1] రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీవనంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించగా, కోఠి వద్ద గల గోకుల్ చాట్ దుకాణం వద్ద జరిగిన పేలుడులో 33 మంది మరణించారు.[2][3]

లుంబినీవనం ఘటన[మార్చు]

లుంబినీవనంలో రాత్రి ఏడున్నరకు లేజర్‌షో మొదలైంది. దాదాపు 500 మంది వరకు సందర్శకులు దాన్ని చూస్తున్నారు. వందేమాతర గీతాలాపన అప్పుడే పూర్తయింది. 'గుడ్‌ ఈవినింగ్‌ హైదరాబాద్‌' అంటూ స్వాగత వచనం! అప్పుడు సీట్ల మధ్యలో బాంబు పేలింది. కుర్చీలు గాల్లో తేలాయి. తలలు ఎగిరిపడ్డాయి. శరీర అవయవాలు, మాంస ఖండాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సందర్శకులంతా భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. కుర్చీలు చెల్లా చెదురయ్యాయి. పేలుడు ధాటికి ఘటనా స్థలిలోనే ఇద్దరు చనిపోగా, మరో ఏడుగురు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. 40-50 మంది వరకు గాయపడ్డారు.[2]

గోకుల్ చాట్ ఘటన[మార్చు]

కోఠి ప్రాంతంలో గోకుల్ చాట్ ప్రముఖ స్థలం. సాయంత్రాల వేళ ప్రజలక్కడ ఎక్కువగా గుమిగూడుతారు. చాట్ మసాలా వంటి ఉత్తరభారత ఉపాహారాలకు గత మూడు దశాబ్దాలుగా పేరొందింది. ఘటన నాటి సాయంత్రం 7:40 ప్రాంతంలో, బాగా రద్దీగా ఉన్న గోకుల్ చాట్ సెంటరులో బాంబు పేలింది. పదిమంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 23 మంది ఆసుపత్రుల్లో మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు.[2]

బాధితులు[మార్చు]

బాంబు పేలుడు సంఘటనలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగటం హైదరాబాదు నగరంలో ఇదే మొదటిసారి.

మృతులు[మార్చు]

చనిపోయిన 42 మందిలో 39 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు పంపించారు. లుంబినీ పార్కు పేలుడులో మరణించిన వారిలో ఏడుగురు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని అమృతవర్షిని ఇంజనీరింగు కళాశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. స్టడీ టూరు మీద హైదరాబాదు వచ్చిన ఈ విద్యార్థులు పేలుడు సంభవించిన సమయంలో లేజర్ షో తిలకిస్తున్నారు. అదే బృందంలోని మరో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు.[4]

