క్షేత్రయ్య

వికీపీడియా నుండి

క్షేత్రయ్య

కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1600-1680) ఒకడు. ఈయన అసలు పేరు మొవ్వా వరదయ్య గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్య గా మారింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని, కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో నివసించి, మువ్వగోపాలుని ఆరాధించాడు. బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి 'గోపాల మంత్రం' ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడింది.


ఆంధ్ర దేశంలోని తిరుపతి, కడప, శ్రీశైలం మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక కంచి, శ్రీరంగం, మధుర, తిరువళ్ళూరులలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కాని, అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితం గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు.


భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే మధుర భక్తి. ఇలాంటి మధుర భక్తి ప్రబలంగా ఉన్న 17 వ శతాబ్దం లో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4,500 కు పైగా పదాలు రచించాడు. వాటిలో 1,500 పదాల వరకు గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా కు అంకితమిచ్చాడు.


క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన తిరుమల నాయకుడు, గోల్కొండ నవాబు, తంజావూరు రఘునాధ నాయకుడు ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడు.


క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు చక్కని అలంకారాలు మరియు జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము యిచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు.


[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు



పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు