Jump to content

పత్తి

వికీపీడియా నుండి
(ప్రత్తి నుండి దారిమార్పు చెందింది)

పత్తి
గోస్పియమ్ బార్బడెన్సె
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
గాసిపియమ్

జాతులు

పాఠ్యం చూడు

కోతకు తయారుగా వున్న పత్తి.
నాగార్జున సాగర్ వద్ద పొలములో పత్తిని సేకరిస్తున్న దృశ్యము
పత్తి పంటలో కలుపు తీసున్న రైతు

ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా 'పత్తి' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది అమెరికా, ఆఫ్రికా, భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క. ఇది ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది.

చరిత్ర

[మార్చు]

ప్రత్తి మొదటగా 7 వేల సంవత్సరాల క్రితం (క్రీ.పూ.5, 4 వ శతాబ్దాలలో) సాగు చేయబడింది. అలా సాగు చేసిన వారు భారత ఉపఖండములో నైరుతి భాగాన, అంటే ఇప్పటి పాకిస్థాన్ లోని తూర్పు భాగాలు, భారతదేశంలోని నైరుతి భాగాలలో విలసిల్లిన సింధూ నాగరికతకు చెందిన వాళ్ళు. అప్పట్లోనే వాళ్ళు ప్రత్తిని గుడ్డలుగా నేయటంలో అద్భుతమైన ప్రతిభగల వాళ్ళు. ఆ విధానాలు భారతదేశం పారిశ్రామీకరించటానికి ముందుదాకా కూడా వాడేవాళ్ళు. వాళ్ళ దగ్గరనుండే ఆ విజ్ఞానం క్రీస్తుపూర్వమే మధ్యధరా నాగరికతకు, ఇంకా ముందుకు వెళ్ళింది.

అరబ్బులకిగాని, గ్రీకులకిగాని ప్రత్తి అంటే ఏమిటో అలెగ్జాండరు భారతదేశం మీద దండెత్తేదాకా కూడా తెలియదు. అలెగ్జాండరు సమకాలీనుడైన మెగస్తనీసు, సెల్యూకస్కు భారతదేశంలో చెట్లపై ఉన్ని పెరుగుతుంది అని చెప్పినట్లు తన ఇండికా గ్రంథంలో వ్రాసుకున్నాడు.

బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా 6వ ప్రకరణ ప్రకారం, "ప్రత్తిని చరిత్ర ముందుకాలం నుండి భారతదేశంలో వడికే వారు, నేసేవారు, రంగులు అద్దేవారు. ప్రత్తి చైనా, ఈజిప్టు, భారత దేశాలలోని ప్రజలకు దుస్తులు అందించింది. క్రీస్తుపూర్వానికి కొన్ని వందల ఏళ్ళ ముందే భారతీయులకి ప్రత్తి నుంచి దుస్తులు నేయటంలో అసమానమైన ప్రతిభ ఉండేది. అది వారి నుంచి మధ్యధరా నాగరికతకు వెళ్ళింది. 1వ శతాబ్దంలో అరబ్బు వ్యాపారులు నాణ్యమైన మస్లిన్, కాలికొ వస్త్రాలని స్పెయిన్ తీసుకు వెళ్ళారు. 9వ శతాబ్దంలో మూర్లు అనబడే అరబ్బు నీగ్రోలు ప్రత్తి సాగు స్పెయిన్ దేశస్థులకి నేర్పారు. ఫస్తియన్ అనే మందపాటి గుడ్డని నేయటం 14వ శతాబ్దంలో ఇటలీ వారికి తెలిసింది. నారతో కలిసిన అట్లాంటి గుడ్డని వెనిస్, మిలాన్ నగరాలలో నేసేవారు.

15వ శతాబ్దం పూర్వం అతి కొద్ది నూలు గుడ్డ మాత్రం ఇంగ్లాండు వెళ్ళేది. అదికూడా కొవ్వొత్తుల వత్తిగా వాడటం కోసం తెప్పించుకునేవారు. కానీ 17వ శతాబ్దానికి ఈస్టిండియా కంపెనీ భారతదేశం నుంచి అరుదైన నూలు వస్త్రాల్ని ఇంగ్లాండు తేవటం మొదలుపెట్టింది. అమెరికా ఆదివాసులుకి ప్రత్తి వడికి వాటితో దుస్తులు నేయటం, అద్దకం పని చేయటంలో ఎంతో నైపుణ్యం ఉండేది. పెరూ దేశంలోని సమాధులలో దొరికిన నూలు వస్త్రాలు 'ఇంకా నాగరికత'కన్నా ముందువని తేలింది. అక్కడ దొరికిన పెరూ, మెక్సికో వస్త్రాలు రంగులలోగానీ, పనితనంలోగానీ, ఈజిప్టు సమాధులలో దొరికిన వస్త్రాలలాగా ఉన్నాయి".

పౌష్ఠికాహార సర్వస్వం ప్రకారం అమెరికా ఖండంలో మెక్సికోలో 8000 సంవత్సరాలకు పూర్వమే ప్రత్తి సాగుచేయబడింది. వాళ్ళు సాగుచేసిన ప్రత్తి రకం పేరు గాస్సిపియమ్ హిర్సూటం. ఈ రకాన్నే ప్రస్తుతం ప్రపంచమంతా సాగు చేస్తోంది. దాదాపు 90 శాతం సాగులోఉన్న ప్రత్తి ఈ రకమే. కానీ అడవి ప్రత్తి రకాలు చూడాలంటే ఎక్కువ రకాలు మెక్సికోలో, తరువాత ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో చూడవచ్చు. ఇరాన్ లోని ప్రత్తి చరిత్ర చూడాలంటే, క్రీ.పూ.5వ శతాబ్దం అఖాయమెనిద్ శకానికి వెళ్ళాలి. అయినా ప్రత్తి సాగు గురించి గట్టి ఆధారాలు లేవు. ఇరాన్ లోని మెర్వ్, రే, పార్స్ ప్రాంతాల్లో ప్రత్తి పండించేవారని తెలుస్తోంది. పర్షియా కవుల గ్రంథాలలో ప్రత్తిని గురించి ఎన్నో ద్రుష్టాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు ఫిరదౌసి షానామా. 13వ శతాబ్దానికి చెందిన మార్కోపోలో అనే స్పెయిన్ యాత్రికుడు పర్షియా యొక్క గొప్ప ఉత్పత్తుల గురించి వ్రాసుకున్నాడు. వాటిల్లో ప్రత్తిని గురించి కూడా ఉంది. 17వ శతాబ్దంలో పర్షియాని సందర్శించిన జాన్ ఖార్డిన్ అనే ఫ్రెంచి యాత్రికుడు కూడా పర్షియా లోని విస్తారమైన ప్రత్తి పండించే క్షేత్రాల గురించి వ్రాసుకున్నాడు.

