కాలువ
కాలువలు, డ్రైనేజీ నిర్వహణకు (ఉదా. వరద నియంత్రణ, నీటిపారుదల ) లేదా జలరవాణా వాహనాల ప్రయాణానికి నిర్మించబడిన నీటి మార్గాలు. అవి ప్రశాంతమైన ఉపరితల ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. వాటిని కృత్రిమ నదులుగా భావించవచ్చు.
చాలా సందర్భాలలో, కాలువలపై తక్కువ ప్రవాహం వేగం ఉండే జలాశయాలను సృష్టించే ఆనకట్టలు, లాకులు ఉంటాయి. ఈ జలాశయాలను స్లాక్ వాటర్ లెవెల్స్ అనీ, కేవలం లెవెల్స్ అనీ అంటారు. ఏదైనా నదికి సమాంతరంగా ప్రవహిస్తూ, ఆ నది నుండి విడుదలైన నీటిని, దాని పారుదల బేసిన్‌లో కొంత భాగాన్నీ వాడుకునే కాలువను నావిగేషన్ కెనాల్ అని పిలుస్తారు. ఆనకట్టలు, లాకుల ద్వారా దాని వనరులను ఉపయోగించుకుని, ఆ నదీ లోయలో ఉంటూనే తగ్గిన నీటి మట్టాలను పెంచుకుని తమ ప్రవాహ నిడివిని పొడిగించుకుంటాయి.
ఎత్తులో ఉన్న నీటి వనరును వాడుకుని కాలువ, లోయ ను విభజించే మిట్టను దాటగలదు. అటువంటి కాలువకు అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ పనామా కాలువ .
అనేక కాలువలను ఎత్తైన ప్రదేశాలలో, లోయల పైన, ఇతర జలమార్గాల పైన నిర్మించారు. ఎత్తున ఉన్న నీటి వనరుల నుండి కాలువలు, నీరు అవసరమైన నగరం వంటి గమ్యస్థానానికి నీటిని అందిస్తాయి. రోమన్ సామ్రాజ్యం లోని ఆక్విడక్టులు అటువంటి నీటి సరఫరా కాలువలే.
కృత్రిమ జలమార్గాలలో ఉపయోగించే నిర్మాణాలు
[మార్చు]కాలువలపై ఇంజనీరింగ్ నిర్మాణాల ద్వారా నావిగేషన్‌ను మెరుగుపరచవచ్చు. అటువంటి నిర్మాణాలు:
- నది నీటి మట్టాలను ఉపయోగించదగిన ఎత్తుకు పెంచడానికి బ్యారేజీలు, ఆనకట్టలు ;
- వేగంగా పారే వాగులు, జలపాతాల చుట్టూ పొడవైన, సున్నితమైన ఛానెల్‌ని సృష్టించే లూపింగ్ అవరోహణలు;
- ఓడలు, బార్జ్‌లు ఎక్కడానికి/దిగడానికి వీలు కలిగించే లాకులు.
అవి డ్రైనేజీ లోయల మధ్య ఉండే మిట్టలను దాటుకుని పోతాయి కాబట్టి, కాలువలను నిర్మించడం చాలా కష్టం. ఇతర వాగులు, రోడ్ల వంటి వాటిని దాటేందుకు వయాడక్ట్‌లు, అక్విడక్ట్‌లు వంటి నిర్మాణాలను చేపట్టవలసి ఉంటుంది.
కాలువల్లో రకాలు
[మార్చు]స్థూలంగా రెండు రకాల కాలువలు ఉన్నాయి:
- జలమార్గాలు : వస్తువులు, ప్రజలను రవాణా చేసే ఓడల ప్రయాణానికి ఉపయోగించే కాలువలు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు:
- ఇప్పటికే ఉన్న సరస్సులు, నదులు, ఇతర కాలువలు లేదా సముద్రాలు, మహాసముద్రాలను అనుసంధానించేవి.