 1. మహ్మద్‌ రిజ్వాన్‌ (16), ఎ-క్లాస్‌, న్యూ మలక్‌పేట, హైదరాబాద్‌
 2. ఇ.శ్యామ్‌రావు (27), సీతాఫల్‌మండి, సికింద్రాబాద్‌
 3. రహీమున్నీసా బేగం (40), మలక్‌పేట, హైదరాబాద్‌
 4. ప్రత్యూష (20), మలక్‌పేట, హైదరాబాద్‌
 5. మహ్మద్‌ బాసిత్‌ (21), మలక్‌పేట, హైదరాబాద్‌
 6. యాహ్యా అబ్దుల్‌ ఖాదర్‌ (17),ఎ-క్లాస్‌, న్యూమలక్‌పేట, హైదరాబాద్‌
 7. అక్రముల్లా ఖాన్‌ (22), పీటీసీ క్వార్టర్స్‌, అంబర్‌పేట, హైదరాబాద్‌
 8. మహ్మద్‌ సలీం (47), హుమయూన్‌నగర్‌, హైదరాబాద్‌
 9. సైదా ఫరీదానాజ్‌ (35), హుమాయున్‌నగర్‌, హైదరాబాద్‌
 10. మహ్మద్‌ అమీర్‌ (8), హుమాయున్‌నగర్‌, హైదరాబాద్‌
 11. మహ్మద్‌ అలీ (5), హుమాయున్‌నగర్‌, హైదరాబాద్‌
 12. కె.కృష్ణచంద్‌, అరవింద్‌కాలనీ, శంషాబాద్‌
 13. పి.వినయ్‌బాబు (24), న్యూ మారుతీనగర్‌, హైదరాబాద్‌
 14. కిషన్‌ గోడే (55), నేతాజీనగర్‌, రామంతాపూర్‌, హైదరాబాద్‌
 15. కుందన్‌దాస్‌ (45), కుద్బీగూడ, కాచిగూడ, హైదరాబాద్‌
 16. శ్రీలేఖ (18), ఉప్పల్‌, హైదరాబాద్‌
 17. స్రవంతి (18), తండ్రి ఆంజనేయులు, హైదరాబాద్‌
 18. సుశీల (45), ఉప్పల్‌, హైదరాబాద్‌
 19. సాయి స్వరూప్‌ (20), దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌
 20. ఎల్‌.శివకృష్ణ (30), వనస్థలిపురం హైదరాబాద్‌ (స్వస్థలం గుంటూరు జిల్లా)
 21. రమేష్‌ (21), శ్రీచైతన్య కళాశాల ఉద్యోగి, సంతోషనగర్‌, హైదరాబాద్‌
 22. పి.పురందర్‌ సన్నిధి (19), కూకట్‌పల్లి, హైదరాబాద్‌
 23. సుధీర్‌ కుమార్‌ (29), బ్యాంకుకాలనీ, నిజామాబాద్‌
 24. శ్రీధర్‌ (21), తండ్రి నర్సింహా, ఆదర్శనగర్‌, నిజామాబాద్‌
 25. సి.విజ్ఞా (18), దూపాడు, త్రిపురాంతకం మండలం, ప్రకాశం జిల్లా
 26. డాక్టర్‌ కె.వి.ఆనంద్‌ (30), నిమ్స్‌ వైద్యుడు (స్వస్థలం బరంపురం, ఒడిషా)
 27. అహ్మద్‌ మోహినుద్దీన్‌ (43), ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జహీరాబాద్‌
 28. డాక్టర్‌ చైతన్యప్రసాద్‌, ఉస్మానియా వైద్య కళాశాల హౌస్‌ సర్జన్‌ (22), (స్వస్థలం నర్సరావుపేట, గుంటూరు జిల్లా)
 29. సచిన్‌ బవార్‌ (19), మహారాష్ట్ర ఇంజినీరింగ్‌ విద్యార్థి
 30. బి.సుజిత్‌కుమార్‌ జా (19), మహారాష్ట్ర ఇంజినీరింగ్‌ విద్యార్థి
 31. కిరణ్‌చౌదరీ, మహారాష్ట్ర
 32. షేక్‌ ఇర్ఫాన్‌ దౌలా, హకీంపేట (స్వస్థలం అనంతపురం)
 33. కె.రామ్మోహన్‌రావు (23), ఈసీఐఎల్‌ ఉద్యోగి (స్వస్థలం వేమూరు, గుంటూరు జిల్లా)
 34. పురేంద్రనాథ్‌ (19), కేరళ
 35. మిలిందర్‌ మండేకర్‌, మహారాష్ట్ర ఇంజినీరింగ్‌ విద్యార్థి
 36. సౌరబ్‌కుమార్‌ (18), మహారాష్ట్ర ఇంజినీరింగ్‌ విద్యార్థి
 37. ఇర్షాద్‌ అహ్మద్‌ (19), మహారాష్ట్ర ఇంజినీరింగ్‌ విద్యార్థి
 38. రాజేష్‌ బోర్‌, మహారాష్ట్ర ఇంజినీరింగ్‌ విద్యార్థి
 39. వల్లాభాయ్‌ పటేల్‌ (40), రాజ్‌కోట్‌, గుజరాత్‌
 40. ఇబ్రహీంఖాన్‌ (45), రైల్వే ఉద్యోగి, కత్ని, మధ్యప్రదేశ్‌
 41. ఎం.కె.జైన్‌ (44), రైల్వే ఉద్యోగి, కత్ని, మధ్యప్రదేశ్‌
 42. గుర్తుతెలియని వ్యక్తి (తల లేని మొండెం)

ప్రతిస్పందన[మార్చు]