ప్రత్తి

పెరూ దేశంలో కోస్తా నాగరికతలైన నార్టే చికో, మోచె, నాజ్క వంటివి అభివృద్ధి చెందటానికి, ప్రత్తి సాగు వెన్నెముక లాగా నిలిచింది. వారు దేశీయమైన గాసిపియమ్ బార్బడెన్సే అనే ప్రత్తి రకాన్ని సాగు చేసేవారు. ప్రత్తిని నది మొదటి భాగంలో పండించి, వలలు అల్లి, ఆ వలల్ని, తీరప్రాంతం వెంబడి గల మత్శ్యకార పల్లెలతో వారికి కావలసిన చేపల కోసం మార్పిడి చేసుకునేవారు. 15వ శతాబ్దం మొదట్లో మెక్సికో వచ్చిన స్పెయిన్ దేశస్థులు, అక్కడి ప్రజలు ప్రత్తి పండించడం, వాటితో నేసిన నూలు దుస్తులు ధరించటం కనుగొన్నారు.

టార్టారీ యొక్క గొర్రె మొక్క

మధ్యయుగాల్లో ఉత్తర యూరోపులో పత్తిని ఒక దిగుమతి చేసుకున్న మొక్కల పీచు లాగా చూశారేకానీ అది ఏమిటి, ఎట్లా వచ్చింది, అనే విషయాల గురించి కనీస జ్ఞానం కూడాలేదు.పైగా నూలు చెట్లకి పెరిగే గొర్రెల బొచ్చు అనే మూఢ నమ్మకం ఉండేది. 1350వ సంవత్సరంలో జాన్ మాండవిల్లే అనే రచయిత ఈ విధంగా వ్రాసుకున్నాడు. భారతదేశంలోఒక అద్భుతమైన చెట్టు ఉంటుందని, దానికి కొమ్మల చివర చిన్న గొర్రె పిల్లలు కాస్తాయని, ఆ గొర్రె పిల్లలకి ఆకలి వేస్తే ఆ కొమ్మలు బాగా కిందకి వంగి గొర్రె పిల్లలు గడ్డి తినడానికి వీలు కల్పిస్తాయని అనుకునేవారు. ఈ విషయం ఎంత నిజమంటే, యూరోపు దేశాల్లో ప్రత్తిని పిలిచే పేర్లలో చూడచ్చు. జెర్మను భాషలో ప్రత్తిని బౌమ్ వూల్ అంటారు. అంటే, చెట్లకి కాసే బొచ్చు అని అర్ధం. 16వ శతాబ్దం చివరకి కానీ ఆసియా, అమెరికాలలోని ఉష్ణ మండలాల్లో ప్రత్తి విస్తారంగా పండించడం మొదలు కాలేదు.

భారతీయ ప్రత్తి పరిశ్రమ ఆంగ్లేయుల కంపనీ పరిపాలన మొదలైన తరువాత అంటే 18 వ శతాబ్దము చివర, 19వ శతాబ్దం మొదట్లో, క్రమంగా తగ్గుముఖం పట్టణారంభించింది. ఇది పూర్తిగా బ్రిటీషు ఈస్టిండియా కంపనీ పరిపాలనలో వారు అవలంబించిన వలసవాద వ్యాపార ధోరణి వల్లనే.భారతీయ మార్కెట్లను ముడి ప్రత్తి మాత్రమే సరఫరా చెయ్యాలని, తయారైన నూలు దుస్తులు బ్రిటీషు వారివే కొనాలనీ బలవంతం చెయ్యటంవల్లనే.

బ్రిటన్ లోవచ్చిన పారిశ్రామిక విప్లవము నూలు తయారీకి గొప్ప ఊపునిచ్చింది. ఎంతలా అంటే నూలు అంటే తెలియని బ్రిటన్ ఎగుమతులలో నూలు మొదటి స్థానాన్ని ఆక్రమంచింది. 1738లోఇంగ్లాండు లోని బర్మింగ్ హామ్ కు చెందిన, లూయిస్ పాల్, జాన్ వ్యాత్ లు రోలర్ స్పిన్నింగు మిషనుకు, దారాన్ని ఒకే లావుతో వడకడానికి ఉపయోగపడే ఫ్లైయర్ ‍‍, బాబిన్ పద్ధతికి గుత్త హక్కులు పొందారు. ఇవే కాక 1764లో కనుగొన్న స్పిన్నింగ్ జెన్ని, 1769లొ రిఛర్ద్ ఆర్క్ రైట్ కనుగొన్న స్పిన్నింగ్ ఫ్రేము, బ్రిటీషు నేతగాళ్ళు నూలు, దుస్తులు తక్కువ సమయంలో కావల్సినంత తయారు చేసుకునేలా ఉపయొగపడ్డాయి. 18వ శతాబ్దం చివరలో నూలు పరిశ్రమ కేంద్రీక్రుతమవ్వడం వల్లా, ప్రపంచ నూలు పరిశ్రమకి కేంద్రబిందువు కావడం వల్లా బ్రిటన్ లోని మాంఛెస్టర్ నగరాన్ని, కాటనోపోలిస్ అని పిలవటం మొదలుపెట్టారు. 1793లో ఎలి విట్ని అనే అమెరికా దేశస్థుడు, కనిపెట్టిన కాటన్ జిన్ వల్ల నూలు ఉత్పత్తి ఇంకా పెరిగింది. ప్రపంచ మార్కెట్లపై గల గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం వల్లా బ్రిటీషు వర్తకులు అభివృద్ధిని పొందారు. వలస రాజ్యాల్లో నుంచి ముడి ప్రత్తి బ్రిటన్ తీసుకుపోవడం, లాంకుషైరు పట్టణంలో దాన్ని బాగుచేసి, దుస్తులునేసి, మళ్ళీ అదే వలస మార్కెట్లు అయిన, పశ్చిమ ఆఫ్రికా, భారతదేశం, ఛైనా (వయా షేంఘాయ్, హాంగ్ కాంగ్) లలో అమ్మటం.

1840కి భారతదేశం ప్రపంచానికంతా కావలసిన దుస్తులు నేసే బ్రిటీషు మరమగ్గాలకి కావలసిన ప్రత్తిని ఉత్పత్తి చెయ్యలేకపోతోంది. అతి తక్కువ ధరలో దొరికే భారత ప్రత్తిని, ఓడల్లో బ్రిటన్ కి తీసుకువెళ్ళడం, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, పైగా ఆలస్యమవుతోంది. ఇంతలో అమెరికాలో పండే ప్రత్తి, ఇంతకన్నా బావున్నదని తెలిసింది. (పొడుగు పింజ, గట్టిదనం ఎక్కువ. అవి అమెరికా దేశవాళీ విత్తనాలైన, గాస్సిపియమ్ హిర్సూటం, గాస్సిపియమ్ బార్బడెన్సె). దాంతో బ్రిటీషు వర్తకులు, అమెరికాలో, కరేబియన్ దీవుల్లో ప్రత్తి క్షేత్రాల్ని కొనుగోలు చెయ్యడం మొదలుపెట్టారు. అక్కడ ఇంకా చవక, ఎందుకంటే పనివాళ్ళంతా బానిసలు. 19వ శతాబ్దం మధ్యకల్లా, కింగ్ కాటన్ అనేది దక్షిణ అమెరికా ఆర్థికావసరాలకి వెన్నెముక అయ్యింది. యునైటెడ్ స్టేట్స్ లో బానిసల ముఖ్యమైన పని, ప్రత్తి పండించడమే.