- సిటీ నెట్‌వర్క్‌లో కనెక్ట్ చేయబడినవి: కెనాల్ గ్రాండే, వెనిస్లోని కాలువల వంటివి; ఆమ్‌స్టర్‌డ్యామ్ లేదా ఉట్రెచ్ట్ లోని గ్రాచ్టెన్, బ్యాంకాక్ లోని జలమార్గాలు.
- అక్విడక్ట్స్ : నీటి సరఫరా కాలువలు త్రాగునీరు, మునిసిపల్ ఉపయోగాలు, జలవిద్యుత్ కాలువలు, వ్యవసాయ నీటిపారుదల కాలువలు
ప్రాముఖ్యత
[మార్చు]చారిత్రికంగా కాలువలకు వాణిజ్యం, నాగరికత అభివృద్ధిలో అపారమైన ప్రాముఖ్యత ఉంది. 1855లో లెహి కెనాల్ 12 లక్షల టన్నుల అంత్రాసైట్ బొగ్గును తీసుకువెళ్లింది; ఒక శతాబ్దానికి పైగా దీనిని నిర్మించి, నిర్వహించిన సంస్థ 1930ల నాటికి మూతపడింది. ఒకప్పుడు ఆర్థిక వృద్ధికి ఆజ్యం పోసిన అనేక కాలువల్లో ఇప్పటికీ పనిచేస్తున్నవి చాలా కొన్ని మాత్రమే. వాస్తవానికి మరింత పట్టణీకరణ, పారిశ్రామికీకరణకు ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. నీటి రవాణా లేకపోయి ఉంటే బొగ్గు, ఖనిజాల వంటి భారీ ముడి పదార్ధాల తరలింపు కష్టమూ, ఖర్చుతో కూడుకునీ ఉండేది. ఇటువంటి ముడి పదార్థాలు 17వ-20వ శతాబ్దంలో పెరుగుతున్న యాంత్రికీకరణ ఫలితంగా పారిశ్రామిక అభివృద్ధికి, కొత్త లోహశాస్త్రానికి ఆజ్యం పోసి, కొత్త పరిశోధన విభాగాలు, కొత్త పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలకు దారితీశాయి.
మనుగడలో ఉన్న కాలువలు
[మార్చు]నేడు చాలా కాలువలు ప్రధానంగా భారీ సరుకు రవాణాకు, పెద్ద ఓడ రవాణా పరిశ్రమలకూ సేవలు అందిస్తున్నాయి. అయితే ఒకప్పుడు చిన్నపాటి అంతర్గత జలమార్గాలు పడవలు, నావలకు అనువుగా రూపొందించబడ్డాయి. వీటిలో చాలా వరకు పూడ్చేసారు, వాటిమానాన వాటిని వదిలేసారు, లేదా వరద నియంత్రణకో పర్యాటక బోటింగ్ కోసమో ఆనకట్టలు లాకులను నిర్వహించే సిబ్బంది నియంత్రణలో ఉంచారు. క్రమేణా వాటి స్థానాన్ని రైల్వేలు ఆక్రమించాయి.
1880ల ప్రారంభానికి, రైలు రవాణాతో ఆర్థికంగా పోటీపడే సామర్థ్యం లేని కాలువలు మరుగున పడ్డాయి. తరువాతి రెండు దశాబ్దాలలో, ఉష్ణం కోసం చమురు వాడకం పెరిగి, బొగ్గు వాడుక బాగా తగ్గిపోయింది. బొగ్గు రవాణా తగ్గింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, మోటారు-ట్రక్కులు విస్తరించినపుడు, అమెరికాలో కాలువలు అనేక రైల్వేలతో పాటు సరకు రవాణా సాధనంగా ఉపయోగత తగ్గింది.
ప్రస్తుతం ఉన్న అతి పొడవైన కాలువ, ఉత్తర చైనాలోని గ్రాండ్ కెనాల్. ఇది ఇప్పటికీ భారీగా ఉపయోగంలో ఉంది. ముఖ్యంగా పసుపు నదికి దక్షిణంగా ఉన్న భాగంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది బీజింగ్ నుండి హాంగ్‌జౌ వరకు 1,794 కిలోమీటర్లు (1,115 మైళ్ళు) పొడవున ప్రవహిస్తోంది.
నిర్మాణం
[మార్చు]అందుబాటులో ఉన్న జలరాశి, అందుబాటులో ఉన్న మార్గాన్ని బట్టి కాలువలను మూడు రకాలుగా నిర్మించవచ్చు:
- మానవ నిర్మిత ప్రవాహాలు
- ప్రస్తుతం అసలు ప్రవాహమే లేని చోట కాలువను సృష్టించవచ్చు. కాలువను త్రవ్వవచ్చు లేదా ఇరువైపుల కట్టలను పోసి నిర్మించవచ్చు. అడ్డుకోతలో కనిపించే కాలువ పూర్తి ఆకృతిని కాలువ ప్రిజం అంటారు. [1] కాలువకు నీటిని వాగులు లేదా జలాశయాల వంటి వాటిని నుండి అందుతుంది. కొత్త జలమార్గం ఎత్తుకు ప్రవహించాల్సిన చోట్ల పడవలను పైకి లేపడానికి, దించడానికి, లాకులు, లిఫ్టులు లేదా ఎలివేటర్లు నిర్మించాలి. పల్లపు ప్రాంతాలను ఎత్తైన ప్రాంతాలకు కలిపే కెనాల్ డు మిడి, కెనాల్ డి బ్రియార్, పనామా కెనాల్ వంటి కాలువలు ఇందుకు ఉదాహరణలు.
- ఇప్పటికే ఉన్న సరస్సు దిగువన ఒక ఛానెలు తవ్వి, కాలువను నిర్మించవచ్చు. ఛానల్ పూర్తి అయినప్పుడు, సరస్సు ఖాళీ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న పల్లపు ప్రాంతాల్లోని నీరు అందులోకి ప్రవహిస్తుంది. ఇప్పటికే ఉన్న సరస్సులో రెండు కట్టలను పోసి వాటి మధ్య కొత్త కాలువను ఏర్పాటు చేసి, ఆపై సరస్సు లోని మిగిలిన భాగాలను ఖాళీ చేయవచ్చు. ఉత్తర సముద్ర కాలువ లోని తూర్పు, మధ్య భాగాలను ఈ విధంగానే నిర్మించారు.
- కెనాలైజేషన్, నావిగేషన్‌లు
- వాగు లాంటి సహజ ప్రవాహపు మార్గాన్ని తగు విధంగా మార్చుకుని కాలువగా మార్చవచ్చు. కాలువ ప్రవాహాన్ని డ్రెడ్జింగ్ చేయడం, ఆనకట్ట కట్టడం, దాని మార్గాన్ని సవరించడం ద్వారా వాగు ప్రవాహాన్ని నియంత్రించి, ట్రాఫిక్‌ను మరింత సురక్షితంగా తీసుకువెళ్లేలా మార్పు చేయవచ్చు. నదిని ప్రయాణానుకూలంగా మార్చే లాకులు, స్పిల్‌వేలను నిర్మించడం ఇలాంటిదే.
- పార్శ్వ కాలువలు
- కానలైజేషను చాలా కష్టంగా ఉన్నప్పుడు, వాగు ప్రక్కన లేదా కనీసం దానికి వీలైనంత సమీపంలో మరో వాగును తవ్వుతారు. దీనిని పార్శ్వ కాలువ అని పిలుస్తారు. వాలు లేదా పిచ్‌ని తగ్గించడానికి పొడవును పొడిగించేందుకు గాను మూలం నుండి కొంత దూరం పాటు పెద్ద గుర్రపునాడా ఆకారంలో మెలికలు తిప్పుతారు. ప్రస్తుతం ఉన్న వాగు నీటి వనరుగా పనిచేస్తుంది. దాని ఒడ్డు చుట్టూ ఉన్న నేల కొత్త కాలువకు మార్గాన్ని అందిస్తుంది.