 • వై.ఎస్.రాజశేఖరరెడ్డి: హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలోని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల దుశ్చర్య అని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రకటించాడు. సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకోవడం రాష్ట్ర పోలీసులకు సాధ్యం కాదు, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేదీ లేదు, పాక్‌, బంగ్లాదేశ్‌లలో మన రాష్ట్రానికి నిఘా వ్యవస్థ లేదు; ఈ పేలుళ్లు ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే జరగలేదు, ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా జరుగుతున్నాయి; పేలుళ్ల అనంతరం పోలీసులు బాగా పనిచేశారు; బాంబు పేలుళ్లలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.20 వేల చొప్పున పరిహారం; సంపాదించే వ్యక్తి మరణించిన పక్షంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం; క్షతగాత్రులకు కార్పొరేట్‌ ఆసుపత్రులలో ఉచిత వైద్యం.
 • పేలుళ్లు జరిగిన మరుసటి రోజు కేంద్ర గృహమంత్రి శివరాజ్ పాటిల్ దాడి జరగబోవచ్చని కొంత సమాచారం ఉండినదని, కానీ భారతదేశమంతటి విశాల దేశంలో కచ్చితంగా ఎక్కడ తీవ్రవాదులు దాడి చేయబోతున్నారో ఊహించడం కష్టమని అభిప్రాయపడ్డాడు.[4]
 • ఎల్.కె.అద్వానీ:"ఉగ్రవాదాన్ని మైనారిటీ, మెజారిటీ అనే దృష్టితో చూడకూడదు. మా హయాంలో తీవ్రవాదాన్ని అణచివేసేందుకు పోటా చట్టం తెచ్చాం. యూపీఏ వచ్చీరాగానే దానిని రద్దుచేసి పారేసింది. మనకిక ఎదురులేదనే సందేశాన్ని తీవ్రవాదులకిచ్చింది. పోటాను పునరుద్ధరించాలి. గత మూడేళ్లలో దేశంలో, రాష్ట్రంలో అనేక తీవ్రవాద దుశ్చర్యలు జరిగాయి. వీటికి సంబంధించి ఏ ఒక్కరినైనా పట్టుకున్నారా?"
 • నారా చంద్రబాబునాయుడు: "అమాయకుల ప్రాణాలు పోతే... చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన తీరేనా ఇది? పేలుళ్ల ఘటనలో తన తప్పు లేదని, పోలీసు కమిషనర్‌ తప్పులేదని సమర్థించుకుంటున్నారు. అంటే రోడ్డు మీదకు రావడం జనం తప్పా? ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడలేని ముఖ్యమంత్రికి ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హతలేదు. వైఎస్‌ తక్షణం రాజీనామా చేయాలి
 • జయప్రకాశ్ నారాయణ: "ఈ దుర్ఘటన ప్రభుత్వం, ఇంటెలిజెన్స్‌ వర్గాల వైఫల్యమంటూ నిందించడం తగదు. దాడుల సమాచారం ఇంటెలిజెన్స్‌ వద్ద ఉన్నా తీవ్రవాదులు ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తారో వూహించలేం. పార్టీల బలాబలాలు తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే సంస్కృతికి స్వస్తి పలకాలి. ఆ విభాగం ప్రజా రక్షణ కార్యక్రమాలపైనే దృష్టి నిలపాలి"
 • భారతీయ జనతా పార్టీ: బాంబు పేలుళ్లకు నిరసనగా సోమవారం బంద్‌కు భారతీయ జనతా పార్టీ పిలుపిచ్చింది. దీనికి మద్దతివ్వాలని అన్ని పార్టీలు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అత్యవసర సేవలకు మాత్రం బంద్‌ నుంచి మినహాయింపు ఇస్తామని పేర్కొంది.
 • ఈ సంఘటనను జిహాదీ తీవ్రవాదమని ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఆగష్టు 26న ఆంధ్ర ప్రదేశ్లో బందుకు పిలుపునిచ్చాడు.[5]

నేర విచారణ[మార్చు]

పోలీసులు హైదరాబాదులో మరో 19 బాంబులను కనుగొన్నారు. తొలుత సంఘటనకు బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు బాధ్యులని భావించారు[6] కానీ ఇందులో నక్సలైట్ల పాత్ర ఉన్నట్టు భావిస్తున్నారు. పరిశోధకులు పేలుడు పదార్ధాలు సేకరించారని భావిస్తున్న నాగపూర్ ఫ్యాక్టరీలో దర్యాప్తు జరుపుతున్నారు.[4] రెండు పేలుడు సంఘటనలలో ఉపయోగించిన విస్ఫోటకాలను అమ్మిన నాగపూర్లోని అమీన్ ట్రేడర్స్ యొక్క ఆవరణను పోలీసులు సోదా చేశారు.[7]

మక్కా మసీదులో జరిగిన పేలుళ్ళలో ఆర్.డి.ఎక్స్ను సెల్ఫోను ఉపయోగించి పేల్చారు. ఈ సంఘటనలో మాత్రం రెండవ తరగతి పేలుడు పదార్ధమైన నియోజెల్ 90 (ఇందులో అమ్మోనియం నైట్రేట్ ఉంటుంది) ని ఉపయోగించారు. పేలుడు పదార్ధాలను విస్ఫోటన చేయటానికి టైమర్ సాధనాలను ఉపయోగించారు. పేలకుండా నిస్తేజం చేసిన ఒక బాంబులో క్వార్ట్ గడియారపు టైమరును వాడారని ఫోర్సెన్సిక్ సైన్సు పరిశోధనాశాలకు చెందిన దర్యాప్తు అధికారి రాంమోహన్ తెలియజేశాడు.[7] పేలుడులో ఆర్డిఎక్స్ బదులు నక్సలైట్లు తరచుగా ఉపయోగించే జిలెటిన్ పదార్ధాన్ని వాడటం వలన నక్సల్స్ యొక్క పాత్ర ఉందని భావిస్తున్నారు.

ఈ సంఘటనలో మరో ముఖ్యమైన ఆధారమైన పేలుడులో గుచ్చుకోవటానికి వాడిన లోహపు గోళీలను నల్గొండ జిల్లా బీబీనగర్ నుండి సమకూర్చుకున్నట్టు వెల్లడైంది.[7]

ఇవీ చూడండీ[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

 1. ఎకనామిక్ టైమ్స్ వార్త
 2. 2.0 2.1 2.2 "ఈనాడులో వచ్చిన వార్త". Archived from the original on 2011-09-01. Retrieved 2020-01-13.
 3. ఆంధ్రజ్యోతి వార్త[permanent dead link]
 4. 4.0 4.1 4.2 ఎన్డీటీవీ వార్త
 5. ది హిందూ వార్త
 6. అలర్ట్ నెట్ వార్త
 7. 7.0 7.1 7.2 ఎన్డీటీవీ రెండవ వార్త