అమెరికా అంతర్యుద్ధం సమయంలో అమెరికా ప్రత్తి ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. దానికి కారణాలు ఒకటి, యూనియన్ ప్రభుత్వం, దక్షిణాది రేవులపై నిషేధం విధించటం, రెండు, కాన్ఫెడరేషన్ ప్రభుత్వం బ్రిటీషు ప్రభుత్వాన్ని తమ కాన్ఫెడరేషన్ ని ఒప్పుకునేలా, లేదా యద్ధానికన్నా వచ్చేలా చెయ్యడం కోసం, తమ ప్రత్తి ఎగుమతులు ఆపెయ్యడం. ఈ పరిణామాలు, ముఖ్య ప్రత్తి కొనుగోలుదారులైన బ్రిటన్, ఫ్రాన్స్ లను ఈజిప్టు ప్రత్తి వైపు మొగ్గేలా చేశాయి. బ్రిటీషు, ఫ్రెంచి వర్తకులు ఈజిప్టులోని ప్రత్తి క్షేత్రాలపై భారీగా పెట్టుబడులు పెట్టారు. అవికాక, ఈజిప్టు ప్రభుత్వ వైస్రాయి అయిన ఇస్మాయిల్, యూరోపు బాంకర్ల నుండి, వ్యాపార వర్గాలనుండి, భారీగా అప్పులు చేశాడు. 1865 లోఅమెరికా అంతర్యుద్ధం ముగిసే సరికి, ఈజిప్టు ప్రత్తిని వదిలేసి బ్రిటీషు, ఫ్రెంచి వర్తకులు మళ్ళీ చవకైన అమెరికా ప్రత్తి వైపు మళ్ళారు. దాంతో ఈజిప్టు ఆర్థిక స్థితి దెబ్బతిని, 1876లో దివాలా ప్రకటించింది. అదే అదునుగా తీసుకుని, బ్రిటీషు సామ్రాజ్యం 1882లో ఈజిప్టుని ఆక్రమించుకుంది. అమెరికా అంతర్యుద్ధ సమయంలో, అక్కడ తగ్గిన ఉత్పత్తిని పూడ్చుకోవటానికి, బ్రిటీషు సామ్రాజ్యంలో ముఖ్యంగా భారతదేశంలో ప్రత్తి సాగు గణనీయంగా పెంచబడింది. అనేక నిషిద్ధాలు, పన్నులు వేసి, ప్రభుత్వం ముడి ప్రత్తి ఉత్పత్తిని ప్రోత్సహించింది కానీ నూలు వస్త్రాలని తయారుచెయ్యటం మాన్పించింది.

దాని గురించి మహాత్మా గాంధీ ఏమన్నారంటే :

  1. ఆంగ్లేయులు ఇక్కడి కూలీలకి రోజుకి 7 సెంట్ల కూలీ ఇచ్చి కోయించిన ముడి ప్రత్తి కొంటారు బలవంతంగా .
  2. ఈ ప్రత్తిని, బ్రిటీషు ఓడలకెత్తి 3 వారాల ప్రయాణంచేసి, వయా హిందూ మహాసాగరం, ఎర్ర సముద్రం, మధ్యధరా, జిబ్రాల్టర్ జలసంధి, బిస్కే జలసంధి, అట్లాంటిక్ మహాసముద్రం ఇంక లండన్ చేరతారు. ఈ ప్రయాణంలో 100 శాతం లాభం వాళ్ళకి తక్కువే.
  3. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఆంగ్లేయులకి, షిల్లింగు వేతనాలిచ్చి దుస్తులు నేయిస్తారు. అంతేకాక ఆ మిషన్లు చేసిన ఇనుప కంపనీలకి కూడా లాభం. అవీ వాళ్ళవే.
  4. మళ్ళీ వాటిని బ్రిటీషు ఓడల ద్వారా భారత దేశానికి తెస్తారు. దీంట్లో కూడా తక్కువ జీతానికి పాకీ పని చేసే కొద్దిమంది భారతీయులు తప్ప లాభం అంతా ఆంగ్లేయులకే.
  5. ఆ దుస్తులు ఇక్కడి జమీందారులకి, ధనవంతులకి అమ్ముతారు. వాళ్ళు ఖర్చుచేసిన ఆ డబ్బులు ఇక్కడి పేదవాడి పొట్ట కొట్టి లాక్కున్నవే.

అక్కడ అమెరికాలో దక్షిణాది ప్రత్తి ఉత్తరాదిని సుసంపన్నం చేసింది. అఫ్రికా నీగ్రో బానిసలు పండించిన ప్రత్తి దక్షిణాది వారికి లాభాలిచ్చినా ఉత్తరాది వ్యాపారులని గొప్ప ధనవంతుల్ని చేసింది. దక్షిణాది ప్రత్తి అంతా ఉత్తరాది రేవుల నుంచే ఎగుమతి చేసేవారు.

ఏదేమైనా 1865 అమెరికా అంతర్యుద్ధం ముగిసేసరికి ప్రత్తి అనేది దక్షిణాది వారి ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక నిభాయించింది. తరువాత దక్షిణాదిన భాగస్వామ్య పంటల పద్ధతి ఆవిర్భవించింది. నల్ల వారు, భూమిలేని తెల్లవారు లాభాల్లో వాటాలిచ్చే పద్ధతిపై ధనిక తెల్ల భూస్వాములకి పంటలు పండించిపెడతారు. 1950 కి ముందు ప్రత్తి సాగులో ప్రత్తిని చేత్తొ తియ్యటానికి పెద్ద ఎత్తున మానవ సహాయం కావలసివచ్చేది. మషీన్లు ఉండేవి కాని అంత ఉపయోగంగా ఉండేవికావు. 1950 తరువాతే నమ్మదగిన మిషన్లు వచ్చాయి. ఎప్పుడైతే మిషన్లు రావడం మొదలయ్యిందో ప్రత్తి పొలాల్లో పనిచేసేవారికి మెల్లగా పనులు తగ్గుతూ వచ్చాయి. ఇంతలో 1వ, 2వ ప్రంచ యుద్ధాల కారణంగా దక్షిణాది పల్లెల్లో వ్యవసాయ కూలీలు తగ్గుతూ వచ్చారు. ప్రస్తుతం దక్షిణాది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రత్తి ఎగుమతి ప్రాముఖ్యమైనది. అంతేకాక, ప్రపంచ ప్రత్తి ఉత్పత్తిలో అమెరికా పొడుగు పింజ ప్రత్తిదే అగ్రస్థానం.

టాంగూయిస్ ప్రత్తి

[మార్చు]

పెరూ దేశంలో కాటన్ విల్ట్, ఫ్యుసేరీయమ్ విల్ట్ అనబడే ఫంగస్ వ్యాధుల వలన ప్రత్తి పంట పూర్తిగా దెబ్బతింది. ఈ వ్యాధి పెరూ దేశమంతా వ్యాపించింది. ఈ వ్యాధి మొక్క వేళ్ళ ద్వారా వ్యాపించి, కాండంలోకి చొరబడి మొక్కని పూర్తిగా ఎండిపోయేలా చేస్తుంది. ప్యూర్టోరికో దేశానికి చెందిన ఫెర్మిన్ టాంగూయిస్ అనే వ్యవసాయదారుడు పెరూ దేశంలో నివసించేవాడు. ఇతను ఈ వ్యాధుల దాడికి గురయ్యి కూడా పెద్దగా దెబ్బతినని కొన్ని మొక్కలని గమనించి వాటిని అనేక రకాల ప్రత్తి మొక్కలతొ అంటుకట్టించడం లాంటి ప్రయోగాలు చేశాడు. చివరకి, 1911 లో 10 సంవత్సరాల కృషి ఫలించి పై వ్యాధులని తట్టుకుని నిలబడగల కొత్త వంగడాన్ని సృష్టించాడు. అంతే కాక ఆ వంగడాల నుంచి వచ్చిన ప్రత్తి 40 శాతం పొడవు, మందమైన దూదినిచ్చింది. పైగా అంత తొందరగా తెగదు, తక్కువ నీరు వాడుకుంటుంది. ఇంకే పేరు దేశంలోని నూలు మిల్లులన్నీ ఈ వంగడాన్ని ఆదరించడం మొదలు పెట్టాయి. పెరూ దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 75 శాతం ఈ ప్రత్తి రకమే.ఆ సంవత్సరం పెరూ దేశం ప్రత్తి ఉత్పత్తి, 2 లక్షల 25 వేల బేళ్ళు. అందుకే ఆ వంగడానికి టాంగూయిస్ ప్రత్తి అని నామకరణం చేశారు.

సాగుబడి

[మార్చు]

ప్రత్తి యొక్క సాగుబడి బాగా సాగాలంటే కావలిసినంత సూర్యరశ్మి, తక్కువ ఛలికాలం, మధ్యతరహా వర్షపాతం ఉండాలి. ఉదా: 600 నుండి 1200 మి.మీ. (24 నుండి 48 అంగుళాలు). భూమి బరువుపాటిదై ఉండాలి. నేలలో ఖనిజాలు మధ్యస్థంగా ఉంటే చాలు. సాధారణంగా ఈ అంశాలన్నీ ఉత్తర, దక్షిణ ధ్రువాల్లోని ఉష్ణ, సమసీతోష్ణ మండలాల్లో సరిగ్గా ఉంటాయి. కానీ ఈనాడు ఎక్కువ భాగం సాగు తక్కువ వర్షపాతం గల, నీటిపారుదల మీద ఆధారపడ్డ ప్రాంతాల్లో జరుగుతోంది.

ప్రత్తిపొలము

ప్రత్తి ఉత్పత్తి వసంతం వెళ్ళంగానే మొదలవుతుంది. విత్తే సమయం సాధారణంగా ప్రాంతాలని బట్టి మారుతుంది. ఫిబ్రవరి నుంచి జూను దాకా ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని దక్షిణ పీఠభూమి అనేది ప్రపంచంలో అతి విస్తారమైన ప్రత్తి పండే ప్రాంతం. నీటిఎద్దడి ప్రత్తి సాగు ఇక్కడ సాధారణంగా చేస్తారు. ఉత్పత్తి పక్కన ఉన్న ఒగల్లాలా గుట్టల నుంచి వచ్చే నీటిపై అధారపది ఉంటుంది.

మొక్కజొన్న లాంటి మిగతా పంటలకి నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. ప్రత్తి అనేది కొంతమేర నీటిఎద్దడిని, చౌడునేలల్ని తట్టుకుంటుంది కాబట్టి ప్రత్తి పంట, పాక్షిక, పూర్తి నీటి ఎద్దడిగల ప్రాంతాలకు బాగా ఉపయోగ పడుతుంది. నానాటికీ ప్రపంచంలో నీటివనరులు తగ్గుతున్న నేపథ్యంలో, వాటి మీద అధారపడ్డ ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు, కష్టాలనీ, ఘర్షణలనీ, ప్రాకృతిక సమస్యలనీ ఎదుర్కొంటాయి. ఉదాహరణకి సరైన నీటిపారుదల, సాగుపద్ధతులు లేనందు వలన, ఉజ్బెకిస్థాన్ లోని ప్రత్తి పండించే క్షేత్రాలు ఎడారి ప్రాంతాలుగా మారిపోయాయి. సోవియట్ రష్యా రోజుల్లో ఆరాల్ సముద్రాన్ని ప్రత్తి వ్యవసాయానికి కావలసిన నీటి పారుదల కోసం నిర్బంధిచటం వల్ల ఇప్పుడు చాలా భూభాగం ఉప్పుడు నేలగా మారింది.

జన్యుపరంగా మార్పిడి చేసిన ప్రత్తి

[మార్చు]

జన్యుపరంగా మార్పిడి చేసిన ప్రత్తి అనేది, పంట మీదవాడే పురుగు మందులాధారపడటాన్ని తగ్గించడం కోసం కనిపెట్టబడింది. బాసిల్లం తురింజెనెసిస్ అనే సూక్ష్మక్రిమి విడుదల చేసే ఒక రకమైన రసాయనం కొన్ని క్రిములకి హానికారకమైనది. ఎక్కువగా, సీతాకోకచిలుకలు, పురుగులు, దోమలు. మిగతా జాతులకి హాని చెయ్యదు. ఆ రసాయనానికి సంబంధించిన జన్యు సంకేతాన్ని ప్రత్తిలో ప్రవేశపెట్టడం ద్వారా ప్రత్తి స్వయంగా ఆ రసాయనాన్ని తయారుచేసుకునేటట్లు చేశారు. చాలా ప్రాంతాల్లో ప్రత్తి పంటపైన వచ్చే క్రిమి లెపిడోప్టెరిన్ లార్వా. ఇవి బిటి రసాయనంవల్ల, అంటే బిటి ప్రత్తి ఆకులు తినటంవల్ల చచ్చిపోతాయి. దీనివల్ల ఈ లార్వాలని చంపడానికి ఉపయోగించే పురుగుమందుల ఖర్చు తగ్గుతుంది. (చాలా పురుగులు పురుగుమందుల నుండి నిరోధకశక్తిని పెంచుకున్నాయి). ఇది ఈ విధంగా ఈ లార్వాల సహజ శతృవులని, పర్యావరణాన్ని కాపాడడానికి దోహదపడుతుంది. ఇంకా సేంద్రియ పద్ధతులలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. కానీ బిటి పత్తి అనేది మిగతా రకాలైన ప్రత్తి పురుగుల ఉదాహరణకి మొక్క పురుగులు, ఆకు నల్లి, ఆకుముడుత లను ఎమీ చెయ్యలేదు. పరిస్థితుల దృష్ట్యా వీటికోసం కూడా పురుగు మందులు వాడాల్సి రావచ్చు.

కోర్నెల్ విశ్వ విద్యాలయ పరిశోధకులద్వారా ఛైనాలో బిటి ప్రత్తి సాగుపై జరిపిన పరిశోధనలలో, బిటి ప్రత్తి విత్తనాల ధర ఎక్కువ. మిగతా పురుగుల కోసం వాడే పురుగుమందుల ఖర్చు, బిటి ప్రత్తి కాని పంట పై ఉన్నట్లే ఉంది. దానితో మామూలు ఖర్చుకు అదనపు ఖర్చు తోడై వారి లాభాలకు చిల్లు పడుతున్నట్లు తెలిసింది. ఐ.ఎస్.ఎ.ఎ.ఎ ప్రకారం 2002లో ప్రపంచ బి.టి. ప్రత్తి సాగు విస్తీర్ణం 67 వేల చదరపు కి.మీ.ఇది ప్రపంచ ప్రత్తి సాగులో 20 శాతం. 2003లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 73శాతం బి.టి.ప్రత్తి సాగే. ఆస్ట్రేలియాలో బి.టి. ప్రత్తి ప్రవేశపెట్టినప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. 85 శాతం పురుగుమందుల వాడకం తగ్గింది. మిగతా దేశవాళీ రకాలలాగానే దిగుబడి వచ్చింది. రెండవ రకం బి.టి. విత్తనం విడుదల చెయ్యంగానే జి.ఎమ్. ప్రత్తి సాగు అమాంతం పెరిగి, ఇప్పుడు ఉత్పత్తి 90 శాతానికి చేరింది.

ప్రత్తిని గ్లైఫోసైట్ అనే కలుపునివారిణిని కూడా తట్టుకునేలాగా కూడా రూపొందించారు. గ్లైఫోసైట్ అనేది తక్కువ ఖరీదుకల ఒక కలుపునివారిణి. మొదట్లో మొక్క చిన్నగా ఉన్నప్పుడే నిరోధకశక్తిని పెంపొందించటం కుదిరేది. కాని ఇప్పుడు మొక్క పెద్దదైన తరువాత కూడా సాధించగలుగుతున్నారు.

భారతదేశంలో కూడా బి.టి. ప్రత్తి సాగు విస్తీర్ణం త్వరితగతిన పెరుగుతోంది. 2002 లో 50,000 హెక్టార్లు ఉండగా 2006కి 38 లక్షల హెక్టార్లు అయ్యింది. మొత్తం ప్రత్తి సాగు విస్తీర్ణం భారతదేశంలో 90లక్షల హెక్టార్లు (ప్రపంచ విస్తీర్ణంలో 25 శాతం. ప్రపంచంలో అతి విస్తీర్ణమైనది). ఇప్పుడు బి.టి. ప్రత్తి విస్తీర్ణం 42 శాతం అయ్యింది. అంటే ఛైనాని వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద బి.టి. ప్రత్తి సాగు విస్తీర్ణం కల దేశం అయ్యింది. కారణం, పెరిగిన ఆదాయం, కాయ తొలుచు పురుగుని బి.టి. ప్రత్తి సమర్థంవంతంగా ఎదుర్కొనడం, పురుగు మందుల ఖర్చు గణనీయంగా తగ్గడం. ప్రత్తి ఆకులలో గాస్సిపోల్అనే విషరసాయనం ఉంటుంది. దాని వల్ల అది పశువుల మేతగా పనికిరాదు. శాస్త్రజ్ఞులు ఆ విషాన్ని ఉత్పత్తి చేసే జన్యువుని పనిచేయకుండా చేసి దాన్ని పశువుల మేతగా ఉపయోగపడేలా చెయ్యడంలో విజయం పొందారు.

సేంద్రియ ప్రత్తి ఉత్పత్తి

[మార్చు]

సేంద్రియ ప్రత్తి అంటే సాధారణంగా జన్యుపరంగా మార్పు చేయని దేశవాళీ వంగడాల నుండి, కృత్రిమమైన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా పండించిన ప్రత్తి అని ధ్రువపరచబడింది. ఈ ఉత్పత్తి జీవ భిన్నత్వాన్ని, జీవశాస్త్ర గమనాన్ని ఉన్నతికి తీసుకువెళుతుంది. సేంద్రియ ప్రత్తి కొంతమంది స్త్రీలకి అల్లర్జీకి కారణమవుతున్నది. ఈ సమస్య అధిగమించటానికి అమెరికా ప్రత్తి పొలాలపై జాతీయ సేంద్రియ విధనాన్ని (NOP) అమలుపరచాలి. (NOP) అనే సంస్థ ఇటువంటి పంటలపై అనుసరించాల్సిన, క్రిమి నిరోధక పద్ధతులని, పోషణని, ఎరువుల వాడకాన్ని, జాగ్రత్తపరచు విధానాలని, నిర్దేశిస్తుంది. 2007 గణాంకాల ప్రకారం ప్రపంచం మొత్తమ్మీద 265,517 బేళ్ళ సేంద్రియ ప్రత్తి పండించబడింది. ఇది ప్రతి సంవత్సరం 50 శాతం చొప్పున పెరుగుతూ వస్తుంది.

చీడ,పీడలు

[మార్చు]

1941లో ప్రత్తి పరిశ్రమ ఎరువులు, పురుగుమందులు లాంటి రసాయనాల మీద బాగా ఆధార పడింది. ఐనా కొద్దిమంది మాత్రం సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపారు. ఇప్పుడు కొన్ని పరిమితమైన చోట్ల సేంద్రియ ప్రత్తి ఉత్పత్తులు దొరుకుతున్నాయి. సేంద్రియ ప్రత్తి, చిన్న పిల్లల గుడ్డలు, గోచీలకి ప్రశస్థమైనది. సేంద్రియ సేద్యంలో జన్యు పరంగా మార్పులు చేసిన వంగడాలకి చోటు లేదు.

చరిత్ర పరంగా ఉత్తర అమెరికాలో ఆర్థికంగా ప్రత్తిపంటని దెబ్బతీసిన క్రిమి కీటకాలలో, కాయతొలుచు పురుగు ముఖ్యమైనది. అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క కాయ తొలుచు పురుగు నిర్మూలనా చర్యల వల్ల ఇప్పుడు ఈ పురుగు ఉత్తర అమెరికా నుండి దాదాపుగా నిర్మూలింపబడింది. దానితొబాటు, బి.టి. ప్రత్తి ప్రవేశం వల్ల, కాయతొలుచు పురుగు, గులాబి పురుగు రెండూ తగ్గిపోయాయి. అంతే కాక పురుగు మందుల ఉపయోగం కూడా గణనీయంగా తగ్గింది.

Aphids on cotton 4

యాంత్రిక సేద్యము

[మార్చు]

అమెరికా, యూరోపు, ఆస్ట్రేలియాలలో ప్రత్తి పంట మొత్తము యంత్రాల ద్వారానే జరుగుతుంది. ఈ యంత్రాలు రెండు రకాలు. కాటన్ పికర్, అంటే గింజల చుట్టూ ఉన్న ప్రత్తిని చక్కగా వేరుచేస్తుంది. కాటన్ స్ట్రిప్పర్, కాయలో ఉన్న ప్రత్తి మొత్తాన్ని గింజలతో సహా వేరుచేస్తుంది. కాటన్ స్ట్రిప్పర్ అనేది బాగా గాలి ఉండే ప్రదేశాల్లో వాడతారు. కాని దీన్ని రసాయనాలని ఉపయోగించి ఆకులు మొత్తాన్ని రాల్చిన తరువాత గాని, లేదా ఆకురాలు కాలంలో సహజసిద్ధంగా ఆకులు రాలిన తరువాత గాని వాడతారు. కాని ప్రత్తి ఈనాటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేతితోనే తీయబడుతోది.

కృత్రిమ నూలు నుండి పోటీ

[మార్చు]

1890లో ఫ్రాన్స్ లో రెయాన్ తయారీతో కృత్రిమంగా తయారుచేయబడే నూలు చరిత్ర మొదలయ్యింది. రెయాన్ అనేది పూర్తిగా కృత్రిమం కాదు, కానీ దాని తయారీలో ఉన్న ఇతర కష్టాలు అంతకంటే చవకైన కృత్రిమ నూలు తయారీకి బీజం వేశాయి. తరువాతి దశాబ్దాలలో రకరకాల కృత్రిమ నూలు రసాయన పరిశ్రమలు ఆవిష్కరించాయి. నూలు రూపంలో ఉన్న ఎసిటేట్ ని 1924 లో అభివృద్ధి చేశారు.1936లో కుట్టు దారంగా డ్యూపాంట్ కంపనీ నైలాన్ని తయారు చేసింది. వాళ్ళే 1944లో ఆక్రిలిక్ ని తయారుచేశారు. ఈ నూలు ఉపయోగించి కొన్ని స్త్రీల దుస్తులు తయారు చేశారు.కాని 1950లో మార్కెట్లోకి పాలిస్టర్ వచ్చిన తరువాత ప్రత్తి నూలుకి నిజమైన దెబ్బ తగిలింది. పాలిస్టర్ దుస్తుల గిరాకీ ఒక్క సారిగా పెరిగేసరికి ప్రత్తి పంట మీద ఆధారపడిన ఆర్థికవ్యవస్థలు గల దేశాలకి ఇబ్బంది మొదలయ్యింది. ముఖ్యంగా చవకైన పురుగుమందుల లభ్యతతో 1950 నుంచి 1965 లమధ్య ప్రత్తి ఉత్పత్తిని పదింతలు పెంచుకున్న నికరాగువా లాంటి మధ్య అమెరికా దేశాలు. ప్రత్తి ఉత్పత్తి 1970ల్లో కొంచెం పుంజుకున్నా, 1990లో మళ్ళీ 1960 కన్నా ముందు స్థాయికి పడిపోయింది. 1960 మధ్యల్లో క్రమంగా పడిపోతున్న ప్రత్తి స్థాయిని చూసి అమెరికా ప్రత్తి రైతులు స్వయం సహాయక విధానాలని మొదలుపెట్టారు. ప్రతి బేలుకి ఇంత అనే విధానానికి, అందరూ మొగ్గుచూపారు. అందుకు కారణాలు ఒకటి నిధులు సేకరించటానికి, రెండు తమకు నష్టం రాకుండా ఉండటానికి. 1996 లో ప్రత్తి పరిశోధన, ప్రోత్సాహం అనే చట్టం వచ్చిన తరువాత ప్రత్తికి కృత్రిమ నూలు పోటీదారులతో పోటీపడటానికి, తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవటానికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ఈ విధానం యొక్క ప్రగతి, అమెరికాలో ప్రత్తి నూలు అద్భుతమైన అమ్మకాలు సాధించటానికి, ప్రపంచంలో తన స్థానం తిరిగి నిలబెట్టుకోవటానికి ఉపయోగపడింది.

ప్రత్తి బోర్డు ద్వారా, ప్రత్తి ఇంకార్పొరేటేడ్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రత్తి పరిశోధన, ప్రోత్సాహము అనే సంస్థ ప్రత్తి పండించే రైతుల ప్రయోజనాలకై అహర్నిశలూ శ్రమిస్తుంది. ప్రత్తి రైతులు, దిగుమతిదారులు ఈ సంస్థకు నిధులు సమకూరుస్తున్నారు.

ఉపయోగాలు

[మార్చు]

ప్రత్తిని వస్త్ర పరిశ్రమలో అనేకమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా టెర్రిక్లాత్, అంటే బాగా నీళ్ళు పీల్చుకునే తుండుగుడ్డలు, దుస్తులు తయారుచేస్తారు. నీలం జీన్సు తయారీకి కావల్సిన డెనిమ్ గుడ్డని తయారుచేస్తారు. పనివాళ్ళువాడే నీలంరంగు గుడ్డలు, కార్డ్యురాయ్, ట్విల్ అనే మందపాటి గుడ్డలు, సీర్ సకర్ అనే పలుచని బల్ల గుడ్డలు కూడా చేస్తారు. సాక్సులు, లోదుస్తులు, చాలా రకాల టి-షర్టులు, దుప్పట్లు ప్రత్తి నూలు తోనే చేస్తారు. అల్లికలలో ఉపయోగించే ప్రత్యేకమైన నూలు ప్రత్తి తోనే తయారవుతుంది. వస్త్రపరిశ్రమలో మిగిలిన నూలుతోకూడా గుడ్డలు నేయవచ్చు. పూర్తి నూలుతోనే కాకుండా నూలుని ఇతర పాలిస్టర్తో కాని, రెయాన్తోకాని కలిపికూడా గుడ్డలు తయారు చెయ్యొచ్చు. రబ్బరు దారాలతో కలిపి, అల్లే గుడ్డలకి కావలసిన నూలు చెయ్యచ్చు. వాటితో సాగే జీన్స్ తయారు చేస్తారు. వస్త్ర పరిశ్రమే కాకుండా ప్రత్తిని చేపల వలలు, కాఫీ వడకట్టే గుడ్డలు, గుడారాలు, తుపాకిమందు, గుడ్డకాగితం, పుస్తకాల బైడింగులలో వాడతారు.

ప్రత్తిని ఉపయోగించిన తరువాత మిగిలే ప్రత్తి గింజలని పత్తిగింజల నూనె తీయడానికి వాడతారు. శుద్ధి చేసిన తరువాత ఆ నూనెని మనుషులు మామూలు ఇతర నూనెలలాగా వాడుకోవచ్చు. మిగిలిన పిప్పిని పశువులకి దాణాగా ఉపయోగించవచ్చు. కాని అందులో ఉండే గాసిపోల్ అనే విష పదార్థం కొన్ని పశువులకు హానికారి. ప్రత్తి గింజల పొట్టు పశువుల దాణాలో కలుపుతారు. అమెరికాలో బానిసత్వం అమలులో ఉన్నప్పుడు ప్రత్తి వేళ్ళ మీద ఉండే పొట్టు గర్భస్రావాలకై వాడేవారు.

ప్రత్తిని గింజలనుండి వేరుచేసిన తరువాత ఆ గింజలకి మెత్తని నూగు ఉంటుంది. ఇంచుమించు 3మి.మి. పొడవు ఉంటుంది. ఆ నూగుని, కాగితం తయారుచేయడానికి, సెల్లులోజ్ ని చేయడానికి వాడతారు.ఈ నూగుని ప్రత్తి ఉన్ని అంటారు. ఈ నూగుని శుద్ధి చేసి వైద్య రంగంలో, సౌందర్య సాధనాలలో, ఇంకా ఇతరత్రా వాడతారు. ఈ ప్రత్తి ఉన్నిని, మొదట వైద్య రంగంలో వాడింది, డా.జోసఫ్ శాంసన్ గామీ. ఆయన ఇంగ్లాండు, బర్మింగ్ హామ్ లోని క్వీన్స్ ఆసుపత్రిలో మొదట వాడారు. ఈ నూగుని కొన్ని ప్రక్రియల అనంతరం చొక్కాలకి, సూటులకి వాడే శాటిన్ గుడ్డ లాంటి గుడ్డని తయారు చెయ్యడంలో వాడతారు. ఇది నీరు త్వరగా పీల్చుకోనందున తుండుగుడ్డలకి, అంట్లు తుడిచే గుడ్డలకి వాడలేరు. ఈజిప్షియన్ నూలు అంటే పేరుకి తగ్గట్టు, ఈజిప్టులో పండే ప్రత్తి. ఇది బాగా పొడుగు పింజ. అందుకని దీన్ని బాగా ఖరీదైన దుస్తులు నేయటానికి వాడతారు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అమోఘమైన పెట్టుబడులు ఈ రకంపైనే పెట్టారు. బ్రిటీషు మిల్లులకి ఈ ప్రత్తే ప్రత్యామ్నాయమైంది. అమెరికా పిమా ప్రత్తి కన్నా ఈ రకం మృదువుగానూ, మన్నిక ఎక్కువగానూ ఉండేది. అందుకే దీని ఖరీదు ఎక్కువ. పిమా ప్రత్తి అంటే అమెరికా ఆగ్నేయ రాష్ట్రాలలో పండించే ప్రత్తి.