చిన్న రవాణా కాలువలు నావలకు, సన్నపాటిపడవ లకూ ప్రయాణా సౌక్ర్యాన్ని కలిగిస్తాయి. అయితే, ఓడలకు అనువైన కాలువలు సముద్రంలో ప్రయాణించే ఓడలను లోతట్టు నౌకాశ్రయానికి (ఉదా, మాంచెస్టర్ షిప్ కెనాల్ ) లేదా ఒక సముద్రం నుండి మరొకదానికి (ఉదా, కలెడోనియన్ కెనాల్, పనామా కెనాల్ ) ప్రయాణించే వీలు కలిగిస్తాయి.
లక్షణాలు
[మార్చు]సరళంగా చెప్పాలంటే కాలువ అనేది నీటితో నిండిన కందకం. కాలువ ప్రవహించే మార్గపు నేలలను బట్టి, మట్టి లేదా కాంక్రీటు వంటి వాటితో కాలువకు లైనింగు చేయడం అవసరం కావచ్చు. బంకమట్టితో చేసే లైనింగును పుడ్లింగ్ అంటారు.
కాలువలు సమతలంపై ప్రవహించాలి. భూమి ఎత్తుపల్లాల్లో ఉండే చిన్నపాటి అవకరాలను కోతలు, కట్టల ద్వారా అధిగమించవచ్చు. పెద్ద తేడాలు ఉన్నపుడు ఇతర విధానాలను అవలంబిస్తారు. వాటిలో అత్యంత సాధారణమైనది లాకు. కాలువను ఒక గది గుండా ప్రవహింపజేస్తారు. ఈ గదిలో నీటి స్థాయిని పెంచడం, తగ్గించడం చెయ్యవచ్చు. ఈ లాకు, ఒక ఎత్తులో ఉన్న కాలువను వేరే ఎత్తులో ఉన్న కాలువను గాని, నదిని గానీ, సముద్రంతో గానీ కలుపుతుంది. బాగా ఎత్తుండే ప్రదేశంతో కలపవలసి వచ్చినపుడు, వరుసగా ఒకదాని వెంట ఒకటిగా అనేక లాకులను నిర్మిస్తారు.
సా.శ. 984లో చైనాలోను, ఆ తరువాత 15వ శతాబ్దంలో ఐరోపాలోనూ పౌండ్ లాకును అభివృద్ధి చెయ్యడానికి ముందు, [2] ఒకే గేటుతో కూడిన ఫ్లాష్ లాక్‌లు ఉపయోగించేవారు. స్థాయిని మార్చడానికి కొన్నిసార్లు రోలర్‌లతో కూడిన ర్యాంప్‌లను ఉపయోగించారు. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న చోట మాత్రమే ఫ్లాష్ లాకులు ఆచరణాత్మకంగా ఉన్నాయి.
లాకులు చాలా నీటిని ఉపయోగిస్తాయి కాబట్టి, నీరు తక్కువగా అందుబాటులో ఉన్న చోట్ల బిల్డర్లు ఇతర విధానాలను అవలంబించారు. వీటిలో బోట్ లిఫ్ట్‌లు ఉన్నాయి, ఉదాహరణకు ఫాల్కిర్క్ చక్రం. ఇవి నీటి కైసన్‌ను ఉపయోగిస్తాయి, ఇందులో పడవలు రెండు స్థాయిల మధ్య కదులుతాయి; వాలుగా ఉన్న తలాలపై కైసన్‌ను నిటారుగా ఉన్న పట్టాల మీద నుండి లాగుతారు.
వాగులనో, రోడ్డులనో, లేదా లోయలనో దాటడానికి ప్రయాణాలకు వీలయ్యేలా అక్విడెక్ట్‌ను కాలువపై నిర్మించచవచ్చు. ఇరువైపులా లాకులు నిర్మించవచ్చు గానీ, దాని వలన ప్రయాణానికి ఆలస్యం అవుతుంది. వేల్స్‌లో డీ నది లోయకు అడ్డంగా నిర్మించిన పాంట్‌సైల్ట్ అక్విడక్ట్ దీనికి ఒక ఉదాహరణ. ఇది ఇప్పుడు ప్రపంచ వారసత్వ ప్రదేశం.
కొండలను దాటి వెళ్ళేందుకు ఒక పద్ధతి, వాటి గుండా సొరంగం తవ్వడం. ఈ విధానానికి ఉదాహరణ ట్రెంట్, మెర్సీ కెనాల్‌పై ఉన్న హరేకాజిల్ టన్నెల్. ఈ సొరంగాలు చిన్నపాటి కాలువలకు మాత్రమే అనువైనవి.
కొన్ని కాలువల నిర్మాణంలో స్థాయిలో హెచ్చుతగ్గులను కనిష్ట స్థాయికి ఉంచేందుకు ప్రయత్నించారు. కాంటూర్ కాలువలు అని పిలిచే ఈ కాలువలు ఎక్కువ దూరం, చుట్టు తిరుగుడు మార్గంలో ప్రవహిస్తాయి. వీటి వెంట భూమి ఒకే ఎత్తులో ఉంటుంది. ఇతర కాలువలు స్థాయి హెచ్చుతగ్గులను ఎదుర్కోవటానికి వివిధ పద్ధతులను ఉపయోగించి, మరింత సూటి మార్గాల గుండా ప్రవహిస్తాయి.
కాలువల్లో నీటి అందుబాటు ఉండకపోయే సమస్యను పరిష్కరించడానికి కాలువలకు వివిధ లక్షణాలు ఉంటాయి. సూయజ్ కెనాల్ వంటి వాటికి కాలువ నేరుగా సముద్రానికే కలిసి ఉంటుంది కాబట్టి నీతు లభ్యతకు సమస్య లేదు. కాలువ సముద్ర మట్టానికి లేని చోట్ల వివిధ పద్ధతులను అవలంబించారు. ఇప్పటికే ఉన్న నదులు లేదా నీటి బుగ్గల నుండి నీటిని తీసుకోవడం అనేది ఒక పద్ధతి. కొన్నిసార్లు ప్రవాహంలో కాలానుగుణ వైవిధ్యాలను ఎదుర్కోవటానికి ఇతర పద్ధతులను వాడారు. అటువంటి వనరులు అందుబాటులో లేని చోట, కాలువ నుండి వేరుగా గాని, కాలువ మార్గంలోనే గానీ జలాశయాలను నిర్మించారు. బ్యాక్ పంపింగ్ వంటి పద్ధతుల ద్వారా కాలువకు అవసరమైన నీటిని అందిస్తారు. ఇతర సందర్భాల్లో, గనుల నుండి బయటికి పంపు చేసిన నీటిని కాలువ లోకి పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో, కాలువ నుండి దూరంగా ఉన్న వనరుల నుండి నీటిని తీసుకురావడానికి "ఫీడర్ కాలువలను" నిర్మించారు.
పెద్ద యెత్తున వస్తువులను లోడింగు, అన్‌లోడింగు చేసే చోట్ల, ఉదాహరణకు కాలువ చివరిలో, కాలువ బేసిన్‌ను నిర్మిస్తారు. మామూలుగా ఇది కాలువ కంటే వెడల్పుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, సరుకుల చేరివేతలో సహాయపడేందుకు ఇక్కడ వార్ఫ్‌లు, క్రేన్‌లూ వాడతారు.
