అన్నమాచార్య ప్రాజెక్టు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
15వ శతాబ్దానికి చెందిన తొలి తెలుగు వాగ్గేయకారులలో ఒకడైన తాళ్లపాక అన్నమాచార్యులు ఇప్పటి వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామానికి చెందినవాడు. అన్నమాచార్యుల తరువాత వాగ్గేయకారులలో ముఖ్యులు త్యాగయ్య, క్షేత్రయ్య. అన్నమయ్య, వేంకటేశ్వరుని ఉద్దేశించి 32వేలకు పైగా సంకీర్తనలు వ్రాశాడు. ఈ సంకీర్తనలు వ్యాప్తిచేసే దిశగా ఈ అన్నమాచార్య ప్రాజెక్టు 1978లో ప్రారంభించబడింది. అన్నమయ్య యొక్క విస్తృత పద సంపదను ఉపయోగించుకొని ప్రజలలో వేంకటేశ్వరుని మధురభక్తిని, శరణాగతిని ప్రోత్సహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించబడింది.
ప్రాజెక్టులోని విభాగాలు
[మార్చు]అన్నమాచార్య ప్రాజెక్టులో సంగీతం, పరిశోధన, ప్రచురణ, రికార్డింగ్ అనే మూడు భాగాలున్నాయి.
సంగీత విభాగం
[మార్చు]యువకళాకారులను తయారు చేసే దిశగా ఈ విభాగం పనిచేస్తుంది. భారతదేశం నలుమూలలా దేవాలయాలలో, పుణ్యక్షేత్రాలలో, విద్యాసంస్థలలో, వివిధ నగరాలలో, పండుగులలో యువ కళాకారుల చేత వాద్య, గాత్ర కచేరి నిర్వహించబడుతుంది. ప్రతి ఏడు అన్నమాచార్య జయంతికి, వర్థంతికి తిరుమల తిరుపతి, తాళ్ళపాకల నందే గాక దేశ నలుమూలల ఆరాధనోత్సవాలు ఈ విభాగం ద్వారా నిర్వహించబడుతున్నాయి.
తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామికి ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ జరిపేటప్పుడు, ఆనందనిలయంలో వేంకటేశ్వరునికి ఏకాంత సేవ, సుప్రభాత సేవ జరిపేడప్పుడు ఈ కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలు పాడుతారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములుచే నిర్వహించబడే దేవాలయాల్లో కుడా కళాకారుల చేత సంకీర్తనలు పాడించబడుతుంది. అన్నమాచార్యుడు వేంకటేశ్వరుని సంకీర్తలనే కాకుండా జానపద కీర్తనలైన జంజార, డుంపాల పాటలు, సువ్విపాటలు, ఎలపదాలు, యుగళ గీతాలు రచించాడు. ఈ విభాగం తరచూ హరికథలు, జానపద కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రెండు సంవత్సరాల పాటు అన్నమాచార్య సంకీర్తలన్నీ పాఠ్యాంశాలుగా కుణ్ణంగా బోధించి, పట్టా ఇచ్చే ప్రణాళికను అన్నమాచార్య ప్రాజెక్టు ప్రారంభించింది. ఈ ప్రణాళిక అన్నమాచార్యుడి సంకీర్తనలు, అన్నమాచార్యుడి వాగ్మయం వ్యాప్తి చేయడంలో భాగమే.
పరిశోధన , ప్రచురణ విభాగం
[మార్చు]ఈ విభాగంలో భాగంగా అన్నమాచార్య సంకీర్తనల మీద, అన్నమాచార్యుల జీవిత చరిత్ర మీద పరిశోధన చేసే యువ పరిశోధకులకు, పరిశోధన చేసేందుకు వీలుగా పారితోషికం ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు యాభైకి పైగా పరిశోధనా గ్రంథాలు భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో ప్రచురించబడ్డాయి. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిశోధన శాఖతో అనుసంధానించబడి ఈ విభాగానికి గుర్తింపు తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తరచూ అన్నమాచార్యుల జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలను, ఆయన సాహిత్య సంపదని ఈ విభాగంలోని ప్రచురణ ఉప శాఖ ప్రచురిస్తుంది.
రికార్డింగు విభాగం
[మార్చు]జనప్రాచుర్యంలో ఉన్న అన్నమయ్య సంకీర్తనలను ఆడియో క్యాసెట్ల రూపంలో తయారుచేసి మార్కెట్టులో అమ్మడమే ఈ విభాగం యొక్క ప్రధాన విధి. ఈ విభాగం శ్రీ వేంకటేశ్వర దృశ్య శ్రవణ ప్రాజెక్టులో భాగం. సంగీత విద్వాంసులైన ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వేంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి, నూకల సత్యనారాయణ, మణి కృష్ణస్వామి, వాణీ జయరాం గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గుంటి నాగేశ్వరనాయుడు శ్రీ పారుపల్లి రంగనాధ్ శ్రీ వేదవ్యాస ఆనందభట్టర్, శోభారాజు వంటివారు తమ గాత్రాన్ని ఈ ప్రాజెక్టుకు అందించారు.
తి.తి.దే. నిర్వహించే ఇతర ప్రాజెక్టులతో సమన్వయం
[మార్చు]తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహించే ధర్మ ప్రచార పరిషత్ తప్పితే మిగతా ప్రాజెక్టులన్నీ అన్నమాచార్య ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. అన్నమాచార్య ప్రాజెక్టుతో దగ్గరి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. అవి
- ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు
- దాస సాహిత్య ప్రాజెక్టు
- భాగవత ప్రాజెక్టు
- వేద రికార్డింగు ప్రాజెక్టు
బయటి లింకులు
[మార్చు]- అన్నమాచార్య ప్రాజెక్టు కార్యకలాపాల పేజీ
- వికీసోర్స్లో అన్నమయ్య పాటలు
- “ఆంధ్రభారతి”లో తి.తి.దే. 29 సంపుటములలో ప్రచురించిన అన్నమాచార్యుల, పెదతిరుమలాచార్యుల, చినతిరుమలాచార్యుల 14,911 సంకీర్తనలు.