అంతర్జాతీయ వాణిజ్యం

[మార్చు]
ప్రత్తిగింజలు 2005లో ఉత్పత్తి

ఈనాడు ప్రపంచంలో పత్తి యొక్క అతిపెద్ద ఉత్పత్తి దారులు మొదట చైనా, భారత్. వీరి సాలుసరి ఉత్పత్తి రమారమి 34 లక్షల బేళ్ళు, 24 లక్షల బేళ్ళు వరుసగా. ఈ ఉత్పత్తి అయిన ప్రత్తి అంతా స్వదేశాల్లోని నూలు మిల్లులే వాడుకుంటాయి. అతిపెద్ద ఎగుమతిదారులు మొదట అమెరికా (4.9 బిలియన్ డాలర్లు), ఆఫ్రికా (2.1 బిలియన్ డాలర్లు).

మొత్తం ప్రపంచ సాలుసరి వాణిజ్యం సుమారు 12 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఆఫ్రికా వాటా 1980 తరువాత రెట్టింపు అయ్యింది. ఎందుకంటే వారికి దేశీయ వస్త్ర పరిశ్రమ లేదు.ఉన్నా అవి తూర్పు, దక్షిణ ఆసియాకి అంటే భారత్, ఛైనా లాంటి అభివృద్ధి చెందుతున్నదేశాలకి వలస పోయాయి.

ఆఫ్రికాలో ప్రత్తి ఉత్పత్తి చిన్నకమతాల రైతుల వద్ద ఎక్కువగా ఉంటుంది. డ్యునవాంట్ ఎంటర్ప్రైజెస్ అనే మెంఫిస్, టెన్నిసీలో ఉన్న కంపనీ ఆఫ్రికాలోని అతిపెద్ద ప్రత్తి బ్రోకరు. వీళ్ళకి వందల మంది కొనుగోలు ఏజంట్లు ఉన్నారు. ఈ కంపనీకి ఉగాండా, మొజాంబిక్, జాంబియాలలో ప్రత్తి జిన్నింగు మిల్లులు ఉన్నాయి. ఈ కంపనీ జాంబియాలో ఉన్న లక్షా ఎనభై వేల మంది రైతులకి విత్తనాలకి, సాగుబడి ఖర్చులకి అప్పులు ఇస్తుంది. ఇంకా సాగు విధానాలపై సలహాలుకూడా ఇస్తుంది. కార్గిల్ అనే కంపనీ కూడా ఎగుమతి కోసం ఇక్కడ ప్రత్తి కొంటుంది.

అమెరికాలో ఉన్న 25 వేల మంది ప్రత్తి రైతులకి అక్కడి ప్రభుత్వం సాలీనా 2 బిలియన్ డాలర్ల రాయితీ ఇస్తుంది. ఈ రాయితీలు ఎన్నాళ్ళు కొనసాగుతాయో తెలియదు కనుక అక్కడి ప్రత్తి బ్రోకర్లు తమ కార్యకలాపాలని ఆఫ్రికాకి విస్తరిస్తున్నారు. డ్యునవాంట్ కంపనీ తన విస్తరణని ఆఫ్రికాలో అక్కడి కంపనీలని కొనుక్కుని ప్రారంభించింది. ఇలా పాత బ్రిటీషు పాలనలో ఉన్న దేశాలలో, మొజాంబిక్ లో సాధ్యం. పూర్వం ఫ్రెంచి పాలనలో ఉన్న దేశాలలో అది సాధ్యం కాదు. అక్కడి వారు ఇతరులని తమ ప్రత్తి మీద అధిపత్యం చూపడానికి ఒప్పుకోకుండా వారే తక్కువ ధరకి ఇస్తూ వారి మార్కెట్లని కాపాడుకుంటున్నారు.

ఉత్పత్తిలో మొదటన ఉన్న దేశాలు

[మార్చు]
2009లో అత్యధిక పత్తి వుత్పత్తిగల 10 దేశాలు
(480-పౌండ్ బేళ్లు)
 People's Republic of China 32.5 పదిలక్ష బేళ్లు
 భారతదేశం 24.3 పదిలక్ష బేళ్లు
 United States 13.0 పదిలక్ష బేళ్లు
 పాకిస్తాన్ 9.2 పదిలక్ష బేళ్లు
 Egypt 5.4 పదిలక్ష బేళ్లు
 Uzbekistan 4.2 పదిలక్ష బేళ్లు
 ఆస్ట్రేలియా 1.8 పదిలక్ష బేళ్లు
 Turkey 1.7 పదిలక్ష బేళ్లు
 Turkmenistan 1.1 పదిలక్ష బేళ్లు
 Syria 1.0 పదిలక్ష బేళ్లు
మూలం:[1]

ఎగుమతి మొదటి అయిదు స్థానాల్లోని ఎగుమతిదారులలో (1) అమెరికా సంయుక్త రాష్ట్రాలు (2) భారత్ (3) ఉజ్బెకిస్థాన్ (4) బ్రెజిల్ (5) ఆస్ట్రేలియా.

దిగుమతి మొదటి అయిదు స్థానాల్లోని ప్రత్తి పండించని దిగుమతిదారులు (1) కొరియా (2) రష్యా (3) తైవాన్ (4) జపాన్ (5) హాంగ్ కాంగ్. భారతదేశంలో మహారాష్ట్ర (26.63%), గుజరాత్ (17.96%), ఆంధ్ర ప్రదేశ్ (13.75%), మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్న ప్రత్తి ఉత్పత్తి దారులు. ఈ రాష్ట్రాల్లో వాతావరణం ప్రత్తికి సరిగ్గా సరిపోయిన ఉష్ణ మండల తడి, పొడి వాతావరణం ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో టెక్సాస్ రాష్ట్రం మొత్తం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంటే, కాలిఫోర్నియా రాష్ట్రం ఒక ఎకరాలో పండించే ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంది.