కాలువ లోని కొంత భాగాన్ని మూసివేయవలసి వచ్చినప్పుడు, నిర్వహణ స్టాప్ ప్లాంక్‌లను వాడతారు. ఇవి, కాలువకు అడ్డంగా చెక్క పలకలను పేర్చి నిర్మించే ఆనకట్టల వంటివి. సాధారణంగా కాలువ ఒడ్డున ముందుగానే అమర్చి ఉంచిన పొడవైన కమ్మీలలో ఈ చెక్కలను దూర్చుతారు. మరింత ఆధునిక కాలువలపై, కాలువను త్వరగా మూసేసేందుకు "కాపలా లాకులు" లేదా గేట్లు పెడతారు. నిర్వహణ కోసం గాని కాలువకు గండి పడినపుడు గానీ వాడేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి
-
ఇంగ్లాండు లోని అవన్ కాలువపై నిర్మించిన 16 వరస లాకులు
-
వేల్స్‌లో, యుకె లో కెల్లా పొడవైన, ఎత్తైన అక్విడక్టుపై ప్రయాణిస్తున్న పడవ
-
కోరింత్ కాలువ విహంగ వీక్షణం
-
అమెరికా, ఓహియో లోని మియామీ అండ్ ఈరీ కాలువ
పురాతన కాలువలు
[మార్చు]సా.పూ. 4000 లో మెసొపొటేమియాలో (ఇప్పుడు ఇరాక్) నిర్మించిన నీటిపారుదల కాలువలు అత్యంత పురాతనమైన కాలువలు. ప్రాచీన భారతదేశంలోని సింధు లోయ నాగరికత (సా.పూ. 3000 ) కాలంలో గిర్నార్ వద్ద నిర్మించిన రిజర్వాయర్‌లతో సహా అధునాతన నీటిపారుదల, నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేసారు. [3] పురాతన ప్రపంచంలో ఇటువంటి ప్రణాళికాబద్ధమైన పౌర ప్రాజెక్టు జరగడం ఇదే మొదటిసారి. ఈజిప్టులో, కాలువలు కనీసం పెపి I మెరీర్ (2332-2283 BC) కాలం నాటివి. అతను అస్వాన్ సమీపంలోని నైలు నదిపై కాటరాక్టును దాటడానికి ఒక కాలువను నిర్మించాలని ఆదేశించాడు. [4]
నీటి మీద నగరాలు
[మార్చు]వెనిస్ నగరం కాలువలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అనేక కాలువ నగరాలను "వెనిస్ ఆఫ్..." అని పిలవడం కద్దు. ఈ నగరాన్ని చిత్తడి ద్వీపాలపై నిర్మించారు. భవనాలకు దన్నుగా చెక్క పైల్‌లను అమర్చారు. అంటే ఇక్కడ మనిషి నిర్మించినది భూమి, కాలువలను కాదు. ఈ ద్వీపాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది; 12వ శతాబ్దం నాటికి, వెనిస్ ఒక శక్తివంతమైన నగర రాజ్యంగా ఉండేది.
ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో కూడా ఇదే విధంగా చెక్క పైల్స్‌పై భవనాలు నిర్మించారు. 1300లో ఇది నగరంగా మారింది. అనేక ఆమ్‌స్టర్‌డ్యామ్ కాలువలను కోటల నిర్మాణంలో భాగంగా నిర్మించారు. నగరాన్ని విస్తరింపజేసి, నీటి పక్కనే ఇళ్లు నిర్మించబడినప్పుడు అవి నగరాంతర్గత కాలువలుగా మారాయి. అమ్‌స్టర్‌డామ్‌ను, జర్మనీకి చెందిన హాంబర్గ్, రష్యాకు చెందిన సెయింట్ పీటర్స్‌బర్గ్, బెల్జియంకు చెందిన బ్రూగెస్‌లను "వెనిస్ ఆఫ్ ది నార్త్" అని పిలుస్తారు.
13వ శతాబ్దంలో మార్కో పోలో తన ప్రయాణాల సమయంలో సుజౌను "వెనిస్ ఆఫ్ ది ఈస్ట్" అని పిలిచాడు. ఆధునిక కాలంలో కాలువ పక్కనే ఉన్న పింగ్జియాంగ్ రోడ్, శాంతాంగ్ స్ట్రీట్ లు ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా మారాయి. నాన్జింగ్, షాంఘై, వుక్సీ, జియాక్సింగ్, హుజౌ, నాన్‌టాంగ్, తైజౌ, యాంగ్‌జౌ, చాంగ్‌జౌ వంటి ఇతర సమీప నగరాలు యాంగ్జీ నది, తాయ్ సరస్సు దిగువ ముఖద్వారం వెంబడి ఉన్నాయి.
విస్తారంగా కాలువలు ఉన్న ఇతర నగరాలు: అల్క్‌మార్, అమెర్స్‌ఫోర్ట్, బోల్స్‌వార్డ్, బ్రియెల్, డెల్ఫ్ట్, డెన్ బాష్, డోక్కుమ్, డోర్డ్‌రెచ్ట్, ఎంఖుయిజెన్, ఫ్రాంకెర్, గౌడ, హార్లెమ్, హార్లింగెన్, లీయువార్డెన్, లైడెన్ ఉట్రెచ్‌నే ఉట్రేలాండ్ ; బెల్జియంలోని ఫ్లాన్డర్స్‌లో బ్రగ్, జెంట్ ; ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ ; రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ; పోలాండ్‌లోని బైడ్‌గోస్జ్, గ్డాన్స్క్, స్జ్జెసిన్, వ్రోక్లా ; పోర్చుగల్‌లో ఏవీరో ; జర్మనీలో హాంబర్గ్, బెర్లిన్ ; యునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్, కేప్ కోరల్, చైనాలోని వెన్‌జౌ, వియత్నాంలో కాన్ థౌ, థాయిలాండ్‌లోని బ్యాంకాక్, పాకిస్తాన్‌లోని లాహోర్ .
పడవలు
[మార్చు]లోతట్టు కాలువల్లో వాటి కోసమే ప్రత్యేకంగా నిర్మించబడిన పడవలు ఉంటాయి. దీనికి ఉదాహరణ బ్రిటిష్ నారో బోట్. ఇది 72 అడుగులు (21.95 మీ.) పొడవు, 7 అడుగులు (2.13 మీ.) వెడల్పు ఉంటుంది. ప్రధానంగా బ్రిటిష్ మిడ్‌ల్యాండ్ కాలువల కోసం దీన్ని నిర్మించారు. ఈ సందర్భంలో పడవల పరిమాణాన్ని పరిమితం చేసే అంశం లాకుల పరిమాణం. పనామా కాలువపై ప్రయాణించే నౌకల పరిమాణాన్ని పరిమితించే పనామాక్స్ ప్రకారం నౌకలు 289.56 మీ. (950 అ.) పొడవు, 32.31 మీ. (106 అ.) వెడల్పు లోపు ఉండాలి. 2016 జూన్ 26 వరకు ఈ పరిమితి అమల్లో ఉంది. కొత్తగా నిర్మించిన పెద్ద లాకులను తెరవడంతో అప్పటి నుండి పెద్ద నౌకలను అనుమతించారు. లాకులు లేణి సూయజ్ కాలువలో, సూయజ్‌మాక్స్ ఓడల డ్రాఫ్టు, 16 మీ. (52.5 అ.) లోపు ఉండాలి.
భారతదేశంలో కాలువలు
[మార్చు]- బకింగ్‌హాం కాలువ: ఆంధ్రప్రదేశ్, పెదగంజాం నుండి చెన్నై వరకు ప్రవహించే సముద్రపు నీటి కాలువ. ఒకప్పుడు రవాణా కోసం వాడిన ఈ కాలువ ప్రస్తుతం ఉపయోగంలో లేదు. కొన్ని చోట్ల కాలువ పూడిపోయింది. ఆక్రమణలకు గురైంది.
- రైవస్ కాలువ: విజయవాడ నుండి బయలుదేరే సాగునీటి కాలువ
- కొమ్మమూరు కాలువ: ఆంధ్రప్రదేశ్ లోని సాగునీటి కాలువ. ఒకప్పుడు రవాణా కోసం విస్తృతంగా ఉపయోగించారు. దుగ్గిరాల నుండి పెద గంజాం వరకు ప్రవహించి బకింగ్‌హాం కాలువను కలుస్తుంది.
- ఇందిరాగాంధీ కాలువ: రాజస్థాన్‌లో ప్రవహించే సాగునీటి, తాగునీటి కాలువ. భారతదేశంలో కెల్లా పొడవైనది.
- కర్నూలు కడప కాలువ: ఆంధ్రప్రదేశ్ లోని సాగునీటి కాలువ
- నక్కల కాలువ: మురుగునీటి డ్రైనేజీ కాలువ
మూలాలు
[మార్చు]- ↑ Thompson, Kristi. "Glossary". www.usbr.gov (in ఇంగ్లీష్). US Bureau of Reclamation. Retrieved 15 September 2017.
- ↑ Hadfield 1986
- ↑ Rodda 2004
- ↑ Hadfield 1986