గిట్టుబాటు వాణిజ్యం ప్రత్తి ప్రపంచమంతా ఎంతో ముఖ్యమైన నిత్యావసర సరుకు.కానీ చాలా మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రైతుల తమ పంటకి సరైన మద్దతుధరలేక లేక అభివృద్ధిచెందిన దేశాలవలే ధరరాక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఒక అంతర్జాతీయ సమస్యకి మూలకారణం అయ్యింది:

  • 2002 సెప్టెంబరు 27న బ్రెజిల్ దేశం, అమెరికాలో ప్రత్తి రైతులకి, వినియోగదారులకి, ఎగుమతిదారులకి ఇస్తున్న నిషేధించబడిన, చర్యతీసుకోదగిన రాయితీలు, పరిపాలకులు, సవరణలు, మినహాయింపులు, చట్టపరమైన పనిముట్లపై చర్చలకి పిలిచింది.
  • 2004 సెప్టెంబరు 8న పానెల్ చేసిన సిఫార్సుల ప్రకారం అమెరికా తన స్వదేశీ వినియోగదారులకి, ఎగుమతిదారులకి ఇచ్చేఋణ హామీలు, చెల్లింపులు నిలిపివేయాలనీ, కనీస మద్దతు ధరలకి ఇచ్చే మినహాయింపుల వల్ల కలిగే దుష్ఫలితాలను రూపుమాపాలని చెప్పింది.
  • రాయితీల విషయమే కాక కొన్ని దేశాలని వారి ప్రత్తి పొలాల్లో, పరిశ్రమలలో బాలకార్మికులని ఉపయోగిస్తూ వారి ఆరోగ్యాల్ని, పురుగుమందులుతో నాశనం చేస్తున్నారని విమర్శించాయి.పరిసరాల న్యాయ ఫౌండేషన్ ఉజ్బెకిస్థాన్లో బాలకార్మికులని ఉపయోగించడానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది.
  • అంతర్జాతీయ ఉత్పత్తి, వాణిజ్యం, నూలు దుస్తులు, పాదరక్షలని గిట్టుబాటు వాణిజ్యానికి చేరువగా చేశాయి.

వాణిజ్యం

[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రత్తిని అమ్మడం, కొనడం, వ్యాపార వస్తువుగా ధర ఊహాగానాలు రెండుచోట్ల చేస్తారు.

  1. ప్రత్తి భవిష్యత్ ఒప్పందాలు వాణిజ్యం న్యూయార్క్ లోని మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ లో టికర్ గుర్తు TT క్రింద చేయబడుతుంది. ఈ ఒప్పందాలు ప్రతి సంవత్సరం మార్చి, మే, జూలై, అక్టోబరు, డిసెంబరు లలో విడుదల చేస్తారు.
  2. భవిష్యత్ ఒప్పందాల వాణిజ్యం న్యూయార్క్ వాణిజ్య బోర్డ్ లో టికర్ గుర్తు CT క్రింద చేయబడుతుంది. ఈ ఒప్పందాలు ప్రతి సంవత్సరం మార్చి, మే, జూలై, అక్టోబరు, డిసెంబరు లలో విడుదల చేస్తారు.

క్లిష్టమైన ఉష్ణోగ్రతలు

[మార్చు]

పుప్పొడి ప్రయాణానికి అనుకూలమైన ఉష్ణోగ్రత - 25 °C (77 °F) కన్నా తక్కువ

పుప్పొడి ప్రయాణానికి ప్రశస్థమైన ఉష్ణోగ్రత - 21 °C (70 °F)

వెలిగే ఉష్ణోగ్రత - 205 °C (401 °F)

మండే ఉష్ణోగ్రత - 210 °C (410 °F)

స్వతహాగా మండిపోయే ఉష్ణోగ్రత - 407 °C (765 °F)

స్వతహాగా మండిపోయే ఉష్ణోగ్రత (నూనెగా ఉన్న ప్రత్తికి) - 120 °C (248 °F

ప్రత్తి 25 °C (77 °F) కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద తన సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా, పెళుసుగా తయారవుతుంది. ఎక్కువ కాలం వెలుతురు తగిలినా అంతే.

25 °C (77 °F) నుంచి 35 °C (95 °F) ల మధ్య ఉష్ణోగ్రత ప్రత్తి నుంచి నూలు తీయడానికి ప్రశస్థమైనది. 0 °C (32 °F) ల వద్ద తడిసిన ప్రత్తి కుళ్ళిపోవటం ఆగిపోతుంది. అందుకే పాడైపోయిన ప్రత్తిని ఈ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు.

బ్రిటీషు నూలు కొలమానాలు

[మార్చు]

1 దారం (థ్రెడ్) = 55 అంగుళాలు (దాదాపు 137 సెం.మీ.)

1 స్కీన్ లేదా ర్యాప్ = 80 (థ్రెడ్స్) దారాలు (120 గజాలు లేదా రమారమి 109 మీ)

1 ఉండ (హాంక్) = 7 స్కీన్లు (840 గజాలు లేదా రమారమి 768 మీ)

1 చుట్ట (స్పిండిల్) = 18 ఉండలు (హాంకులు) (15,120 గజాలు లేదా రమారమి 13.826 కి.మీ.)

నూలు లక్షణాలు

[మార్చు]
లక్షణం నిర్ధారణ
ఆకారం వెడల్పు సమానం, 12-20 మైక్రో మీటర్లు; 1 సెం.మీ నుండి 6 సెం.మీ (½ to 2½ అంగుళాలు) వరకూ పొడవు మారుతుంది.; కచ్చితమైన పొడవు 2.2 సెం.మీ నుండి 3.3 సెం.మీ (⅞ to 1¼ అంగుళాలు) వరకూ ఉంటుంది..
మెరుపు ఎక్కువ
ధృడత్వము
పొడిగ
తేమగా

3.0-5.0 g/d
3.3-6.0 g/d
తట్టుకునే శక్తి తక్కువ
సాంద్రత 1.54-1.56 g/సెం.మీ³
తేమ పీల్చుకునే తత్వం
పచ్చి: క్రమమైనది
సంతృప్తత
మెర్సెరైజ్డ్: క్రమమైనది
సంతృప్తత

8.5%
15-25%
8.5-10.3%
15-27%+
అకార స్థిరత్వము బాగుంది
నిరోధకత
ఆమ్లాలు
క్షారాలు
కర్బన ద్రావకాలు
సుర్యకాంతి
సూక్ష్మ జేవులు
కీటకాలు

పాడు చేస్తాయి, నూలు బలహీనమగును
నిరోధకత; హాని లేదు
గట్టి నిరోధకము
ఎక్కువకాలమైతే నూలు బలహీనమగును.
శిలీంద్రాలు కాని కుళ్ళు కలుగచేయు సూక్ష్మ జీవులుకాని నూలు పాడుచేస్తాయి..
సిల్వర్ ఫిష్ నూలు పాడు చేస్తుంది.
ఉష్ణ ప్రతిక్రియలు
వేడికి
అగ్నికి
150 డిగ్రీల వేడికి ఎక్కువసేపు గురిచేస్తే మాడిపోతుంది.
మండిపోతుంది.

రసాయనిక విశ్లేషణ

[మార్చు]

ప్రత్తి యొక్క రసాయన సమ్మేళనం ఈక్రింది విధంగా ఉంటుంది.

  • పీచు 91 శాతం; నీరు 7.85 శాతం; ప్రోటోప్లాస్మ్, పెక్టిన్స్ 0.55 శాతం; మైనము, కొవ్వు 0.40 శాతం; ఖనిజ లవణాలు 0.20 శాతం.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పత్తి&oldid=4339189" నుండి వెలికితీశారు